Previous Page Next Page 
సూర్యనేత్రం పేజి 7


    'మీకు చూపించవలసిన అవసరం లేదు ప్రభుత్వానికి తప్ప మేం ఎవ్వరికీ బాధ్యులం కాము' అందామనుకున్నాడు రవి. అనలేదు.
    ఇక్కడ ఏ కారణమూ లేకుండానే తగాదాలు? ఈ గ్రామాల ప్రజలు తగాదాలు తిని, అవే తాగి, ఊపిరిగా బతుకుతున్నారనిపిస్తుంది. ఇక్కడకు రావటానికి ముందే ఈ రెండు గ్రామాల మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటుందనీ, ఒక గ్రామంలో కూలీలని మాత్రమే తీసుకుంటే మరో గ్రామం వాళ్ళు పగబట్టి తప్పకుండా పనికి ఆటంకం కలిగిస్తారానీ ముందుగానే తెలుసుకున్నాడు రవి. అందుకే రెండు గ్రామాల నుంచీ కూలీలను సమాన సంఖ్యలో తీసుకున్నాడు.
    "నిన్న దేవనారాయణ్ మిమ్మల్ని చూడటానికి వచ్చాడటగా? ఏం మాట్లాడాడు?" అడిగాడు యజ్ఞనారాయణ్.
    ఈ ప్రశ్నతో రవికి అతని రాకకు కారణం అర్థమయింది.
    దేవనారాయణ్ వచ్చాడు గనుక ఇతడూ రావాలి. అతడేం మాట్లాడాడో తెలుసుకోవాలి. ఆహా! ఎంత అద్భుతమైన కాంపిటీషన్?
    ఆ క్రిందటిరోజు జరిగిందంతా చెప్పాడు రవి.
    "ఈ రోజే బట్టలని ఫోరెన్ సిక్ లేబ్ కి టెస్ట్ కి పంపిస్తున్నాను. కొంతవరకు సాల్స్ చెయ్యగలిగాను."
    అనిల, తనూ తెలుగులోకి అనువదించింది చూపించాడు.
    అయితే, ఆ ఫైల్ అందుకున్నది విలసిత. ఆ చొరవకి గతుక్కుమన్నాడు. ఆ క్షణంలోనే పులిలా కనిపించే యజ్ఞనారాయణ్ ఆమె చేతిలో కీలుబొమ్మ అని స్ఫురించింది.
    చూసి, ఫైలు తిరిగి రవి కందించింది విలసిత.
    "గుహ ముఖద్వారంలో కూడా ఇలాంటి లిపితోనే ఏదో రాసి ఉంది. అది అనువదించలేదా?"
    వెన్నెలలు సన్నజాజుల పరిమళాన్నీ, కోయిలల గొంతులోని మాధుర్యాన్నీ కలుపుకొని మాట్లాడినట్లు మెత్తని మధురమైన ధ్వని.
    ఆమెకు సమాధానమివ్వకుండా ఏదో ఆలోచిస్తున్నట్లు ఉండిపోయాడు రవి.
    అనిల మాట్లాడింది "గుహ ముఖద్వారం మీద కూడా లిపి ఉందా? మాకు కనపడలేదే?"
    "ఎడమ చేతి వైపు పైభాగాన ఉంది. మీరు కుడివైపు నుంచి ఎక్కి ఉంటారు."
    "అవును. ఈ రోజు ఆ లిపిని కూడా తెలుగులోకి అనువదిస్తాం."
    దంపతులిద్దరూ వెళ్ళిపోయారు. అప్పటివరకూ ట్రాన్స్ లో ఉన్నట్లుగా ఉన్న రవి వాళ్ళు వెళ్ళిపోగానే అన్నాడు "ఆమెని నేనెక్కడో చూశాను. ఆ గొంతు ఎక్కడో విన్నాను."
    "హైదరాబాద్ లో సాలార్ జంగ్ మ్యూజియంలోని మేలి ముసుగుతో ఉన్న పాలరాతి శిల్పాన్ని చూసి ఉంటారు. అంతే తప్ప యజ్ఞనారాయణ్ భార్యని మరొకచోట మీరు చూడటం అసంభవం" అనిల అంది.
    తల అడ్డంగా విదిలించాడు.
    "కాదు ? కాదు? ఆ గొంతు విన్నాను. ఆమెని చూశాను. చాలా సన్నిహితంగా..."


                                           *    *    *    *


    విలసిత చెప్పినట్లుగానే గుహ ఎడమ ద్వారం కుడి పక్కన పూర్వ శాతవాహన కాలంనాటి లిపిలో ఏదో వ్రాసి ఉంది. అంతేకాదు. ఎడమ వైపు కొండ కింది రోడ్డు గతుకులు లేకుండా జనం తరచు వాడుతున్న దారిలాగా ఉంది. బహుశః సిరిమిట్ట, లచ్సింబోడు గ్రామాల నుంచి పక్కనున్న టౌన్ కి రోడ్డు అదేనేమో.
    కొండపైకి చేరుకునే దారీ, అక్కడి నుంచి గుహ ముఖద్వారం దగ్గిరకి చేరే దారి కూడా నునుపు దేరి, ఆ రాళ్ళ మీద మనుష్యులు నడుస్తున్నారనటానికి నిదర్శనంగా ఉన్నాయి.
    "సాధారణంగా ఈ గుహకి వచ్చేవాళ్ళందరూ ఇటే వస్తారనుకుంటాను" అన్నాడు రవి.
    "రహదారి ఇదే కదా! అంచేత ఇటే గుహకి దారి అనుకుని ఉంటారు. అసలు కుడివైపు నుంచి కూడా దారి ఉన్నట్లు చాలామందికి తెలియదేమో" అంది అనిల.
    చుట్టూ పరిశీలనగా చూశాడు రవి. కొంత దూరంలో తవ్వకాలు జరిపించటానికి ప్రయత్నాలు చేసిన గుర్తుగా సగం సగం తవ్విన గోతులున్నాయి.
    "సమ్ బడీ కేమ్ బిఫోర్ అజ్" అసంపూర్తిగా మిగిలిపోయిన తవ్వకాలను చూపిస్తూ అంది జెన్నిఫర్.
    "ఒకరు కాదు, చాలామంది వచ్చారు" అన్నాడు రవి.  
    "అయితే పని మధ్యలోనే వదిలి ఎందుకు వెళ్ళిపోయినట్టు" అడిగాడు విష్ణువర్ధన్.
    ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ డైరెక్టర్ చెప్పిన విషయాలన్నీ గుర్తొచ్చాయి రవికి. కానీ, ఆ మాటలేవీ పైకి చెప్పలేదు. ఇది చెప్పవలసిన సందర్బం కాదు. అందులోనూ విష్ణువర్ధన్ కి అసలు చెప్పకూడదు. అతడసలే భూతయ్య.
    "కెన్ యు ట్రాన్స్ లేట్ దట్ స్క్రిప్ట్స్?"
    పూర్వం శాతవాహన లిపి వైపు చూపుడు వేలు చాపి అడిగింది జెన్నిఫర్.
    "ప్రయత్నించాలి మిస్- అనిలా! మీరు కూడా ట్రై చేస్తారా?"
    అనిల అప్పటికే తన డైరీలో ఆ లిపిలో ఒక్కొక్క వరమూ అతి జాగ్రత్తగా కాఫీ చేసుకుంటోంది. చాలా పాతకాలం నాటిదవటం వల్ల ఆ లిపిలో వర్గాలు సమగ్రంగా లేవు.
    ఒక గీత కాస్త పొడుగ్గా వచ్చిందంటే "గ" "భ" అయిపోతుంది. అంచేత అతి జాగ్రత్తగా ఎక్కించుకోవాలి.
    రవి కూడా తన డైరీలో ఆ లిపి అంతా నోట్ చేసుకున్నాక అనిల, రవి కొద్దిగా శాసనాల లిపులతో పరిజ్ఞానం ఉన్న టెక్నికల్ అసిస్టెంట్స్ ముగ్గురు, కొంతసేపు తర్జన భర్జనలు సాగించాక దానికి తెలుగులోకి అనువదించారు.
    "ఈ ప్రదేశంలో మహారాజు, మహారాణి దివ్య రూపంతో తిరుగాడుతున్నారు. ఇతరులెవరూ ఈ ప్రాంతానికి రాకుండా వ్యాఘ్రాసుర వ్యాళాసురులు కాపాడుతున్నారు. ఈ ఆన అతిక్రమించి మూర్ఖులెవరైనా లోపల ప్రవేశిస్తే వాళ్ళని వ్యాఘ్రాసురుడు తన వాడి గోళ్ళతో నిలువునా చీల్చేస్తాడు. వ్యాళాసురుడు తన విష జ్వాలలతో నల్లగా మార్చేస్తాడు. నగ్న భైరవుడి ఆన, జోగులాంబ ఆన."    
    కొన్ని క్షణాలు ఎవరూ నోరు విప్పి మాట్లాడలేదు. గాలి మాత్రం రకరకాల వింత శబ్దాలతో వాళ్ళని వెక్కిరిస్తోంది, కవ్విస్తోంది. గుహ లోపల చూసిన భయంకర శిల్పాలు నలుగురి కళ్ళముందూ వికటాట్టహాసాలు చేస్తున్నాయి.
    "ఏం చేద్దాం?" అన్నాడు రవి.
    "లోపలికి వెళ్దాం?" ఆజ్ఞాపిస్తున్నట్లే అన్నాడు విష్ణువర్ధన్.
    "ఇప్పుడొక విషయం మీతో చెప్పాలి ఆ తరువాత రహస్యం దాచానని మీరు నామీద నింద వెయ్యొచ్చు" అందరి కళ్ళూ భయంగా బెదురుగా రవి వైపు తిరిగాయి.
    "నేనిక్కడ ఎక్స్ కవేషన్స్ జరపాలని నిర్ణయించుకున్నాక ముందు మా యూనివర్శిటీ వాళ్ళని అడిగాను. ఆర్ధిక సహాయం మామూలుగానే ఫండ్స్ లేవన్నారు. వాళ్ళు నా ప్రాజెక్ట్స్ సమర్ధించతగినవిగా లేవని తోసిపారేశారు. సీనియర్ ప్రొఫెసర్స్ ఆ తరువాత ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ డైరెక్టర్ గారిని కలుసుకుని నా ప్రాజెక్ట్స్ చూపించి, ఇక్కడి యెక్స్ కవేషన్స్ మొదలుపెడితే, వేల్యుబుల్ ఇన్ ఫర్మేషన్ దొరికే అవకాశం ఉంది అన్నాను. అప్పుడాయన చెప్పిన సమాచారం."
    "మీకంటే చాలా ముందుగానే మాకు ఈ ఊహ వచ్చింది. మా గ్రూప్ తో అక్కడికి వెళ్ళటం కూడా జరిగింది. మేం వెళ్ళేసరికి అక్కడ పిశాచాల కాపలాకి సంబంధించిన కథలు బాగా ప్రచారంలో ఉన్నాయి. కూలీలు తవ్వకాలకి రామన్నారు. మేము ఎక్కువ కూలి ఆశ పెడితే కొందరు వచ్చారు. వాళ్ళయినా గుహలోకి రామన్నారు.
    ఇలాంటి మూఢ నమ్మకాలో, దెయ్యాల, పిశాచాల కథలూ ఎక్కడికక్కడ మాకు ఎదురవుతూనే ఉంటాయి. వాటిని ఖండిస్తూ గ్రామీణులయిన కూలీలకి ధైర్యం చెపుతూ మా పని మేం చేసుకుపోవటమే మా వృత్తి. అంచేత ధైర్యంగా కొందరం గుహలోకి వెళ్ళాం.
    మాలో ఒకడు గుహలో చచ్చిపోయాడు. అతనికి అంతకుముందే గుండె జబ్బు ఉందో, లేక భయానికే అలా అయిపోయాడో, గాలి తాకిడికి తట్టుకోలేకపోయాడో చెప్పలేం. అసలే బెదురుతున్న మా వాళ్ళు మరింత బెదిరిపోయారు.
    అక్కడ ఒక్కరోజు కూడా ఉండటానికి ఒప్పుకోలేదు. దానికితోడు గ్రామీణులు చెప్పే వింత వింత కథలు. ఒక మనిషిని పిశాచం పులి చీల్చినట్లు నిలువునా చీల్చేసిందనీ, మరొకడు విషం తాగినట్లు నురగలు కక్కుకుంటూ నల్లగా మాడిపోయి చచ్చిపోయాడనీ...వగైరా దానితో మా క్యాంపు ఎత్తెయ్యవలసి వచ్చింది. మళ్ళీ మరోసారి వెళ్ళొచ్చి అని నిర్ణయించుకున్నారు. ఆ 'మరోసారి' ఎప్పుడొస్తుందో తెలీదు. డైరెక్టర్ గారు ఇలా అన్నారనేవారు. విష్ణువర్ధన్ గారు సహాయం చేస్తానన్నారు. మీ ఇష్టం ఏం చేద్దామంటారో చెప్పండి" అసహనంగా కదిలాడు విష్ణువర్ధన్.

 Previous Page Next Page