లేవగానే అనిల తనే స్వతంత్రించి రవి చెయ్యి పట్టుకుంది. గాలి మూలంగా అతడి చెవి దగ్గిరగా ముఖం పెట్టింది.
"ఈ సారి మళ్ళీ పడెయ్యకండి. ప్లీజ్? ఒట్టు నేను మీ శీలం పాడుచెయ్యను"
రవి సమాధానం చెప్పలేదు. ఇద్దరూ గోడ కానుకునే నడవసాగారు. వ్యాఘ్రాసుర, వ్యాళాసుర శిల్పాలపై మరోసారి టార్చి వేశాడు రవి. అలాగే ఉన్నాయి. ఎర్రగా-భయంకరంగా...ఎడమవైపు నుంచి గుహలోకి వచ్చినప్పుడు రెండో ద్వారం దగ్గిరకు రావటానికి మరికాస్త చుట్టూ తిరిగి వెళ్ళవలసి వచ్చింది. ఆ శిల్పాలను దాటుకుంటూనే వెళ్ళాలి.
రవి చెయ్యి మరింత గట్టిగా పట్టుకుంది అనిల. ఆమె వణుకుతున్నట్లు తోచింది అతనికి. నడుం చుట్టూ చెయ్యి వేసి గట్టిగా దగ్గిరకి హత్తుకున్నాడు. ఆమెకి ధైర్యం చెప్పాలని తప్ప మరో ఉద్దేశం లేకపోయినా అంత చలిలో అతని శరీరం వేడెక్కింది. అది అనిల గ్రహిస్తుందేమోనని సిగ్గు కూడా వేసింది. తనని తను తిట్టుకున్నాడు. కానీ వెనకటిలా గభాలున వదిలెయ్యలేదు.
గోడని వదలకుండా అతి నెమ్మదిగా నడుచుకుంటూ రెండో గదిలోకి వచ్చారు. ఊపిరి తిరిగింది. నరకంలోంచి నందనంలోకి వచ్చినట్టుగా ఉంది. ఈ గదిలో ఉధృతమైన గాలి లేదు. తీవ్రమైన గాలిలేదు, తీవ్రమైన చలిలేదు. ఎండలేదు. ఎయిర్ కండిషన్ రూంలా ఉంది.
గదిలో వెలుతురు ఉంది. దట్టమైన తెర గుండా వచ్చే ఎండలాంటి వెలుతురు, అన్ని వస్తువులూ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముందుగా ఆ ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. ఇద్దరి వంటిమీద రక్తం మరకలున్నాయి ఎవరో చిమ్మినట్టుగా రక్తం జల్లు.
ఆ విషయం ఎవరూ ప్రస్తావించలేదు. ఆ సమయంలో అది మాట్లాడుకోకూడదని ఇద్దరికీ తోచింది. వెంటనే ఏదో ఒకటి మాట్లాడాలని కూడా అనిపించి అనిల అంది "అంత గభాలున నన్నెందుకు వదిలేశారు?"
"భయం?"
"భయమా? దేనికి?"
"ఏకాంతము నందు నున్న జవరాండ్రనెపంబిడి చెయ్యి పట్టుకున్నాను- అన్నా?"
"మీకు తెలుగు బాగా వచ్చా?"
"ఏమీ రాదు."
"మరి ఏకంగా పద్యాలు కోట్ చేసేస్తున్నారు. నాకేమీ అర్థం కాలేదు. ఈ రోజుల్లో తెలుగూ, తెలుగులా ఉంటేనే ఎవరికీ అర్థం కాదు. సంగం ఇంగ్లీషు కలిపితే తప్ప..."
"నాకూ అంతేలెండి. ఇది టెక్ట్స్ లో పద్యం. బాగుంటే ఈ కాస్త ముక్కా గుర పెట్టుకున్నాను. అంతకు ముందుదీ, ఆ తరువాతదీ నాకూ రాదు."
రవి నవ్వాడు. ఆ నవ్వులో ఇద్దరిమధ్యా ఉన్న సంకోచపు తెర చాలావరకు తొలగింది.
"చెప్పండి ఎందుకు భయం? నా పవిత్రత పాడయిపోతుందనా?"
"కాదు"
"మరి కొంపతీసి మీ శీలం పాడయిపోతుందనా?"
"కాదు కాదు."
"లేకపోతే, నేను భయంకరంగా ఉన్నానా"
"ఛ, ఛ, ఆ కారణం అస్సలు కాదు. మీరెలా ఉన్నారో చెప్పాలంటే నాకొచ్చిన భాష సరిపోదు."
"బతికిపోయాను. భయం ఎందుకో చెప్పండి."
"మిమ్మల్ని ముట్టుకుంటే, నాకు దేవనారాయణ్ గారు కలలో కొస్తారు. అది దెయ్యపు తలతో..."
నవ్వు ఆపుకోలేకపోయింది. పైకే నవ్వేసింది.
"ఆయన కలలోకి రావటం వరకూ అర్థం చేసుకోవచ్చు. పాపం దెయ్యపు తల ఎందుకట? మీరు అలా ఊహించుకుంటున్నారా ఆయన్ని"
"అది కాదు? నాకూ దెయ్యాలంటే భయం ఉన్నా పట్టుదలగా వాటి నెదుర్కోవాలని ఉంటుంది అందుకేమో?"
మళ్ళీ నవ్వింది. మామూలుగా కొంత గంభీరంగా ఉండే రవి ఇలా సరదాగా మాట్లాడటం అనిలకి తెలీదు.
రవి మళ్ళీ అన్నాడు.
"మీలో ఎంగేజ్ మెంట్ అయితే పెళ్ళి అయినట్లే కదూ?"
ఈ ప్రశ్నకి వెంటనే సమాధానం చెప్పలేకపోయింది అనిల. అనిలకీ, దేవనారాయణ్ కీ నిశ్చితార్థం జరిగినట్లు ఆ రెండు గ్రామాల ప్రజలకూ తెలుసు.
అదొక పెద్ద సంబరంగా జరిగింది. పాతకాలపు జమీందారీ కుటుంబాలు ఆ రాచపోకడలు పూర్తిగా పోలేదు. రాచరికాలు పోయినా... అలాంటి కుటుంబాలలోంచి వచ్చిన అనిల ఇంత సామాన్యంగా ఉండటమే ఆశ్చర్యం అందరికీ.
ఈ రకంగా మారటానికి ఇంట్లో వాళ్ళతోను, బయట సమాజంతోనూ అనిల ఎంత హోరాహోరీ పోట్లాడవలసి వచ్చిందో, ఎంత సంఘర్షణ అనుభవించిందో, ఎలాంటి ధైర్యంతో మొండిగా పరిస్థితులకెదురీదిందో మాత్రం ఎవరికీ తెలీదు.
సెడానులున్న కారులో తప్ప బయటకి అడుగు పెట్టనీయని కుటుంబంలోంచి స్వతంత్రించి బస్ లో ప్రయాణం చేసి కాలేజీలో చదువుకున్న దీ. దేవనారాయణ్ తో నిశ్చితార్ధానికి అనిల ఒప్పుకోవటానికీ, సంప్రదాయాలంటే ఎంతో గౌరవం ఉన్నా, వాటిని ధిక్కరించే అనిలని దేవనారాయణ్ అంగీకరించటానికీ చాలా కారణాలున్నాయి. అందుకే రవి ప్రశ్నకి వెంటనే సమాధానం చెప్పలేకపోయింది.
ఆలోచించి అంది "అవును. మాలో నిశ్చితార్థం అయితే పెళ్ళి అయిపోయినట్టే అయితే ఇప్పుడిప్పుడు మాలోనూ పెళ్ళి అయ్యాక కూడా సరిపడకపోతే విడాకులు తీసుకుని మళ్ళీ పెళ్ళి చేసుకుంటున్నారు."
రవి మాట్లాడలేదు. లిప్త మాత్రం అతడి కళ్ళు మెరిశాయి.
గది అంతా మసక వెలుగులో ఉంది. ఒక్కచోట మాత్రం గోడమీద వెలుగు కిరణం రేఖలా ప్రసరిస్తోంది.
"ఇది వింతగా ఉంది" అనిల, దానిమీద దృష్టి పడగానే.
"బహుశా ఇది అప్పటి వాళ్ళ గడియారం అయి ఉంటుంది. అప్పట్లో సూర్యకిరణ ప్రసారాన్ని బట్టే కాలం నిర్ణయించుకొనేవారు."
"అది నేనూ విన్నాను. కానీ, ఇలా వెలుగురేఖలా ఎక్కడ్నుంచి వస్తోంది? వెంటిలేషన్ ఏది? ఇలా ప్రత్యేకించి ఒక గోడమీద రేఖలా పడేలా ఎలా కట్టారు?"
"మీరు లేపాక్షి చూశారా? ఎంతవరకు నిజమో కాని, ఆ దేవాలయం ఏకంగా రామాయణకాలం నాటిదంటారు. జటాయువు మరణించిన చోటు అట. లయ+పక్షి=లేపాక్షి అయిందట. అక్కడి "హేగింగ్ పిల్లర్స్" చూశారా కింద ఏ ఆధారమూ లేకుండా కట్టిన శిల్ప స్థంభాలు అలాంటి శిల్పుల వాస్తు ప్రతిభకు సాధ్యంకానిదేముందీ? చూద్దాం. ఈ గది అంతా పరిశీలనగా చూస్తే తెలుస్తుందేమో."
గది గోడల నిండా దశావతార శిల్పాలున్నాయి. అయితే ఎక్కువగా ఉన్నవి మత్స్యావతారాలు.
"దశావతారాలలో మత్స్యావతారాన్ని ఎక్కువగా చెక్కడానికి కారణమేమిటో?"
"ఆ రోజులలో అందరికీ సంతానం కావాలి. జనాభా సమస్య లేదు సరికదా. జనాభా పెరగటమే ఒక సమస్యగా ఉన్న రోజులు. ఒక చేప కడుపుతో ఉన్నప్పుడు దాని గర్భంలో లెక్కలేనన్ని అండాలుంటాయట. ఆ కారణంగా అప్పటివారు మత్స్యావతారాన్ని ప్రధానంగా పూజించేవారట. ఇలా అని ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ డైరెక్టర్ గారు చెప్పారు. అదే కావచ్చు."
గోడల మీద శిల్పాలు చెక్కినచోట చాలా భాగం నున్నగా పాలిష్ చేసినట్లు ఉంది. అక్కడక్కడ శిల్ప భాగాలు విరిగిపోయిన చోట్ల రాతి గోడ రఫ్ గా కనిపిస్తోంది. అప్పటి శిల్పులు రాతిగోడకి ఏదో ద్రవం పూసేవారట. దానివల్ల నున్నగా అయ్యేదట.
ఆ ద్రవం ఎండకి, వానకీ, గాలికీ చెదిరిపోనిది. ఎవరైనా కావాలని పగలగొట్టినప్పుడు మాత్రమే లోపలి గరుకుతనం బయటపడుతుంది. రామప్ప దేవాలయంలోని శిల్పాలలో ఇది స్పష్టంగా కనపడుతుంది. నల్లగా నిగనిగ మెరుస్తూ శిల్పాలు కనిపిస్తే అలాంటి రాతిలోనే శిల్పాలు చెక్కారనుకుంటాం. కానీ అక్కడక్కడ శిల్పం దెబ్బతిన్నచోట లోపలి గరుకుతనం బయటపడి అసలు శిల అలాంటి గరుకుదేననీ ఆనాటి శిల్పులు నున్నదనం కోసం ఏదో ద్రవం పూసేవారనీ అర్థమవుతుంది.