రాజు తనకోసం ఫోన్ చేశాడని వినగానే, అతనిని క్షమించాలని నిర్ణయించుకోగానే మళ్ళీ రాజుకు తనకూ మధ్య అనుబంధం ఎప్పటిలా కొనసాగుతుందని అనుకోగానే గుండెలమీద సీసంలా పేరుకున్న బరువేదో తొలగిపోయినట్లయింది. మనసేదో మధుర నాదాలను ఆలపించింది. ఏదో సంతృప్తితో సంతోషంతో గాలిలో తేలిపోతున్నట్లు నడుస్తూ ఫోన్ దగ్గరకు వెళ్ళింది. ఫోన్ అందుకున్న చెయ్యి వణికింది. తనను తను అదుపులోకి తెచ్చుకుంటూ "హలో!" అంది ఆప్యాయంగా.
అవతలి వైపు నుండి "హలో!" అని వినిపించింది. అది రాజు కంఠం కాదు. ఎవరో స్త్రీ కంఠ స్వరం.
"లలితను మాట్లాడుతున్నాను. ఎవరు?"
"నేను లలితా! గుర్తుపట్టలేదా? రాగిణిని." కిలారు మని నవ్వు...
నెత్తిమీద ఎవరో తట్టలతో మంచు గుమ్మరించినట్లు ఒక విధమైన జడత్వం ఆవహించింది లలితని...
"లలితా! చూసావా, నువ్వు మరిచిపోయినా, నేను మరిచిపోలేదు. కొందరు స్నేహితులు కాస్త పైకి రాగానే పాత స్నేహితుల్ని మరిచిపోతారు. నేనలా కాదు. నేనెంత పైకొచ్చినా నిన్నూ నీ స్నేహాన్నీ మరిచిపోలేదు. ఒకనాటి నీ సహాయం, నీ ఆదరణ జన్మలో ఎన్నడు మరిచిపోలేను..."
విదిలించుకోవాలి! కుప్పలా మీద పడుతున్న మంచు కొండల నుండి బయటపడాలి! ఓడిపోకూడదు. నిలబడాలి. "థాంక్స్" కంఠాన్ని అదుపులో పెట్టుకుంటూ దానిలో నవ్వు పలికిస్తూ అంది లలిత.
మళ్ళీ కిలారుమంది రాగిణి. చక్కగా తీయగా నవ్వగలదు రాగిణి. ఆ నవ్వు కృతిమత్వం వినిపిస్తోందా? ఏమో! వినిపించినా ఎంతమంది వినగలరు? చాలామంది ఆ తీయదనానికే ముగ్ధులవుతారు.
"లలితా! మీరంతా ఒక జాతివాళ్ళు. మీవన్నీ 'పవిత్ర ప్రేమ'లు! పాపం! రాజుకోసం నువ్వెంత బాధపడుతున్నావో, ఎంత తపించిపోతున్నావో, నేను అనుభవించకపోయినా నీ ముఖం చూసి ఊహించగలిగాను. అక్కడికీ రాజుతో చెప్పాను. "లలితను దూరం చేసుకోవద్దు." అని. ఆముదం తాగిన వాడిలా ముఖంపెట్టాడు! ఈ మొగాళ్ళంతేనే! ఎక్కడిమాట లక్కడ! నా దగ్గిర నా ముందు అంతకంటే ఇంకేమంటాడు? కానీ లలితా! అతనికి నీమీద ప్రేమలేకపోలేదు. నీకెందుకు? నేను చెప్పి ఒప్పిస్తాగా! నువ్వు రా! రేపు రా! నిన్నూ రాజును సినిమాకు పంపించే బాధ్యత నాది!..."
జుగుప్సతో వణికిపోతోంది లలిత. ఎలా మాట్లాడుతోంది రాగిణి! ఒకవేళ రాగిణి నిజంగానే తనపట్ల స్నేహభావం కనపరచాలని అనుకుంటుందేమో! రాగిణికి తెలిసినంతలో ఆ భావాన్ని వ్యక్తపరచగలిగిన భాష ఇంతమాత్రమేనేమో! ఒక జాతికంతా ఒక భాష ఉండటం మాత్రమే కాదు. ప్రతి ఒక్కరికీ ఒక్క భాష ఉంటుంది. దాని పరిధిలోనే తమ మనసు బయటపెట్టుకోగలరు.
లలిత నవ్వింది.శాంతంగా స్థిమితంగా నవ్వింది. హమ్మయ్య! మంచు కరిగిపోతోంది. చైతన్యం వస్తోంది.
"చాలా థాంక్స్ రాగిణీ! కానీ, నువ్వు నాకోసం ఏమీ శ్రమ పడకు! నేనెక్కడికీ రాను. నాకేమీ అక్కర్లేదు!"
"అదేంమాట లలితా? నీకు రాజు మీద ప్రేమ పోయిందా?"
లలిత నిజమే చెప్పదలచుకొంది. "ఇప్పటివరకు పోలేదు."
"భలే దానివి. అంటే ముందు ముందు పోతుందా?"
"నేనేం చెప్పగలను? జీవితం మన ముందు ఉంది. మన ఇష్టానిష్టాలతో నిమిత్తం లేకుండా రకరకాల అనుభవాలు ఎదురౌతాయి. ఆ అనుభవాలు పాఠాలు నేర్పుతాయి. ఆ పాఠాల నుండి శక్త్యానుసారం జీవితాన్ని అర్థంచేసుకుంటాం. ఏమో! ఏం జరుగుతుందో?"
ఈసారి రాగిణి నవ్వలేదు. కంఠంలో కూడా ఏదో మార్పు వచ్చింది.
"రాజుతో కలిసి సినిమాకు వెళ్ళటం నీకిష్టం లేదా?"
"ఇష్టమయిన పనులన్నీ అన్నివేళలా చెయ్యలేం. అంతకంటే ప్రధానమయినదేదో అడ్డుపడుతుంది."
"ఏమిటి, ఆ ప్రధానమయినది?"
"మానవత్వమంటే__ కళ్ళు, ముక్కు, నోరు, ఒడ్డు పొడుగు కాక మరేదైనా ఉందనుకుంటే... అదేదో తెలుసుకో గలిగితే... అదే ప్రధానమైనది!"
రాగిణి టక్కున ఫోన్ పెట్టేసింది.
ఈ మనసు! శరీరాన్ని చంపినంత తేలిక కాదు మనసును చంపటం! ఎన్నివిధాల ఎలాంటి విషప్రయోగాలు చేసినా, ఏ వైపు నుండి ఏ కొద్దిపాటి మానవత్వపు వాసన సోకినా మేలుకుని కూర్చుంటుంది. ఊపిరి పోసుకుంటూ ప్రాణిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. పాపం! రాగిణి!
శ్రమపడటం కష్టమే! కానీ శ్రమించినకొద్దీ శరీరం మరింత దృఢమవుతుంది. మనసూ అంతే! కొన్ని కొన్ని భావనలు తాత్కాలికంగా మనసును బాధించి మెలిపెట్టినా రానురాను ఆ బాధే మనోబలాన్ని పెంపొందిస్తుంది.
రాజు రాగిణికి తన ఫోన్ నంబరు ఇచ్చాడు. రాగిణి తనతో ఏం మాట్లాడుతుందో ఊహించలేడా? అయినా రాగిణి అడగగానే నంబర్ ఇయ్యగలిగాడా?
రాగిణి మాటలకంటే ఈ భావనే ఎక్కువగా బాధపెట్టింది లలితని. ఈ భావనలో పదేపదే మనసు నలిగి పదునెక్కటంవల్లనేనేమో... రాజు తన ఇంటికి వచ్చినప్పుడు మామూలుగా ఆహ్వానించగలిగింది.
"నీ డబ్బు నీ కియ్యాలని ఎప్పటినుండో అనుకుంటున్నాను. కుదరటం లేదు. ఇవాళ తీసుకొచ్చాను."
తన జేబులోంచి అయిదువందలు తీసి బల్లమీద పెట్టాడు రాజు.
ఒక్కసారి నోట్లవంక చూసింది లలిత. వద్దనుకున్నా వాటివెనుక ఉన్న కథ గుర్తుకొచ్చింది.
రాజు కూడా లలితలాంటి మధ్య తరగతి మనిషే! అందుకే చదువుకునే రోజుల్లోనే వాళ్ళిద్దరూ ప్రేమించుకోవటానికి పెళ్ళిచేసుకోవాలని అనుకోవటానికి కాని ఎలాంటి ఆటంకాలు రాలేదు. బి.ఏ. పాసయి లలితలాగే యు.డి.సి. గా చేరిన రాజును ఐ.ఏ.ఎస్. కి కట్టమని లలిత ప్రోత్సహించింది.
"మన బోటి వాళ్లకు వస్తాయా అలాంటి ఛాన్స్ లు?" నిరాశగా అన్నాడు రాజు.
"ప్రయత్నించు. తప్పేముంది?" అంది లలిత.
రాజు ఐ.ఎ.ఎస్. పరీక్షకి కట్టాడు. పరీక్షల ముందు కనీసం రెండు నెలలైనా ఉద్యోగానికి సెలవు పెట్టి ట్యుటోరియల్ కాలేజిలో చేరి చదవాలనుకున్నాడు. జీతం నష్టంమీద కాని సెలవు దొరకదు. కుటుంబ పరిస్థితులు రెండు నెలలు జీతం లేకుండా గడిచేలా లేవు.
మెడలోకి సన్నని గొలుసు చేయించుకోవాలని అతి కష్టంమీద లలిత పోగుచేసుకుంది అయిదువందలు. ఆ డబ్బు అతని చేతిలో పెట్టింది.
"నా దగ్గరున్నదీ ఇంతే! ఎలాగో సర్దుకో! సెలవు పెట్టెయ్యి. చదువు అశ్రద్ధ చెయ్యకు!" అంది.
కృతజ్ఞతతో కరిగిపోయాడు రాజు. లలిత చేతులు రెండూ తన చేతుల్లోకి తీసుకున్నాడు.
"లలితా! ఎలా తీర్చుకోగలను నీ రుణం?"
"రుణమా? తీర్చుకుంటావా?"
మూతి బిగించింది లలిత.
ముడుచుకున్న లలిత మూతిమీద చిన్నగా చూపుడు వేలితో కొట్టి "సారీ! నేను ఐ.ఎ.ఎస్. ఆఫీసర్నయితే అదంతా నీదేగా!" అన్నాడు.
లలితకెలాగో అనిపించింది.