అరుంధతి అయిదు గంటలకే నిద్ర లేస్తుంది. లేవగానే ముఖం కడుక్కొని...పనమ్మాయి వచ్చి ఇంటిముందు శుభ్రంచేసి చిన్న చిన్న ముగ్గులు పెట్టేస్తుంది.
ఓ అరగంట తర్వాత నరసింహంగారు నిద్రలేచి మార్నింగ్ వాక్ కి వెడతారు. సీతారాంపురం నుంచి బందర్ రోడ్ మీద కొచ్చి పడమటివైపు వెళ్ళి సాధ్యమైనంత వడివడిగా యించుమించు రెండుమైళ్ళ దూరం నడిస్తారు.
బెంజిసర్కిల్, ఆ తర్వాత విశాలంగా ఎంతో దూరం ఎదిగిపోయిన రోడ్డు పట్టణ భాగంలో వున్నట్లు విపరీతంగా పెరిగిపోయిన దుకాణాలు, సినిమా హాళ్ళు...
"ఒకప్పుడు...ఈ ప్రాంతమంతా అడవిలా ఉండేది. నిర్జనంగా ఉండి వంటరిగా మనుషులు నడవడానికి భయం కొలుపుతూ వుండేది. అటువంటిదిప్పుడు రెండో విజయవాడలా తయారయింది.
* * * *
ఆరు గంటలకు సుదర్శనం నిద్రలేచాడు. మొహం కడుక్కోవటం అయిపోగానే అరుంధతి కాఫీ తెచ్చి ఇచ్చింది.
సుదర్శనం నిద్రలేవగానే ఏ సమస్యా గుర్తు తెచ్చుకోకుండా వుండటానికి ప్రయత్నిస్తాడు. అయినా ఏ ఆలోచన అయితే, అవే ఈగల్లా ముసురుతూ ఉంటాయి.
వెచ్చాల కొట్లో ఇవ్వాల్సిన డబ్బులు, బట్టలకొట్టు అప్పు, ఆఫీసులో ఒక స్నేహితుడి బలవంతంమీద భార్యకు తెలీకుండా కట్టిన చీటి, ఆ చీటీ డబ్బు సకాలంలో కట్టకపోతే ఆ స్నేహితుడు చేసే హంగామా...
ఇవన్నీ గుర్తుకొచ్చి గుండె దడదడ కొట్టుకుంటుంది. వొళ్ళంతా ముచ్చెమటలు పడుతూంటాయి.
నెలకి దాదాపు రెండువేలరూపాయలదాకా వస్తాయి. ఆ డబ్బంతా ఎలా హరించుకుపోతుందో తెలీదు. వారంరోజులు తిరిగేసరికి చేతిలో పైసా ఉండదు. మిగతా మూడు వారాలూ తనమీద తనకు అసహ్యం కలిగేటట్లు ప్రతి చిన్నదానికీ ఇబ్బంది పడుతూ గడపడం...
తన మీద తనకు అసహ్యం కలిగే సందర్భాలు అతని జీవితంలో చాలా జరుగుతూ ఉంటాయి. ఒకరకంగా చూస్తే ఆ క్షణాలే జీవితాన్ని ఎక్కువగా ఆక్రమించి వేశాయి.
అతను కాఫీ త్రాగేటప్పుడు కొంచమన్నా మాట్లాడకపోతే అరుంధతికి తోచదు.
అతను నిశ్శబ్దంగా వుండటం చూసి "ఏమిటలా వున్నారు?" అనడిగింది.
"ఊ?"
"కుటుంబ సమస్యల గురించి ఆలోచిస్తున్నారా?"
"ఉహు"
అరుంధతి నవ్వింది. "మీరు మామూలుగా ఉండండి. సమస్యల గురించి కాకుండా, సరదాగా వుంటే చూడాలని ఎంతో ఆకాంక్ష."
"సరదానా?"
"ఏం? సరదాగా ఉండే హక్కు మీకు లేదా?"
"ఉంది."
"మరేం?"
"ఆ హక్కుని ఉపయోగించుకోవటం చేత కావటం లేదు.
అరుంధతి మళ్ళీ నవ్వింది. "మన దేశంలో అందరూ సృష్టించుకున్న హక్కుల గురించి కల్లోలాలు కలిగిస్తూ ఉంటారు. ఉన్న హక్కుని వినియోగించుకోవటం మీకు చేతకాదు."
సుదర్శనం కూడా నవ్వుదామని ప్రయత్నించాడు. నవ్వు రాలేదు.
జీవితంలో అతను సహజంగా నవ్వి చాలా రోజులయిపోయింది.