"ఏమిటమ్మా! ఇదంతా? లచ్చమ్మ, సింహాచలం ఏంతప్పు చేశారని? వాళ్ళని మీరంతా ఎందుకింత వెలేసినట్లు చూస్తున్నారు?" అన్నాడు తల్లితో.
అన్నమ్మ గుండె బాదుకుని "హమ్మో! పెద్దమాట తప్పితే ఇంకేమన్నా వుందా? ఆళ్ళు తప్పుకట్టేస్తే పోలా?" అంది, తప్పంతా వాళ్ళదేనని మనసారా నమ్ముతూ.
"ఏం తప్పుచేశారని తప్పు కట్టాలి?"
"అదేంటి? కట్టు తప్పి ఈడు చాకలిదాన్ని పెళ్ళాడనా?" కొడుకుని అమాయకుణ్ణి చూసినట్టు చూస్తూ అంది అన్నమ్మ.
"ఏం పెళ్ళి చేసుకుంటే? ఇద్దరికీ ఇష్టమయింది, చేసుకున్నారు. అందుకు పెద్దకు తప్పుకట్టటం దేనికి! వీళ్ళంతా ఆ డబ్బుతో తాగి తందనాలాడితే కాని, సింహాచలం చేసిన తప్పుపోదా?"
కోపంగా అంటున్న కొడుకుని వింతగా, భయంగా చూసింది అన్నమ్మ.
"సాల్లే ఊరుగు! కట్టు దాటితే ఊరుకుంటారా పెద్దమాట కాదని బ్రతగ్గలమా?" అని కసిరింది.
లచ్చమ్మ, సింహాచలం ఈ తాకిడికి తట్టుకోలేకపోయారు. తప్పు కట్టడానికే సిద్దమయ్యారు. పెద్ద రెండు వందలు తప్పు కట్టమన్నాడు.
సింహాచలం కాళ్ళావేళ్ళాపడితే, నూటయాభై కట్టమన్నాడు. అందరూ పెద్ద ఔదార్యాన్ని పొగిడారు. సింహాచలం అప్పుచేసి నూట యాభై రూపాయలు తప్పుకట్టాడు.
ఆ డబ్బుతో సింహాచలంతో సహా అందరూ తాగి తందనాలాడారు.
ఆ దృశ్యాన్ని దూరంనుంచి చూసిన జైహింద్ బాబు చంద్రి ఒకరినొకరు భయంగా చూసుకున్నారు.
4
మోకాలి వరకు పంచెకట్టి, వదులచేతుల చొక్కా తొడిగి, భుజానపెద్ద సంచీ పట్టుకొని వెంకడు రాజయ్య గుడిసె ముందు నిలబడ్డాడు.
నాగమ్మ బయటకు వచ్చి "ఎవరు నువ్వు?" అంది.
వెండు భయంగా "అయ..... రాజయ్యున్నాడా?" అన్నాడు.
రాజయ్య గుడిసెలోనే ఉన్నాడు. తన పేరువిని బయటకు వచ్చాడు.
నేనే రాజయ్యని! ఏం కావాలనీకు" అన్నాడు.
"నేను నీ కొడుకుని - వెంకణ్ని....." అన్నాడు వెంకడు ఏడుపు గొంతుతో.
"ఏంటి?" తెల్లబోయి చూశాడు రాజయ్య. నాగమ్మ ముఖంలో అప్పుడే రంగులు మారుతున్నాయి.
"అమ్మ చచ్చిపోనాది!" ఏడుపు మొదలు పెట్టబోయాడు వెంకడు.
రాజయ్య "సాల్లే!" అని విసుక్కుని "మీ తాత ఏమయిపోయినాడు?" అన్నాడు.
"తాతకూడా చచ్చిపోనాడు. నన్ను నీ కాడకి నువ్వీడున్నావని తాతకెవరో సెప్పారంట!"
"సర్లే! లోపలికిరా?" అన్నాడు రాజయ్య.
తలవంచుకుని లోపలికి నడిచాడు వెండు.
"ఇదో కొత్త తగలాటమా" అని గింజుకుంది నాగమ్మ.
"ఊరుకొయ్యే! ఎవుడినెవుడు సాకాల? ఆడి బతుకాడు బతుకుతాడు. మనతోపుంటాడు" కసిరాడు రాజయ్య.
రాజయ్య సాధారణంగా నాగమ్మను కసురుకోడు. ఆడింది ఆటగానే సాగనిస్తాడు.
కానీ, ఎప్పుడయినా కసిరినప్పుడు నాగమ్మ తగ్గిపోతుంది..రాజయ్యకు మరీ కోపం తెప్పించకూడదని దానికి తెలుసు.
లోపలికొచ్చాడు వెంకడు భయంగా- బెదురుగా తన కొత్త అన్నను కుతూహలంగా చూసింది చంద్రి.
"ఆ సంచీలోదేంటన్నా?" అంది.
'అన్నా' అనే పిలుపు ఎంతో తియ్యగా వినిపించింది వెంకడికి. ఇక్కడ చెల్లెలు తన్నంత తియ్యగా పిలుస్తుందని అతడు ఆశ పెట్టుకోలేదు.
"అయ్యన్నీ మూలికలు. మా తాత మూలికల వయిద్దెం. చేస్తాడుగద! అయ్యి! నాకూ వచ్చు వయిద్దెం. నీకోసం దెచ్చినా ఇది....."
రంగు రంగుల పూసలదండ ఒకటి చంద్రికి అందించాడు చంద్రి ఆప్యాయంగా అందుకుని "బాగుంది" అంది.
"యెండా? బంగారమా? యేంటి బాగుండాది నీకు?" అంది నాగులు ఈసడించుకుంటూ.
"వెండీ; బంగారం కొట్లల్లో దొరుకుతాయిలే అమ్మా? ఇది కావాలంటే దొరికేదికాదు. అన్న తేబట్టి దొరికింది"
వెంకడి ముఖం వికసించింది. వాడికి చంద్రి మాటలు పూర్తిగా అర్థం కాలేదు. కానీ, చంద్రికి తనమీద వున్న అభిమానం మాత్రం అర్దమయింది.
ఆ ఇళ్లలో ఊరకే కూచుంటే ఎవరికీ జరగదు. అంచేత అప్పుడే వెంకడు ఏం చెయ్యాలన్న ఆలోచన జరిగింది.
నువ్వేం పని చేస్తావురా?" అన్నాడు రాజయ్య.
"వయిద్దెం తెలుసు. మూలికల వయిద్దెం- తాతకాక నేర్చుకున్నాం....
"పోపోరా! ఈడ మూలికల వయిద్దెం ఎవడికి కావాల? అందరికీ గోళీల మందులే కావాల, అయ్యేవాడతన్నారు. కూలిపనికి పోతావా! ఆడఏడనో రోడ్డేస్తున్నారంట....."
వెంకడు బిక్కమొహం వేసుకున్నాడు. "సిన్నప్పుడు దెబ్బ తాకి నా కాలు సొట్టపోయినాదయ్యా, కూలిపని సెయ్యలేను....."
"ఆ! కూకుని మింగుతావు" అంది నాగమ్మ కల్పించుకొని......
"నువ్వూరుకోయే" అని నాగమ్మని కసిరి "మరి నీకు ఏపని చేతనవుద్దిరా? నీ వయిద్ధెం ఈడ పనికిరాదు" అన్నాడు రాజయ్య.
"తైలం పట్టించి పళ్ళు తోముతా! తాతకి తోమేవాడిని. నొప్పులన్నీ తగ్గిపోతాయి....."
"ఆ మాటలినగానే నాగమ్మ సంబరంగా "మా వరదయ్యగోరికెప్పుడూ కీళ్ళనొప్పులే! వొళ్ళు తోమేవాడు కావాలని ఇదవుతున్నారు. ఆడ కుదురుస్తాను అందాకా.... అంది.
అప్పటికి అంతకంటే చెయ్యగలిగినది లేదు గనుక రాజయ్య ఒప్పుకున్నాడు.