Previous Page Next Page 
కళ్ళు పేజి 7


    "ఆపరేషనా? నాకా? నాకే రోగమూలేదే. నేను చాలా ఆరోగ్యంగా వున్నాను" ఆమె ధైర్యం తెచ్చుకుని అంది.


    
    "అందుకే... నువ్వు పనికి వస్తావు."

 

    "కాని... ఏం ఆపరేషన్?"

 

    "నీ కళ్ళకి."

 

    భయంతో ఆమె ఒళ్ళు గగుర్పొడిచింది. "నా కళ్ళు... చాలా ఆరోగ్యంగా..."

 

    "అందంగా కూడా వున్నాయి. అందుకే..." అంటూ అతను ఒకడుగు ముందుకు వేశాడు.

 

    ఆమె లేచి నిలబడి మంచానికానుకుంటూ నడిచి వెనక్కి జరిగింది.

 

    "నీ పేరు మందాకిని కదూ? మందాకినీ! ఈ రోజు నీ రెండు కళ్ళూ పెకలించి వెయ్యబోతున్నాను."

 

    ఆమె విద్యుద్ఘాతం తగిలినట్లు వణికిపోయింది. అతని కళ్ళు... మరింత భయంకరంగా మారినట్టు, తీసుకున్న నిర్ణయానికి తిరుగులేనట్లు వెలుగుతూ కనిపించాయి.

 

    నడిరోడ్డు మీదే అతన్నుంచి తప్పించుకోలేనప్పుడు అతని స్థావరంలో, అతని సమక్షంలో నిలబడి అలాంటి ప్రయత్నం చెయ్యటం వ్యర్థమని గ్రహించింది.

 

    "ప్లీజ్! నన్నొదిలెయ్యి. నీకెంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను" నిస్సహాయంగా, దీనాతిదీనంగా అర్థిస్తుంది. ఆమె కళ్ళవెంట జలజలమని నీళ్ళు కారుతున్నాయి.

 

    అతని కళ్ళలోని నిర్ణయంలో మార్పులేదు. ఇంకో అడుగు ముందుకు వేశాడు.

 

    "నిజంగా... నిజంగా... నా కళ్ళు తీసేస్తావా?"

 

    అతను చూపులతోనే సమాధానం చెప్పాడు.

 

    "నన్ను... నన్ను... ప్లీజ్... అంధురాల్ని చేసెయ్యకు. కావాలంటే నన్ను రేప్ చెయ్యి. నా సర్వస్వం దోచుకో... కానీ..."

 

    అతనింకో అడుగు ముందుకు వేశాడు.

 

    "చూడూ! నేను చాలా అందమైనదాన్ని. నా ఒంపుసొంపులు చాలా గొప్పవి. నన్ననుభవించాలని ఎందరో ఉవ్విళ్ళూరారు. అటువంటిది నన్ను నేనే నీ సమర్పించుకుంటాను. నా అందాలు..."

 

    అతనామెను సమీపించాడు. కళ్ళలోని ఎరుపు... ఆశగా ఆ కళ్ళవంక చూస్తుంది. ఫెడీమని ఆమె చెంపమీద కొట్టాడు. చాలా బలమైన దెబ్బ.

 

    కళ్ళు చీకట్లు క్రమ్మినట్లు క్రిందకు వాలిపోయింది.


                                                          *  *  *


    మందాకినికి తిరిగి తెలివొచ్చేసరికి తానో టేబుల్ మీద పడుకోబెట్టబడి వున్నట్లు గ్రహించింది. తల అటూ ఇటూ కదపటానికి ప్రయత్నించింది. కదల్లేదు. కాళ్ళూ చేతులూ ఆడించాలని చూసింది. కదలడం లేదు.

 

    ఏం చేశాడు? తనని ఈ టేబుల్ కి బంధించి వుంచాడు.

 

    ఉన్నట్లుండి ఆమె ముఖంమీదకు కాంతి ప్రసరింపజేస్తూ ఫోకస్ లైటు లాంటిదొకటి వెలిగింది.

 

    తాను పడుకొన్న టేబుల్, కళ్ళు జిగేలు మనిపించే ఆ లైటు- ఆమె ఆపరేషన్ థియేటర్ లో వున్నట్లనిపించింది. తాను తెలివితప్పటానికి ముందు అతనన్న మాటలు చెవుల్లో మార్మోగాయి. గుండె గుభేలుమంది.

 

    జబ్బ దగ్గర ఏదో సూది ఆనినట్లయింది. "ప్రీమేడికేషన్ ఇస్తున్నాను నువ్వు హడలి చావకుండా. అఫ్ కోర్స్! కొంచెం ముందే ఇవ్వాలనుకో."

 

    నీడిల్ జబ్బ దగ్గర కండలో దిగబడింది. చాలా సున్నితంగా, ఎంతో అనుభవమున్న వ్యక్తి ఇంజక్షన్ చేస్తున్నట్లనిపించింది.

 

    "వేలియమ్ టెస్ట్ చేశాను. ఇప్పుడు ఫేనర్గాన్, ఎండ్రోపిన్ కంటివైపు చేస్తున్నాను."

 

    రెండో జబ్బకు కూడా ఇంజక్షనివ్వబడింది.

 

    తాను అరిచీ, కేకలుపెట్టి ప్రయోజనం లేదని తెలుసుకుంది. ఇహ ప్రపంచంలోని ఏ శక్తీ అతన్నుంచి కాపాడలేదు.

 

    మూగగా, హృదయవిదారకంగా, దీనాతిదీనంగా రోదిస్తుంది.

 

    హ్యాండ్స్ వాష్ చేసుకునేందుకతను ప్రక్కకి వెళ్ళాడు.

 

    నెమ్మదిగా మగత ఆవహిస్తుంది. లీలగా అతని కదలికలు తెలుస్తున్నాయి.

 

    అతనొచ్చి ఆమె తన వెనగ్గా నిలబడ్డాడు.

 

    "ఇంజక్షన్ ఇస్తున్నాను నొప్పి తెలీకుండా."

 

    జైలోకైన్ ఇంజక్షన్ ఎడమ టెంపోరో మేన్ డిబ్యులార్ జాయింటులోకి ఇవ్వబడింది.

 

    లోపలకు మొద్దుగా ఏదో జరజర ప్రాకుతున్నట్లనిపించింది. ఫేషియల్ బ్లాక్.

 

    తర్వాత రిట్రోబల్బార్ రిజియన్ లో ఇంకో ఇంజక్షనివ్వబడింది.

 

    మందాకిని ముఖమంతా తిమ్మిరెక్కినట్లు బండబారినట్లు తెలుస్తోంది.

 

    ఒక్కక్షణం...

 

    తర్వాత స్పెక్యులర్ పెట్టి ఎడమకంటి కనురెప్పలు సెపరేటు చేశాడు.

 

    చేతిలో చిన్న స్కేల్ పెల్ నిగనిగ లాడుతోంది.

 

    కార్నియా చుట్టూ గుండ్రంగా సర్క్యులర్ ఇన్ సిషన్.

 

    తర్వాత స్లెర్కా నుంచే కన్ జెక్టెయివా సెపరేటు చెయ్యబడింది.

 

    అతని వ్రేళ్ళు చురుగ్గా, లాఘవంగా పని చేస్తున్నాయి.

 

    ఆ తర్వాత ఎక్స్ ట్రా ఆక్యులర్ మసిల్స్ కత్తిరింపబడ్డాయి.

 

    కనుగుడ్డు ఇప్పుడు ఫ్రీగా కదులుతోంది.

 

    ఆప్టిక్ నెర్వ్ గైడ్ చేతిలోకి వచ్చింది. కనుగుడ్డు క్రింద నుంచి లోపలకు జొనపబడి, చిన్న సిజర్స్ తో అడుగునున్న అవరోధాలన్నీ తొలగించబడి- చివరకు కనుగుడ్డు పూర్తిగా విడిపోయింది.

 

    ఆమెకు ఏ మాత్రం నొప్పి తెలీకుండా ఐ బాల్ ఊడిపోయి అతని చేతిలోకి వచ్చేసింది.

 Previous Page Next Page