ఎన్నో యేళ్ళుగా కృత్రిమ వాతావరణంలో విసిగి వేసారిపోయిన నాకు యీమె పరిచయం ఎంతో మనశ్శాంతినిచ్చేది. అప్పుడూ మొదట దేవాలయంలో ఈమెను చూసి ఊహించుకున్న ఊహలను తలచుకుని సిగ్గుపడుతుండేవాడిని, ఆయన జబ్బుగురించి ఆమె వేదనతో ప్రశ్నిస్తూ వుండేది. చివరకు యెలాగో చెప్పాను. ఆమె ముఖం కళావిహీనమయింది. సహజంగా వుండటానికి ప్రయత్నిస్తూ ఏదో చెప్పబోయి విఫలురాలయింది. నేను చూడనట్లు ముఖం పక్కకు తిప్పుకోవటం మినహా ఏమీ చేయలేకపోయాను.
ఒకరోజు ఒక దుర్ఘటన జరిగింది. ఈ మధ్య యెలాగైనా నా స్నేహితులు తరచు రావటంలేదు. ఆ వెనుకటిరోజు రాత్రి నన్ను మార్చితీరుతామని పంతం పట్టినా, నా మనస్తత్వానికి అసహ్యించుకునో, మరి ఏమో ఆ ప్రసక్తి నాముందు తీసుకురాలేదు. వ్యంగ్యంగా మాత్రం వాళ్ళలో వారు ఏదో అనుకునేవారు.
ఒకరోజు మనోహర్ కనుచీకటి పడుతుండగా వచ్చి "చిరంజీవి! నువ్వీ సహాయం చేసి పెట్టక తప్పదోయ్" అన్నాడు.
అతన్ని కూర్చోమని "ఏమిటి?" అన్నాను.
"రేఖా!" అన్నాడు. కర్టెన్ తొలగించుకొని ఒక ఇరవై ఏళ్ల అందమైన అమ్మాయి వచ్చి తలవంచుకుని కుర్చీలో కూర్చుంది. ఏమిటన్నాను మళ్లీ.
అతను నవ్వి, పెదవులు తుడుచుకుని మళ్ళీ నవ్వి "ఒకసారి బంజారా హిల్స్ కు పోయివస్తుంటే ఈమె తటస్థపడింది. వీళ్ళ నాన్నగారు పెద్ద ఆఫీసర్! పేరెందుకులే ఈమె, నేనూ పెళ్ళి చేసుకుందామనుకున్నాం. అందుకని కలిసి తిరిగాం. అవును ప్లెయిన్ గా చెప్పేస్తున్నాను. కలిసి తిరిగాం. కాని పెళ్ళి జరగటానికి ఓ అవాంతరం వచ్చిపడింది. ఇప్పుడు ఒక విషయంలో సహాయ పడకపోతే ఈ పిల్లజీవితం దుఃఖభాజనమవుతుంది."
నాకు సరిగ్గా పాలుపోక సరిగ్గా చెప్పమన్నాను.
"చెప్పుకొచ్చేందుకేముంది?" నసిగి ముసిముసి నవ్వులు నవ్వి, చివరకు సత్యాన్ని బయటపెట్టాడు. నేను కోపంతో కుర్చీలోంచి లేచి నిలబడ్డాను. "నో నో మనోహర్ నన్ను గురించి ఏమనుకుంటున్నావు? నేనిట్లాంటి అవాచ్యపు పనులు చేసే డాక్టర్ ని కాదు. బుద్దిగల డాక్టరు యెవరూ కూడా చేయరు" అన్నాను.
"చిరంజీవి! నేను నీ ప్రాణస్నేహితుడ్ని నా పరువు, ప్రతిష్ట వేలం వేయమన్నావా?" అన్నాడు.
మొహమాటం ముంచుకొచ్చింది. మంచిమాటలతో యిలాంటి పనులు ఎన్నడూ చేయనని చెప్పసాగాను. అతను వినలేదు. నేనంతకంటే వినలేదు. చెప్పి చెప్పి విసిగిపోయి చివాకు కోపం పట్టలేక "నువ్వు చవటవు. నీకంటే క్వాక్ నయం. అని తిట్టి "రేఖా, రా ఈ వెంగళాయితో ఏమిపని?" అంటూ దురుసుగా వెళ్లిపోయాడు.
స్నేహితుడిని బాధపెట్టానుకదా అని మొహం ఇంత చేసుకొని కూర్చున్నాను మనసు ఏమీ బాగాలేదు. ఒకసారి వాళ్ళయింటికి పోయివద్దామనే ఉత్సుకత నాపుకోలేకపోయాను. ఆయనకు కూడా ఎక్కువగా వుంది. ఎలానూ ఇంక కొద్దిరోజులకన్న యెక్కువ బ్రతకడు. తరచు పోయి కనుక్కొని వస్తూ వాళ్ళకు అండగా వుండాలి.
నేను పోయేసరికి అనసూయ యివతలి గదిలో చాపమీద కూర్చొని భాగవతం చదువుతోంది. టైం ఎనిమిది దాటి వుంటుంది. నన్నుచూసి "రండి, వారు నిద్రపోతున్నారు. నాకు ఏమీ తోచక చదువుకొంటున్నాను" అంది.
ఈ వేళప్పుడు రావటం ఇదే ప్రథమం అనుకొంటాను. "ఇహనుంచి రెండు తడవులూ వచ్చి విచారిస్తుండటం మంచిదని భావంచాను" అన్నాను కూర్చుంటూ.
"తప్పకుండాను. మేమంటే మీకు యెంత దయా! మీరు భోంచేసి వచ్చినట్లులేదు. ఒక్క పది నిముషాలు..." అంటూ ఆమె లోపలికి పోబోయింది.
"వద్దండి. నేను చాలా భోజనప్రియుడ్ని అది ముగించకుండా యెక్కడికీ కదలనే కదలను" అని నిబ్బరంగా బొంకాను.
"నిజంగా!" అంటూ ఆగి "నిజమే చెప్పి వుంటారు. లేకపోతే మీ పిన్నిదగ్గర అబద్దం ఎందుకు చెపుతారు?" అని మళ్ళా వచ్చి కూర్చుంది. "మీ ముఖం ఎందుకో వాడిపోయి వుంది" అని మళ్ళా తలయెత్తి చూసింది.
"ఇవాళ ఓ సంఘటన జరిగింది. అప్పట్నుంచి మనసు గాయపడింది. అది మీకు చెబుదామనే నిశ్చయించుకున్నాను" అని సవివరంగా జరిగిందంతా ఆమెకు నివేదించి "సిగ్గుపడకుండా మీముందు ఇటువంటి విషయాలు చెప్పాను. మీరేమీ అసహ్యించుకోవటం లేదుకదా?"
"అసహ్యమెందుకు డాక్టర్" అంది అనసూయ వెంటనే "కాని మీరు చేసిన పనిని నేను అభినంధించటంలేదు."
"అదేమిటి? ఎందుకని? అది ఎంత నీచమైన పని."
"డాక్టర్!" అంది అనసూయ. "మరణశిక్ష ఎంత గొప్ప నేరంచేసినా సాధారణంగా విధించలేం. మరి ఈ సామాన్యమైన నేరానికి మరణశిక్షా"
"మరణశిక్షా? ఎవరు విధించారు?"
"మీ సహకారం ఆమెకు లభించదాయె! ప్రేమకోసం అమాయకురాలై యీ పనిచేసిందని నేను పాత పాటలు పాడను! మీలాగే యితరుల సహకారం ఆమెకు లభించదు. చివరకు ఏ నుయ్యో గొయ్యో చూసుకొంటుంది. ఆశ్చర్యంగా వుంది డాక్టర్! ఆమె గొప్పింటిబిడ్డ! నాగరికురాలు, ఆఫీసర్ గారి కూతురు. అయినా ఆడధై వుండటంచేత ఆ సహజమైన అల్పత్వాన్ని విడిచిపెట్టలేకుండా వుంది."
"అబ్బ! ఏమిటి మీరనేది? ఇది సామాన్యమైన నేరమన్నారే, ఎలా అవుతుంది?"
"అవును మరి! వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని వుంటే యిది నేరంక్రింద పరిగణించరుగా! ఆమెకు ఈ యిబ్బంది రాకుండా వుంటే ఇది నేరమని యెవరూ అనుకొనేందుకు అవకాశం వుండదుగా డాక్టర్! ప్రపంచంలో అనాదినుంచీ నేరానికి న్యాయాన్యాయాలు నిర్ణయించటంలో సరిగ్గా ఎవరూ కృతకృత్యులు కాలేకపోయారు.