Previous Page Next Page 
మేడలో నీడలు పేజి 7


    లలితమ్మగారు ఊరుకుంది. ఏమీ జవాబు చెప్పలేదు.

 

    "లలితా!" అన్నారాయన దగ్గరకొచ్చి, "అంత దిగులుగా వున్నావేం?"

 

    "ఏమీ లేదండీ" అన్నదామె తల ఎత్తి బలహీనంగా.

 

    "నాకు మనస్సు బాగుండలేదు. ఎక్కడికయినా పోవాలనిపిస్తోంది."

 

    "ఆవిడ ఒకక్షణం ఊరుకొని "ఏమండి తీర్థయాత్రలకి పోతే?" అనడిగింది ఆశగా.

 

    ఆయన ముఖం వికసించింది. "బాగానే వుంటుంది" అన్నాడు ఉత్సాహంగా. కాని మరునిముషంలో ఏదో గుర్తుకువచ్చి ముఖం నల్లబడి పోయింది.

 

    "కాని... డాక్టర్ ఎక్కడకూ కదలటానికి వీల్లేదన్నాడు" అన్నాడు గాద్గదికంగా.

 

    ఈ గాద్గత్వం విని ఆమె చలించింది. "పోనీండి. తీర్థయాత్రలకేమొచ్చె. మీ ఆరోగ్యం బాగుంటే అదే చాలు" అన్నది ఎంతో ఆప్యాయతతో.

 

    విశ్వనాథంగారు విచారంగా "యాత్రలు చేద్దామని ఎన్నాళ్ళపట్టో నీకు మనసుగా వుంది తీర్చలేకపోయాను" అన్నాడు.

 

    ఆమె అనునయిస్తున్నట్లుగా "బాగుంది. దీనికి విచారం దేనికి? ఎప్పటికయినా చెయ్యకపోతామా?" అని మాటమారుస్తూ "పొద్దుపోతోంది. స్నానానికి లేవరూ?" అంది.

 

    "వస్తున్నాను. ఈలోగా కొంచెం కాఫీ తీసుకురా."

 

    "తెస్తాను" అంటూ ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది.

 

    విశ్వనాథంగారు సోఫామీద కూర్చుని మరో సిగరెట్ వెలిగించి మెల్లిగా ఆలోచనల్లో పడ్డారు. రెండునిముషాలు గడిచాక గదిబయట అలికిడి అయ్యేసరికి భార్యేమో అని తల ఎత్తి చూశాడు. కాని వచ్చింది క్రింద అద్దెకుంటున్న జగన్నాథంగారు.

 

    విశ్వనాథంగారు అద్దెతో డబ్బు చేసుకుందామని అద్దెకివ్వలేదు. లంకంత కొంప. యింట్లో ఎవరూ సరిగ్గా వుండటంలేదు గనుక సందడిగా వుంటుందన్న వుద్దేశంతో క్రింద రెండుగదులు జగన్నాథానికి అద్దెకిచ్చాడు. జగన్నాథానికి పనీపాటా ఏమీలేదు. ఇదివరకటి రోజుల్లో పౌరోహిత్యం చేసేవాడుగాని యిప్పుడు అదీ మానేశాడు. రెండుమూడు ఎకరాల పొలం వుంది. ఆయన హాబీగా చేసుకున్న పెళ్ళిళ్ళ బ్రోకరేజ్ వలన కాస్తో కూస్తో లభిస్తూంటూంది.

 

    "రండి. రండి జగన్నాథంగారూ!" అని ఆహ్వానించాడు విశ్వనాథంగారు.

 

    జగన్నాథం వచ్చి ఎదురుగుండా సోఫాలో చతికిలబడి "అయ్యా సుప్రభాతం. మరి విశేషాలు సెలవియ్యండి" అన్నాడు.

 

    అంతస్థులో ఎంతో తేడా వున్నా వీళ్ళిద్దరికీ మంచిస్నేహం ఏర్పడిపోయింది. విశ్వనాథంగారికి ఆయనంటే ఎందుచేతనో సదభిప్రాయం ఏర్పడింది. ఇద్దరు రోజుకు ఒకటి రెండుసార్లన్నా కలిసి లోకాభిరామాయణం ముచ్చటించుకుంటూ వుంటారు.

 

    త్రిలోక సంచారులు మీరే సెలవియ్యండి" అన్నారు విశ్వనాథంగారు.

 

    నిన్న ఈ ఊళ్ళో రామావధాన్లుగారమ్మాయికి తణుకులో ఫస్టుక్లాసయిన సంబంధమొకటి చూశాం. ఇవాళ మధ్యాహ్నం సిట్టింగ్ ఏర్పాటుచేశాం" అన్నాడు జగన్నాథం. ఆయన పెళ్ళిచూపులకి సిట్టింగ్ అనే పదం వాడుతుంటాడు.

 

    "మంచిపని చేశారు. అయితే యివాళంతా మీరు బిజీయే అన్నమాట."

 

    "చిత్తం. అలాంటిదే."

 

    "మరి మన చదరంగం!"

 

    మధ్యాహ్నంపూట యిద్దరూ తరుచూ చదరంగంకూడా ఆడుతూంటారు. జగన్నాథానికి పేకాట జబ్బుకూడా వుంది. జేబులో నాలుగుడబ్బులుండటం తటస్థపడితే దమ్మిడీ స్టేక్ మీద యిరుగు పొరుగుతో సీక్వెన్స్ ఆడతాడు.

 

    జగన్నాథం పెద్ద సమస్యే వచ్చిపడినట్లు ముఖంపెట్టి "అవునండోయి. గట్టి చిక్కే వచ్చింది. ఏం చేద్దామంటారు? పోనీ యిప్పుడు ఆడేద్దామా?" అన్నాడు.

 

    ఇంతలో లలితమ్మగారు కాఫీ తీసుకుని అక్కడకు వచ్చింది. "మరి జగన్నాథంగారికి కూడా పంపించు కాఫీ" అన్నాడు విశ్వనాథంగారు. లలితమ్మగారు మళ్ళీ వెళ్లిపోయింది.

 

    "అన్నట్లు రాత్రి మీ ఇంట్లో ఆ చప్పుడేమిటండి?"

 

    జగన్నాథం బిక్కమొహం వేసి "విన్నారా మీరు?" అన్నాడు.

 

    "విన్నాను. వినిపిస్తూంటే మరి."

 

    "ఎవరో ఎవర్నో తంతున్నట్లు అనిపించింది."

 

    "కొంపదీసి మా ఆవిడ నన్ను తంతున్నట్లు అనుకోలేదు కదా!"

 

    విశ్వనాథంగారు పెద్దగా నవ్వుతూ "అదేమిటండోయ్. అది కూడా అప్పుడప్పుడూ జరుగుతూంటుందేమిటి?" అన్నాడు.

 

    జగన్నాథం గంభీరంగా ముఖంపెట్టి "ఛా ఛా లేదండోయ్" అన్నాడు. "అలాంటిదింతకు ముందెప్పుడూ జరగలేదు. ఆవిడ నన్ను ఏకబిగిన తిట్లు లంకించుకోవటం, అన్నం పెట్టకపోవటం, బెదిరించటం ఇత్యాదులేగాని దాషామరపా ఎప్పుడూ లేదు" అన్నాడు.

 

    "మరి ఆ చప్పుళ్ళేమిటండి?"

 

    "అదా! నిన్న డబ్బువిషయంలో కాస్త పేచీ వచ్చిందండి! దాని పెట్టెలో డబ్బు నేను తీశానంటుంది. తీయలేదంటాను. దాంతో పెద్ద రాద్ధాంతం చెలరేగింది. అప్పుడది ఉగ్రరూపం ధరించటం, దాంతో నేను బెంబేలుపడి మంచం ఎక్కడం. అది మీదికి రాబోయేసరికి గభీమని క్రిందకు దూకటం అంతేగాని... ఛ... చెయ్యి చేసుకోలేదండీ."

 

    "ఓహో! అదా?"

 

    "ఏం? కొంపతీసి నా మాటలు నమ్మటల్లేదేమిటి."

 

    "అబ్బే. నమ్ముతానండీ!" అని విశ్వనాథంగారు అంటూండగా ఆ గదిలోకి కాఫీకప్పుతో ఆశ వచ్చింది.

 

    ఆశ కిప్పుడు పద్ధెనిమిదేళ్ళుంటాయి. కాని ఆమె తన వయసుకన్నా చిన్నగా, లేతగా కనిపిస్తుంది. ఆమె విశాలనేత్రాలు కాటుక పెట్టుకోకపోయినా చిత్రమైన నలుపుతో కాంతిగా వుంటాయి. ఆశ ఇప్పుడు దిగులుగా వుంది. ఆమె ముఖంలో దైన్యం తొంగిచూస్తోంది.

 Previous Page Next Page