Previous Page Next Page 
వ్యక్తిత్వం లేని మనిషి పేజి 7


    కొంతమంది ప్రయాణం చేసినంతసేపూ సరదాగా, ఖుషీగా గడిపేస్తారు. కొంతమంది ఆ మహాయాతనలోనే గుర్రుపెట్టి నిద్రపోతారు. కొంతమంది పత్రికలో, పుస్తకాలో చదవటంలో లీనమౌతారు. మొత్తంమీద చాలామంది ప్రయాణమనే సాధనాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లే కనబడతారు. వాళ్ళ జీవిత కాలంలో దీనికి వెచ్చించే కాలం ఓ వేస్టుక్రింద జమకట్టుకోక తమతమ పనులు గడిపేసుకుంటారు. మృత్యుంజయరావుకు యిది నిర్వచించలేని వృధా యాపన. ఆ సమయంలో అతని మస్తిష్కం బ్లాంక్ గా వుంటుంది. ఇది అతని జీవితానికి అదనపు ఖర్చు. యెన్ని గంటలు, అవసరంవస్తే రోజులైనా సరే, జీవితానుభావాన్ని అంగుళమైనా పెంచకుండా వాడిలా చేయలేకపోతున్నానే, వీడిలా చేయలేకపోతున్నానే, ప్రయాణానందాన్ని అనుభవించలేకపోతున్నానే అని మధనపడ్తూ గడిపేస్తాడు. పిరికితనంతో తప్పించుకుని పారిపోయేవాళ్ళని అనుభవాలు అంతగా వెంట తరమవు.
    ఇహ ఏవయినా సంఘటనలలో చిక్కుకున్నప్పుడు దాన్ని సహజపద్ధతిలో అతను ఎదుర్కోలేడు. అసలు సహజపద్ధతి అంటూ ఒకటి వుంటేగా. ఈ సమయంలో సంజీవరావు వుంటే ఏం చేసేవాడు? శేఖరం వుంటే ఏం చేసేవాడు అని వితర్కంలో పడతాడు.
    ఒకసారి ఆఫీసరుగారి తాలూకు బండెడు లగేజితో దిగాడు బెజవాడ స్టేషనులో. అర్థరాత్రి దాటింది. కూలీలని పిల్చాడు.
    "దీన్ని బయటికి తీసుకుపోవటానికి మూడురూపాయలివ్వాలి" అన్నారు లైసెన్సుకూలీలు.
    మృత్యుంజయరావు ఆశ్చర్యపోయి "గట్టిగా పడితే ముగ్గురు కూలీల సామాను. మనిషికి పావలాచొప్పున ముప్పావలా అవుతుంది" అన్నాడు. హెడ్ లోడ్ పావలా అని స్టేషన్ లోని గోడలకి తగిలించివున్న బోర్డులు చాటిస్తున్నాయి.
    "మనుషుల లెక్కన కాదండీ. మూడురూపాయలిస్తేనే సామాను ఎత్తేది. తొరగా చెప్పండి. ఇది కుదరకపోతే మరో బేరానికి పోవాలి" అన్నాడు కూలీ ఒత్తిడిచేస్తూ.
    "ఇది అన్యాయం. ఇవ్వను" అన్నాడతను.
    "అబ్బో! అన్యాయం. అవతల ధరలన్నీ ఒకటికి పదింతలు పెరిగాయి. డబ్బు చాలక మలమలమాడిపోతున్నాం. అన్నాయంట, అన్యాయం" అన్నాడు కూలీ చేతులు జాచి అభినయిస్తూ.
    మృత్యుంజయరావుకి కోపం వచ్చింది. "ధరలు పెరిగితే, పెరుగుతాయి. రూలు రూలే, ఇవ్వటానికి వీలులేదు" అన్నాడు గట్టిగా.
    "ఈయనెవడో రూల్సు చెబుతున్నాడయ్యా రూల్సు, ఈ గిరాకి టైంలో, పదండ్రా పోదాం, అదిగో అక్కడాయనెవరో పిలుస్తున్నాడు."
    ఘడియసేపు మృత్యుంజయరావుకి ఏంచేయాలో తోచలేదు. ఈ పరిస్థితుల్లో శేఖరం వుంటే ఏంచేస్తాడని చప్పున ఆలోచించాడు. 'ఆగు!' అని గర్జిస్తాడు.
    "ఆగు" అని గర్జించాడు.
    కూలీలు ఆగిపోయారు.
    అదిగో వాళ్ళు ఆగిపోయారు. ఇప్పుడేం చేస్తాడు శేఖరం... 'నోరు మూసుకుని సామానెత్తుకోండి" అంటాడు.
    "నోరు మూసుకుని సామానెత్తుకోండి" అన్నాడు.
    వాళ్ళు వెనక్కి తిరిగారు. రెండడుగులు వేశారు. అతన్ని చూపులతో కాలుస్తున్నారు. ఒకడు మరీ ముందుకొచ్చి "యేం చేస్తావ్ ఎత్తకపోతే?" అన్నాడు గర్వంగా ఛాతీ విరిచి.
    చెప్పవయ్యా శేఖరం చప్పున, ఇవతల ముంచుకు వస్తున్నది. ఇప్పుడు నువ్వేం చేస్తావు? చెప్పవయ్యా మహానుభావా?"
    శేఖరం 'తంతాను" అంటాడు.
    మృత్యుంజయరావు "తంతాను" అనబోయాడు. కాని ఎలా సంబాళించుకున్నాడో, బుద్ధిహీనుడిలా ప్రవర్తించకుండా తెలివి యెలా తెచ్చుకున్నాడో అతనికే తెలీదు. ఎలాంటివాడికైనా ఒక్కోసారి బుర్ర అమోఘంగా పనిచేస్తుంది. అతనికీ అలానే పనిచేసింది.
    "స్టేషను మేష్టరికి రిపోర్టు చేస్తాను" అన్నాడు.
    తర్వాత మధ్యలో ఎవరో కల్పించుకోవటం, సర్దిచెప్పటం ఏదో బేరం కుదరటం జరిగింది. ఎలాగో గండం గడిచి బయటపడ్డాడు. రిక్షాలో కూలబడి తనుచేసిన పొరబాటుని తల్చుకునేసరికి అతనికి ముచ్చెమటలు పోశాయి. అదీ కథ.
                     *    *    *
    సోమయాజులుగారి మస్తిష్కంలో ఒక అద్భుతమైన ఆలోచన ప్రవేశించింది. ఇంతవరకూ తమ సమితి సన్మానాలు చేయడంలోనూ, వక్తలను పిలిచి మాట్లాడించి పూలమాలలు వేయడంలోనూ సరిపోయింది. ఓ చక్కని కళా ప్రదర్శన- అనగా నాటక ప్రదర్శన ఏర్పాటుచేసి, తమ ప్రతిభను ఎందుకని చాటుకోకూడదూ అని. అనుకోవటమేటి, ఆ సాయంత్రమే తీర్మానం ప్రవేశపెట్టాడు. వెనువెంటనే సభ్యులంతా ఏకగ్రీవంగా తమ ఆమోదం తెలియబర్చారు.   
    దానిమీదట యిహ అభిప్రాయ పరంపరలు వెలువడ్డాయి. నాటకం వెయ్యాలా, నాటిక వెయ్యాలా? స్త్రీ పాత్రలు వుండాలా, అక్కర్లేదా? అదివరకె పాపులర్ గా వున్న నాటకం తీసుకోవాలా, కొత్త నాటకాన్ని చేపట్టాలా?
    తనదగ్గరకు ఆహ్లాదకరమైన యితివృత్తాలున్నాయనీ, సభ్యులు అనుమతిస్తే వారంరోజులలో అమోఘమైన నాటకాన్ని రూపొందించగలననీ సోమయాజులు చల్లగా వ్రాక్కుచ్చాడు. 
    తురంగరావు ఈ ప్రతిపాదనకు వెంటనే అభ్యంతరం తెలియపర్చాడు. సోమయాజులుగారు వ్యక్తిగతంగా సహృదయులూ, కొంచెమో గొప్పో కళాభిషేకం వున్నవారూ అయితే కావచ్చుగాని అనేక హంగులూ, మేధస్సూ మేళవించవలసిన నాటక రచనను ఉపక్రమించటం అలవాటులేని ఔపోసనమే కాగలదని వక్కాణించి, తన అభిప్రాయం నిర్మొహమాటంగా వ్యక్తం చేసినందుకు ఆయన తనను అపార్థం చేసుకోకూడదని మనవి చేసుకున్నాడు సవినయంగా.
    సోమయాజులుగారు అనుభవజ్ఞుడు. సాంబశివుడు గరళాన్ని మ్రింగినట్లు ఆయన అవమానాన్ని దిగమ్రింగి చిరునవ్వు ప్రదర్శిస్తూ "చిన్నవాడైనా తురంగరావు వున్నమాట సెలవిచ్చాడు. ఏ నాటకం చేపట్టినా మన కళాసమితి పేరు ప్రతిష్టలకు లోపం రాకూడదనే నేననేది. ఆఁ, అది నా ఆశయం" అన్నాడు.
    అయితే పేరుప్రతిష్టలు నిలబెట్టే నాటకాన్ని యెక్కడ వెదకాలి అన్నప్రశ్న వచ్చింది. "బ్రహ్మాండమైన నాటకం వుంది. అయిదుసీన్లు వుంటాయి. సెట్టింగు మార్చక్కర్లేదు. ఎక్కడో వెదకడం యెందుకండీ! మా కోదండపాణి వున్నాడు. 'ముళ్ళచక్రం' అని ఒక్కటే స్త్రీ పాత్ర" అన్నాడు తురంగరావు.
    ప్రస్తుత నాటకరంగ పరిస్థితి ఎలా వున్నదంటే, ఒక జీవితచరిత్ర అంతా ఒకటే సెట్టుమీద జరగాలి. ఆ జీవితచరిత్రలోకి స్త్రీ పాత్ర ప్రవేశించకూడదు. అలాటి నాటకాన్ని ప్రదర్శించటానికే ప్రదర్శనలు ఉత్సాహంగా ముందుకు వస్తారు.
    "స్త్రీ పాత్రవుంటే కష్టమేనే, చాలా యిబ్బందుల్ని ఎదుర్కోవలసి వస్తుంది" అని చప్పరించాడు సోమయాజులు.  
    "అబ్బే, యిబ్బంది ఏమిటండీ? స్త్రీపాత్ర లేకపోతే నాటకం రక్తికట్టదు. డ్రైగా వుంటుంది."
    "వేషం కట్టటానికి ఎవర్ని తీసుకొస్తామయ్యా మహానుభావా?"
    "ప్రొఫెషనల్ గా తీసుకువద్దాం.."
    "అంత డబ్బు ఎవడు పోస్తాడయ్యా?"
    ఆర్థికసమస్య సంగతి నిజమేమరి. అంతా ఏం చేద్దామంటే ఏం చేద్దామనుకున్నారు. "మాలతిగార్ని నటించమని ప్రాధేయపడదాం" అని ఓ ప్రబుద్ధుడు సలహా యిచ్చాడు.
    "మాలతి" అన్న నామధేయం వినబడగానే శేఖరం భుజాలెగరేశాడు. అతని ముఖం విప్పారింది.
    కాని క్షణం ఆలోచించి "మాలతి ఒప్పుకుంటుందా?" అన్నాడు అనుమానం వెలిబుచ్చుతూ.
    సోమయాజులుకు ఆవేశంవచ్చి కాసేపు కళాకారుడి స్థాయిలో మాట్లాడాడు. "ఎందుకు ఒప్పుకోదయ్యా? ఆమెకూడా మన సమితి సభ్యురాలు. మనం వున్నతాశయాలతో, ఉత్తమలక్ష్య సాధనకోసం పనిచేస్తున్నాం. కళ అనేదానికి స్త్రీ పురుష భేదంలేదు. ఆ విచక్షణ మనం పాటించకూడదు. ఇలాంటి విచక్షణలు చూపిస్తుందువల్లనే ప్రజల్లో మానసిక వికాసాలూ, విలువలూ నశించిపోతున్నాయి. మనమంతా విద్యావంతులం, విజ్ఞానవంతులం, కళారాధన మన పరమార్థం. మనలో మాలిన్యం లేనివాడు మాలతిని ఒప్పించ గల శక్తికూడా మనలో వుంటుంది."
    ఈ మాటల్లోని నిజానిజాలు ఎలావున్నా ఆయన అలా మాట్లాడటం మాత్రం అందరికీ నచ్చింది.
    మొదట ఆ నాటకం స్క్రిప్టు తెప్పించి చదవాలి. తర్వాత మాలతిని అడగాలి అని తీర్మానించారు.
    రెండుమూడురోజుల్లో ఆ నాటకం ప్రతి తీసుకురావటం, చదవటం జరిగింది. అయితే దాని యుక్తాయుక్తాలు నిర్ణయించే విచక్షణాజ్ఞానం అక్కడ ఎవరికి వుందిగనక? వేసేద్దామంటే వేసేద్దామన్న ఉత్సాహంలో వున్నారు. అప్పటికి ఆ నాటకంలోని లోటుబాట్లని కొన్నిటిని ఎత్తిచూపి అధ్యయనం చెప్పటానికి సోమయాజులు ప్రయత్నించాడు. అయితే ఆ సంరంభంలో ఆయన మాట ఎవరు వినిపించుకుంటారు? బాగుందంటే బాగుందని భుజాలెగరేశారు. ఈసారికూడా తురంగరావే గెలిచాడు.
    మరునాడు ఆఫీసులో విరామసమయం. టైప్ మిషన్ దగ్గర్నుంచి లేవబోతున్న మాలతి, ఆఫీసులోని ఉద్యోగస్థులందరూ కట్టగట్టుకుని తన దగ్గరకే రావటం చూసి కంగారుపడి, కలవరపాటుని అణచిపెట్టుకుంటూ ఒక చిరునవ్వు నవ్వి "ఏమిటి యీవేళ అందరికీ యింత దయ కలిగింది నామీద?" అని అడిగింది కోమలస్వరంతో.   

 Previous Page Next Page