"నేను చూశాను నిజంగా- ఆకలితో అల్లాడి
మర్రిచెట్టు క్రింద మరణించిన ముసలివాణ్ణి-
నేను చూశాను నిజంగా- నీరంధ్ర వర్షాన
వంతెన క్రింద నిండు చూలాలు
ప్రసవించి మూర్చిల్లిన దృశ్యాన్ని!
నేను చూశాను నిజంగా-
తల్లి లేక తండ్రి లేక తిండి లేక ఏడుస్తూ
మోచేతులతో కన్నులు తుడుచుకుంటూ
మురికి కాల్వ పక్కనే నిద్రించిన మూడేళ్ళ పసిబాలుణ్ణి
నేను చూశాను నిజంగా, మూర్తిభవత్ దైన్యాన్ని, హైన్యాన్ని....
నాకు శాంతి కలగదింక నేస్తం నిగర్వినైనాను.
ఈ ఆర్తి ఏ సౌదాంతరాలకు పయనించగలదు?
ఏ భగవంతునికి నివేదించకోగలదు??
వద్దు - ఇక నన్ను నిర్భంధించకు నేస్తం. ఈ రాత్రి
నేను పాడలేను. ఈ కృత్రిమ వేషాన్ని అభినయించలేను"
కాగితం మడిచేస్తూ "అయితే కమ్యూనిష్టు వన్నమాట!" అన్నాను వెటకారంగా. "ఆ ముసుగేసుకుని హత్యలు చేస్తున్నావా? ఇంతకీ లెఫ్టిస్టువా, రైటిస్టువా?"
అతడు నిర్వికారమైన భావం మొహంలో కదలాడుతూ వుండగా, "నాకు లెనిన్ ఎవరో తెలీదు. కార్ల్ మార్క్స్ ఎవరో తెలీదు. నేను మానవతావాదిని. ఆ గేయం తిలక్ ది" అన్నాడు.
"ఓహో అలాగా! కానీ మానవతావాదులు ఎవరూ చరిత్రలో గండ్రగొడ్డళ్ళు పట్టుకుని పీకెలు తెగ్గేసిన దాఖలాలు లేవు" అన్నాను మరింత వెటకారంగా.
అతడు పక్క సర్దుకుంటూ "వెళ్ళు నేస్తం. వాదనలవల్ల అభిప్రాయాలు మారవు. అవి మారేవి అనుభవాలవల్లే. జనారణ్యపు నాలుగ్గోడల మధ్య భద్రంగా వున్నవాడివి. నీకు చెప్పినా అర్ధం కాదు" అని పడుకున్నాడు. మరుక్షణం నిద్రలోకి జారుకున్నట్టు కళ్ళు మూసుకున్నాడు.
బయట కొచ్చాను. సెంట్రీ తలుపువేసి తాళాలు అందించాడు. వెన్నెల పడుతూంది. జైలంతా నిర్మానుష్యంగా వుంది. ఒకవైపు పూలభారంతో వంగిన చెట్లు, మరోవైపు ఎత్తయిన గోడలు, వాతావరణం ప్రశాంతంగా వుంది. సన్నగా గాలి వీస్తూంది. ఎంత కాదనుకున్నా ఆ కాగితమూ, దానిమీద వ్రాసిన ముత్యాల్లాంటి అక్షరాలూ గుర్తొస్తున్నాయి.
"నేను చూశాను నిజంగా, ఆకలితో అల్లాడి మర్రిచెట్టు క్రింద మరణించిన ముసలివాణ్ని... నీరంధ్ర వర్షాన ప్రసవించలేక నిండుచూలాలు మూర్చిల్లిన దృశ్యాన్ని...."
* * *
భీమరాజు తప్పించుకోవటానికి చేసిన ప్రయత్నం అతడే బుద్ధిపూర్వకంగా చేసింది అని మేము నిరూపించలేకపోయాము. నేల తవ్వటానికి అతడి వద్ద ఆయుధాలు ఏమీలేవు. బయట్నుంచి ఎవరో తవ్వుకుని అతడి సెల్ లో ప్రవేశిస్తే దానికి అతడెలా బాధ్యుడు అవుతాడు.
-ఇలా వాదించి డిఫెన్సు లాయరు కేసు నెగ్గాడు. అయినా దాని గురించి మేమంతగా పట్టించుకోలేదు. ఇంకా నాలుగేళ్ళుంది అతడికి శిక్ష. ఆ తరువాత బయటకు వెళ్ళినా మళ్ళీ వెంటనే తిరిగివస్తాడు. అది తప్పదు. అందుకే జైలులో అందరూ దాని సంగతి దాదాపు మర్చిపోయారు.
నేను తప్ప....
ఎమ్మెల్యేగా నిలబడుతున్న దామోదరం, మా జైలు సూపర్నెంటెండెంట్ జగన్నాధం కలిసి కుమ్మక్కయి ఈ తవ్వకం ఏర్పాటు చేశారని నా మనసులో గొప్ప నమ్మకం ఏర్పడింది. కానీ నాకు ఋజువుల్లేవు. ఎలాగయినా వీళ్ళని రెడ్ హాండెడ్ గా పట్టుకోవాలి.
భీమరాజు తప్పించుకుపోవటానికి చేసిన ప్రయత్నం బయటపడిన దగ్గిర నుంచీ అతడి చుట్టూ కాపలా ఎక్కువ పెట్టాం. అందువల్ల ఇప్పటిలో అతడి ప్రయత్నం నెరవేరదు. పదిమంది సూపర్నెంటెండెంట్ లు కలిసినా సరే! ఆ విషయం నాకు నమ్మకం వుంది!! ఇక నేను వెలికితీసి పట్టుకోవలసిన విషయాలు జగన్నాధానికీ, దామోదరానికీ వున్న సంబంధం గురించీ... భీమరాజుని విడిపించటం కోసమే ఇతడ్ని ఈ జైలుకి అధికారిగా వేయించాడన్న వార్తని ధృవపరిచే ఋజువులూ.
అందుకు చిన్న ట్రిక్ వేశాను.
మాజీ ఎమ్మెల్యేగారు చేయబోయే ప్రారంభోత్సవం తాలూకు ఇన్విటేషన్ ఒకటి సంపాదించి, కవరు వెనుక పెన్సిల్ తో కనబడీ కనబడనట్టు అంకెలు వేశాను. దాన్ని డీకోడ్ చేస్తే ఈ క్రింది అర్ధం వస్తుంది.
"ఈ ఉత్తరం అందిన వెంటనే నాకు ఫోన్ చెయ్యి.... భీమరాజు విషయం... చాలా అర్జెంటు."
అలా వ్రాసి ఆయన బ్రీఫ్ కేస్ లో పెట్టేశాను. ఆయన ఇంటికి వెళ్ళి దాన్ని చూస్తాడు. అంతకు ముందు చూసుకోనందుకు కంగారు పడతాడు. నా ఆలోచన కరెక్టయితే, ఆ కంగార్లో జాగ్రత్త విషయం మర్చిపోయి దామోదరానికి ఫోన్ చేస్తాడు.
ఫోన్ దగ్గిర కూర్చున్నాను.
జైలుకీ, జైలు ఆవరణలో వుండే ఆఫీసర్ల గృహాలకీ కలిపి బి.ఫై.యక్స్. విడిగా వుంది. అక్కడ కూర్చున్నాను. రాత్రి ఎనిమిదయింది.
నేను వూహించినట్టే గంట తరువాత దామోదరం ఇంటికి కనెక్షన్ అడిగాడు జగన్నాథం. హెడ్ ఫోన్స్ పెట్టుకుని వినసాగాను.
"నేను జగన్నాథాన్ని మాట్లాడుతున్నాను."
"ఏమిటి విషయం?"
"మీరే చెప్పాలి. ఎందుకూ అంత అర్జెంటుగా ఫోన్ చెయ్యమని వ్రాశారు?"
"వ్రాయటమా- నేను వ్రాయటం ఏమిటి?"
"కోడ్ లో వ్రాసి పంపలేదూ?"
"లేదే"
వింటూన్న నేను ఆ క్షణం మా సూపర్నెంటెండెంట్ మొహం చూడాలని చాలా ఉబలాటపడ్డాను.
"మీరు వ్రాయలేదా? అచ్చు మన కోడ్ లాగానే వుందే."
రాజకీయ నాయకుడికి తెలివితేటలు ఎక్కువగా వున్నట్టున్నాయి. "మననెవరో మోసం చేసి రహస్యం కనుక్కున్నట్టున్నారు. ఫోన్ పెట్టెయ్యి. విడిగా మాట్లాడుకుందాం-"
రెండు ఫోన్లూ డిస్ కనెక్టు అయినయ్.
సో-
తెర వెనుక చాలా కథ నడుస్తూ వుందన్నమాట. శివప్రసాద్, రాజారాం- ఇద్దరూ చెప్పినవి నిజమే. ఎలక్షన్ వచ్చేలోపులో భీమరాజు విడుదల అవటం చాలా ముఖ్యం. అయతే అది నేనుండగా అసంభవం.
ఇదంతా సరే-
జగన్నాథాన్ని పోలీసులకి పట్టివ్వటం ఎలా? ఎంతో బలమైన సాక్ష్యాధారాలు వుంటే తప్ప కేసు నిలబడదు. తెర వెనుక నుంచి అతడిని బయటకు లాగాలీ అంటే మరోమారు అతడు భీమరాజుని విడిపించే ప్రయత్నం చేసేవరకూ ఆగాలి. అంతేకాదు, ఈ విషయాలన్నీ నాకు తెలిశాయన్న విషయం గానీ, నాకు అనుమానం వచ్చిందన్న సంగతిగానీ ఎక్కడా బయట పడకూడదు. ఇంతకు ముందులాగే ప్రవర్తించాలి.
ఆపరేటర్ కి థాంక్స్ చెప్పి నేను ఇంటికి వచ్చాను.
వచ్చిన అయిదు నిముషాలకు మ్రోగింది ఫోను. ఎత్తి "హలో" అన్నాను.
"నేనూ జగన్నాధాన్ని?"
రిసీవర్ మీద చెయ్యి అప్రయత్నంగా బిగుసుకుంది. కంట్రోల్ చేసుకుంటూ "సార్" అన్నాను.
"ఒకసారి ఇంటికి రాగలవా? అర్జెంటు-" అతడి కంఠం ఎందుకో వణుకుతూంది. భయం స్పష్టంగా వినిపిస్తూంది. కంఠం అదోలా వుంది.
"ఏమైంది సర్"
"చెప్తాను - నువ్వు వెం..."
ఏదో దబ్బున పడిన చప్పుడు. రిసీవర్ పెద్ద చప్పుడుతో పడి డిస్ కనెక్టు అయింది.
"...హలో... హలో" అని రెండుసార్లు అరిచాను.
అట్నుంచి జవాబు లేదు.
మనసు కీడు శంకించింది. ఒకవేళ ఆయన కేదైనా కీడు జరిగితే దానికి కారణం నేను ఆడిన నాటకమే అయి వుంటుంది.
చెప్పులేసుకుని దాదాపు పరుగెత్తాను.
మా ఇంటికి రెండు ఫర్లాంగుల దూరంలో జైలుకి ఆవలి పక్క, వుంది ఆయనిల్లు. చేరుకునేసరికి పది నిముషాలు పట్టింది. కొద్దిగా ఆయాస పడుతూ కాలింగ్ బెల్ నొక్కబోయాను.
తలుపు తెరిచే వుంది. తోసుకుని లోపలికి ప్రవేశించాను. హాలు ఖాళీగా వుంది.
"జగన్నాధంగారూ" పిలవబోయి ఆగిపోయాను. ఒకవేళ శతృవులు ఇంకా లోపలే వుండి వుంటే అనవసరంగా నా ఉనికి వాళ్ళకి తెలిపినట్టు వుంటుంది.
జేబులోంచి రివాల్వర్ తీసి చేతిలో పట్టుకున్నాను.
హాల్లోంచి కుడిపక్కకి ఒక గదీ, ఎదురుగా మరో గదీ వున్నాయి. రెండింటికీ దగ్గిరగా తలుపులు వేసి వున్నాయి. ఫోన్ యధాస్థానంలో వుంది గానీ, దాని క్రింద గుడ్డ మాత్రం ఎవరో లాగేసినట్టు పక్కకి జారివుంది.
ఎటువైపు వెళ్ళాలో నిశ్చయించుకోలేక తటపటాయిస్తూ అడుగు ముందుకు వేశాను.
అప్పుడు వినిపించింది కుడివైపు గదిలోంచి శబ్దం క్షణం సేపే!! మళ్ళీ అంతలోనే నిశ్శబ్దం...
ఒక నిశ్చయానికి వచ్చినట్టు అటువైపు నడిచాను. తలుపు దగ్గిర వంగి పరీక్ష చేశాను! గడియ వేసిలేదు. ఇంక ఆలస్యం చేయటానికి కూడా వీల్లేదు. నిటారుగా నిలబడి గుండెల్నిండా గాలి పీల్చుకుని ఒక్కసారిగా కాల్తో తలుపుల్ని ధడేలున తోసి, చేతిలో రివాల్వర్ తో లోపలికి ప్రవేశించాను.
లోపల రేఖ, మరో నలుగురు స్నేహితురాళ్ళతో కలసి కూర్చొని వుంది. నన్ను చూసి నోటికి చేతులు అడ్డు పెట్టుకుని నవ్వాపుకోవటానికి ప్రయత్నిస్తున్నారు.
* * *
"మొత్తానికి భలే చేశావే. ముచ్చటగా రెండుసార్లూ ఒకే ఆఫీసర్ ని..."
"కంగ్రాచ్యులేషన్స్...."
ఎదురుగా వున్న నిలువుటద్దంలో నా మొహం ఎర్రగా కనబడుతూ వుంది. చూపు మరల్చుకున్నాను. ఈ అల్లరికి పక్కగదిలోంచి జగన్నాధం వచ్చాడు. అప్పుడే నిద్రకుపక్రమించినట్టున్నాడాయన. "ఏమిటమ్మా గొడవ" అంటూ నన్ను చూసి ఆశ్చర్యపోయి, "నువ్వేం చేస్తున్నావ్ ఇక్కడ?" అని అడిగాడు.
రేఖ "డాడీ" అంటూ చెప్పటం మొదలు పెట్టింది. రెండుసార్లూ ఎలా మోసగించిందీ తండ్రితో వివరంగా చెప్పింది. ఆమె చెపుతూంటే ఈయన బాగా ఆనందిస్తున్నట్టు కనబడ్డాడు. నాకు వళ్ళు మండిపోతూంది. ఆయనకీ అంతా చెప్పి, నా వైపు తిరిగి వెక్కిరిస్తున్నట్టు- "బాగా అలసిపోయినట్టున్నారు, అంత దూరం నుండి పరుగెత్తుకు వచ్చి... కాఫీ ఇస్తానుండండి" అంటూ స్నేహితురాళ్ళతో కలసి లోపలికి వెళ్లింది రేఖ. వాళ్ళటువైపు వెళ్ళగానే ఆయన నా వైపు తిరిగి, "మన డిపార్ట్ మెంట్ పరువు తీసేశావోయ్" అన్నాడు.