నేనూ రాజారాం ఒకరి మొహాలు ఒకరం చూసుకున్నాం. రాజారాం మొహం పాలిపోయింది. "రోజురోజుకీ ఈ జైలుని సంరక్షించటం కష్టమైపోతూ ఉంది" అని తనలో తనే గొనుక్కోవటం స్పష్టంగా వినిపించింది.
మళ్ళీ ఇంకో నరమాంస భక్షక కిరాతకుడు.
ఆఫీసు రూమ్ వైపు నడిచాను. ఆలోచనలన్నీ రాబోయే గండ్రగొడ్డలి చుట్టూ తిరుగుతున్నాయి. ఆ హడావుడిలో పడి భీమరాజు సంగతి కొన్ని రోజులపాటు మర్చిపోయాను.
ఆ 'మరుపు'కి ప్రతిఫలంగా చాలా పెద్ద నష్టాన్ని చెల్లించవలసి వచ్చింది మేము.
4
"మైడియర్ ఆఫీసర్స్! ... ఏ మనిషి పేరు చెబితే పసి పిల్లలు పాలు తాగటం మానేస్తారో, ఏ మనిషి పేరు వినబడితే వ్యాపారస్తులు తమ ఇనప్పెట్టెలు కూడా విడిచి పారిపోతారో ఆ గండ్రగొడ్డలి మన జైలుకి వస్తున్నాడు. అతడు మూడు హత్యలు చేశాడు. పదిమంది తలలు నరికి వీధి గుమ్మాలకి వేలాడగట్టాడు.... అడవిలో జంతువుని వేటాడినట్టు మన పోలీసులు అతణ్ణి పట్టుకున్నారు. ఉరిశిక్ష పడింది. ప్రెసిడెంట్ దగ్గిర్నుంచి కన్ ఫర్మేషన్ వచ్చేవరకూ అతను ఈ జైల్లోనే ఉంటాడు. ఆ తరువాత ఇక్కడే ఉరితీయబడతాడు. అతి ప్రమాదకరమైన ఆ మనిషిని చాలా కట్టుదిట్టాలతో మనం కాపలా కాయాలి. ఓ.కే!"
"యస్ సర్"
"నౌ యు కెన్ గో"
మే మందరం బయటికి వచ్చేం.
నేను శివప్రసాద్ తో అన్నాను, "చూశావా! అంతమంది ప్రాణాలు తీసిన ఆ నరరూప రాక్షసుడిని ఉరి తీయటానికి కూడా ఇంకా ఎన్ని చట్టబద్ధమైన అడ్డంకులో...."
శివప్రసాద్ నవ్వి "తప్పదుగా" అన్నాడు.
"నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానైతే ఏం చేద్దునో తెలుసా?"
"ఏం చేద్దువు"
"ముందు ఉరి తీసి తరువాత కన్ఫర్మేషన్ కి వ్రాయండి అని ఆర్డరేసి ఉండేవాణ్ని"
అక్కడ వింటున్న వాళ్ళందరూ నవ్వేరు.
అంతలో వ్యాన్ వచ్చి ఆగింది. జవానులు అటెన్షన్ లోకి వచ్చారు. ఉన్నట్టుండి అక్కడి వాతావరణంలో ఏదో మార్పు వచ్చింది. అకస్మాత్తుగా నిశ్శబ్దం అలుముకుంది. ఎంత కాదనుకున్నా అందర్లోనూ అదో టెన్షన్ కనిపించింది.
అంతలో వాన్ తలుపులు తెరుచుకున్నాయి.
గండ్రగొడ్డలి అడుగు క్రింద పెట్టాడు.
అప్పుడు సాయంత్రం అయిదయింది. సూర్యుడు ఇంకా పూర్తిగా దిగిపోలేదు. ఒక కిరణం ఏటవాలుగా అతడి వెనుక నుంచి పరావర్తనం చెందుతూంది.
దాదాపు ఆరడుగుల ఎత్తు ఉన్నాడు అతడు. జీవితం అంతా ఎండలోనే గడపటం వల్లననుకుంటా, అతడి చర్మం నల్లగా కమిలిపోయి ఉంది. అతడిలో అన్నిటికన్నా నన్ను ఆకర్షించింది అతడికళ్ళు. తీక్షణంగా ఉన్నాయవి, వాటిలో ఒక విధమైన నిర్లక్ష్యం....
అప్రయత్నంగా నా చూపు అతడి చేతులమీద పడింది. అతడి అసలు పేరేమిటో తెలీదు. గండ్రగొడ్డలితో మనుష్యుల్ని చంపటం అలవాటుగా పెట్టుకున్నాడు కాబట్టి అతడిని ఆ పేరుతోనే పిలుస్తున్నారు అందరూ.
ఇరవై మూడు హ....త్య....లు!
అది గుర్తుకు రాగానే మామూలు జైలరునై పోయాను. ఇక ఈ క్షణం నుంచీ ఇతడు ఉరి తీయబడే వరకూ జాగ్రత్తగా చూడాలి. అంతే! అయితే ఇన్ని హత్యలు చేసినవాడు అంత సులభంగా చచ్చిపోకూడదు. బ్రతికున్న కొద్దికాలంలో ఈ జైలంటే ఏమిటో రుచి చూపించాలి...
వాన్ దిగుతూ అతడు తూలిపడ్డాడు. నవ్వొచ్చింది. అపర పరశురాముడి ననుకొనేవాడు తూలి పడటమా-? చెయ్యి అందిస్తూ "ఇంతకు ముందులా యిది అడవి కాదు. చేతికీ కాళ్లకీ సంకెళ్లున్నాయని గుర్తుంచుకో ...పద" అన్నాను.
అతడి వెనకే నేనూ మరో ఆఫీసరూ నడిచి సెల్ దగ్గరకి వచ్చాం. ముందే జవాను గది తలుపులు తీసి వుంచాడు.
గది ముందు అతడు ఆగాడు. నెమ్మదిగా, స్ఫుటంగా ఉన్న కంఠంతో అన్నాడు- "చేతికి కాళ్ళకీ సంకెళ్ళు లేని మీలాంటి వాళ్ళు అడవి కానిచోట కూడా వెనుక నడవబట్టే దేశం ఇదిగో ఇలా చెరసాల్లోకి, చీకట్లో వెళ్ళిపోతూంది...." అంటూ తన సెల్ లోకి వెళ్ళి తలుపు వేసేసుకున్నాడు.
క్షణంపాటూ తల తిరిగిపోయింది నాకు. నా పాతికేళ్ళ జీవితంలో ఎవరూ ఇంత పెద్ద రిటార్టు ఇవ్వలేదు నాకు.
* * *
ఆ తరువాత గండ్రగొడ్డలి ఫైలు పూర్తిగా చదివాను.
ఇరవైమూడు హత్యలు... దారుణమైన ఇరవై మూడు హత్యలు!!! హత్య చేయటమే కాదు, కొన్ని వాటికి సమాధులు కూడా కట్టాడట. వాటి ప్రారంభోత్సవాన్ని దామోదరం చేత చేయిస్తున్నట్టు వాల్ పోస్టర్ లు కూడా అంటించాడట.
ఇతడిని చూస్తే గ్రామస్తులు- ముఖ్యంగా ఆడవాళ్ళు, పిల్లలు భయంతో వీధులు ఖాళీచేసేవారట. గ్రామానికి 'ఇంత' అని చెప్పి సుంకం వసూలు చేసేవాడట. అందమైన స్త్రీ కనబడితే చాలు అడవిలోకి లాక్కెళ్ళేవాడట. ఆర్తనాదాలు వినిపించినా బయటకు రాలేనంత భయంలో గ్రామస్థులని పెట్టేవాడట.
చదువుతూ వుంటే నా రక్తం సలసలా కాగిపోయింది. మనసులో ఏ మూలో వున్నగిల్టీ ఫీలింగు పోయింది. ఈ నరరూప రాక్షసుడిని ఇంత తొందరగా ఉరికంబం ఎక్కించకూడదు. భూమ్మీద ఉంచే మరిన్ని బాధలు పెట్టాలి.
తిరిగి ఫైలు చదవటం మొదలు పెట్టాను.
గండ్రగొడ్డలి పట్టుబడటానికి ముందురోజు, ఒకేరోజు పదిహత్యలు చేశాడు. చెరువుకట్ట దగ్గిర పని చేసుకుంటున్న పదిమందిని పాత గ్రామ కక్షల కారణంగా గొంతులు కత్తిరించి చంపాడు. వాళ్ళనే సమాధి చేసి ఆ చుట్టుపక్కల గ్రామాల్లో భీతావహం సృష్టించాడు.
- కోర్టులో కూడా కేసు ఎక్కువకాలం నడవలేదు. జడ్జీకి ఏ మాత్రం అనుమానం లేకపోయింది. ఉరి విధించాడు. వెంటనే హైకోర్టుదాన్ని కన్ఫర్మ్ చేసింది. ఇన్నాళ్ళ తరువాత గ్రామస్థులు మళ్ళీ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.
ఫైలు మూసి లేచి నిలబడ్డాను. మొత్తం అంతా వివరంగా చదివే సరికి నాలుగు గంటలు పట్టింది.
గండ్రగొడ్డలి నిజ స్వరూపం తెలిసిన తరువాత నాకెందుకో అతడికి ఒకసారి ఈ జైలు 'రుచి'చూపించాలనిపించింది. ఇంతవరకూ అతడు నాణేనికి ఒకవైపునే చూశాడు. అమాయకులైన, అసమర్ధులైన గ్రామ ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసి పబ్బం గడుపుతున్నాడు. ఆ బందిపోటుకి తగిన గుణపాఠం నేర్పాలి! ఉరి ఒక్కటే సరి అయిన శిక్షకాదు.
వడివడిగా అతడి సెల్ వైపు నడిచాను.
అప్పుడు రాత్రి రెండు గంటలు కావొస్తూంది.
గండ్రగొడ్డలిని సాలిటరీ కనఫైన్ మెంటులో వుంచారు. సాధారణంగా అలాంటి భయంకరమైన వారిని అలానే ఒంటరి గదుల్లో వుంచుతారు.
గేటు దగ్గిర వున్న సెంట్రీ నన్ను చూసి సెల్యూట్ చేసి ఏదో పనివున్నట్టు దూరంగా వెళ్ళాడు. ఆ సమయంలో మేమెందుకు వస్తామో వాళ్ళకి తెలుసు.
సెంట్రీ పక్కకి వెళ్ళగానే నేను అడుగు ముందుకు వేశాను.
సెల్ లోంచి గండ్రగొడ్డలి కనబడుతున్నాడు. అతడు మెలకువగా వుండి, బయట్నుంచి పడే దీపం వెలుతుర్లో ఏదో వ్రాసుకుంటున్నాడు.
అప్రయత్నంగా నా మనసు కీడు శంకించింది. కొన్నాళ్ళ క్రితం కాగితం గుర్తొచ్చింది, "ఆపరేషన్ నెంబర్ వన్ కంప్లీటెడ్."
నా మొహంలో మారుతున్న భావాలుచూసి సెంట్రీ వణికిపోయాడు. పరుగెత్తుకుంటూ దగ్గిరకి వచ్చాడు. కఠినంగా అన్నాను- "ఏమిటి? సెంట్రల్ జైల్ ని పబ్లిక్ పోస్టాఫీసు చేస్తున్నారా?"
సెంట్రీ తడబడుతున్న గొంతుతో "లేదు సార్! చాలా చెప్పి చూశాము. రాత్రి ఎనిమిది తరువాత సెల్ లో మేల్కొని వుండకూడదని రూల్ అని చెప్పినా వినలేదు" అన్నాడు.
"విన్లేదు. అందుకని వూరుకున్నారు. రాత్రి రెండింటివరకూ ఒక ఖైదీ బయట ఎవరికో వర్తమానం వ్రాస్తూ వుంటే చూస్తూ కాపలాకాస్తున్నారు. ఇంకొంచెం అయితే మీరు ఆ వర్తమానాన్ని తీసుకెళ్ళి బయటకు అందజేస్తారు. అవునా?" కఠినంగా అన్నాను.
"లే... లే... లేద్సార్?"
"లేకపోవట మేమిటి? ఇలా 'లూజ్'గా వుండబట్టే భీమరాజు తప్పించుకునే ప్రయత్నం చేశాడు. చాలావరకూ గెలిచాడు.'
సెంట్రి మాట్లాడలేదు.
"రేపు ప్రోటోకాల్ అయిన తరువాత నాకు కనిపించు,"
సెంట్రీ మొహంలో బెదురు స్పష్టంగా కనబడింది. భయంగా తలూపాడు. నా దృష్టి దూరంగా వున్న గండ్రగొడ్డలి మీద పడింది. అతడు మా మాటలు వినటంలేదు. ఇంకా వ్రాసుకుంటున్నాడు.
అతడికి అనుమానం రాకుండా దగ్గిరగా వెళ్ళాను. జాగ్రత్తగా పట్టుకోవాలి. ఏ మాత్రం అనుమానం వచ్చినా కాగితాన్ని చటుక్కున నోటిలో వేసుకుని మింగేసే ప్రమాదం వుంది. చప్పుడు కాకుండా తలుపు తెరిచాను. బ్రిటీషుటైపు జైలు మాది. తాళం గోడకి వుంటుంది. అందువల్ల లోపలున్న వ్యక్తికి ఆ విషయం తెలిసే అవకాశం లేదు.
తలుపు తెరవటమేమిటి? కనురెప్పపాటులో అతడి చెయ్యి పట్టుకోవట మేమిటి? అన్నీక్షణాల్లో జరిగిపోయాయి. అకస్మాత్తుగా జరిగిన ఈ సంఘటనకి అతడు బెదిరినట్టు కనిపించాడు.
"ఏమిటి ఈ అనుమానం?" అన్నాడు గింజుకుంటూ.
అతడి చేతిలో పేపరు లాక్కొన్నాను.
"ఎవరికి వ్రాస్తున్నావు ఇంత అర్దరాత్రి పూట ఈ ఉత్తరం?"
అతను మాట్లాడలేదు.
"బయట పడటానికి రహస్య వర్తమానమా?"
అతడు దానికి కూడా జవాబు చెప్పలేదు. "చూడూ" అన్నాను. "ఇది మామూలు జైలు కాదు. ప్రతిక్షణమూ ఒక జత కళ్ళు నిన్నూ 'నీలాటి వాళ్ళనీ కనిపెడుతూనే వుంటాయి. ఏ వేషం వేయటానికి ప్రయత్నించినా క్షణాల్లో పట్టుబడతావు. ఈ నాలుగు గోడల మధ్యా చచ్చేవరకూ నువ్వు ఉండక తప్పదు."
అతను నెమ్మదిగా అన్నాడు. నిజమే! ఈ నాలుగు గోడల మధ్య నుంచీ బయట పడలేని మిమ్మల్ని చూసి జాలిపడుతున్నాను."
రెండో రిటార్టు ఇది. అతడి కళ్ళలో నవ్వు కదలాడిందా? ఏమో- అలానే అనిపించింది. ఆ సెటైరు నన్ను పరిహసిస్తున్నట్టు అనిపించింది.
లాగిపెట్టి బలంగా పిడికిలితో అతడి గెడ్డంమీద కొట్టాను. వెనక్కి తూలిపడ్డాడు. తల గోడకి తగిలి టప్ మని చప్పుడయింది. అప్పటివరకూ ఇటే చూస్తున్న సెంట్రీ చప్పున, ఏమీ ఎరగనట్టు చీకటిలో అటు తిరిగాడు. "ఇప్పటివరకూ నువ్వు వేసిన రెండు సెటైర్లకూ ఇదే జవాబు" అంటూ, అతడు వ్రాసిన పేపరు చదవటం మొదలుపెట్టాను.