"ఇలాంటి వాటివల్ల ఫర్వాలేదు. మీలాటి వాళ్ళవల్ల అదే పూర్తిగా పోతుంది" అందామనుకొని, బావోదని వూరుకున్నాను.
"పోలీసులంటే ఎటువంటి మోసాన్నయినా క్షణాల్లో పట్టుకుంటారని నాకు గొప్ప నమ్మకం వుండేది. దాన్ని నువ్వు పోగొట్టావ్-"
నేను నెమ్మదిగా అన్నాను. "పోలీసులం కాబట్టే మనం తొందరగా బుట్టలోపడతాం. 'నాన్నా తోడేలు' కథ మనకి వర్తించదు. ఎన్నిసార్లు అవతలివాళ్ళు నాటకం ఆడినా మనం వెళ్ళాల్సిందే. ఒక్కసారి బద్దకిస్తే అదే ఘోర ప్రమాదానికి దారి తీయవచ్చు. ఇది మనని ఫూల్ ని చేయటం కాదు. మన సహనానికి పరీక్ష. ఎన్నిసార్లు ఓడిపోతే అంత ఎక్కువ సహనం మన కుందన్నమాట."
"ఓడిపోయిన ప్రతివాడు అలాగే అనుకుంటాడోయ్" అంటూ నవ్వేడు ఆయన. ఈసారి నాకు నిజంగానే సహనం నశించింది.
"మీరు మీ కూతురు గురించి ఏదో గొప్పగా వూహించుకుంటున్నట్టున్నార్లా వుంది. ఆ కోడిపిల్ల మెదడు అమ్మాయిని ఫూల్ ని చేయవలసి వస్తే ఇంతకంటే ఘోరంగా ఫూల్ ని చేస్తాను సరేనా" అన్నాను. ఆయన మొహంమీద నవ్వు మాయమైంది.
"ఏం చేస్తావ్? ఎలా చేస్తావ్?" అని అడిగాడు.
"ఎలా చేస్తానన్నది అనవసరం. ఇక ఏం చేస్తానంటే... జాగ్రత్తగా వినండి. నన్ను రెండుసార్లు ఫూల్ ని చేసిన మీ అమ్మాయి, నన్ను ముచ్చటగా ముక్కాలి పీటమీద కూర్చోబెట్టి తన చేతుల్తో తను స్వయంగా నాకు తలంటుస్నానం చేయించేలా చేస్తాను. ఇంకోలా చెప్పాలంటే ఒకే బాత్ రూమ్ లో ఇద్దరం ఒకేసారి స్నానం చేసేలా చేస్తాను."
అప్పుడు చూడాలి ఆయన మొహం! శ్రేష్టమైన వంటాముదం తాగుతున్నట్టుగా మారింది. "హౌడేర్ యూ ఆర్" అని అరిచాడు. అంతలో ఏదో అనుమానం వచ్చినట్టు- "కొంపదీసి పెళ్ళి చేసుకుంటావా?" అని అడిగాడు.
"పెళ్ళి చేసుకుంటే ఏ అడ్డగాడిదైనా చేయించగలడు సార్. నా గొప్పేముంది. పెళ్ళాడకుండానే నీళ్ళాడిస్తాను. ఐ మీన్ స్నానం చేయిస్తాను...."
ఆయన చేతిలో పవర్స్ లేవుగానీ లేకపోతే ఆ క్షణం నన్ను సస్పెండ్ చేసి వుండేవాడు. అంత కోపంగా చూశాడు. సెల్యూట్ చేసి బయటకు వచ్చాను.
నడుస్తూంటే వెనుకనుంచి 'ఆగండీ' అని వినిపించింది. ఆ అమ్మాయి కప్పుతో వచ్చి "కాఫీ తాగకుండా వెళ్ళిపోతున్నారే" అంది.
వద్దనలేదు నేను. అందుకుని సిప్ చేయసాగాను. "ఏమిటి మానాన్న గారి దగ్గిర ఏదో ఛాలెంజి చేశారట."
"అవును."
"ఏమిటి?"
"మీ నాన్నగారినే అడగలేకపోయావా?"
"అడిగాను."
"ఏమన్నారు?"
"ఏ తండ్రీ కూతురుతో నోరు తెరిచి చెప్పుకోలేని విషయం- అన్నారు".
నవ్వుతో పొలమారింది. ఖాళీ కప్పు అందిస్తూ "సరే అయితే చెప్తావిను. నువ్వు ఎంతో తెలివైన దానివని మీ నాన్నకో నమ్మకం! అందుకే ఈసారి నీ పరీక్ష పోయేలా చేస్తానని ఆయనతో పందెం కట్టాను" అన్నాను. "బ్రహ్మాండమైన ప్లాను వేసి నీ పరీక్ష పోగొడతాను చూస్తూ వుండు."
ఆమె ముక్కు పుటాలు అదిరాయి. "అసంభవం" అని అరిచింది. "నేను రాంకు స్టూడెంట్ ని- తెలుసా?"
"అయితే మరీ మంచిది. నన్ను ఫూల్ ని చేసినందుకు అదే సరి అయిన శిక్ష..." అని అక్కణ్ణుంచి కదిలాను.
* * *
భీమరాజు వైపునుంచి ఏ అలజడీ లేకపోవటం నాకు ఆశ్చర్యం కలిగించింది. అతడిని ఒక కంట కనిపెడుతూ వుండమని మా సెంట్రీలకి రహస్యంగా చెప్పి వుంచాను. వాళ్ళు ఏ రోజుకారోజు నాకు వివరాలు చేరవేస్తూ వుండేవారు.
భీమరాజు ఇంతకుముందు కన్నా 'నెమ్మది' అయిపోయాడు. ఇదే ఆశ్చర్యం కలిగించింది. అంత నోటోరియస్ క్రిమినల్ ఉన్నట్టుండి నెమ్మదస్తుడయిపోయాడంటే మళ్ళీ ఏదో తుఫాను రాబోతూ వుందన్నమాట.
ఏమిటి అది?
మళ్ళీ వీళ్ళందరూ కలిసి ఏదైనా ప్లాను వేస్తున్నారా?
ఎంత ప్రయత్నించినా నాకు తెలియలేదు.
ఈ సమయంలో నాకు కొన్ని రోజులు శలవు కావల్సి వచ్చింది. రేఖతో కట్టిన పందెం గెలవాలంటే కొన్ని రోజులు జైలుకు దూరంగా వుండాలి. ఉండటం మంచిదేనా? ముఖ్యంగా ఈ పరిస్థితుల్లో...
నా అనుమానానికి నాకే నవ్వొచ్చింది. ఈ జైలు నా స్వంతం కాదు. పైగా దీని రక్షణ భారం పూర్తిగా నా ఒక్కడి భుజస్కంధాల మీదే లేదు.
అందుకని శలవు తీసుకోవటానికే నిర్ణయించుకున్నాను.
శలవు కాగితం మీద సంతకం పెడుతున్నప్పుడు సూపర్నెంటెండెంట్ మొహంలో లీలా మాత్రమైన ఆనందం కనపడటం గమనించాను. అప్పటికయినా నేను నా ఉద్దేశ్యాన్ని మార్చుకుని, శలవు కాగితం వెనక్కి తీసుకోవలసింది. కానీ అలా చెయ్యలేదు.
అలా చేసివుంటే ఒక ఘోరమైన విపత్తు తప్పేది. ఎన్నో ప్రాణాలు రక్షింపబడేవి.
* * *
"శివప్రసాద్! మీ ఆవిడ- అదే నీక్కాబోయే అమ్మాయి.... మంగతాయారుని కలుసుకుని పరీక్ష లెప్పటినుంచో కనుక్కో. ముఖ్యంగా బోటనీ పరీక్ష ఎప్పుడో కనుక్కో. అలాగే ప్రాక్టికల్స్ కూడా."
"ఎందుకు గురూ!"
"చెప్తాను" అన్నాను. నా మనసులో ఒక వ్యూహం అప్పటికే సిద్ధమై వుంది.
ఆ మరుసటిరోజు శివప్రసాద్ వచ్చి, వాళ్ళబోటనీ పరీక్ష ఎప్పుడో చెప్పాడు.
ఆ రోజు భోజనం చేస్తూ వుండగా అమ్మదగ్గిర గండ్రగొడ్డలి ప్రసక్తి వచ్చింది.
"చాలా కిరాతకుడమ్మా. ఇరవై మూడు హత్యలు చేశాడట. రేపో ఎల్లుండో ఉరి ఖాయమై ఆర్డరొస్తుంది" అని చెప్పాను.
"మనుష్యుల్లో కూడా అంత కిరాతకులు వుంటార్రా?"
"ఉంటారమ్మా! వాడే ప్రత్యక్ష తార్కాణం..." కంచంలో చేయి కడుక్కుంటూ అన్నాను.
నేను జైలు కెళ్ళే సరికి ఒక ముసలివాడు రాజారాం కాళ్ళా వేళ్ళాపడి బ్రతిమాలుతున్నాడు. ఏమిటి సంగతి అని అడిగాను.
"పల్లెనుంచి వచ్చారట. గండ్రగొడ్డలిని చూడాలని అడుగుతున్నారు. వీల్లేదని చెప్పినా అరగంటనుంచీ వినటంలేదు. ఏం చేద్దాం భాయీ?" అని అడిగాడు.
ఈ లోపులో ఆ వృద్ధుడు నాకాళ్ళ దగ్గిరకి చేరుకుని బ్రతిమాలసాగాడు. "చాలా దూరం నుంచి వచ్చాము బాబూ. అది నా కోడలు. కడుపుతో వుంది. నా పెండ్లాం కూడా సూడాలని వచ్చింది. కాదనకుబాబూ."
నేను వాళ్ళని చూసేను. ఒక నిండు గర్భిణీ, ఒక ముసలి ముత్తయిదువ దూరంగా నిలబడి వున్నారు. నేనటు చూసేసరికి ఇద్దరూ చేతులెత్తి దణ్ణం పెట్టారు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. రాజారాం ఏం చేద్దాం అన్నట్టు చూస్తున్నాడు.
నేనా ముసలివాడితో అన్నాను- "చూడూ, గండ్రగొడ్డలిని సాలిటరీలో కనెఫైన్ మెంట్ లో - అంటే, ఒంటరిగా వుండాల్సిన గదిలో పెట్టాం! అతడినెవరూ చూడటానికి వీల్లేదు. మీరెంత దగ్గిర బంధువులైనా గానీ- కొన్ని నిర్ణీతమైన సమయాల్లో మాత్రమే చూడటానికి వీలవుతుంది...."
"అలా అనకు బాబూ - నీ కాల్మొక్కుత. సాన దూరం నుంచి వచ్చినం. నా కోడలు ఇయ్యాలో రేపో కనేట్టూ వుంది. దాని కోర్కె తీర్చుబాబూ, నీ ఋణం వుంచుకోము-"
నేను రాజారాంవేపు తిరిగి, ఇంగ్లీషులో "ఈ ముసలోడు వదిలిపెట్టేట్టు లేడు అన్నాను.
"క్వారంటైన్ కి తీసుకొచ్చి మాట్లాడిద్దామా"
"వద్దులే వీళ్ళనే అక్కడికి తీసుకెళ్ళటం మంచిది. రూల్స్ కి వ్యతిరేకమైనా-" అన్నాను.
రాజారాం వాళ్ళవేపు తిరిగి, "రండి నాతో" అన్నాడు. అంతలో సూపర్నెంటెండెంట్ దగ్గిరనుంచి పిలుపొచ్చింది. ఎవరో ముఖ్య అతిధులు వచ్చారనీ, జైలు చూపించమనీ!
"సరే. నువ్వెళ్ళు. నేను వీళ్ళని తీసుకు వెళ్తాలే" అన్నాను.
"చూసేవా భాయీ, ఈ ముసలోళ్ళు అంత దూరంనుంచి వస్తే మనం ఇంత తటపటాయించాం, ఎవరో వి.ఐ.పి. గారు వస్తే మనమే పరుగెత్తుకెళ్ళి జైలంతా చూపిస్తున్నాం" అన్నాడు.
నేను నవ్వి ముందుకు కదిలాను. ముసలివాడు, అతడి భార్యా, కోడలూ
నేను నవ్వి ముందుకు కదిలాను. ముసలివాడు, అతడి భార్యా, కోడలూ నన్ను అనుసరించారు.
వెళ్తూవుంటే అడిగాను. "గండ్రగొడ్డలి మీకేమవుతాడు?"
"దేవుడు బాబూ"
మొదటి ఒక క్షణం అతడి జవాబు నాకు అర్ధం కాలేదు. స్పాంటేనియస్ గా వచ్చిన ఆ సమాధానం, ఏమీ తెలివితేటలు లేకుండా, అసంకల్పితంగా వచ్చింది. ఆ సమాధానంలో నన్ను ఏడిపించాలన్న భావంగానీ, బాధ పెట్టాలన్న ఆలోచనగానీ ఏమీ లేదు. ఈ అమాయకులయిన గ్రామీణుల్లో అంత తెలివి వుందని కూడా నేననుకోను.
సాలిటరీ గదులు వరుసగా వున్నాయి. మరీ భయంకరమయిన ఖైదీల్ని ఈ గదుల్లో పెడతారు, గదులముందు పొడవాటి వరంగా వుంది.
గండ్ర గొడ్డలి దృష్టి నెమ్మదిగా పక్కకి తిరిగి, నా పక్కన నిల్చున్న ముసలివాడిమీద పడింది. దానికోసమే చూస్తున్నట్లు అతడు కోడల్నీ, భార్యనీ తీసుకుని ఊచల దగ్గరికి వెళ్ళాడు. వాడి కళ్ళల్లో సంభ్రమం వుంది. ఆనందం వుంది. వాటి వెనుక లీలగా విచారం వుంది.
"బాబూ! నిన్ను సూడాలని పల్లెనుంచి వచ్చినం. గిదో నా కోడలు! నిండు గర్భిణీ! 'తొమ్మిదో నెల కడుపుతో ఇంతదూరం పెయాణం ఎట్టాగే' అన్న. వినలేదు. బండిమీద వత్తుగా గడ్డేసి పడుకోబెట్టి తీసుకొచ్చిన!! కడుపు మీద చెయ్యేసి దీవించు బాబూ!" అన్నాడు. అంతలో కోడలు ముందుకొచ్చింది.
అతడు ఊచల మధ్యనుంచి చెయ్యి బయటికి పెట్టి ఆమె కడుపు మీద ఆన్చాడు. అతడి కంఠంలో అదో లాంటి ఆర్థ్రత ధ్వనించింది.
"అమ్మ కడుపులో హాయిగా కళ్ళు మూసుకుని నిద్రపోతూన్న ఓ పసికూనా! ఏమని ఆశీర్వదించమంటావ్ రా నన్ను? నీ కళ్ళు విచ్చుకునే సరికి, పిడికిళ్ళు విడిపడేసరికి, భారతమాత కనుకొలుకుల్లో నిలిచిన కన్నీటి చుక్క ముత్యమై నీ చేతిలో నిలవాలనీ, నిలుస్తుందనీ ఆశీర్వదించమంటావా? లేక కనీసం నువ్వు పెద్దయ్యే సరికన్నా భారత ప్రజ, ప్రజాస్వామ్యపు అసలు అర్ధం గుర్తిస్తుందనీ, నీ శ్రమ శక్తికి తగిన ప్రతిఫలం లభిస్తుందనీ ఆశీర్వదించమంటావా? అన్నీ పెద్ద కోర్కెలుగానే కనిపిస్తున్నాయిరా నాకు.