"నేనేమనను సర్, మీరే అన్నారు- నేనెందుకూ పనికిరాని చవటని అని ఇంగ్లీషులో!"
"నేనలా అనలేదు. పని పట్ల నీ వితండ వాదాన్ని విమర్శించానంతే!"
"నాది వితండ వాదం కాదు సర్! సతండ వాదమే!! మనుషులు పనెందుకు చేస్తారు చెప్పండి చూద్దాం".
ఆయన తెల్లబోయి చూసాడు. బృహస్పతి కొనసాగించాడు. "....డబ్బు కోసం, అధికారం కోసం, కీర్తికోసం, పని చేయకపోతే ఇంకేం చేయాలో తోచదు కాబట్టి దానికోసం- అవునా?"
"అవును" అప్రయత్నంగా అన్నాడాయన.
"గుడ్! దార్లోకొచ్చారు. ఇప్పుడు నేను చెప్పే రెండో పాయింట్ ని జాగ్రత్తగా అర్ధం చేసుకోడానికి ప్రయత్నం చేయండి...." ఒక అమాయకుడ్ని హిప్నటైజ్ చేస్తున్న వాడిలాగా మంద్ర స్వరంతో చెప్పసాగాడు. ".... డబ్బు అధికారం అనేవి 'పని' యొక్క అంత్యపరిణామ ఫలితాలైతే, మనం ఎంత ఎక్కువ పని చేస్తే అంత ఎక్కువ డబ్బు రావాలి కదా! మనకెన్ని తెలివి తేటలుంటే అంత అధికారమూ, హోదా రావాలి కదా! అవునంటారా, కాదంటారా?"
"అవును"
"కానీ మన ప్రపంచంలో, ముఖ్యంగా మన దేశంలో.... పైన చెప్పిన విధంగా జరుగుతోందంటారా?" అని ఒకక్షణం ఆగి, ఒక ప్రశ్న వేసాడు "మీకున్న అనుభవంతో, ఈ ప్రపంచంలో అసలు పని చేయవలసిన అవసరం లేని ఒక రంగం.... అస్సలు తెలివితేటలు అవసరంలేని మరో రంగం అలాంటి రెండు రంగాలు చెప్పగలరా?"
అక్కడ భయంకరమైన నిశ్శబ్దం ఒక్కక్షణం రాజ్యమేలింది.
"మీరిలా ప్రతి ప్రశ్నకీ మౌనం వహించబట్టే సుప్రీంకోర్టులో తల వాచేలా చివాట్లు తింటున్నారు. పోన్లెండి ఆ విషయం అప్రస్తుతం. పని చేయడం అవసరంలేని ఫీల్డు రాజకీయం! తెలివితేటలు అవసరంలేని ఫీల్డు జ్యోతిష్యం."
రాఘవరావు కాబోయే అల్లుడి (?) వైపు బిత్తరపోయి చూసాడు. తన కూతురు ప్రేమలో ఎందుకు పడిందో మిగతా సగం కారణం కూడా ఆయనకిప్పుడు అర్ధమైంది. 'ఇలాంటి మాటలు చెప్పే ఆ అమ్మాయి మతిపోగొట్టి వుంటాడు' అనుకున్నాడు. ఈలోగా బృహస్పతి వాదన కొనసాగించాడు.
"....బంగారం పనిచేసే కంసాలినుంచి, హోటల్లో పనిచేసే వంటవాడి వరకూ ఏదో ఒక నైపుణ్యం వుండాలి. చివరికి బ్యాంక్ లో పనిచేసే ఫ్యూన్ కి కూడా పదో తరగతి ఫెయిలయ్యాడన్న అర్హత కావాలి. కానీ రాజకీయ నాయకులకీ, తాంత్రిక స్వాములకీ ఏ క్వాలిఫికేషనూ అక్కరలేదు. అయినా అధికారమూ, డబ్బూ వాళ్ళదగ్గరే వుంటాయి. కాబట్టి శ్రమకీ, శ్రమ ఫలితాలకీ మధ్య సంబంధం విలోమ నిష్పత్తిలో ఉంటుందని అర్ధమైంది కదా! అందుకే నేను శ్రమపడను" అన్నాడు తుది తీర్పు ఇస్తున్న న్యాయమూర్తిలా.
"నువ్వు చెప్పినదంతా బాగానే వుంది. అయితే రేప్రొద్దున్న నా కూతుర్ని నీకిచ్చి పెళ్ళిచేసాననుకో.... ఆ అమ్మాయిని ఎలా పోషిస్తావ్?"
"అదేం పెద్ద సమస్య కాదంటున్నాను."
"అదే.... ఎలాగని అడుగుతున్నాను."
"మీ అమ్మాయి ఉద్యోగం చేస్తోంది కాబట్టి ఆ సమస్య రాదనుకుంటున్నాను."
'ఓర్నీ దుంపతెగా' అన్నట్టు చూసాడు రాఘవరావు. "నా కూతురు రెక్కలు ముక్కలు చేసుకుని డబ్బు సంపాదిస్తే దానిమీద పడి బతుకుతావా? పైగా అలోమానుపాతం, విలోమనిష్పత్తి అని లెక్చర్ లు యిస్తావా?
"మీరు నన్ను పొరపాటుగా అర్ధం చేసుకున్నారు. నిజమైన పనికి గుర్తింపు లేదన్నానే తప్ప నేను అవసరం వచ్చినప్పుడు పని చేయనన్లేదే! చెప్పండి, రేపు సాయంత్రంలోగా ఒక ఐదు లక్షలు సరదాగా సంపాదించమంటారా?"
రాఘవరావు అదిరిపడ్డాడు.
రాష్ట్రంలోని నలభై రెండు సీట్లలో తమ పార్టీకి కనీసం 3 సీట్లు కూడా రావని బల్లగుద్ది చెప్పిన పార్టీ లీడరు- నలభై సీట్లు వస్తే ఎంత దిగ్భ్రాంతి చెందుతాడో అలాంటి విస్మయంతో బృహస్పతివైపు చూసాడు.
ప్రెసిడెంట్ తిడితే తప్ప తన తప్పు తనకు తెలియని గవర్నర్ లాగా, నిజాయితీ కూడిన అమాయకపు చిరునవ్వుతో అన్నాడు బృహస్పతి. కృష్ణుడు నోరు విప్పితే ముంగిట్లో మూడు లోకాలూ యశోదకు కనబడ్డట్టు- బృహస్పతి నవ్వు వెనక హవాలా స్కాండల్ అంత ప్రపంచం కనబడింది రాఘవరావుకి.
"రేపు సాయంత్రంలోగా అయిదు లక్షలా?" అన్నాడు తడారిన గొంతుతో.
"కాబోయే అల్లుడు కడు సమర్ధనీయుడు అని తెలుసుకోవటానికి ఐదు లక్షలు సరిపోవా?" నాటకీయంగా అన్నాడు బృహస్పతి. "... రేపు మధ్యాహ్నం మూడుగంటలకి వస్తాను. రెడీగా వుండండి మీ కారులోనే వెళదాం."
"ఎక్కడికి?"
"ఈ పక్కనే.... ఒక వంద కిలోమీటర్లు. వివరాలు రేపు చెప్తాగా!" అంటూ అక్కణ్ణించి కదిలాడు.
* * *
మరుసటిరోజు వాళ్లు అక్కడికి వెళ్ళేసరికి నాలుగున్నర అయింది. సాయంకాలపు నీడలు నెమ్మదిగా పరుచుకుంటున్నాయి.
"మనం ఇక్కడికి ఎందుకొచ్చాం?" అన్నాడు రాఘవరావు.
"చుట్టూ పొలాలు చూడండి సార్ ఎంత బావున్నాయో! కర్ణాటక పొలాలు."
"కర్ణాటక పొలాలకీ, ఆంధ్రా పొలాలకీ తేడా చూపించటానికే నన్నీ రాష్ట్రం తీసుకొచ్చావా?" కోపంగా అడిగాడాయన.
"లేదు సర్! యిక్కడ బంజరు భూములు కొని పొలాలుగా మారిస్తే ఎంతకాలంలో ఎంత లాభం వస్తుందోనని మీతో చర్చించడం కోసం తీసుకొచ్చాను. అయిదు సంవత్సరాల్లో అయిదు లక్షలు లాభం రాదూ?" అన్నాడు.
రివాల్వర్ తీసి షూట్ చెయ్యాలన్నంత కోపాన్ని అతికష్టం మీద అణుచుకుని.... "నా కూతురు రికమెండ్ చేసింది కాబట్టి బతికిపోయావ్! అయినా నిన్ను కాదులే, ఢిల్లీ వెళ్ళాక మా అమ్మాయి పని చెప్తాను" అని విసురుగా వెళ్లి కార్లో కూర్చుని.... "పోనీ" అని డ్రైవర్ ని కసిరాడు. బృహస్పతి ఆయనతోపాటు పక్కన కూచునే సాహసం చేయలేక ముందు సీట్లో బుద్ధిమంతుడిలా కూచున్నాడు.
చాలాసేపు మౌనంగా వుండటానికి ప్రయత్నించాడు. అయితే అలాంటి లక్షణం రక్తంలో వుండాలి. వెనక్కి తిరిగి మాట్లాడితే ఆయన తంతాడని డ్రైవర్ తో సంభాషణ కలిపాడు.
"ఇదేంటి సర్?" అనడిగాడు స్టీరింగ్ పక్కన వున్న బటన్ చూపిస్తూ.
"హారన్" అన్నాడు డ్రైవర్.
కారు బోర్డర్ దాటి ఆంధ్రాలో ప్రవేశిస్తోంది. చెక్ పోస్టు దగ్గర పోలీసులు నిలబడి వున్నారు. బృహస్పతి బటన్ నొక్కగానే కారు టాప్ పైనున్న ఎర్రలైటు వెలుగుతూ 'బొయ్ బొయ్' మని శబ్దం చేయసాగింది. పోలీసులు శాల్యూట్ చేస్తుండగా కారు ముందుకు సాగిపోయింది.
"ఆ శబ్దాన్నాపు" వెనకనుంచి విసుగ్గా అరిచాడు చీఫ్.
"మీరు కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు అది మోగుతూ వుండాలి కదండీ?" డ్రైవర్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత బృహస్పతి ఆయన్ని అనుమానంగా అడిగాడు.
"ఎప్పుడెప్పుడు ఏది మోగాలో, ఆగాలో ఆ రూల్స్ అన్నీ నీ కనవసరం. నువ్వు కారు దిగు. వూళ్ళోకి ప్రవేశించాం. నువ్వు చేసిన వెధవ పనికి అక్కడే వదిలెయ్యాల్సింది" అంటూండగా డ్రైవర్ కారునో పక్కగా తీసి ఆపుచేశాడు.
బృహస్పతి కారు దిగుతూండగా ఒక వ్యక్తి అక్కడికొచ్చి చిన్న బ్రీఫ్ కేస్ అందించాడు.
బృహస్పతి రాఘవరావుతో "చూసుకోండి సార్! అయిదు లక్షలు సరిగ్గా వున్నాయో లేదో" అన్నాడు.
ఆ ముసలాయన అయోమయంగా "ఐదు లక్షలా? ఎలా వచ్చాయి? ఆ మనిషెవరు?" అనడిగాడు.
బృహస్పతి నవ్వి.... "ఆ మనిషి ప్రొహిబిషన్ మినిష్టర్ గారి బావమరిది. లిక్కర్ స్మగ్లర్. పది లక్షల సరుకు బోర్డర్ దాటించి తీసుకొస్తే యాభైశాతం కమీషన్ యిస్తాడు."
"నువ్వు చేసే పని ఇదా? భగవంతుడా! నా కూతురు ఓ దొంగ సరుకు రవాణా చేసేవాణ్ణి ప్రేమించిందా?"
"నేను చేయలేదు సార్! మీరే ఆ సరుకు రవాణా చేయించారు" అన్నాడు.
ఆయన ముందుకు తూలబోయి అతికష్టంమీద నిభాయించుకుని "నేనా?" అన్నాడు కీచుగొంతుతో.
"అవును సర్! మీరే! కర్ణాటక బోర్డర్ చెక్ పోస్టు దగ్గర పోలీసులకి మా బ్రహ్మానందం ఫోన్ చేసి చెప్పాడు. బీదర్ నుంచి సి.బి.ఐ. చీఫ్ తన కుటుంబంతో రెండు మూడు కార్లలో హైదరాబాద్ వస్తున్నాడనీ, తాను పోలీసు కమీషనర్ ననీ అలర్ట్ గా వుండమనీ ఆజ్ఞలు జారీచేశాడు. మనం హారన్ కొట్టుకుంటూ ప్రవేశిస్తున్నప్పుడు వాళ్ళందుకే శాల్యూట్ చేస్తూ అటెన్షన్ లో నిలబడ్డారు."
"నా ప్రయాణం విషయం వాళ్ళకెందుకు చెప్పావ్? దానికీ ఈ ఐదు లక్షలకీ సంబంధం ఏమిటి?"
"ఇంత చెప్పినా లైటు వెలగలేదంటే బాధగా వుంది సార్! అందుకే సుప్రీంకోర్టు మీ డిపార్ట్ మెంటుని అలా తిడుతూంటుంది."
_________________________________________________________________
*ఈ నవల వ్రాస్తున్న సమయానికి ఆంధ్రప్రదేశ్ లో ప్రొబిషన్ వున్నది.
"మాటిమాటికీ నువ్వా విషయం గుర్తుచేయనక్కరలేదు. అసలు విషయం చెప్పు."
"మీ వెనక వచ్చిన వేన్లలో మీ ఫేమిలీ మరియు మీ సామాను వుందనుకున్నారు. సి.బి.ఐ. చీఫ్ ని ఆపేంత ధైర్యం వాళ్ళకి లేకపోయింది. ఆ విధంగా .... 'రాజా వెడలె రవితేజము లలరగ" అన్న స్టయిల్ లో మీరే సరుకు సరఫరా చేయడానికి తోడ్పడ్డారు. చూసారా సర్? అరగంటలో ఐదు లక్షలు సంపాదించాను. మీ కూతురికి ఏ విధమైన లోటూ రానివ్వననే నమ్మకం ఇప్పటికయినా కుదిరిందనుకుంటాను."
సి.బి.ఐ. చీఫ్ మొహంలో భావాలు అంచెలంచెలుగా మారాయి. మొట్టమొదటి భావం షాక్. దాన్నించి తేరుకున్నాక కించిత్ సిగ్గు, ఆ తర్వాత అవమాన భారంతో కోపం. 'నేను నిన్ను వెంటనే అరెస్టు చేయిస్తాను' అనబోయి - మళ్ళీ సుప్రీంకోర్టుని గుర్తుచేస్తాడేమోనని తమాయించుకున్నాడు. ఈలోగా బృహస్పతి వినయంగా అన్నాడు- "మీ శ్వాస తీవ్రత చూస్తుంటే బి.పి. పెరిగినట్టనిపిస్తోంది. ఇలాంటి చట్టవిరుద్ధమైన పనులు చేయడం నాకూ ఇష్టం ఉండదు సార౧ కేవలం మీకు ఉదాహరణ చూపించడం కోసమే చేసాను. కావాలంటే ఆ డబ్బు మీరే ఉంచుకోండి. లేదా ఏ రక్షణ నిధికో ఇచ్చేసెయ్యండి."
రాఘవరావు ఎంత దిగ్భ్రాంతి చెందాడంటే- వెళ్లిపోతున్న ఆ యువకుడ్ని ఆపుచెయ్యాలన్న స్పృహ కూడా లేకుండా పోయింది.
5
మోచేతులు రెండూ గడ్డం కింద పెట్టుకుని ముందుకు వాలి దీర్ఘాలోచనలో ఉన్నాడు రాఘవరావు. ఆలోచిస్తున్న కొద్దీ బృహస్పతి ఒక అర్ధం కాని పజిల్ లాగా తోచసాగాడు. అల్లుడ్ని చేసుకోవడం అన్న విషయం పక్కన పెడితే- అసలిలాంటి వ్యక్తులుంటారా అనిపిస్తోంది. అరగంటలో ఐదు లక్షలు సంపాదించటం ఒక ఎత్తయితే, దాన్నంత నిర్వికారంగా వదులుకోవడం మరీ చిత్రం! నిజంగానే తన కూతురన్నట్టు ఈ యువకుడు ఒక విశిష్టమైన వ్యక్తా?
ఆయన ఆలోచిస్తూండగా క్రింది అధికారి ఫాక్స్ మెసేజ్ తీసుకొచ్చి ఇచ్చాడు. దానిమీద 'కోడ్ ఎక్స్' అని రాసివుంది.