అతను కాస్త షాక్ తిన్నాడు. అయినా తమాయించుకున్నాడు. "నేను చెప్పేది మధ్యాహ్నం నాకు మందిచ్చిన నర్సు గురించి."
డాక్టర్లు మొహమొహాలు చూసుకున్నారు. "నువ్వు చెప్పేది ప్రనూష గురించా?"
"ప్రనూష ఎవరు?"
"నీకు మందు ఇచ్చిన నర్సు"
"ఎవరైతేనేం? చంపేసేరుగా?"
"ప్రనూష చనిపోవటం ఏమిటి? అదిగో-"
ఒక చలనచిత్రం స్లోమోషన్ లో కదిలినట్టు అతడు తల తిప్పి చూశాడు. కిటికీ ఊచల్ని పట్టుకొని తనవైపే భయం భయంగా, దిగులుగా చూస్తున్న 'ఆమె' కనపడింది. అతడికెంత షాక్ అంటే- అచేతనావస్థలో చేతిలో సీసా వదిలేశాడు.
అయితే అతడిని ఎవరూ పట్టుకోవడానికి రాలేదు. అతడి చేతుల్లో అప్పటివరకూ బందీగా వున్న డాక్టర్ కూడా అతడివైపు సానుభూతిగా చూస్తూ అక్కడే వుండిపోయాడు.
ఆమె అందమైన కళ్ళలో అతడి స్థితిపట్ల ఆర్ధ్రతతో కూడిన జాలి.
"అక్షౌహిణి" అన్నాడు అస్పష్టంగా.
"కాదు. ఆ అమ్మాయి పేరు ప్రనూష" అన్నాడు డాక్టర్ పాల్. అందరూ క్రమంగా అక్కడనుంచి వెళ్ళిపోసాగారు.
"ప్రనూష చాలా అందమైనది సుబ్బారావ్! ఇక్కడ చాలా మంది డాక్టర్లే మతులు పోగొట్టుకున్నారు. నీ మనస్తత్వం నువ్వు అనలైజ్ చేసుకో. మతిస్థిమితానికి అదే అన్నిటికన్నా పెద్దమందు. నువ్వే హీరోవి అన్న భ్రమ నీది. హీరోలా ఆపదలో పడ్డాననుకున్నావు. ప్రనూష నిన్ను రక్షించాలనీ, ఆ ప్రమాదంలో తన ప్రాణాలు పోగొట్టుకోవాలనీ సినిమా కథలా రాత్రంతా ఆలోచించావు. అదే భ్రమ. హెలూసినేషన్. అంతా నిజంగా జరిగినట్లు నీ కనిపించింది. అందుకే భ్రమలోంచి బయటికిరా సుబ్బారావ్."
డాక్టర్ పాల్ వెళ్తూ వుంటే ఆమె అతడిని అనుసరించింది.
"నాకాయన ఏం పేరు పెట్టారు డాక్టర్?"
"అక్షౌహిణి అట."
"భలే వుంది.... అంటే?"
"సైన్యం అని అర్ధం."
వరండా చివర్లో వాళ్ళ మాటలు మాయమయ్యాయి.
అతడు మాత్రం అలాగే శిలాప్రతిమలా నిలబడివున్నాడు.
వరండాకి ఇటు చివర అతడి భార్య నిలబడి వుంది బిడ్డనెత్తుకుని... కళ్ళనిండా నీళ్ళతో.
అతడు నెమ్మదిగా తన భార్య దగ్గరికి వెళ్ళి ఆమె తల మీద చెయ్యివేసి, "నన్ను క్షమించు" అన్నాడు.
ఆమె ఆశ్చర్యంగా తలెత్తింది.
"అవును! నాకు ఏది నిజమో, ఏది అబద్ధమో అర్ధంకావడం లేదు. జరిగిన విషయాలన్నీ చూస్తూంటే ఈ డాక్టర్లు చెప్పేవన్నీ నిజమేనేమో అనిపిస్తూంది. అదే నిజమయిన పక్షంలో నా అంత దురదృష్టవంతుడు మరెవరూ వుండరు. నీ పేరుతో సహా, నాకేమీ గుర్తులేదు."
ఆమె కళ్ళలో నెమ్మదిగా వెలుగొచ్చింది. కళ్ళలో నీళ్ళు అలాగే వుండగా, పెదాలమీద నవ్వు అందంగా కదలాడింది. ఇన్నాళ్ళూ పడ్డ వ్యధ అంతా ఆ క్షణం తొలగిపోయినట్లు అనిపించింది. మంగళసూత్రం తీసి కళ్ళకద్దుకుంటూ అక్కడనుంచి వెళ్ళిపోయింది. ఆమె ఆనందం ఆమెని మాట్లాడనివ్వలేదు. డాక్టర్ని కలుసుకోవటం కోసం వడివడిగా వెళ్లింది. ఆమె దూరంగా డాక్టర్ తో మాట్లాడటం వినిపిస్తూంది. అంతా విని డాక్టర్ అన్నాడు-
"ఇప్పటి వరకూ తన భ్రమలో వున్నానన్న విషయం అతనికి తెలియటం శుభసూచకమే! కానీ ఆ కాస్తా సరిపోదు. అతడికి తన గతం పూర్తిగా గుర్తురావాలి. మొత్తం మీద ఇది మంచి పరిణామమే"
ఆమె అతడికి నమస్కారం చేసి కదిలింది.
ఆమె వెళ్ళిపోయిన తరువాత డాక్టర్ అతని వద్దకు వచ్చాడు.
ఇద్దరూ కొద్దిసేపు మాట్లాడుకోలేదు. నిశ్శబ్దాన్ని చీలుస్తూ డాక్టరే అన్నాడు- "మనస్తత్వశాస్త్రం, మానసిక పరిణామం చాలా క్లిష్టమైనవి సుబ్బారావ్! నాకీ వైద్యంలో పాతిక సంవత్సరాల అనుభవం వుంది. మనిషి అంత క్లిష్టమైన ప్రవర్తన గల జంతువు ఈ ప్రపంచంలో మరొకటి లేదు. నేను కొన్ని వేలమంది రోగుల్ని ఈ ఆస్పత్రిలో ట్రీట్ చేసి పంపించాను. కానీ ఇంతకు పదిరెట్లు "పేషెంట్లు" బయటి ప్రపంచంలో వున్నారని నాకు తెలుసు. పైకి నవ్వుతూ కనిపిస్తూ ఇంట్లో రాక్షసులుగా ప్రవర్తించే వాళ్ళూ, కొద్ది ఓటమికే ఆత్మహత్య గురించి ఆలోచించేవాళ్ళూ, తాము నమ్మిందే నిజమని భ్రమించి కొంతకాలానికి అది అవాస్తవికమని తెలిసినా ఆ భ్రమనుంచి బయటపడలేనివాళ్ళూ, బాధల్ని మర్చిపోవటానికి తాగుడిని ఆశ్రయించేవాళ్ళూ- వీళ్ళంతా పిచ్చి వాళ్ళు కాక మరేమిటి? నువ్వు ఆరాధించే నటుడు చైతన్యనే తీసుకో! వసూళ్ళలో అతను పెద్ద అని అందరికీ తెలుసు. అకస్మాత్తుగా మరొక నటుడి పిక్చర్ హిట్ అవుతుంది. తనే ఇక నంబర్ వన్ అంటాడు. రచయితల్లో కూడా అంతే! ఇదంతా పబ్లిసిటీ కోసమయితే ఫర్వాలేదు. కానీ ఆ వ్యక్తులు కూడా దీన్ని మనస్పూర్తిగా నమ్ముతారు. చుట్టూ వున్న వాస్తవాల్ని, స్టాటిస్టిక్స్ నీ, తమ పొజిషన్నీ గుర్తుపెట్టుకోరు. ఇలా తమకి ఆనందం ఇచ్చే ఒక అబద్ధాన్ని 'మనస్పూర్తిగా' నమ్మటమే పారనాయిడ్ సైకాలజీ. నువ్వు తొందర్లోనే అందులోంచి బయట పడటం నాకు ఆనందంగా వుంది. నెమ్మదిగా నీ గతజీవితం గుర్తుతెచ్చుకోవడానికి ప్రయత్నించు. దానికి నీ భార్య సాయం తీసుకో" అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాడు. అతడు చాలాసేపు మంచంమీద అలాగే పడుకున్నాడు.
ఎక్కడో ఏదో సంతృప్తి.
.....అతడి కళ్ళముందు తన భార్య కదలాడింది. ప్రనూష గోచరించింది. ప్రనూష గుర్తొచ్చినప్పుడు ఒక అందమైన మెరుగు తీగె కదలాడిన భావం. భార్య గుర్తుకొచ్చినప్పుడు- తప్పు చేస్తున్నానేమో అన్న భావం.
ప్రనూషని చూడగానే తనలో కదలాడిన ప్రేమభావమే- ఆ రాత్రి ఆమెతోసహా పారిపోవటానికి చేసే యత్నంగా కలొచ్చిందా?
కలలో కూడా ఎంత లాజిక్?
అక్షౌహిణి
సైన్యం.
ఒక స్త్రీకి సహాయపడాలనే కోరిక, పురుషుడిలో అంతర్గతంగా అలాగే వుంటుంది కాబోలు. తనే ఆమెకి సైన్యంగా ఈ ఆస్పత్రి నుంచి తప్పించుకోవాలన్న కోరికకి ప్రతిరూపమే ఆ కల అయివుండవచ్చు. ఆమె తనని చైతన్యగా గుర్తించడం, తనలోని (ఆమెచేత) గుర్తింపబడాలన్న కోరికకి నిదర్శనం. ఒక సుబ్బారావుగా ఆమె తనని గుర్తించకపోవచ్చు. చైతన్య అదృష్టవంతుడు. ప్రనూషలాంటి ఎంతోమందిచేత గుర్తింపబడుతున్నాడు.
అయినా ఇదంతా తనకి అనవసరం!
తన భార్యకి అన్యాయం చేయకూడదు.
-అతడు తన భార్యని గుర్తు చేసుకోవటానికి ప్రయత్నం చేశాడు. తన కొడుకుని, తన గతాన్ని జ్ఞాపకం చేసుకోవాలనుకున్నాడు. జరిగినదంతా నిజమైతే తన భార్య ఎంత మానసిక క్షోభ అనుభవిస్తూ వుండి వుండాలి. గతం మర్చిపోయిన భర్త కన్నా నరకం ఏముంది?
అసలు తన తల్లిదండ్రులెవరు? తను ఏ కాలేజీలో చదివాడు?
తలుపు దగ్గర అలికిడి అవడంతో అతడు తలతిప్పి చూశాడు. అతడి భార్య గుమ్మం దగ్గర నిలబడి వుంది. చేతిలో బాబు.
అతడు లేచి వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు. కొడుకుని చేతుల్లోకి తీసుకుని "నన్ను క్షమించు. నిజంగా నాకేమీ గుర్తులేదు" అన్నాడు, కొంచెం ఆగి, ".... గుర్తు తెచ్చుకోవటానికి ప్రయత్నిస్తాను" అని మళ్ళీ అన్నాడు.
అతడిలో వచ్చిన ఆ కాస్త మార్పుకే ఆమె కదిలిపోయినట్టు కనిపించింది. ఇన్నాళ్ళ దిగులు, ఒంటరితనం ఏమవుతుందో అన్న భయం ఆమె చుట్టూ స్తబ్దతని పెర్చాయి. ఈ ఓదార్పుకి అది కరిగింది.
అతడి భుజాలమీద తల ఆన్చి వెక్కివెక్కి ఏడవటం ప్రారంభించింది. అతడు అనునయంగా ఆమె తల నిమిరాడు.
"నువ్వేమీ అనుకోకపోతే నా గురించి కొద్దిగా చెప్పు. ఏదయినా ఒక పాయింటు దగ్గర నాకు అంతా గుర్తు రావచ్చు. ముందు నీ పేరు చెప్పు."
"లక్ష్మి"
"బాబు పేరు?"
"చైతన్య"
అతడు వులిక్కిపడ్డాడు. "అవునండీ! మీరు చైతన్యగారి అభిమాని. మన ఇంటినిండా ఆయన ఫోటోలే. బాబుకి కూడా ఆయన పేరు పెట్టారు."
"నేను బాగుపడి మన ఇంటికి వెళ్ళగానే ఆ ఫోటోలన్నీ తీసేద్దాం. అభిమానం వుండటం మంచిదేగానీ, ఫోటోలు బెడ్ రూంలో పెట్టుకొనేటంత అవసరం లేదు. నేను ముందు ఈ చైతన్య "అబ్సెషన్" నుంచి బయటపడాలి. దానికి మనం ఏర్పాటు చేసుకోవాలి."
"మీ ఇష్టం."
ఆ తరువాత అతడికి అతడిని గురించిన వివరాలు చెప్పింది ఆమె. కిళ్ళీ కొట్టుముందు గొడవ, తలకి దెబ్బ తగలటం వగైరా. ఆమె వెళ్లిపోయాక అతడు డాక్టర్ తో మాట్లాడాడు.
"నన్ను ఇంటికి ఎప్పుడు పంపిస్తారు డాక్టర్?"
"ఎందుకు అలా అడుగుతున్నావ్?"
"ఇంటి పరిసరాలు చూస్తే గతం గుర్తొచ్చే సూచనలున్నాయి అని మీరే అన్నారుగా-"
డాక్టర్ తటపటాయించి, "ఇందులో కొద్దిగా యిబ్బంది వుంది సుబ్బారావ్. నీ జబ్బు నయమైంది అన్న సర్టిఫికేట్టు మేమిస్తే- వెంటనే పోలీసులు నిన్ను అరెస్టు చేస్తారు. ఆ ప్రమాదం వుంది."
"కాని నేను ఆత్మరక్షణ కోసమే ఆ రౌడీని కొట్టాను."
"ప్రమాదం పోలీసుల్నించి కాదు. చనిపోయిన రౌడీ తాలూకు మనుష్యుల్నించి."
"ఆ ప్రమాదం ఎప్పుడూ వుంది" అన్నాడు. "నేనూ జీవితాంతం ఎలాగూ వుండలేనుగా."
"సరే నీ ఇష్టం."
ఆ తరువాత అతడు చాలాసేపు స్తబ్దంగా పక్కమీద పడుకుని వుండిపోయాడు. సముద్ర కెరటాలు ఒడ్డుని కొట్టినట్టు ప్రనూష ఆలోచన్లు మనసుని తాకుతున్నాయి.
అతనికి నిద్రపట్టడం లేదు. మధ్యాహ్నం నిద్ర అతడికి అలవాటు లేదు. దూరంగా ఎక్కడో ఒక పక్షి దాహంతో అరుస్తోంది. అతడు విసుగ్గా పక్కమీద నుంచి లేచాడు. కిటికీ దగ్గర నిలబడి బయటకు చూడసాగాడు. ఎండ ఏటవాలుగా పడుతోంది. బిల్డింగ్ చుట్టూ చెట్లు, దూరంగా ప్రహరీగోడ, గోడ అవతల రోడ్డు, పెద్ద రష్ గా లేదు. ఒక సైకిలిస్ట్ నెమ్మదిగా వెళుతున్నాడు. బహుశ ఆస్పత్రి వూరి చివరగా వుండి వుంటుంది. అందుకే అంత నిశ్శబ్దంగా వుంది.
అతడు తిరిగి పక్క దగ్గరకు రాబోతూ ఆగిపోయాడు.
దూరంగా-
కొమ్మల మధ్యనుంచి - చెట్ల ఆకుల వెనుకనుంచి-
మసగ్గా-
అస్పష్టంగా కనబడుతూంది సినిమా వాల్ పోస్టర్ బ్యానరు.
నేడే విడుదల-
"అతడే ఆమె సైన్యం."
అదే...
తనకి పదిరోజుల క్రితం ప్రొడ్యూసర్ చూపించింది.
ఇదికూడా భ్రమేనా?
అతడు కళ్ళు నలుముకున్నాడు.
ఆ వాల్ పోస్టర్ మీద హీరో- హీరోయిన్ లు వున్నారు.
ఆకారాలు స్పష్టంగా కనిపించడంలేదు.
ఎవరా హీరో?