Previous Page Next Page 
క్షమించు సుప్రియా! పేజి 7

           

                                                           ఇలాగే జరుగుతుంది
   

   
    ప్రొఫెసర్ వ్యాస్ కుర్చీలో ఇబ్బందిగా కదిలి వాచీ చూసుకున్నాడు. అతడి చేతుల్లో ఒక పెద్ద కవరుంది. జాగ్రత్తగా గమనిస్తే అతడి చేతులు టెన్షన్ తో వణకటం కనిపిస్తుంది.
   
    అతడి చేతిలో వున్న కవరులో నిక్షిప్తమై వుంది ఒక అపురూపమైన విషయం.
   
    అది బయటపడిన మరుక్షణం యావత్ ప్రపంచం అతడికి నివాళులర్పిస్తుంది.
   
    ప్రొఫెసర్ వ్యాస్ మళ్ళీ అసహనంగా వాచీ చూసుకున్నాడు. ఐదున్నర అయింది. ఒక్కరొక్కరే లోపలికి వెళ్ళి వస్తున్నారు. విజిటర్స్ రూమ్ అది. వరుసగా కుర్చీలు వేసి వున్నాయి. అతడే చివరికి మిగిలేడు. అతడికి ఐదింటికి అప్పాయింట్ మెంట్ ఇవ్వబడింది.
   
    ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆఫీసులో విజిటర్స్ రూమ్ అది. రూమ్ లోపలి వెళుతున్న వాళ్ళు ప్రెసిడెంట్ ని కల్సుకోవటానికి వెళ్తున్నారు. వాళ్ళందరూ రెండు నెలల ముందే సరైన టైమ్ తో సహా అప్పాయింట్ మెంట్ తీసుకున్న వాళ్ళు ఒక్కొక్కరికీ ఐదూ.... పదీ.... పదిహేనూ యిలా అవసరాన్ని బట్టి సమయం కేటాయించబడింది.
   
    వ్యాస్ మాత్రం తను కనుక్కున్న విషయం, ఆ ఫార్ములా కాగితాల కాపీ, మాట్లాడవలసిన పని, వ్రాసి ఢిల్లీ పంపగానే పదిరోజుల్లో వచ్చి రాష్ట్రపతిని కలుసుకొమ్మని జవాబు వచ్చింది.
   
    అతడి ఫార్ములాని విదేశాలు తీసుకెళతాయనీ, గూఢచారులు వెంటబడ్తారనీ, ఇలాటి చౌకబారు డిటెక్టివ్ కథల భయం ఏమీ లేదు. మామూలుగానే ఢిల్లీ వచ్చాడు.
   
    ఇచ్చిన టైమ్ కి ప్రెసిడెంట్ భవనానికి వెళ్ళాడు. అక్కడ అతడి ఐడెంటిటీ పరిశీలించబడింది. ఇంకొద్ది క్షణాల్లో తనుప్రెసిడెంట్ ని కల్సుకోబోతున్నాను అన్న భావం అతడిలో టెన్షన్ని కలుగజేయటం లేదు. తను కనుక్కున్నది త్వరలో ప్రపం చానికి వెల్లడి కాబడ్తున్నది అన్న భావం మాత్రం అతడిలో వుద్వేగాన్ని కలగజేస్తున్నది.
   
    ఇంతలో పిలుపు రావటంతో అతడు ఆలోచన్ల నుంచి తేరుకొని లోపలి వెళ్ళాడు. లోపల సోఫాలో చాలా ఇన్ ఫార్మల్ గా కూర్చొని వున్నాడు ప్రెసిడెంట్. ప్రొఫెసర్ వ్యాస్ ని చూసి నవ్వి కూర్చోమన్నట్టు చేయి చూపించేడు.
   
    కొంచెం సేపు మామూలు సంభాషణా, పరిచయాలూ జరిగేక వ్యాస్ ముందుకు వంగి, "నేను.... నేను ఒక విషయాన్ని కనుగొన్నాను" అన్నాడు ఉపోద్గాతంగా అతడి కంఠం వణుకుతూంది.
   
    అయితే ప్రెసిడెంట్ మొహంలో ఆశించినంత ఉద్వేగం కనబడలేదు. కానీ, వ్యాస్ ఆతృత గమనించినట్టూ నవ్వి, "మీరు పంపించిన కాగితాలు మా వాళ్ళు చదివి వివరాలు వివరించారు ప్రొఫెసర్. నాకు కొద్దిగా విషయం తెలిసింది" అన్నాడు. "....మీరు మిగతా విషయాలు చెప్పండి-"
   
    వ్యాస్ గొంతు సవరించుకొని, "నికోటిన్" అన్నాడు. "చాలామంది శాస్త్రజ్ఞులు నికోటిన్ ని చాలా అపాయకరమైన వస్తువుగా భావిస్తారు. కానీ నికోటిన్, ఆల్కహాలు కొన్ని విపరీతమైన పరిస్థితుల్లో కలిస్తే ఒక రకమైన గ్లూకోజ్ తయారవుతుందని నేను కనుక్కున్నాను."
   
    "ఆ విషయం మీ రిపోర్టులో వ్రాసేరు."
   
    "ఆ గ్లూకోజ్ ఒక మాత్ర పరిమాణంలో తీసుకుంటే మనిషి శరీరంలోకి అది ప్రవేశించేక కోటింగ్ ఏర్పరుస్తూ పోతుంది. గుండె, కాలేయం, ఊపిరితిత్తులు ఒకటేమిటి అన్ని అంగాలకి అది భద్రత చేకూరుస్తుంది. బ్రతికినంత కాలమూ ఆ కోటింగ్ అలానే వుంటుంది. అంటే..... అంటే..... ఇక మనిషికి అనారోగ్యం అన్నదే వుండదన్న మాట. కేన్సర్, క్షయ, పక్షవాతం యిలాంటి రోగాల్ని మానవుడు మర్చిపోతాడు. చివరికి తలనొప్పి అంటేకూడా ఏమిటో వచ్చే తరానికి తెలీదు. ఆస్పత్రి అన్న పదం కేవలం డిక్షనరీల్లోనే మిగులుతుంది. ప్రతీ మనిషీ రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తాడు."
   
    ఈ మాటలు చెబ్తున్నప్పుడు వ్యాస్ మొహం ఒక రకమైన దీప్తితో వెలిగింది. ఎంతో శ్రమపడి ఒక గొప్ప విషయాన్ని కనుక్కున్నవాళ్ళు ఆ విజయం తాలూకు వివరాల్ని ప్రజల ముందు పెట్టి వారు సంభ్రమంతో దాన్ని ఆస్వాదించబోతుంటే వచ్చే ఆనందం అది. చాలా గొప్ప విజయం సాధించిన వాళ్ళకే దాంట్లో వుండే ఆనందం తెలుస్తుంది.
   
    వ్యాస్ చెప్పటం మొదలు పెట్టాడు- "ఈ విషయం కనుక్కున్న వెంటనే నేను దీన్ని వెల్లడించలేదు ప్రెసిడెంట్! రెండు సంవత్సరాలు ప్రయోగం చేసేను. ఆ ప్రయోగం ఎవరిమీదో కాదు, నా భార్య మీదే ఆమెకో టాబ్లెట్ ఇచ్చి పరిశీలిస్తూ వచ్చాను. ఏ దుష్పరిణామమూ కలగలేదు. అనుకున్నట్టే ఏ వ్యాధీ ఆమెను చేరలేకపోయింది. ఐస్ ముక్కలు తలమీద గంటలకొద్దీ వుంచినా జలుబు చేయలేదు. "-కాబట్టి ఇక మీరు చేయవలసిందల్లా ఒకటే. మాత్రని ప్రపంచానికి అందించటం.....నెలరోజుల్లో ప్రపంచంలోని ప్రతివ్యక్తీ ఈ మాత్రని ఒకదాన్ని వేసుకునే ఏర్పాటు చేయటం- అంతే."
   
    అమరత్వం సిద్దించిన ఋషిలా సంతృప్తితో వెలిగిపోతున్న వ్యాస్ మొహం లోకి ప్రెసిడెంట్ నిర్లిప్తంగా చూసేడు.
   
    "ఇదంత సులభం అని ఎందుకనుకుంటున్నారు మిస్టర్ వ్యాస్." తాపీగా అడిగిన ప్రశ్నకి ఉలిక్కిపడ్డాడు వ్యాస్.
   
    "ఏమిటి....ఏమిటంటున్నారు మీరు?"
   
    "చాలా గొప్ప విషయాన్ని ప్రపంచంలో ఏ శాస్త్రజ్ఞుడూ కనుక్కోలేని విషయాన్ని మీరు కనుక్కున్నారు. మీకు నా అభినందనలు" అంటూ పక్కనున్న ఫైలు తీసుకున్నాడు ప్రెసిడెంట్ తీసుకుంటూ అన్నాడు-"మీ పరిశోధన తాలూకు వివరాలు అందగానే నేను కొన్ని వివరాలు అధికారులనుంచి తెప్పించాను ఇవిగో అవి" అంటూ కాగితాలు పరిశీలిస్తూ అన్నాడు.
   
    "మన దేశంలో వున్న ఆస్పత్రులు దాదాపు పదిమిలియన్లు యాభైలక్షల మందికన్నా ఎక్కువ డాక్టర్లున్నారు. వీరుకాక ఆరెమ్పీలూ, హోమియోపతి వగైరా. ప్రొఫెసర్ వ్యాస్! నెలరోజుల తర్వాత వీళ్ళందరూ ఏం చెయ్యాలి?"

 Previous Page Next Page