Previous Page Next Page 
ఆఖరి పోరాటం పేజి 7


    అప్పుడు వినపడింది వెనుకనుంచి నెమ్మదిగా, స్థిరంగా - ఒక కంఠం. ".... కుమారి కాలి కాపాలి కపిలే, కృష్ణపింగళే, బాగున్నావా బాలికా?"

    నడుస్తున్న కారులో అంత చీకట్లో, అంత దగ్గర్నుంచి చెవిపక్కగా వినపడిన ఆ స్వరానికి ప్రవల్లిక అదిరిపడి వెనక్కి తిరిగి చూసింది.

    వెనుక సీట్లో అనంతానంతస్వామి కూర్చుని వున్నాడు.

    ఆమె సడెన్ గా వేసిన బ్రేకుకి కారు కీచుమని ఆగింది. అతడు తాపీగా వచ్చి ముందు సీట్లో కూర్చునే వరకూ ఆమె ఈ లోకంలోకి రాలేకపోయింది.

    "తలుపులు నాలుగూ తాళంవేసి వున్న కారులోకి ఈయన ఎలా వచ్చాడా అనుకుంటున్నావా అమ్మా!"

    "నీ గురించి ఆలోచన్లలో కూడా నేను బహువచనంలో ఆలోచించను" కసిగా అంది.

    స్వామి నవ్వేడు. "అయితే మనం ముఖాముఖమే మాట్లాడుకోవచ్చు" అని ఆగి అన్నాడు-"..... ఇది గవర్నమెంట్ కారు. దీని తలుపులు తీయటానికి నేనేమీ దొంగతాళం చేతులు ఉపయోగించలేదు. ఈ కారు నీకు అలాట్ చేసినప్పుడు దీని తాలూకు డూప్లికేట్ తాళాలు మీ స్టోర్ లో పెడతారు. వాటిని మీ ఆఫీసు వారి ద్వారానే సంపాదించి వచ్చి ఇందులో కూర్చున్నాను. ఇప్పుడు చెప్పు నాకున్న పలుకుబడి సామాన్యమైనదంటావా?"

    ఆమె అప్రతిభురాలై అప్రయత్నంగా "కాదు" అంది.

    "ఒప్పుకున్నావ్ కదా! నేను చెప్పేది ఏమిటంటే.... చిన్నపిల్లవి, అనవసరంగా ఈ విషయాల్లో జోక్యం చేసుకోకు. నా కూతురిలా కనిపిస్తున్నావు. అఫ్ కోర్స్ నాకు పెళ్ళి కాలేదనుకో! కానీ మరీ పిచ్చుకమీద బ్రహ్మాస్త్రం ఎందుకు అని.... నువ్వేమిటి! ఐపియస్సా....? డైరెక్టు రిక్రూటా?"

    ఆమె సమాధానం చెప్పలేదు.

    "యస్యాంతఃకరణం నిత్యం గీతాయాం రమతే.... ఏమిటి మొన్న మీటింగ్ లో నా గురించి ఏదో చెప్పావుట....."

    ఆమెకి సింకింగ్ ఫీలింగ్ కలిగింది. సి.బి.ఐ. అంటే ఎంతో జాగ్రత్తగా పటిష్టంగా వుండవలసిన డిపార్ట్ మెంట్. అటువంటి దాన్లోనే అరవై గంటల్లోగా రహస్యాలు బయటకు పోతున్నాయంటే, మైగాడ్.... ఈ దేశాన్ని ఎవరూ బాగుచేయగలరు?

    ఆమె ఒక నిర్ణయానికి వచ్చినట్లు - కారు డ్రైవ్ చేస్తూనే, "అవును చెప్పాను. అంతేకాదు, నిన్న రవీంద్ర కళాక్షేత్ర సంఘటన వెనుక వున్నది కూడా నువ్వే అని నాకు తెలుసు. నీ మనిషి లాకప్ లో వున్నాడు. ఈ రోజు కాకపోయినా రేపయినా అతడు నోరు విప్పుతాడు."

    "నేను ఇప్పుడు నిన్ను కలుసుకున్నది అందుకే నమ్మా! జాతస్య హి ధృవో మృత్యుః, ఏ దృష్టితో చూసినా మృత్యువు దుఃఖ హేతువు కాకూడదన్నారు. ఈ అనంతానంతస్వామి గురించి నీకు ఏమీ తెలియదు. కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకూ వేళ్ళు పాతుకుపోయిన మర్రి చెట్టు ఇది. దీని నీడలో ఆశ్రయం పొందటం నీకు శ్రేయస్కరం".

    "లేకపోతే ఏం చేస్తావ్? ప్రాణాలు తీస్తావ్, అంతేగా!"

    "అది సామాన్యులు చేసే పని. నేను చేయలేనిదంటూ ఏమీ లేదు. ఉదాహరణకి నువ్వు ఐ.పి.ఎస్. అనుకో, నువ్వు ఏ సంవత్సరం మార్కుల్లో కుంభకోణం జరిగినట్లు నిరూపిస్తాను. ఇన్నాళ్ళు చేసిన ఉద్యోగం పోయి, డిగ్రీ పోయి, రోడ్డుమీద నిలబడటం కన్నా నరకం ఏమయినా వుంటుందా?" అంటూ అతడు నవ్వి - తిరిగి అన్నాడు. "చేయని నేరం మోపి ఉద్యోగాన్నించి సస్పెండ్ చేయించడం- దగ్గర వారిని బంధించి ఇరుకున పెట్టడం - ఇవన్నీ చాలా పాత పద్ధతులు - ఇన్నాళ్ళు కష్టపడి చదివిన చదువుకీ, అసలు డిగ్రీయే పూర్తిగా పోయి, కట్టుబట్టలతో నిలబడవలసివస్తే అంతకన్నా నరకం ఇంకొకటి వుంటుందా?"

    చాలాసేపటి తరువాత ఆమె నవ్వింది. "అలా నిలబడవలసి వస్తే నీ ఆశ్రమానికే వస్తాను. నువ్వు భజనచేస్తూ ఉంటావు. హాలు మధ్యలో నిలబడి నిన్ను కాల్చేసి జైలుకి వెళ్ళిపోతాను. ఈ ముగింపు బావుందా నీకు?"

    "ఫర్వాలేదు. నాకు సమఉజ్జీవి దొరికావు. నిన్ను ఆగిపోయిన నాటకం ఏమిటి? 'ఆఖరి పోరాటం' కదూ..... మంచి టైటిలు".

    ఒక కారు ఆమె కారుని దాటి ముందుకు సాగింది. ఆ తరువాత రెండు మోటారుసైకిళ్ళు, ఆ తరువాత మరో రెండు కార్లు, వాటి వెనుక 'ఆడీ'. 

    అతడు సడెన్ గా సీరియస్ అయ్యాడు. "ఈ దేశపు సగంమంది పౌరులు నా భక్తులు. సగంమంది రాజకీయ నాయకులకు నేను ఆరాధ్యదైవాన్ని. సగంమంది వ్యాపారవేత్తల దగ్గిర నా ఫైనాన్స్ స్ వున్నాయి. ఈ రోజు ఇలా జరిగిందని నువ్వు చెప్పినా ఎవరూ నమ్మరు. అసలు నేనిలా ఇంగ్లీషులో అప్పుడప్పుడు మాట్లాడతానని నువ్వు అన్నా - దె డోన్ట్ బిలీవ్ ఇట్......"

    "ఇంకో రెండ్రోజులు ఆగు, లాకప్ లో వున్న మనిషి నోరు విప్పనీ-"

    ఎందుకో తెలీదు కానీ అనంతానంతస్వామి బిగ్గరగా నవ్వేడు. తమతోపాటు వస్తున్న ఆడీ కారు మరింత పక్కగా రావటంతో ఆమె బలవంతంగా తన కారు పక్కగా తీసి ఆపు చేయవలసి వచ్చింది. ఆ కారులోంచి ఒక వ్యక్తి దిగి, ఆమె కారు దగ్గిరగా వచ్చి నమ్రతగా డోర్ తీసి పట్టుకున్నాడు. స్వామి కారు దిగి వెళ్ళొస్తాను. అన్నట్టు ఆ లాకప్ లో వున్న వ్యక్తుల మార్పిడి ఎప్పుడో జరిగిపోయింది. ఒక తాగుబోతుకి బాగా పోయిస్తే పాపం వెళ్ళి జైల్లో కూర్చున్నాడు. నిన్న నువ్వు అరెస్ట్ చేసిన వ్యక్తి..... A-2 ఇడుగో ఇతనే" అన్నాడు.

    ప్రవల్లిక దిగ్భ్రాంతురాలైంది. తన కళ్ళే తనని మోసం చేస్తున్నాయా అనిపించింది. కారు డోర్ తీసిన వ్యక్తే నిన్న తమ అరెస్టు చేసిన వ్యక్తి. స్వామితో పాటు వెళ్ళిపోతున్నాడు.

    ఆమె రివాల్వర్ తీయబోయింది.

    అనవసరం.....

    నిన్న తాము అరెస్ట్ చేసినది ఇతడినే అని నిరూపించలేదు. లాకప్ బ్రద్ధలు కొడితే కేసుపెట్టి ఇన్వెస్టిగేషన్ చెయ్యవచ్చు. కానీ రికార్డులు రికార్డులాగే వుంటే తనేం చేయగలదు?  లాకప్ లో వున్న వ్యక్తి పది రూపాయలకు దేన్నైనా వప్పుకుంటాడు. A-2 బదులు జీవితాంతం జైల్లో వుండమన్నా వుంటాడు. ఇటువంటి ప్రజలున్న దేశంలో చట్టం నాలుగు పాదాలమీద ధర్మాన్ని ఎలా నిలబెడుతుంది? తన డిపార్ట్ మెంట్ లోనే కనీసం నలుగురైదుగురి సాయమన్నా లేకపోయివుంటే ఇది సాధ్యపడి వుండేదా? ఈ పరిస్థితుల్లో తనేం చేయగలదు?

    కారు దగ్గిర నిలబడి A-2 స్నేహపురస్కరంగా చెయ్యివూపాడు. అతడి మొహంమీద కదలాడే ఎగతాళి చిరునవ్వు లైటు వెలుతురులో ఇంత దూరం కనపడుతూంది.

    అనంతానంతస్వామి ఎక్కగానే కారు కదిలింది.


                         *    *    *


    "లేదు- నాన్నా. నేనీ వృత్తిలో కొనసాగలేను" నిస్పృహగా తలాడిస్తూ అన్నది ఆమె. అతడు కూతురివైపు సానుభూతితో చూశాడు.

    "ఎవరు నీతికి నిలబడేవాళ్ళో - ఎవరు అవినీతిపరులో తెలియటం లేదు. ప్రాణాలకు తెగించి ఒక టెర్రరిస్టుని పట్టుకుంటే ఇరవై నాలుగు గంటలు తిరిగేలోగా అతడి స్థానంలో మరో అమాయకుడు లాకప్ లో వుంటాడు. రికార్డు సరిగ్గానే వుంటుంది. సమాఖ్య సరిగ్గానే వుంటుంది. ప్రత్యర్ధుల ఎగతాళి చిరునవ్వే చివరికి మిగులుతుంది".

    "ఆ ఇన్ స్పెక్టర్....."

    "చాలా నిజాయితీపరుడు నాన్నా. నేను ముందే వాకబు చేశాను. అతడిని సస్పెండు చేయించటం కూడా వాళ్ళ ఎత్తులో ఒక భాగం అనుకుంటాను".

    "వాళ్ళు చాలా తెలివైన వాళ్ళలా వున్నారే".

    "తెలివా.... తెలివా..... ఆ అనంతానంతస్వామి చూస్తే అప్పుడే గుడిలో అలంకరించబడిన దివ్యమంగళ విగ్రహంలా వుంటాడు. స్మగ్లింగ్ కి స్పెల్లింగే తెలియనివాడిలా వుంటాడు. వాడి కోసం కాదు నాన్నా నా బాధ. అతడికి సాయంచేస్తున్న మా అధికారుల మీదే నా కోపమంతా! దేశం కుళ్ళిపోతోంది."

    "ఇరవై సంవత్సరాల క్రితం చైనీస్ సరిహద్దుల్లో ప్రాణాలకి తెగించి పోరాడుతున్నప్పుడు కూడా మాకీ విషయం తెలుసమ్మా. కానీ దేశాన్ని రక్షించడంలో ఏ నిర్లక్ష్యమూ చేయలేదే మేము..... ఈ స్వార్ధపరుల ఇనప్పెట్టెలు రక్షించటానికి అక్కడ చలిలో పోరాడుతున్నామనుకోలేదే. ప్రజలకన్నా దేశం ముఖ్యం. దేశం కన్నా లక్ష్యం ముఖ్యం" అంటూ ఆయన దగ్గరగా వచ్చి- "చాలా చిన్న వయసులో పెద్ద స్థానాన్ని సంపాదించగలిగావు. సినిక్ లా మారకు" అని వెళ్ళిపోయాడు.

    ఆయన వెళ్ళిపోయాక ఆమె డైరీలో వ్రాసుకుంది.

    "నేను సినిక్ గా మారటంలేదు. కానీ ఈ బరువులూ బాధ్యతలూ నా మనసు స్వీకరించడంలేదు. ఒక పల్లెటూళ్ళో పైరుగాలిలో పొలాల పక్కన నిశ్చింతగా అల్లరిచేస్తూ బ్రతికెయ్యాలని నా మనసు ఉవ్విళ్ళూరుతోంది. ఈ పదవీ, ఈ కృత్రిమత్వమూ, ఎత్తులకి పై ఎత్తులూ - అన్నీ నా లేలేత ఉత్సాహాన్ని పీల్చి పిప్పి చేస్తున్నాయి. నాన్న అన్నట్లు ఇదంతా అదృష్టమే అయితే ఇంత అదృష్టం నాకొద్దు. చదువూ, తెలివితేటలు, హోదా, ఆస్థి- ఇవన్నీ వరాలయితే వాటన్నిటికన్నా మించింది 'ఆనందం'. అది లేకపోయాక ఇవన్నీ ఎందుకు? ఇంత చిన్న వయస్సులోనే ఎవరిమీద ఏ హత్యాప్రయత్నం జరుగుతుందా అని, ఏ రాజకీయ పార్టీని ఎవరు పాలదొయ్యటానికి ప్రయత్నిస్తున్నారా అని పరిశోధనలు జరపవలసి రావటం- దురదృష్టం కాక మరేమిటి? నా కిక్కడినుంచి పారిపోవాలని వుంది. ఏ కొండల మధ్యకో, సెలయేటి తీరాల్లోకో.... ఇక్కడ వుంటే మాత్రం త్వరలో నేనో స్కిజోఫ్రెనియా రోగిగా మారటం ఖాయం. నా మనసు నా ప్రతీ చర్యనీ వ్యతిరేకిస్తోంది. ముఖ్యంగా నా కళ్ళజోడుని బ్రద్ధలు కొట్టేయ్యాలి. ప్రస్తుతం అదే నా అబ్సెషన్. భగవంతుడా! నా తెలివితేటల్ని కావాలంటే కాసింత వెనక్కి తీసుకో. నాకు నచ్చేలా బ్రతికే అవకాశం నాకు వీలైనంత తొందరలో ఇవ్వు. నా గమ్యానికి నన్ను తొందరగా చేర్చు.

    I want two hands
    between which
    I can sleep without dreams......
    As life itself would
    then be a dream.....


                               5


    "జాగ్రత్తగా వెళ్ళు. ఒకవేళ బస్సు తొందరగా వస్తే మాత్రం ఇక్కడే వుండు. కాలేజీ నుంచి వచ్చి నేను ఇక్కణ్ణుంచి ఇంటికి తీసుకువెళ్తాను" అంది సునాదమాల.

    "నేను కాదు. ఒకవేళ నువ్వే కాలేజీ నుంచి తొందరగా వస్తే భయపడకుండా ఇక్కడే ఉండు. సరిగ్గా నాలుగింటికి స్కూల్ బస్ లో నేనిక్కడ దిగుతాను" అన్నాడు విష్ణు.

    "వేలెడంత లేవు వెధవా, నువ్వు నాకు ధైర్యం చెబుతున్నావా?" కోప్పడింది సునాదమాల. విష్ణు నవ్వేడు. వాడు ఆరో క్లాసు చదువుతున్నాడు. ప్రతిరోజూ స్కూలు మినీ బస్సు వచ్చి తీసుకు వెళుతుంది. సునాదమాలే వాడికి తల్లి, అక్క, గురువు, ఫ్రెండు వగైరా. మరోరకంగా సునాదకి వాడు బాడీగార్డు. వీధి మొదలు మెయిన్ రోడ్డులో బస్సు ఎక్కిస్తుంది. ప్రతిరోజూ అక్కణ్ణుంచి తను కాలేజీకి వెళుతుంది. ఇదీ దినచర్య.

    వీధి పెద్ద రష్ గా లేదు. కానీ దారినపోయే ప్రతివారూ, ముఖ్యంగా స్త్రీలు ఆమెని పరకాయించి చూస్తున్నారు. అందమైన స్త్రీలని పురుషుల కన్నా ఎక్కువగా స్త్రీలే చూస్తారని ఆమెకి అనుభవం చెప్పింది.

 Previous Page Next Page