చంద్రం ఆశ్చర్యంగా చూసి "ఏం" అన్నాడు.
"ఏం లేదు".
చంద్రం కుర్చీలోంచి లేస్తూ "కొంచెంసేపు ఛాయానట్ వినిపించు" అన్నాడు.
"ఇప్పుడు మూడ్ లేదు."
చంద్రం కుర్చీలోంచి లేస్తూ ఆశ్చర్యంగా "అదేమిటి? ఎప్పుడూ నాకన్నా ముందే మొదలుపెట్టేవాడివి, ఇప్పుడు వద్దంటున్నావు" అన్నాడు.
"ఇప్పుడు మూడ్ లేదు."
"మూడ్ బాగా లేనప్పుడే ఛాయానట్ వాయించాలి."
మిత్ర ముఖం బాధగా పెట్టి "నిస్సత్తువ- కుడిచేతిలో సత్తువస్సల్లేదు" అన్నాడు.
చంద్రం అతడివైపు తేరిపార చూసి "ఆరోగ్యం బానేవుంది కదా" అన్నాడు. "లేదా.... నువ్వు ఇంట్లో వుండిపోతానంటే మేం కాన్సిల్ చేసుకుంటాం."
"బా.... బానే వుంది ఆరోగ్యం."
"అయిదు నిమిషాలు వాయించు. రికార్డు చేద్దాం" టేబుల్ లైటు పక్కకి జరపబోయేడు.
మిత్ర వెన్నులో చలి మొదలైంది. "లేదు లేదు" అన్నాడు కంగారుగా. "నేను మూడ్ లోకి వెళ్ళిపోతే కష్టం. ఇక అది ఆగదు.
"ఆగకపోతే ఏం...."
"నీ గర్ల్ ఫ్రెండ్ వచ్చేస్తుంది."
"రానీ. తనూ వింటుంది."
శంభు మరింత కంగారుపడి- "వద్దొద్దు. వెళ్తాను" అన్నాడు.
"ఎక్కడికి?"
"సైకియాట్రిస్ట్ దగ్గిరకి".
"సైకియాట్రిస్ట్....?" అర్ధంకానట్టూ అడిగేడు.
శంభు నవ్వి - మొన్న ట్రెయిన్ లో పరిచయమయ్యేడు వరాహన్. ప్రొఫెసర్ వరాహన్ అని" అన్నాడు. ఖాళీగా వున్నప్పుడు 'టీ'కి రమ్మన్నాడు.
"గుడ్" అన్నాడు చంద్రం. "తొందరగా వచ్చెయ్యి. ఆ అమ్మాయీ నేను మొదటిసారి ఏం మాట్లాడుకున్నామో అన్నీ చెప్తాను" నవ్వేడు.
నువ్వెందుకు చెప్పటం. ప్రతీమాటా అక్షరం పొల్లుపోకుండా నాకు తెలుస్తుంది అనుకుంటూ లేచి "నేను వెళుతున్నాను" అన్నాడు.
చంద్రం వాచీ చూసుకుని, "మంచిది. ఆ అమ్మాయి వచ్చే టైమ్ కూడా అయింది" అన్నాడు.
"సరీగ్గా ఎనిమిదిన్నర కొస్తాను!"
"దట్స్ గుడ్"
"ఫాన్ వెయ్యనా? ఉక్కగా లేదూ-" అంటూ సమాధానం కోసం చూడకుండా వేసి, దాంతోపాటే ఉంగరపు వేల్తో టేపు స్విచ్ నొక్కాడు. టేపు కదిలిన చప్పుడు వినిపించింది. తేలిగ్గా వూపిరి పీల్చుకున్నాడు. పేపర్ల కట్ట స్పూల్ కి అడ్డుపడలేదన్నమాట.
"చలిపెడ్తూంటే ఫాన్ ఏమిటీ" అన్నాడు చంద్రం విచిత్రంగా చూస్తూ.
మొహంలో ఏ భావమూ లేకుండా "వద్దా" అని స్విచ్ ఆఫ్ చేసి "వెళ్ళొస్తాను" అన్నాడు మామూలుగా కనపడటానికి ప్రయత్నిస్తూ.
"మిత్రా"
ఆగేడు.
"థాంక్స్, థాంక్స్ బ్రదర్. అండ్ సారీ ఆల్సో."
"నో, నో బెస్ట్ ఆఫ్ లక్."
చంద్రం మెట్లమీద నిలబడి వున్నాడు. మిత్ర ఏభై గజాలు నడిచి మలుపు తిరగబోతూ వెనక్కి తిరిగి చూసేడు.
ఎర్రచీరె కట్టుకున్న ఒక అమ్మాయి తన ఇంట్లోకి ప్రవేశించబోతూ వుంది.
4
ప్రొఫెసర్ వరాహన్.
విజిటర్స్ రూంలో కూర్చుని శంభుమిత్ర లోపలికి కార్డు పంపించేడు. వెంటనే లోపలికి రమ్మని కబురొచ్చింది.
ఎదుటి చైర్లో వరాహన్ కూర్చొని వున్నాడు. తెల్లటి గడ్డం. కోటు.... రూమ్ నీటుగా వుంది. అతడికి ఏభై అయిదేళ్లుంటాయి. మాటిమాటికీ కళ్ళు చికిలించటం అలవాటు.
"కమాన్ కమాన్" అన్నాడు వరాహన్ చెయ్యి అందిస్తూ. అతని మొహంలో మిత్రని చూసిన సంతోషం కొట్టొచ్చినట్టు కనబడుతోంది.
"విజిటింగ్ కార్డులూ, అప్పాయింట్ మెంట్లూ పేషెంట్లకి. నువ్వు సరాసరి లోపలికి వచ్చెయ్యాల్సింది."
"ఇట్సాల్ రైట్ సర్."
"అదిగో.... ఆ సర్ అన్న పదం తీసెయ్యి. మనం స్నేహితులం" నవ్వేడు మిత్రకూడా నవ్వి వూరుకొన్నాడు.
రెండేళ్ళ క్రితం ట్రైన్ లో ప్రయాణం చేస్తూండగా, కూపేలో వరాహన్ పర్స్ పోవటం, టికెట్ అందులో వుండటం, సమయానికి మిత్ర సాయం చేయటం జరిగింది.
"అప్పట్నుంచీ నువ్వు వస్తావనే చూస్తున్నాను".
"కొంచెం పనుండీ" నసిగేడు.
"ఆ రోజు నువ్వు చేసిన సాయానికి మరోసారి కృతజ్ఞతలు."
మిత్ర మొహమాటంగా నవ్వేడు.
ఒక పావుగంటసేపు అన్ని విషయాల మీదా సంభాషణ జరిగింది.
ఈ లోపులో బోయ్ కాఫీ తెచ్చి ఇచ్చేడు.
"సైకియాట్రిస్టుగా మీరేం చేస్తూ వుంటారు."
"నట్స్ ని పరీక్షించి ట్రీట్ చేస్తూ వుంటాను."
"నట్ అంటే!" కాఫీ సిప్ చేస్తూ అడిగేడు.
"మెదడులో స్క్రూలూజు అయినవాళ్ళు" నవ్వేడు.
మిత్ర కూడా నవ్వి.... "మతిస్థిమితం లేనివాళ్ళూ, మానసిక వ్యాధుల్తో బాధపడే వాళ్ళూ.... వీళ్ళనే కాకుండా సున్నితమైన విషయాల్ని కూడా మీరు డీల్ చేస్తారా...." అడిగేడు.
"సున్నితమైన విషయాలంటే?"
మిత్ర ముందుకు వంగి, "నా స్నేహితుడు ఒకతను వున్నాడు" అన్నాడు.
"ఇక్కడ కొచ్చినవాళ్ళు ప్రతివాళ్ళూ 'నా స్నేహితుడు' అని మొదలుపెట్టి తమ సమస్యల గురించి చెబుతారు. మీకలాటి అనుమానాలేమీ వద్దు. మీ గురించి మామూలుగా చెప్పెయ్యండి."
మిత్ర పెద్ద దెబ్బ తిన్నట్టు ఓ క్షణం గుక్క తిప్పుకోలేక పోయేడు. తలెత్తి ప్రొఫెసర్ వైపు చూసేడు. ఆయన స్నేహపూర్వకంగా నవ్వేడు. మిత్ర కూడా నవ్వి "నా సమస్యే"
"ఏమిటి సమస్య?"
గదిలో గడియారం టిక్ టిక్ మంటోంది. గాలి వీచినప్పుడల్లా తెర అల్లలాడుతుంది. అతని వేళ్ళమధ్య పేపర్ వెయిట్ తిరుగుతూంది.
"నా సమస్య ఆడపిల్లలతో మాట్లాడటం."
డాక్టర్ ఉలిక్కిపడి "ఏమిటీ?" అన్నాడు.
సిగరెట్ చివర టేబిల్ మీద అదిరిపడింది. కిటికీ తెరకూడా వూగతం మానేసింది. ఫోటోలో నెహ్రూగారు గాంధీగారివైపు తిరిగి నవ్వుతున్నారు.
"మాట్లాడటం.... ఆడపిల్లల్తో మాట్లాడటం."
క్షణంలో ప్రొఫెసర్ సర్దుకున్నాడు.
"మీకు చెల్లెళ్ళున్నారా?" నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అడిగేడు.
"లేరు."
"తల్లి?"
"లేదు."
"మీ ఇంట్లో ఎవరెవరుంటారు?"
"నేనూ. మా వంటవాడు."
"వంటవాడు మగవాడేనా?"
"వంట- వాడు మొగవాడే"
"మీ నాన్నగారు?"
"కలకత్తాలో"
"మీకెంత అమ్మాయిల్తో పరిచయం వుంది?"
"అస్సల్లేరు"
"అయితే మీరు భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నారు."
"ఏమిటి?"
"నింఫొ ఫోబియో."
మిత్ర ఉలిక్కిపడ్డాడు. అతడి మొహం భయంతో పాలిపోయింది.
"చాలా పెద్ద వ్యాధా అది-" అన్నాడు. పేరునుబట్టి పెద్దదిలాగే వుంది.
"ఫర్లేదు. నేను కుదురుస్తాను."
"ఎలా...."
"నా నర్సు మిమ్మల్ని ట్రీట్ చేస్తుంది. అమ్మాయిలంటే భయం పోగొడుతుంది.
"నాకాడవాళ్ళంటే భయంలేదు" ఆయన మాటల్ని మధ్యలో కట్ చేస్తూ అన్నాడు మిత్ర. "కేవలం నా సమస్య ఆడవాళ్ళతో మాట్లాడటం. అంతే. భయం అని నేననుకోను."
"మీరిప్పటివరకూ మీ జీవితంలో మాట్లాడిన ఆడపిల్ల లెవరెవరు?"
"నా సెక్రటరీ రీనా, ఏడోక్లాసు చదువుతున్నప్పుడు మా టీచర్! అంతే"
అంతేనా.....
మిత్ర క్షణం ఆలోచించి- "ఆ, ఇంకొకరు" అన్నాడు.
ప్రొఫెసర్ ఆసక్తిగా కుర్చీలో ముందుకి వంగి "చెప్పు .... చెప్పు.... ఎవరు?" అన్నాడు.
"మా ఇల్లూడ్చేపిల్ల ఎంకి"
ప్రొఫెసర్ నిరాశగా వెనక్కి వాలేడు. "వీళ్ళతో ఏం భయమూ లేకుండా మాట్లాడతారా మీరు?"
"అహ"
"వాళ్ళకీ మీకూ మధ్యనున్నది బిజినెస్. అందువల్ల మీరు వారితో మాట్లాడగలుగుతున్నారు."
"నా సమస్య అదే. మామూలుగా మాట్లాడగలను. కానీ ఒక అమ్మాయితో సరదాగా మాట్లాడి -నవ్వించి - ఇంప్రెస్ చేయటం ఎలాగో తెలియటం లేదు. అసలేం మాట్లాడాలో కూడా అర్ధంకాలేదు."
"అంటే - మాట్లాడబోతే మాటలు రావా?"
"వస్తాయి. కానీ ఒక టాపిక్ గురించి ఎత్తుకోబోతే ఇంకో టాపిక్ ముఖ్యంగా తోస్తుంది. ఈ రెంటిలో ఏది మాట్లాడితే అమ్మాయికి నచ్చుతుందో ఆలోచించేలోపులో మూడో విషయం వచ్చి అందులో చేరుతుంది. ఈ గందరగోళంలో సమయం అంతా గడిచిపోతుంది. 'చెప్పండి.... ఏం చెప్పను.... మాట్లాడండి.... ఏం మాట్లాడను?' ఇలాంటి మాటల్తో ఆ అమ్మాయికి పూర్తిగా నామీద ఇంట్రెస్టు పోతుంది. నా తోటివాళ్ళంతా తుళ్ళుతూ నవ్వుతూ మాటలాడుకుంటుంటే నేనేమో వెధవలా నిలబడి చూస్తూ వుండిపోవాల్సి వస్తూంది."