Previous Page Next Page 
బ్లాక్ మాంబా పేజి 7


    ఇది జరిగిన మరో పదిహేను నిమిషాలకి...

    బాగా రద్దీగా ఉన్న చిక్కడపల్లిలోని ఓ గుడిలో దేవుణ్ణి దర్శించాలని వచ్చిన వందల కొద్దీ భక్తులు కకావికలై పరుగెత్తారు గర్భగుడి ముందునుంచి. అక్కడ అంతసేపూ క్యూలో నిలబడ్డ ఓ భక్తుడు చేతిలోని చిన్న సంచిని తెరిచి రెండు మిన్నాగుల్ని వదిలిపెట్టిన విషయం ఎవరూ గుర్తించలేదు.

    ధూపదీప నైవేద్యాలతో తనను నమ్మిన దీన జనుల స్తోత్రాలతో పరవశించిన ఆ దేవుడు అర నిముషంలో అనాధగా మారిపోయాడు.

    తొక్కిసలాటలో మిన్నాగు కాటుకి బలైన కొందరి ఆర్తిని అర్ధం చేసుకోలేక ఆర్తత్రాణపరాయణుడన్న తన కీర్తికే కళంకాన్ని తెచ్చుకున్నాడు.

    రాయిగా వున్న దేవుడు రాడని తెలిసిన ప్రత్యర్ధి ఇంత స్వల్ప వ్యవధిలో ఇలా మరో సవాల్ ని విసురుతాడని పోలీసులు ఊహించలేకపోయారు. ప్రత్యర్ధి తన శక్తితో పోలీసు బలగాన్ని సైతం వణికించిన చివరి సంఘటన అదే...ప్రమాదం ఏ మూలపొంచి వుందో తెలీని జంటనగరాల్లోని ప్రజల నిద్రలేని రాత్రులకి అదే తొలి కాళరాత్రిగా కూడా అయ్యింది.


                                                           *    *    *    *


    చీకటి కడుపు కోతలో మెలిగే అమ్మ పెనుగులాటలా సిటీనంతా కప్పింది. వెలుగు నింపాలని ప్రయత్నించే విద్యుద్దీపాలు శవాల తలల ముందుంచిన ప్రమిదల్లా ఊపిరిని కోల్పోతున్నాయి. దేవుని గుడిలో బడిలో మనుషుల గుండెల్లో జడిగా మొదలై అలజడిగా మారి ప్రాచీన ఆటవిక స్మృతుల చప్పుళ్ళతో అంతటా ఆందోళన పరుచుకున్న ఆ నిశిరాత్రి వేళ...

    అంతవరకూ ఇంటికి మరలిరాని డాక్టర్ సంఘమిత్ర కోసమే కాకుండా జంటనగరాలను కుదిపేస్తున్న సంఘటనలణు గురించి తెలుసుకుని అసహనంగా నలిగిపోతూంది డాక్టర్ శృతి.

    ఇదే సరిగ్గా ఇలాంటి స్థితి నుంచి మనిషిని రక్షించాలనే ఆయన అహోరాత్రులూ శ్రమించింది కూడా...

    అదిగో సరిగ్గా అప్పుడు ద్వారం తెరిచిన చప్పుడైంది.

    ఉలికిపాటుగా కిటికీ దగ్గరనుంచి వెనక్కు తిరిగిన శృతి ముందు అవాక్కయింది. ఎదురుగా నిలబడ్డ జయేంద్రను చూసి...

    "మీరు..." ఆమె మాటలింకా పూర్తికాకముందే అతను తలుపు గడియపెట్టాడు.

    తను ఇప్పుడు ఓ ఆపదలో చిక్కుకున్నానని తెలుసుకోవడానికి ఆమెకు ఎక్కువసేపు పట్టలేదు...

    "ఎందుకొచ్చావిలా..." ఒక ఒంటరి ఆడపిల్ల గదిలోకి రావడమేగాక అలా గడియపెట్టిన జయేంద్రని ఉక్రోషంగా చూసింది. అతడు నెమ్మదిగా ముందుగా నడుస్తున్నాడు.

    "నిన్నే..." రెట్టించింది గొంతు రుద్దమవుతుంటే.

    "నాకు మంచి చేసావుగా శృతీ...సరిగ్గా అలాంటి మంచే నీకూ చేయాలని ఇలా వచ్చాను..." నవ్వుతున్నాడు. ఆ నవ్వు చూస్తుంటే అతడో ఉన్మాదిలా అనిపించింది.

    "ఆగక్కడ" అరిచింది తొట్రుపాటుగా "ఏం ఆశించి నా దగ్గరికి వచ్చావు."

    "ఒక పాముని రెచ్చగొడితే ఏమవుతుంది. కాటేస్తుంది... గాయం చేసి వదిలేస్తే ఏం జరుగుతుంది, పగబడుతుంది"

    "ట్రిష్" పాము పగపడుతుందన్న స్టేట్ మెంట్ టాక్సికాలజీలో నిపుణురాలిగా ఆమె అంగీకరించని విషయం. "మర్యాదగా బయటికి నడు."

    "ఓ కాటేసి చూద్దామని" అప్పటికే ఆమెను సమీపించాడు జయేంద్ర. "బహుశా నీ అనుభవం పాము విషంలోని టాక్సిన్స్ గురించి తెలియచేసి వుంటుంది శృతీ...ఇప్పుడు యీ అనుభవం మందే తెలియని కాటు గురించి నీకు స్పష్టంగా తెలియజేస్తుంది..." 

    ఆ వ్యక్తి ఇప్పుడేం చేస్తాడో ఆమెకు తెలీదు. తప్పించుకోవాలనుకుంది... కొద్దిగా పక్కకు జరిగింది కూడా.

    కానీ అప్పటికే ఆలస్యమైంది.


                        *    *    *    *


    ఇప్పుడు శృతి చేయి జయేంద్ర పడికిలిలో వుంది.

    ఒక అందమైన అమ్మాయి చేతిని పట్టుకున్నప్పుడు ప్రతి అబ్బాయి కొద్దిపాటి లాలిత్యాన్ని ఖచ్చితంగా ప్రదర్శిస్తాడన్న నమ్మకం ఆమెలో ఏ కోశాన ఉన్నా అది నిజం కాదన్నంత గట్టిగా నలిగిపోతోందామె కుడిచేయి. అదికూడా కాదు...ఇప్పుడు జయేంద్ర కళ్ళలో పాములమధ్య కూర్చున్నప్పటి స్నేహ పూర్వకమైన స్నిగ్ధతా లేదు. ఒక స్నేక్ ఛార్మర్ పాముతలనీ ఒడిసి పట్టుకన్న క్షణాల్లోని మామూలు కర్తవ్యం లాంటి నైశిత్యం తప్ప.

    "ఏమిటిదంతా" తిరగబడి! ప్రయోజనం లేదని బోధపడిపోయిందెప్పుడో...

    "మరి అదంతా ఏమిటని నేనూ అడిగితే...?" మరికాస్త మీదకి లాక్కున్నాడు ఉదయం తను చేసిన దాన్ని స్పురింపచేస్తూ...

    "మాట్లాడు శృతీ...నా ప్రపంచంలోకి ఎందుకు అడుగుపెట్టావు... నా నేస్తాలని నాకెందుకు దూరం చేశావు?"

    "నేస్తాలా?" ఆ స్థితిలోకూడా ఆశ్చర్య పడకుండా వుండలేకపోయింది. "అవి విషసర్పాలు."

    "కాబట్టే వాటితో సుఖంగా బతికేయగలుగుతున్నాను." నిశ్చేష్టంగా వింటున్న ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు, "ఒళ్ళంతా విషం దాచుకునే మనుషుల సంస్కారం కన్నా కోరల్లో మాత్రమే విషముండే ఆ సర్ప సంస్కారమే గొప్పది అదే నా ఆస్థి. అదే నా బ్రతుకు తెరువు. ఎందుకిలా చేశావు?" నిలదీసి అడుగుతున్నాడు తప్ప, తనూహించినట్టు ఆ 'కాటు' వేయాలని ప్రయత్నించడం లేదు. ఒక మగాడు మరో మగాడ్ని కలియబడి హెచ్చరిస్తున్నట్టుంది తప్ప ఒక ఆడపిల్ల ఒంటిని చుట్టేసే పురుష కుసంస్కారం అతడిలో కనిపించడంలేదు. అయినా అతడర్ధం కావడం లేదు. ఇంకా...

    ఒక తపస్విలా శ్లోకాన్ని ఉచ్చరించిన అతను ఇప్పుడు ఋషిలానే ప్రవర్తిస్తాడో, ఇక్కడనుంచి ఇంకా ముందుకు జరిగి ఏదన్నా అఘాయిత్యం చేస్తాడో తోచడంలేదు.

    మరో క్షణం గడిస్తే క్షమార్పణలు చెప్పుకునేదేమో...

    అదిగో సరిగ్గా అప్పుడు తలుపు తట్టిన చప్పుడైంది.

    గభాలున చేయి విడిచిపెట్టాడు ప్రకంపనలకి ఉలికిపడిన సర్పంలా... అయినా ఎక్కడో దాగోవాలోనని తనో ఆపదలో చిక్కుకోబోతున్నానేమో అన్న భయంకాని లేకుండా తనే వెళ్ళి ద్వారం తెరిచాడు.

    అక్కడెదురుగా ఓ పోలీసాఫీసరు నిలబడి వున్నాడు. "నువ్వు" జయేంద్రని చూసి అతడి కంఠంలో ఆశ్చర్యం... "ఇక్కడికెలా వచ్చావు?" జవాబు చెప్పని జయేంద్రని ఓ క్షణం పరికించి చూసి "టేక్ హిమ్ ఇంటూ కస్టడీ" అని తన సిబ్బందితో అన్నాడు.

    "జయేంద్ర ప్రతిఘటించలేదు. మౌనంగా పోలీసులతో వెళ్ళిపోయాడు. ఇంతసేపటిదాకా అవాక్కయి చూస్తున్న శృతి దగ్గరకి వచ్చిన పోలీసాఫీసర్ "ఆయన మీకు బంధువులా?" అడిగాడు యథాలాపంగా...

    తల అడ్డంగా ఊపింది ఇంకా విస్మయంనుంచి తేరుకోకుండానే.

    "ఇక్కడికెందుకు వచ్చాడు?"

    "ఉదయం స్నేక్ షోస్ ను ఆపించినందుకు నిలదీయాలని" కలలోలా చెప్పుకుపోయింది.

    "గుడ్! వచ్చిందెందుకైనా...మరోపని కూడా పూర్తయ్యింది." అతడు చెబుతున్నదేమిటో ఆమెకు అర్ధంకాలేదు.

    "అయామ్ ప్రసన్న డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్" తనను తను పరిచయం చేసుకుని "నిజానికి నేను వచ్చింది డాక్టర్ సంఘమిత్ర గార్ని కలుసుకోవాలని. కాని ఇక్కడ నేను వెతుకుతున్న జయేంద్రకూడా కనిపించాడు" అంటూ ఓ సోఫాలో కూర్చున్నాడు.

    "డాక్టర్ శృతీ...ఈరోజు ఓ గేంగ్ మూలంగా జంటనగరాల్లో ఎంతమంది అమాయకులైన వ్యక్తులు ప్రాణాలు వదిలిందీ మీకు తెలియనిది కాదు." ఓ క్షణం ఆగి అన్నాడు. "వుయ్ నో. డాక్టర్ సంఘమిత్ర రిప్టయిల్స్ మీద అధారిటీయేగాక పాము విషాలగురించి పరిశోధన చేస్తున్న టాక్సికాలజి ఎక్స్ పర్ట్ అని. నేరస్థుల్ని పట్టుకోవడం మాత్రమే గాక ఈలోగా ప్రజల్ని కాస్త పాముల విషయంలోనూ కాటు తర్వాత ఫస్ట్ ఎయిడ్ గురించి ఎడ్యుకేట్ చేయాలని రేపు ఉదయం ప్రెస్ క్లబ్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ తోబాటు దాన్ని షూట్ చేసి రేపు రాత్రి దూరదర్శన్ లో టెలికాస్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. అలా పత్రికల్నీ అటు టీవిని కవర్ చేస్తే సాధ్యమైనంత ఎక్కువగా ప్రాపగేట్ చేసినట్టు ఉంటుందని..."

    ఆమెకు బోధపడింది అతను వచ్చినదెందుకో...ప్రస్తుతం ఆయన లేరని చెప్పింది తప్ప మరే వివరాల్నీ చెప్పలేదు. చెప్పడానికి మనస్కరించలేదెందుకో...అయితే ఆయన అసిస్టెంటుగా తను ప్రెస్ కాన్ఫరెన్సులో పార్టిసిపేట్ చేస్తానంది.

    డిసిపి వెళ్ళిపోయాడు మరో అయిదు నిమిషాలలో...

    ప్రసన్న జయేంద్రతో పాటు జీపులో వెళ్తుంటే చూడటానికి శృతి బయటకు రాలేదు.

    కాని భుజానికి జోలి తగిలించుకున్న ఓ వ్యక్తి ఓ గోడవార్న నిలబడి రెప్పవాల్చకుండా జీప్ నే చూస్తున్నాడు. ఆ వ్యక్తి జోలిలో ఓ పాము పడగ విప్పి పైకి రావాలని ప్రయత్నిస్తూంది.


                        *    *    *    *


    ఉదయం పది గంటల వేళ...

    జంట నగరాల రోడ్లపై జనసంచారం పల్చగా ఉంది. ఆ ముందురోజు సంఘటనల్ని పేపర్లలలోనూ, రేడియో, టీవీల ద్వారాను తెలుసుకున్న చాలామంది భయంతో ఆఫీసులకి శలవు పెట్టారు. ఏ క్షణం ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో అన్నట్టుగా...     

 Previous Page Next Page