Previous Page Next Page 


    డ్రాగన్ మొహం తొడుక్కున్న అమ్మాయి వయ్యారంగా భాగవతార్ దగ్గరికి నడుచుకుంటూ వచ్చి, హే! ఆర్యపుత్ర! హే ప్రాణప్రియా! మీ పాదదాసినైన నన్ను ఇట్లనుమానింప దగునా? ఇట్లనుమానించుట కంటే మీ చేతులతో మీరే నా ప్రాణము తీయుడు. మరు జన్మమున మీకే భార్యనై, ఇట్లే అనుమానించబడునట్లు ఆశీర్వదింపుడు" అంది.
    భేతాళుడి మొహం తొడుకున్న అమ్మాయి. "హూ!" అని ఉరిమి-
    "ఓరి భ్రష్టా! నన్ననుమానిస్తావుట్రా! ఇప్పుడే కోర్టులో నీమీద పరువునష్టం దావావేసి నష్టపరిహారం వసూలు చేస్తాను. ఆడదంటే నీ చేతిలో ఆటబొమ్మనుకున్నావా?" అని కసిరింది.
    తగినంత కారణం లేకుండానే ఖంగారుపడిపోయే భాగవతార్ కి తల గిర్రున తిరిగినట్లయి మంచంమీద కూలబడ్డాడు. అమ్మాయిలంతా చప్పట్లు చరుస్తూ, "ప్రాణప్రియా!" "డాళింగ్!" "స్వీట్ హార్ట్", అనీ "భ్రష్టా! చవటా - మూర్ఖాగ్రేసరా - అనీ నోటికొచ్చిన ముద్దుపేర్లతో భాగవతార్ ని పిలుస్తూ "సా, పా, సా...." అంటూ భాగవతార్ పాడే స్టయిల్ ఇవి టేడ్ చేస్తూ, గదంతా హోరెత్తించేశారు.
    భాగవతార్ ఇంటిదగ్గర కార్ పార్క్ చేసే సమయానికి డ్రైవర్ సిగరెట్ కాల్చుకుంటూ షెడ్ లో వున్న స్టూల్ మీద కూర్చున్నాడు. భాగవతార్ ని చూడగానే చేతిలో సిగరెట్ అవతల పారేసి నమస్కారం చేసి "కారు రెడీగా వుంచమంటారా సార్!" అని అడిగాడు అలవాటుగా.
    "నోర్ముయి! ఇప్పుడా బయటికెళ్ళేది?" తన చిరాకంతా కాస్తలోకువగా వున్న డ్రైవర్ మీద గుమ్మరించాడు.
    "నేను టైమ్ కే వచ్చాను సార్! మీరు లేరు" అన్నాడు డ్రైవర్ భాగవతార్ కోపాన్ని యేమాత్రం లక్ష్యపెట్టకుండా. చీటికి మాటికి అకారణంగా వచ్చే భాగవతార్ కోపం డ్రైవర్ కి అలవాటే. ఊర్కే చిరాకు పడతాడే తప్ప తనని మాన్పించడని కూడా తెలుసు. భాగవతార్ డ్రైవింగ్ వచ్చు కాని పాటకచ్చేరీ చేయడానికి వెళుతూన్నప్పుడు తనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడం చిన్నతనమని అనుకుంటాడు. తనలాంటి వాళ్ళు తప్ప అతనిదగ్గర మరెవ్వరూ ఎక్కువరోజులు పని చేయలేరు.
    డ్రైవర్ కి యేం సమాధానం చెప్పలేక కారు షెడ్ లో పెట్టేయి, ఇప్పుడిప్పుడే బయటికి వెళ్ళను" కోపంగా అని విసురుగా లిఫ్ట్ వైపు నడిచాడు. డ్రైవరు తనలో తను నవ్వుకుంటున్నాడేమోనని అనుమానం. "వెధవలకి అందరికీ అలుసైపోయింది. తనను చూస్తే అంతా యీ మృదుల మూలంగానే" లిఫ్ట్ ఫోర్త్ ఫ్లోర్ కి చేరుకుంది. లిఫ్ట్ బయటికి నడిచి తన ఫ్లాట్ దగ్గరికొచ్చేసరికి తలుపు వేసేవుంది. "ఈ మహారాణి మళ్ళీ యెక్కడికో బయలుదేరింది" అని పళ్ళు నూరుకుంటూ డూప్లికేట్ తాళం చెవితో తాళం తీసి తలుపుని కాల్తో తన్నాడు. తలుపు గోడకి కొట్టుకుని ధన్ మనే చప్పుడుతో తెరుచుకుంది. 
    "ఎవరది?" భయంగా అరిచింది భోంచేస్తూన్న మృదుల. భాగవతార్ ని చూసి. "నువ్వా? తలుపు పగిలేలా ఎందుకలా తొయ్యడం?" అని మళ్ళీ డైనింగ్ టేబిల్ దగ్గరకెళ్ళిపోయి భోజనంముందు కూర్చుంది. భాగవతార్ ఆమె కెదురుగా కుర్చీలో కూలబడ్డాడు. అప్పుడే లంక నుంచి తప్పించుకొచ్చిన తమిళ కాందిశీకుడిలా వున్నాడతడు. ఏ ఏరోప్లేన్ హైజాకింగ్ లోనో చిక్కుకుపోయి ఎలాగో బయటపడ్డ ప్రయాణీకుడిలా నిస్త్రాణగా- అలసటగా- విరక్తిగా చూస్తున్నాడు.
    "ఏం జరిగింది? ఎందుకలా వున్నారు?" నవ్వుతూ అడిగింది. పెళ్లెయి సంవత్సరం పూర్తిగా నిండకపోయినా అతని రకరకాల అవతారాలు ఆమెకు పూర్తిగా అలవాటైపోయాయి. సహజంగానే దేనికీ ఖంగారు పడడం అలవాటులేని ఆమె భాగవతార్ ఫోజులని లక్ష్యపెట్టదు.
    ఎన్నెన్నో తిట్టాలనుకున్నాడు భాగవతార్. ఏదేదో చెప్పాలనుకున్నాడు. మృదుల చేసిన నేరాలన్నీ ఆమె ముఖం మీదే ఎత్తి చూపాలను కున్నాడు. చిరునవ్వుతో స్థిమితంగా అన్నం తింటున్న మృదులని చూస్తూ.
    "నా కాకలిగా వుంది," అన్నాడు దీనంగా.
    "అదేవిటి? పొద్దుట్నించీ యేమీ తినలేదా?"
    లేదన్నట్లు తలూపాడు.
    వెంటనే మృదుల తను తింటున్న కంచం చేత్తో పట్టుకుని అతడి వొళ్ళో కూర్చుని ఆ కంచంలోంచే ముద్దలు కలిపి నోటికందించింది.
    అది కూరో- పచ్చడో- పులుసో- పాయసమో, ఏదీ తెలియడంలేదు భాగవతార్ కి. తరతరాలుగా కవులు- భావుకులు ఊహల్లో కల్పించుకున్న అమృతం జుర్రు కుంటున్నట్లుగా వుంది. బాధ- చికాకు- కోపం కసి యేవీ గుర్తు రావటంలేదు. తను- తన వొళ్ళో కూర్చుని నవ్వుతూ ఆప్యాయంగా కళ్ళల్లోకి చూసే మృదుల- ఇంతే లోకమంతా.
    "నాకిది కావాలి" అని భాగవతార్ అడగటంలేదు. అతడికేం కావాలో అతడికంటె తనకే తెలుసన్నట్లు కంచంలో వడ్డించుకుని అతనికి తినిపిస్తోంది మృదుల.
    "హెవీ అయిపోయింది ఇంకచాలు" అన్నాడు. మృదుల నవ్వి ఎంగిలి చేత్తోనే అతడి బుగ్గమీద చిటికెవేసి "కడుపు నిండగానే చెప్పకూడదూ" అంది.
    "నువ్వు తినిపిస్తోంటే నాకెప్పుడు కడుపు నిండిందో కూడా తెలియలేదు." సిన్సియర్ గా అన్నాడు.
    "మొద్దబ్బాయి" అంటూ అతడి ముక్కు పట్టుకు ఆడించి, అతని చెయ్యి, ముఖం తనే కడిగి "చాలా అలిసి పోయినట్టున్నావు, ముందు పడుకో", అంది బుజ్జగింపుగా.
    ఆవులింతల మధ్య, "నేను నీకోసం...." అంటూ ఏదో చెప్పబోయాడు భాగవతార్.
    "అవన్నీ తరువాత చూసుకోవచ్చు. ముందెళ్ళి పడుకో, రేపు అనంతపురంలో నీ పాటకచ్చేరీ వుంది. తగినంత రెస్టు తీసుకోపోతే కచ్చేరి రక్తి కట్టదు."
    "నువ్వూ వస్తావా?" అడిగాడు.
    "ఈసారికి మిస్ కావల్సిందే. నాకిక్కడ అర్జెంట్ పనులున్నాయి"
    "ఏవిటవీ?"
    "అన్నీ వివరంగా చెప్తాను. కళ్ళు మూసుకుపోతున్నాయి పడుకో" అని "శాంతము లేక- సౌఖ్యము లేదు" త్యాగరాజ కీర్తన నాగయ్య పాడిన కేసెట్ టేప్ రికార్డర్ లో పెట్టి ఆన్ చేసి తలుపులు దగ్గిరగా వేసి వెళ్ళిపోయింది.
    భాగవతార్ లేచేసరికి ఏండెటో మృదంగంతోను, వయోలినిస్టు వయోలిన్ తోనూ సిద్ధంగా వున్నారు. భాగవతార్ మనసు ఎన్ని చిరాకుల పెటైనా రిహార్సల్స్ చేస్తున్నప్పుడు మాత్రం సమస్తం మర్చిపోతాడు. ఏండెటోని, వయొలినిష్టుని తన స్టడీ రూమ్ లో కూర్చోమని తొందరగా వెళ్ళి ముఖం కడుక్కుని మిరియాలు పొడి కలిపిన పాలు తాగి తనూ వచ్చి స్టడీరూమ్ లో మెత్తని తివాసీమీద కూర్చున్నాడు. ఎదురుగా వీణా పాణి సరస్వతి పాలరాతి విగ్రహం వుంది. ఒక సంస్థ అతనికి బహుకరించింది ఆ విగ్రహం, ఆ పక్కనే మరో సోఫాలో సరస్వతీదేవి సరదాగా మోడ్రన్ డ్రెస్ వేసుకొని కూర్చుందాన్నట్లు కూర్చుని వుంది మృదుల. పొంగిపోయాడు, ఉత్సాహం వచ్చింది, మనసులో సరికొత్త స్వరాలు- రాగాలు సాగాయి.
    అంతలో మృదుల కూర్చున్నది తనకోసమా లేక ఏండెటో కోసమా అనే అనుమానం వచ్చింది. నీరుకారిపోయాడు. గొంతు పెగల్లేదు.
    గొంతు సర్దుకున్నాడు.
    "శ్రీమణి రాగం ఆలపించు. నీ కంఠంలో ఆ రాగానికి కొత్త మాధుర్యం వస్తుంది." ఆ మాటలు భాగవతార్ లో జారిపోతున్న ఉత్సాహానికి ప్రాణం పోసాయి.
    దాదాపు రెండుగంటలు ఆ గదిలో గానకళా సరస్వతి తన విశ్వరూపంతో లాస్యం చేసింది.
    "వండ్రఫుల్." అంటూ చప్పట్లు కొట్టి అంతమందిలోనూ అతని బుగ్గమీద ముద్దు పెట్టుకుని, "నా కర్జంటు పనివుంది వెళ్ళాలి. బై బై" అనేసి తూనీగలాగ యెగిరిపోయింది.
    భాగవతార్ కి మృదుల చెక్కిలి మీద ముద్దు పెట్టుకోవడం బాగానే వుంటుంది కాని అంతమందిలో ముద్దు పెట్టుకోవడం బాగాలేదు. మృదుల అలా ముద్దు పెట్టుకుంటునప్పుడు మిగిలినవాళ్ళు కళ్ళప్పజెప్పి చూడ్డం అసలేమాత్రం బాగుండదు. అయినా తను చెప్పడం మృదుల వినడం దాకా యెక్కడ? తనేదేనా అని అనుకునేలోగానే మృదుల తనకేం తోస్తే అది చేసేస్తుంది. ఎదుటివాళ్ళచేత చేయిస్తుంది. మళ్ళీ రిహార్సర్స్ లో మునిగిపోవడంతో అతనికి తన మనసును దొలిచేసే ఆలోచనల నుంచి విముక్తి లభించింది.
                              *    *    *

    అనంతపురంలో భాగవతార్ పాటకచ్చేరి బ్రహ్మాండంగా రక్తి కట్టింది. మడక సిర, తాడిపత్రి, ఉరవకొండ, హిందూపూర్ మొదలైన, చుట్టుపక్కల ప్రాంతాలనుంచి కూడా సంగీతాభిమానులు వచ్చారు. ఆరుబయట షామీయానా వేసి తయారు చేసిన సభ జనంతో కిక్కిరిసిపోయింది. అతని ప్రతీ రాగాలాపనకి- ప్రతీ స్వరకల్పనకి - కృతులు పాడుతూ మధ్యలో వేసే సంగతులకి సభలో కరతాళ ధ్వనులు మారుమ్రోగాయి. ఇంచుమించు అంతగాను ప్రశంసలనందుకోగలిగాడు ఏండెటో. ఒక్కొక్క పాటకచ్చేరీకి అయిదువేలకి తక్కువ తీసుకోడు భాగవతార్. నిర్వాహకులు టికెట్స్ పెట్టి అంతకంటె ఎక్కువగానే డబ్బు వసూలు చేస్తారు. ప్రతీ పాట కచ్చేరీలోనూ అయిదువేల క్యాష్ పేమెంట్ తరువాత చందనమాలతో కాశ్మీర్ శాలువాలతో సన్మానాలు జరుగుతాయి భాగవతార్ కి. వయొలినిస్టుకి, మృదంగిస్టుకి. మృదంగిస్టుకి, వయొలినిస్టుకి చెరొక రెండువేలు వేర్వేరుగా యిస్తారు నిర్వాహకులు.
    ఆ రోజు నిర్వాకులు సన్మానం చేసాక సభలోంచి కూడా అయిదారు సంస్థలవాళ్ళు లేచి భాగవతార్ కి సన్మానాలు చేసారు. కాశ్మీర్ శాలువాలతో వెండి వీణ బొమ్మని బహుకరించారు.

 Previous Page Next Page