"నాకలాగనిపించలేదు" అన్నాను.
"అన్నట్లు చలం నవలలగురించి మరో అభిప్రాయం చెప్పడం మరిచాను" అన్నది కోమలి.
"ఏమిటది?"
"నీవంటివాడు ఆ సాహిత్యంపై అభిప్రాయం చెప్పడానికి తగడని"
నాకు కోపం వచ్చింది. "మరి ఎందు కడిగావు?" అన్నాను.
"నీ చేతికి బంగారం ఇచ్చి మంచిదో కాదో చెప్పమంటే నువ్వేం చేస్తావు?" అన్నది కోమలి.
"కంసాలి దగ్గరకు వెళతాను" అన్నాను.
"కానీ కోపగించుకోవుకదా" అన్నదామె.
ఆమె ఉద్దేస్యమేమిటో నాకు తెలియలేదు. అందుకే మాట్లాడకుండా చిరాగ్గా చూశానామెవంక.
"నిన్నెవరైనా ఎప్పుడైనా ఉత్తమ సాహిత్యంపైన అభిప్రాయమడిగితే వెంటనే నా దగ్గరకు రా__" అన్నది కోమలి.
"చాలా థాంక్స్" అన్నాను కోపంగా.
కోమలి కిసుక్కున నవ్వింది. అధి నన్ను చూసి హేళనగా నవ్వినా నవ్వు. అయినప్పటికీ ఆ నవ్వులో ఆమె ఎంత మనోహరంగా ఉన్నది!
నేను ముగ్దుడినై ఆమెవంక చూస్తున్నాను.
"ఏమిటలా చూస్తున్నావ్?" అన్నది కోమలి కాస్త సిగ్గుపడుతూ.
"సంగీత విధ్వాంసుడి రాగాన్నిమించి, కోమలగాత్రి ఏడుపు బాగుంటుందని చదివాను. నీవంటి ఆడపిల్ల నన్ను తిడుతూ నవ్వినా ఎంతో బాగుంది."
"నిజంగా...." అన్నది కోమలి.
"అవును" అన్నాను.
"ప్రేమ అలా అనిపించేలా చేస్తుంది" అన్నది కోమల.
కధ మళ్ళీ మొదటికి వచ్చింది. కోమలి అందమైనది తెలివైనది. ఆమె నన్ను ప్రేమిస్తే అది నా అదృష్టం. ఇప్పుడు...ప్రేమ ఏమిటి?
ప్రేమించాలని నాకూ ఉన్నది. కానీ భయంగా వున్నది.
"నా మీద ప్రేమతో నువ్వు కవిత్వంకూడా లిఖించావు" అన్నది కోమలి మళ్ళీ నవ్వుతూ.
"నీ ఉద్దేశ్యం ఏమిటి?" అన్నాను.
"చిన్నప్పటినుంచీ కలిసి పెరిగాం మనిద్దరం. నువ్వంటే నాకెంతో ఇష్టం. నీకూ నేనంటే ఇష్టమని నాకు తెలుసు. కాని ప్రేమ ఎలాంటిదో నాకు తెలియదు. ఎన్నోసార్లు నిన్ను పిలిచి నా మనసువిప్పి చెప్పుకోవాలనుకున్నాను. కానీ భయం వేసింది. ఎప్పుడైతే కొండల్రావుతో నువ్వు నన్ను నీ చెల్లెల్ననడానికి బదులు మరదలనని చెప్పావో అప్పట్నించి నాకు నీమీద ఆశపుట్టింది. అందుకే నీకు చేరువ కావాలని ప్రయత్నిస్తున్నాను."
నేను ఆశ్చర్యపోయాను. కోమలి మరీ ఇంత లా మాట్లాడుతుందని నాకు అనిపించలేదు.
"కానీ ఇది చదువుకోవలసిన వయసు" అన్నాడు.
"ఆ విషయం నాకూ తెలుసు. కానీ చదువుకు ఎందుకు అడ్డం వస్తుందో నాకు తెలియదు. దేనిదారి దానిదే ఈరోజుల్లో ఎందరో యువకులు, యువతులు వివాహానంతరం కూడా చదువును కొనసాగిస్తున్నారు. అటువంటిది చదువు ప్రేమ ఎందుకు ప్రతి బంధకమవుతుంది?" కోమలి.
"అసలు మనకిప్పుడు ప్రేమ అవసరం ఏముంది అన్నాను.
"అప్పుడే వండిన కూరకూ, చల్లారిన కూరకూ రుచిలో ఎంత తేడా వుంటుంది? తాజాతనంలోని రుచి రాదు. ఇది తాజా ప్రేమను రుచిచూడవలసిన వయసు అన్నది కోమలి.
"ఇంకా ఏమయినా చెప్పాలా?" అన్నాను.
"ఊఁ" అన్నది కోమలి. "నేను నా స్నేహితురాండ్రతో ఎన్నో విషయాలు మాట్లాడతాను. నీతో ఏకాంతంగా ఎన్నో విశేషాలు చర్చించాలని వుంటుంది నాకు. నాకూ నీకూ మధ్య ఏ రహస్యాలూ వుండకూడదనీ మనిద్దరం ఒకరినొకరు దగ్గర కావాలనిపిస్తూంటుంది నాకు. నీకు దూరంగా వుండవలసిన నన్నేదో అసంతృప్తి ఆవహిస్తుంది."
"అందుకు నేనేం చెయ్యను?"
"చెపితే వింటావా?"
నేను 'ఊఁ' అనలేదు. అయినా కోమలి చెప్పడం ప్రారంభించింది.
"మా యింట్లో అమ్మ ఒక్కతే ఉన్నది. రేపు కాలేజీకి సెలవు. రేపు మధ్యాహ్నం అమ్మ వీధిలోని మరికొందరు ఆడవాళ్ళతో కలసి భజన మందిరానికి వెడుతున్నది. మధ్యాహ్నం మూడుగంటలకు వెడుతుంది. తిరిగి ఏడింటి దాకా రాదు. నువ్వు మీ దొడ్డి గుమ్మంవేపునుంచి మా ఇంట్లోకి రా. నీకోసం మా వేపు తలుపు గొళ్ళెంతీసి ఉంచుతాను. తర్వాత అన్నీ అక్కడ మాట్లాడుకుందాం"
వింటూంటే నావళ్ళు జలదరించింది.
ఒక ఆడపిల్ల-ఎంత సులభంగా ఈ విషయం చెప్పింది?
కోమలి గురించి నేనేమని అనుకోవాలి?
"విన్నావు కదా సరేనా?" అంది కోమలి.
ఏమనాలి? నేను ఆలోచిస్తున్నాను. నేను కోమలి ఇంటికి వెడితే అప్పుడు హఠాత్ గా ఆమె తల్లి తిరిగివస్తే...
నా సందేహం ఆమె ముందు బయటపెట్టాను.
"నేనే పిలిచానని చెబుతాను" అంది కోమలి.
"నాకు నమ్మకంలేదు" అన్నాను. నేను ఎన్నో జానపద కధల్లో చదివి వున్నాను. ఇటీవల చాలా సాంఘీక చిత్రాల్లోకూడా చేశాను.