ఒక పర్యాయం పెంపుడు తండ్రి పరిస్థితి కూడా అతను విచారించాడు. వాళ్ళ పరిస్థితి మరీ అంత బాగాలేకపోయినా తమ కంటె మెరుగ్గానే ఉంది. పెంపుడు తల్లిదండ్రులకు స్వామి అంతే అసూయగా కూడా ఉంది. ఆ విషయం వారి మాటల్లోనూ చేతల్లోనూ కూడా బాగా వ్యక్తమౌతోంది.
స్వామి బాధపడలేదు. వాళ్ళసూయపడే స్థాయికి తను చేరుకున్నందుకు తనెంతో సంతోషించాడు.
ఈలోగా ఇంకో విచిత్రం జరిగింది. స్వామి ప్రస్తుతం ఉన్న పరిస్థితి అతని బంధువర్గంలో చాలామందికి తెలిసింది. పెద్ద పెద్ద కట్నాలతో అతనికి పిల్లనిస్తామంటూ చాలామంది ముందుకు రాసాగారు. కొంతమండి పదివేలన్నారు. కొందరు పాతికవేలన్నారు. ఫారిన్ వెళ్ళే అల్లుడికి ఎంతైనా సరే ఇవ్వడానికి చాలామండి ఎగబడసాగారు. ఇలా ఎగబడ్డవారిలో బసవరాజు ముఖ్యుడు. ఆయన లక్ష రూపాయలు కట్నంగా ఇస్తానన్నాడు.
బసవరాజు కొక్కర్తే కూతురు. అందంగానే ఉంటుంది. కొంతవరకు చదివించారు. సాంప్రదాయంగా పెంచారు. సంగీతం నేర్పించారు. బసవరాజు ఇంట్లో లక్షలకు లక్షలు మూల్గుతున్నాయి. అందులో ఒక లక్ష కూతురి కివ్వడానికి ఆయన సిద్ధంగా ఉండడం మాత్రమేకాక, మరో లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఘనంగా చేయాలని కూడా ఆయన అనుకుంటున్నాడు. బసవరాజు ఆఫర్ తో స్వామికి కళ్ళు తిరిగిపోయాయి.
సమాజంలో తన స్థానం ఇంతలా పెరిగిపోయిందని అతనూహించలేదు. లక్ష రూపాయలతో తన కుటుంబం దరిద్ర మంతా తీరిపోతుంది. పెంపుడు తండ్రి అసూయపడే స్థాయికి తన కన్న తల్లిదండ్రులు కూడా చేరుకుంటారు. తను అమెరికా వెళ్ళి రావచ్చు. ఏ త్యాగమూ చేయవలసిన అవసరముండదు.
"లక్ష రూపాయలిస్తానన్నాను గదా అని నా కూతురు కుంటిదో, గుడ్డిదో అనుకోవద్దు. అది బంగారు బొమ్మ. నాకు వేరే అల్లుళ్ళు దొరకరన్న భయమూ లేదు. మాకు పిల్లాడు యోగ్యుడనిపించాడు. ఇంటల్లుడిగా చేసుకోవాలనిపించింది. అడుగుతున్నాం. ఒప్పుకుంటే మీరూ, మేమూ అదృష్టవంతులం. ఒప్పుకోకుంటే దురదృష్టం మీదేకానీ మాదికాదు...." అని అర్ధం వచ్చే విధంగా బసవరాజు స్వామి దగ్గరకు రాయబారాలు పంపాడు. స్వామి మనసు రకరకాలుగా ఊగిసలాడింది. అతను వెళ్ళి బసవరాజు కూతుర్ని పెళ్ళిచూపులు చూసి వచ్చాడు. పిల్ల బాగానే ఉన్నదని అతనికి తోచింది. అయితే, వెంటనే ఏ నిర్ణయమూ తీసుకోలేకపోయాడు.
అమెరికా నుంచి తిరిగి వచ్చాక వివాహం చేసుకుంటే మంచిదని అతనికి తోస్తోంది. కాని వివాహం చేసుకోకుండా అమెరికా ప్రయాణమే సాధ్యపడేలా లేదు.
ఈలోగా స్వామికి రుద్రరాజు దగ్గర్నుంచి ఉత్తరం వచ్చింది. స్వామికి వచ్చిన అమెరికా ఆఫర్ గురించి ఆయన అమితంగా సంతోషిస్తూ__"కాని, ముందుగా అక్కడికి వెళ్ళడానికి నీకు కొంత డబ్బు అవసరమవుతుంది. ఆ డబ్బు ఎలా సంపాదించాలనుకుంటున్నావు? ఈ విషయంలో నేను నీకు సహాయపడగల ననుకుంటున్నాను. నా వద్ద వేలకు వేలు డబ్బు నిల్వలేదు. కాని నీకు అవసరమైనంత డబ్బు అప్పుగానైనా సంపాదించగల పరపతి నాకుంది...." అంటూ రాశాడు. ఆయన రాసిన ప్రకారం ఓ పర్యాయం స్వామి ప్రిన్సిపాలు గారిని కలుసుకోవలసి ఉంది.
స్వామి వెళ్ళి రుద్రరాజును కలుసుకున్నాడు. ఆయన యింట్లో అతనికి ఆప్యాయతతో కూడిన ఆదరణ లభించింది. కాని మీనాక్షి మాత్రం అతని కళ్ళబడలేదు.
రుద్రరాజు స్వామితో ఆ సంగతీ ఈ సంగతీ మాట్లాడి, అతనికి కావలసిన డబ్బు తను సిద్ధం చేయగలనని అన్నాక- "ఈ డబ్బుతో నిన్ను కొనివేయడం లేదని నువ్వు అనుకోనంటే, నీతో ఒక విషయం మాట్లాడాలని అనుకుంటున్నాను" అంది అన్నాడు.
"చెప్పండి?" అన్నాడు స్వామి.
"నా కూతురు మీనాక్షికి నువ్వు కొంతకాలం ప్రయివేటు చెప్పావు. అయినా విశ్వాసం లేకుండా-చాలాకాలం తర్వాత నువ్వు మా యింటికి వచ్చినా అది నీకు స్వాగతం పలకలేదు. అందుక్కారణం తెలుసా?" అన్నాడు రుద్రరాజు.
తెలియదన్నట్లు తలాడించిన స్వామి ముఖంలో కలవరపాటు ఉంది. తనేదైనా తెలియకుండానే పొరపాటు చేయలేదు కదా-అని అతనికి అనుమానంగా ఉంది.
"దానికిప్పుడు కొత్తగా సిగ్గు బయల్దేరింది. నీతో పెళ్ళి మాటలు మాట్లాడబోతున్నానని తెలిసి, అది నిన్ను చూడ్డానికి కూడా సిగ్గు పడుతోంది" అని కూతురి ప్రవర్తనకు ముచ్చటపడుతూ అన్నాడు రుద్రరాజు.
స్వామి ఎక్కువగా ఆశ్చర్యపడలేదు కాని, యిప్పుడీ ప్రసక్తి వస్తుందని అతననుకోనందున ఏం మాట్లాడాలో తెలియడం లేదు.
"మిస్టర్ స్వామీ! నువ్వు నన్ను అపార్ధం చేసుకోకూడదు. నేను నీ చదువుకు సాయపడ్డా, నీ అభివృద్దికి కాంక్షించినా అది స్వార్ధంతో కాదు. వృద్దిలోకి రావలసిన ఒక కుర్రవాడిని పైకి తీసుకురావాలన్నదే నా సంకల్పం. కాని నిజంగానే నువ్వు వృద్దిలోకి వచ్చేసరికి నేను నిన్ను మన్నించు. కాని అందుకొక కారణముంది...." అని ఆగాడు రుద్రరాజు - "నా కూతురు చాలా గారాబంగా పెరిగింది. కొడుకైనా కూతురయినా అదొక్కర్తే నాకు. అది నిన్ను ప్రేమించిందన్న ఒక్క కారణంగా నేను నిన్నీ కోరిక కోరుతున్నాను. అయితే అది నిన్ను ప్రేమించిందన్న ఒక్క కారణంగా నేను నిన్నీ కోరిక కోరుతున్నాను. అయితే అది నిన్ను ప్రేమించిందన్న విషయం నాకు ఎప్పుడో చెప్పింది. అయినా అప్పట్లో నేను నీ దగ్గర ఈ ప్రసక్తే తీసుకురాలేదు. అందుకుకూడా నువ్వే కారణం...." మళ్ళీ ఓ క్షణం ఆగి చెప్పనారంభించాడు రుద్రరాజు-"అప్పట్లో మాది గొప్ప, నీది తక్కువ. నువ్వే నా కూతురిని వలలో వేసుకున్నట్లు నేను భావిస్తానని నువ్వభిప్రాయపడ్డావు. నువ్వు మా స్థాయిని మించగలవాడవని నాకు తెలుసు. అందుకే అంతవరకూ ఆగేను. ఇప్పుడడుగుతున్నాను- మీనాక్షి అంటే నీకు యిష్టమేనా?"
స్వామి కళ్ళముందు బసవరాజు చెప్పిన లక్ష తిరుగుతోంది. హటాత్తుగా తనకు లభించిన ప్రాముఖ్యత అతన్ని కింకర్తవ్య విముఖుణ్ని చేస్తోంది.
"మాట్లాడవేం? ఇంతకాలం నేను నీకు చేసిన సహాయం దూరాలోచనలో పెట్టబడిన పెట్టుబడి అనుకొంటున్నావా? దాంతో నిన్ను కొనేశాననుకుంటున్నావా?" అన్నాడు రుద్రరాజు.
స్వామి అదోలా నవ్వి- "అలా ఎందుకనుకుంటానండీ! ఒకవేళ నిజంగా అలా జరిగినా నన్ను విడిపించుకోగల శక్తి నాకిప్పుడుంది. వడ్డీతోసహా మీరిచ్చిన డబ్బు తీర్చేసి ఋణ విముక్తుణ్ణి కాగలను నేను. బసవరాజని ఒకాయన లక్ష రూపాయల కట్నంతో తన కూతుర్ని నాకిచ్చి పెళ్ళి చేస్తానంటున్నాడు" అన్నాడు.
రుద్రరాజు నివ్వెరపోయాడు. ఈ విషయం ఆయనకు తెలియదు. స్వామికిటువంటి ఆఫర్ ఒకటి వచ్చిందనీ, వచ్చినా ఆ సమాచారాన్ని తనకిప్పుడు ఈ సమయంలో ఈ విధంగా అందజేస్తాడనీ ఆయన అనుకోలేదు. అతనన్న మాటలకు అర్ధమేమిటి?
స్వామి లేచి నిలబడి- "మీరు అన్యధా భావించవద్దు. నేనో పర్యాయం మీనాక్షితో మాట్లాడాలి" అన్నాడు.
రుద్రరాజు మాట్లాడకుండా ఒక గదివైపు వేలు చూపించాడు. అనుకోనిది జరిగినట్లూ, తన అంచనా తప్పయినట్లూ ఆయన ముఖంలోని భావం వ్యక్తం చేస్తోంది.
స్వామి తిన్నగా ఆ గదిలోకి వెళ్ళాడు. అతన్ని చూస్తూనే కుర్చీలో కూర్చుని ఉన్న మీనాక్షి చటుక్కున లేచి నిలబడింది. స్వామి తలుపులు దగ్గరగా చేరవేశాడు.
మీనాక్షి వంచిన తల పైకి ఎత్తలేదు.
"మీనాక్షీ! నన్ను చూడ్డానికి సిగ్గుపడుతున్నావా?" అన్నాడు స్వామి.
మీనాక్షి చటుక్కున తలెత్తి అతనెవరో చూసి వెంటనే తల దించుకుంది.
"ఈ రోజు నాకు చాలా బాధగా ఉంది" అన్నాడు స్వామి.
"ఏం?" అందామె తల ఎత్తకుండానే.
"మీ యింట్లో ఒక కుక్క ఉంది. దానికింత తిండి పెడుతున్నందుకది మీకు ఎంతగా ఉపయోగపడుతోంది. తండ్రికి మించిన రక్షణ మీకు యిచ్చింది. నాలో విజృంభించే పశువును అరికట్టింది. మీ యింటి తిండితిన్న జంతువుకే అంత విశ్వాసముంటే- మీ కారణంగా యింతవాడినైన నేను, మనిషినని అనుకుంటున్న నేను-మరోలా ప్రవర్తిస్తానా? యజమానిలా శాసించవలసిన మీ నాన్నగారు నన్ను దీనంగా అర్ధించారు. అదీ ఎందుకో తెలుసా? కలలో కూడా ఏ మీనాక్షిని పొందగలగడం నా అదృష్టమని భావించానో ఆ మీనాక్షిని పెళ్ళి చేసుకొమ్మని.... ...."
మీనాక్షి చటుక్కున తలెత్తి చూసి నవ్వింది. సజల నయనాలతో ఆమె నవ్విన నవ్వు ఆ గది నిండా కొత్త వెలుగును ప్రసరింపజేసింది.
"మీనాక్షీ! గది తలుపులు వేసి ఉన్నాయి. గదిలో మీరు, నేను ఇద్దరే ఉన్నాం. కుక్క కూడా మన పక్కనలేదు. అయినా నాకు తృప్తిగా లేదు. ఎందుకంటే నా కోరిక ఇది కాదు. గదిలో మనమిలా ఉండగానే-కుక్క కూడా మన పక్కనే ఉండాలి. నేను మిమ్మల్నేం చేసినా అది మొరగకూడదు. ఇది విచిత్రమైన కోరికగా మీకు తోచవచ్చు. కాని యీ కోర్కె సాధించడానికే నేను ఇంత శ్రమపడి ఈ స్థాయికి వచ్చాను" అన్నాడు స్వామి.
అంతకు మించి వారిద్దరూ ఏమీ మాట్లాడుకోలేదు. తర్వాత స్వామి రుద్రరాజుగారిని సమీపించి- "అమ్మగారిని కూడా పిలవండి. మీ యిద్దరికీ నేను ప్రత్యేకంగా చెప్పవలసిన మాట ఉంది" అన్నాడు.
రుద్రరాజు భార్యను పిలిచాడు. ఆవిడ వచ్చి ఆయన పక్కన నిలువగానే స్వామి ఆ భార్యాభర్తలిద్దరకూ పాదాభివందనం చేసి- "మీరు లేకపోతే ఈ స్వామి లేడు. వీడిని మీరు శాసించాలి తప్పితే అర్ధించకూడదు. అలాగని మీరు చెప్పిన పెళ్ళికి శాసించడం అవసరమనీ అనుకోవద్దు. అది నా అదృష్టం. మీవంటి పుణ్య దంపతులు నాకు అత్తమామలవడం ఏ జన్మలోనో చేసుకున్న అదృష్టం" అన్నాడు.
రుద్రరాజు కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఒక్కక్షణం అలా ఉన్నాక ఆయన ముఖం గంభీరంగా అయిపోయింది. భార్యవంక తిరిగి- "రాజానిలా తీసుకురా!" అన్నాడు.
అయిదు నిముషాల్లో ఆవిడ కుక్కతో తిరిగి వచ్చింది. రుద్రరాజు కుక్కను దగ్గరగా రమ్మని పిలిచాడు. అది ఒక్క గెంతులో ఆయన్ని సమీపించింది. ఆయన దాన్ని ప్రేమగా నిమురుతూ- "రాజా! ఇతను ఫారిన్ వెడుతున్నాడురా. వెళ్ళేముందు నన్ను శాసించమని అడుగుతున్నాడురా. అక్కడ జనం తాగి తందనాలాడతారు. ఆడదానికీ, మగవాడికీ పవిత్రత లేదు. వాళ్ళ సంఘానికవి తప్పుకాదు. కాని యితను ఆ సంఘంలో ఉన్నా మన సంఘ సాంప్రదాయాల్నే అనుసరించాలనీ, ఏ తప్పూ చేయకూడదనీ నేను శాసిస్తున్నాను. గాంధీ మహాత్ముడిని ఆయన తల్లి యిలాగే శాసించింది. ఆయన అదే పాటించాడు. స్వామి కూడా అలాగే పాటించాలని నా కోరిక. పాటించినదీ లేనిదీ నాకెలా తెలుస్తుంది- నువ్వే సాక్ష్యంగా ఉండాలి" అన్నాడు.
స్వామికి అందులో హెచ్చరిక, శాసనం అన్నీ వినబడ్డాయి.