Previous Page Next Page 
రామాయణము పేజి 6

        పగ పురికొల్పగా విశ్వామిత్రుడు త్రిశంకువును బొందితో స్వర్గమునకు పంపెను. కాని ఇంద్రుడు త్రిశంకువును లోనికి రానివ్వలేదు. 'స్వర్గమైననూ, నరకమైననూ మానవునకు మరణానంతరమే ప్రాప్తించును. నీవు చచ్చిన పిమ్మట చితిపై తగులు బడవలసిన ఈ బొందిని ఇచ్చటకేల తెచ్చితివి? పొమ్ము! పొమ్ము!!' అని ఆ నిర్భాగ్యుని కిందికి నెట్టివైచెను.
    త్రిశంకువు "విశ్వామిత్ర మహర్షీ పడిపోవుచున్నాను, రక్షించుము! రక్షించుము!!" అని మొఱపెట్టినాడు. వాని ఆక్రందనమును విని విశ్వామిత్రుడు "ఆగు మాగుము!" అని శాసించినాడు. తలకిందుగా పడుచున్న త్రిశంకువు భూమ్యాకాశముల నడుమ తానాక్షణమున ఉన్న చోటుననే ఆగిపోయెను. విశ్వామిత్రుడు "స్వర్గప్రవేశము కలుగనందుకు దిగులు చెందకుము, నీవు ఇప్పుడున్న చోటుననే వేరొక నాకమును నీకు నేను సృజించెదను!" అన్నాడు... ఈ నాకము (స్వర్గము)నకు 'త్రిశంకుస్వర్గము' అన్న పేరు వచ్చినది.
    విశ్వామిత్రునకు అసంతృప్తియే మిగిలినది. "బ్రహ్మర్షిని కావలెనని కోరి తపస్సునకు పోవుచుండగా త్రిశంకువు తారసిల్లినాడు. వసిష్ఠుని పరాభవించుటకు ఒక అవకాశము కలిగినదని పొంగిపోయి త్రిశంకువును బొందితో స్వరమునకు పంపినాను. కాని ఏమైనది? ఇంద్రుడు త్రిశంకువును కిందికి త్రోసివేసినాడు! వసిష్ఠునకు జరిగిన పరాభవమేమియూ లేదు సరికదా నా తపోబలము తరిగిపోయినది!" అని అతడు వాపోయినాడు.
    "ఇంక నేనిక్కడ తల ఎత్తుకొని తిరుగలేను!" అతడా నిశ్చయమునకు వచ్చి, సకుటుంబముగా పోయి పశ్చిమ మండలమును ప్రవేశించెను. పుష్కర తీర్ధమున స్థిరపడి మరల తపమును ప్రారంభించినాడు.     
    ఒకనాడచ్చటకు అతని మేనల్లుడు శునశ్శేఫుడు వచ్చినాడు. విశ్వామిత్రుడు "ఏమిరా, మీ తల్లి సత్యవతియూ తండ్రి బుచీకుడునూ క్షేమముగా ఉన్నారా? నీ అన్నయూ తమ్ముడునూ కుశలమే కదా?" అని ప్రశ్నించినాడు.
    శునశ్శేఫుడు కన్నీరు కార్చుచూ, "మామా, వారందరునూ క్షేమమే. నేనే దిక్కులేనివాడనై నీ శరణు జొచ్చుటకు వచ్చినాను. నన్ను రక్షించుము" అన్నాడు.
    'నాయనా నీకు వచ్చిన ఆపద యేమిటి?"
    శునశ్శేఫుడిట్లు చెప్పెను:
"అంబరీష చక్రవర్తి ఆశ్వమేధ యాగమును ప్రారంభించి అశ్వమును వదలినాడు. ఆ హయమును ఎవరో అపహరించినారు. ఋత్విక్కులు ఆయనతో 'రాజా నీ సవనాశ్వమును వెతకితెచ్చి సవనమును పూర్తిచేయని యెడల మాతోపాటు నీకునూ చేటు సంభవించును. గుఱ్ఱము దొరకని పక్షమున దానికి బదులు బలియిచ్చుటకు ఒక నరుని కొనితెమ్ము' అని పంపినారు. ఆయన మా తండ్రి వద్దకు వచ్చి 'నీ కుమారత్రయములో ఒకనిని నాకు యజ్ఞ పశువుగా విక్రయించ గోరుచున్నాను. మూల్యముగా లక్ష గోవులను ఇచ్చెదను' అన్నాడు. గోవులకు ఆశపడి మా తండ్రి కుమారులలో ఒకనిని విక్రయించుటకు అంగీకరించెను కాని 'ఎవనిని ఇచ్చుట? అన్న ప్రశ్న ఎదురై చేతికి అందివచ్చిన జ్యేష్ఠుని నేను విడువజాలను' అన్నాడు. మా అమ్మ 'కనిష్ఠుడన్న నాకిష్టము. వానిని నేను వదలలేను' అన్నది... అమ్మకునూ అబ్బకునూ అక్కరలేని మధ్యముడను నేను పొంగివచ్చుచున్న దుఃఖమును ఆపుకొనుచూ రాజు వెంట వచ్చినాను. మార్గమందలి ఈ పుష్కర తీర్ధమున అంబరీషుడు పరివారముతో ఆగి విశ్రాంతిని తీసికొనుచున్నాడు. నీవిచ్చట తపస్సును చేసికొనుచున్నావని విని నేను రాజు అనుజ్ఞను తీసికొని నిన్ను చూడవచ్చినాను. ఇంక నాకు తల్లివైననూ తండ్రివైననూ నీవే. అకాల మృత్యువు నుండి నన్ను కాపాడుము."
    శునశ్శేఫుని జాలి కథ విశ్వామిత్రుని గుండెను కరిగించినది. అతడు తన నల్వురు పుత్రులతో "మీలో ఒకడు ఈ శునశ్శేఫునకు బదులుగా పోయి అంబరీషునకు అర్పించుకొనుడు. అట్లు చేయుట వలన శరణుజొచ్చిన వీనికి రక్షణ కలుగును. మీరు తండ్రి మాటను పాటించిన వారగుదురు. అంబరీషుడు లోకకల్యాణము నిమిత్తము చేయుచున్న యజ్ఞమునూ నెరవేరును" అనెను.
    వారు తండ్రిని గేలిచేసినారు: 'పరాయి బిడ్డను కాపాడుటకు కన్నబిడ్డ నొకనిని చావుమనుట కుక్క మాంసమునకు తాపత్రయపడి మధురాహారమును పారవేయుట వంటిది! మేము ఎవరమూ వెళ్ళము!"... విశ్వామిత్రుడు క్రుద్ధుడైనాడు. "మీరు తండ్రికి ఎదురు చెప్పుటయే కాక ధర్మ విరుద్ధముగా పలికినారు! శునక మాంస ప్రసక్తిని తెచ్చినారు కనుక శ్వవచులు (చండాలురు) ఐ శునక మాంసమును తినుచూ బ్రతుకుడు!" అని శపించినాడు...అతడు మరుక్షణము ననె తన తొందరపాటునకు పశ్చాత్తప్తుడైనాడు. "తనయులు తప్పు చేసినచో తండ్రులు మందలించవలెను గాని శపించవచ్చునా?" అని బాధపడినాడు.
    విశ్వామిత్రుడు శునశ్శేఫుని తనవెంట బెట్టుకొని అంబరీషుని వద్దకు పోయి "సార్వభౌమా, ఈ బాలుని దయతో వదలివేయుము. దేవతలు నీ కారుణ్యమును మెచ్చి నీకు యజ్ఞఫలమును ప్రసాదించెదరు" అనెను. అంబరీషుడు శునశ్శేఫుడు "యథేచ్చగా పొమ్ము" అని చెప్పి యాగఫలమును దక్కించుకొనెను.
    పిమ్మట గాధినందనుడు "నా తపమున కెప్పటికప్పుడు ఏదియో ఒక ఆటంకము కలుగుచున్నది! నేనింక అన్యుల విషయములలో కలుగజేసికొనకుండ ఏకాగ్రతతో తపమాచరించవలెను" అని నిశ్చయించుకొని నిష్ఠను వహించినాడు.
    అతనికీసారి వేరొక విధముగా అంతరాయము కలిగినది. ఒకనాడు పుష్కర తీర్ధము ఒడ్డున ధ్యానము  ముగించి కన్నులు తెరువగా అతనికి, సరోవరమున జలకమాడుచూ ఒక అపురూప సౌందర్యవతి ప్రత్యక్షమైనది. అతడామె అందచందములకు ముగ్ధుడై "మోహనాంగీ, నీవిచ్చటనే ఉండిపొమ్ము" అని  అర్ధించినాడు. ఆమె 'మేనక' అను  అప్సరంగన. "విశ్వామిత్రునకు  తపోభంగమును కలిగించి రమ్ము" అని ఆదేశించి ఇంద్రుడామెను పంపినాడు. విశ్వమిత్రుడు జపతపాదులను విస్మరించి ఆమెతో గడపినాడు. కొంతకాలమైన పిమ్మట వారికొక ఆడ శిశువు  జనించినది... మేనక ఆ బిడ్డ నచ్చటనే వదలి  తిరిగి  ఇంద్రలోకమునకు పోయినది. వివేకోదయమై విశ్వమిత్రుడు దుఃఖించినాడు. "కామమోహితుడనై భ్రష్టుడనైనాను! బ్రహ్మర్షిని కావలెనన్న లక్ష్యమును మరచినాను! బ్రహ్మర్షిత్వము జితేంద్రియులకు గాని నావంటి కామాంధులకు సిద్దించునది కాదు!" అని  విలపించినాడు. బిడ్డను వదలి అతడునూ పుష్కర తీర్ధము నుండి నిష్ర్కమించినాడు.   
ఆ శిశువునకు ఎండ తగులకుండ శకుంతల పక్షులు కాపాడినవి. ఆ దారిని వచ్చిన 'కణ్వుడు' అను  మహర్షి   ఆ శిశువును  తీసికొని పోయి పెంచినాడు. శకుంతల ములచే కాపాడబడిన ఆ బిడ్డకు  'శకుంతల' అని నామకరణము చేసినాడు.
    పుష్కర తీర్ధము నుండి పోయిన  విశ్వామిత్రుడు "కాశికి" అను  నదియొడ్డున ఆశ్రమమును నిర్మంచుకొని తిరిగి తపమును ప్రారంభించినాడు.
    ఇంద్రుడీమారు గాధేయుని తపస్సును భంగపరుచుటకు 'రంభ' అనెడు అప్సరపను పంపినాడు. ఆ సుందరి ఆడుచూ పాడుచూ ఆశ్రమము ముందర తచ్చాడుచూ గాధిపుత్రుని కంటపడినది. అతడిప్పుడు జితకాముడు (కామమును జయించినవాడు). ,మేనక వలన కలిగిన తపోభంగము జ్ఞప్తికి వచ్చి అతడు క్రుద్ధుడై రంభను "శిలగా మారిపోయి ఇచ్చటనే పడియుండుము!" అని  శపించినాడు... ఆమె  పాషాణమై నేలకు ఒరిగిపోయినది.
    మరుక్షణముననే అతడు పశ్చాత్తప్తుడైనాడు. "స్వామికార్యము నెరవేర్చ వచ్చిన ఈమెను నేను క్షమించి పొమ్మని యుండవలసినది! క్రోధమునకు వశ్యుడనై శపించి నా తపమును కొంత నేనే కోల్పోయినాను! కామక్రోధములను జయించులేని వానికి బ్రహ్మర్షిత్వమెట్లు సిద్ధించును? కామక్రోధములనే కాదు లోభామోహ మదమత్సరములనూ జయించవలెను... అరిషడ్వర్గమును నిరోధించి నిర్విఘ్నముగ తపమాచరించుటకు నేనిప్పుడు పూర్వదిశగా పోయి  సిద్దాశ్రమమును చేరుకొందును. పూర్వము శ్రీమహావిష్టువు తప మొనరించి సిద్దుడైన పుణ్యస్దలమది"
    సిద్దాశ్రమమున చేరిన పిమ్మట అతనికచట ఎట్టి ఆటంకములునూ కలుగలేదు. అతడు కొంతకాలము జలమునైననూ త్రాగకుండాగనూ, తుదకు ఊపిరిని కూడా బిగపట్టియూ ఉగ్రమగు తపమును చేసెను.
    అతనియందెన్నియో మార్పులు వచ్చినవి. రాజసము వీడి పోయినది. సత్వ గుణ సంపన్నుడై భాసిల్లినాడు.
    ఎట్టకేలకాతని లక్ష్యము సిద్ధించినది. బ్రహ్మదేవుడు ప్రత్యేక్షమై "గాధినందినా  నీవు  బ్రహ్మర్షివైనావు. ఇంక నీ  తపమును చాలించుము" అని పల్కి అంతర్హితుడైనాడు.
    వసిష్ఠుడా సంగతి తెలిసి  సంతోషించినాడు. ఆయనకు విశ్వామిత్రునిపై కోపములేదు. ఆ బ్రహ్మమానస పుత్రుడు సిద్దాశ్రమమునకేగుదెంచి "మిత్రమా, విశ్వామిత్రా బ్రహ్మర్షివైతివి. నిన్ను అభినందించుటకు వచ్చినాను" అన్నాడు.
     విశ్వామిత్రుడు బ్రహ్మనందభరితుడైనాడు. వసిష్ఠునకు శ్రద్దాసక్తులతో అతిథి సత్కారాములను చేసినాడు. వసిష్ఠు "బ్రహ్మర్షి పుంగవా, లోకహితార్ధము నీవొక యాగమును చేయుము" అని చెప్పి తన  ఆశ్రమమునకు తిరిగి పోయినాడు.                            

 Previous Page Next Page