పారును ఓ అయ్య చేతిలో పెట్టేరోజు దగ్గరికి వచ్చే సిందన్నమాట?.....
అలా అనుకొన్న క్షణం నుండి కృష్ణారావుకు ఊహలు చిత్రంగా రాసాగాయి. ఇంతకీ తన అల్లుడు ఎలా ఉండాలి. గొప్ప ఇంటివాడు కావాలి. అందంగా ఉండాలి. పెద్ద ఉద్యోగం. చేస్తుండాలి. తన కూతుర్ని పువ్వుల్లో పెట్టి పూజ చేసే వాడుకావాలి?
కృష్ణారావు నిస్పృహగా నవ్వుకొన్నాడు. వస్తువు విలువైన కొద్దీ దాని ఖరీదు పెరిగిపోతూనే ఉంటుంది. పెళ్ళి కొడుకుల విషయంలో ఇధి మరింత యధార్ధం ఈ పేదతండ్రి అంత గొప్ప సంబంధం ఎక్కడినుండి తీసుకు రాగలడు?
ఇంతకీ తన పారు ఎలాంటి అదృష్టం తెచ్చుకుందో.
రాత్రి రంగనాధం భోజనాలయిపోయాక, "కృష్ణారావ్ భోజనం అయిపోయిందా?" అంటూ వచ్చాడు
"రా, రంగా కూర్చో"
"పారిజాత చదువు మానేస్తుందట కదా? ఈ రోజు బళ్ళో అల్లరైందని వాళ్ళత్త చెప్పింది."
"అవును"
"ఆడపిల్ల బయట కాలుపెడితే ఇలాంటివి మామూలే. అలా చదువు పాడుచేసుకోవడం ఏం బాగుంది? అయినా ఇంట్లో కూర్చొని ఏం చేస్తుంది పారు?"
"పెళ్ళి చేసుకొంటుందట" కృష్ణారావు నవ్వబోయాడుగాని నవ్వు రాలేదు
"తనే చేసుకుంటుందటనా?"
"పారు ఇంకా అంత పెద్దది కాలేదులే"
"ఆ పిల్ల ఎంత తెలివి తక్కువ పని చేస్తుందో ఆ పిల్లకు తెలీకపోతే నీకు తెలియదా, కృష్ణారావ్? పెళ్ళి చేసుకోవాలనుకొంటే మాత్రం ముందుగా చదువు మానేసి కూర్చోవడమేమిటి? చదువుకొంటే పెళ్ళి పనికిరాదనా? పెళ్ళి అయ్యేనాటికి అవుతుంది గాని రేపటి నుండి బడికి పంపించు"
"దానికి చదవాలని లేకపోతే నేనేం చేయను?"
"ఆ పిల్ల ఇంకా చిన్నది జ్ఞానం తక్కువ. నువ్వు కళ్ళప్పగించి ఏం చేసినా ఊరుకోవడమేనా?"
"పారు చేత ఉద్యోగం చేయించే ఉద్దేశ్యం నాకు లేదు?" అభిమానంగా అన్నాడు కృష్ణారావు.
"నీ అభిమానం తగలెయ్య. ఆడది ఉద్యోగం చేస్తే అంత నామోషీ పడడమేమిటి?"
"ఆడది ఉద్యోగం చేయడం నామోషి కాదు, నా కూతురు ఉద్యోగం చేసి నాకు పెట్టడం మాత్రం నేను నామోషీగానే భావిస్తాను"
"నీకు పెట్టడం కోసం ఉద్యోగం చేయాలని కాదు. ఆ పిల్ల తన కాళ్ళమీద తను నిలబడడం బాగుండదూ."
"మరీ అంత కూతురుని పోషించలేని వాడిని కాదు! నాకు చేతనైనంతలో దాన్ని బాగానే చూస్తాను"
"నువ్వు శాశ్వతమా ఆ పిల్లకు?"
"నేను శాశ్వతం కాదు. కాని, నేను బ్రతికి ఉండగానే అదో ఇంటిదై వెళ్ళి పోతుందిగా? నా కర్తవ్యాన్ని నేను మరీ ఆలస్యం చేయకుండా పారు గుర్తు చేసింది. నీ ఎరికలో మంచి సంబంధముంటే చూడు. చూడచక్కని జోడీ కావాలి? పిల్ల జీవితం పూలవాన కావాలి!"
"ఆహాఁ? అయితే బాగానే వెనుక వేశావన్నమాట! ఎంత ఉందేమిటీ?" ఆశ్చర్యంగా ప్రశ్నించేడు రంగనాధం.
అప్పటికిగాని కృష్ణారావు మత్తుదిగి పోలేదు. "పైసా కూడా వెనక వేయలేదు. చూస్తున్నావుగా? పిల్లలకి పాఠాలు బాగా చెప్పగలనన్న పేరుతప్ప డబ్బు సంపాదించలేదు. ఏదో దిన చర్య గడిచి పోతున్నదంతే."
"పైసా కూడా వెనుక వేయలేదు. పైసా లేకుండానే పెద్ద శ్రీమంతుడిని అల్లుడిగా తెచ్చుకోవాలనుకొంటున్నావు" వెక్కిరించాడు. "నువ్వూ నీ కూతురూ ఒక్క మాదిరిగానే ఆలోచిస్తారన్న మాట! నువ్వు నీ కూతురికి చెప్పాల్సిందిపోయి నువ్వే నేలవిడిచి మాట్లాడతా వేమిటి?"
"నా కూతురికి గొప్ప సంబంధమే పడేలా చూస్తాను! జోలి కట్టి బిచ్చమెత్తుతాను. దాని పెళ్ళికోసం నా కూతురి అందం చూసి పెళ్ళి చేసుకొనేవా డెవడూ? దొరుకుతాడు. అందరూ కట్నాల కాసించేవాళ్ళే ఉంటారా? పిల్ల అందం చందం, గుణం చూచేవాళ్ళు ఎవరూ ఉండరూ?"
"ఉంటారేమో! పిల్లరూపం తప్ప వేరే కట్నం ఇవ్వలేనని, ఎవరైనా ఆదర్శయువకులుంటే పెళ్ళాడరమ్మని స్వయంవరం చాటించు."
"పరిహాసంకాదు, రంగా! నా పిల్ల అదృష్టవంతురాలు పెద్ద సంబంధానికే పడుతుంది చూడు."