ధీర మాటల్లో ఏదో అపశృతి లాంటిది ధ్వనిస్తూంది.
ఆర్తి కిదంతా నమ్మశక్యం కా లేదు.
సరిగ్గా ఏడు నెలల క్రితం ధీర ఓ సారిలా ఇంటికి వచ్చింది. అప్పటికి పెళ్ళి ప్రసక్తే రాలేదు. కానీ వాళ్ళ బామ్మ చివరి కోరికగా బావని పెళ్ళి చేసుకోక తప్పని సరైందీ అంటుంది అదీ అంత అసహజంగా లేదు. కానీ ఆ తర్వాత ఉత్తరం రాయకపోవడం గానీ, దానికి ఆమె ఇచ్చిన సంజాయిషీ గానీ అంత సంతృప్తికరంగా లేదు.
అంటే.....
ధీరకి ఈ పెళ్ళి అంత ఆనందాన్నివ్వలేదా?
తల్లి- తండ్రుల బలవంతం పైనే తప్ప తను ఇష్టపడి చేసుకేలేదా?
ఇష్టపడే చేసుకున్నదైతే అంత నిర్లిప్తంగా ఎలా చెబుతుంది?
అదికాదు ఆర్తిని ఇంకా కలవరపెడుతున్న విషయం.
పెళ్ళయిన ధీర ఇష్టమైన వ్యక్తి అంటూ అతడెవరో దయాకర్ గురించి నోరు జారింది. అదీ కాకుండా దయాకర్ చెల్లెలి పెళ్ళికి భర్తతో కాక ఒంటరిగా వచ్చింది.
" ఏమిటే ఆచూపులు?" ధీర ఆర్తిని తడుతూ అంది. " మూడ్ లో కి రాకుండా ఏదో ఆలోచిస్తూ నిలబడ్డావేమిటీ?"
వెంటనే అనుమానాల్ని నివృత్తి చేసుకోవడం సముచితంగా అనిపించలేదు ఆర్తికి.
" కాఫీ తీసుకురానా ?" అంది ఆర్తి.
"ముందు స్నానం గట్రా పూర్తి చేయనియ్."
ధీర ఆర్తి జవాబు కోసం ఎదురుచూడనట్టు ఎయిర్ బ్యాగ్ ని ఓ మూల వుంచి వెంటనే బాత్ రూంలోకి దూరింది.
కిచెన్ లో అడుగు పెట్టిన ఆర్తి ధీర కోసం భ్రేక్ ఫాస్ట్ చేస్తూ ఆలోచిస్తూనే వుంది.
యవ్వనంలో ని ఆశల సముద్రంపై ఆర్తిగా కదిలించిన ఆలోచనల చిన్ని పడవలు ఒక్కోమారు కాలం తాకిడికి మునిగిపోతే తనలా నిస్త్ర్రాణగా మిగిలిపోవాలిగానీ ధీరలా దూకుడుని ప్రదర్శించగలగడం ఎంత వరకూ సాధ్యం?
కలల పారవశ్యంతో అద్దుకున్న చిత్రాలు జీవిత గమనంలో అసంపూర్తిరేకలుగా మారితే వాస్తవం నిర్జీవంగా మారి భయపెట్టాలిగానీ ధీర ఇంత నిబ్బరంగా ఎలా మాట్లాడగలుగుతుంది?
అసలు అది నిబ్బరమేనా లేక నిబ్బరాన్ని నటించడమా?
" ఏమిటమ్మా కోడలుపిల్లా!" సరస్వతమ్మ వంటింటి ద్వారం దగ్గర నిలబడి వుంది. " నన్ను నీ ఇంట వుండమంటావా లేక బిచాణా ఎత్తి వెళ్ళిపోమంటావా? అవ్వ..... ఎంత స్నేహితురాలు వస్తే మాత్రం ఇంత విర్రవీగుడా? ముసలిముండకి కాస్త టిఫిన్ పెట్టాలన్న ధ్యాస లేకుండా...."
" రెండు నిమిషాలు కాదమ్నా!" ఆర్తి కంగారుగా అంది "తప్పయింది."
"తప్పు నీది కాదమ్మా!" సరస్వతమ్మ గొంతు స్థాయిని పెంచింది. "నీలాంటిదాన్ని కోడలుగా తెచ్చుకరున్ననాది. లాభం లేదు. వాడు రాగానే నిలదీసి అడుగుతాను. ఉండమంటాడో పొమ్మంటాడో ఈరోజే తేల్చుకుంటాను."
ఆర్తి అయిదు నిమిషాల్లో దోసెల్ని చేసి ఉల్లి చెట్నీతో బాటు డైనింగ్ టేబుల్ మీద వుంచింది.
పనిమనిషిని సాధింస్తున్నట్టు సరస్వతమ్మ మాట్లాడుతున్నా అందుకు బాధపడటంలేదు ఆర్తి. ఎప్పుడూ వున్నే. కానీ ధీర ఎప్పుడూ వుండేది కాదు. ఇదంకా వింటే సరస్వతమ్మతో పోరాటానికి సిద్ధపడుతుంది.
ఆర్తి ఇలా అనుకుంటుండగానే ధీర వచ్చింది.
డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని " నువ్వూ రావే" అంది ఆర్తిని చూస్తూ.
"నేను తర్వాతచేస్తాను. ముందు నువ్వు కానియ్" అర్ధింపులా అంది ఆర్తి.
సరస్వతమ్మ గొణగడం ఇంకా కొనసాగుతూనే వుంది. ఇంటికి వచ్చిన అతిథులు ఇలాంటి సమయంలో మనకెందుకులే అని మౌనాన్నిపాటిస్తారు సామాన్యంగా . కానీ ధీర పేరుగు తగ్గట్టు బాగా మొండిఘటం.
అందుకే సరస్వతమ్మకి చురుక్కుమనేట్టుగా అంది ధీర "అలా బెదురు చూపులతో నిలబడటానికి, అంట్లుతోమి, వంటచేసి మాటలు పడటానికి నువ్వేం ఇంటి పనిమనిషివి కాదే. చదువూ, సంస్కారం వున్న దానివి. ఈ ఇంటి కోడలివి. ఓ పెద్ద ఆఫీసరుకు భార్యవి.రా..... కూర్చుని భ్రేక్ ఫాస్ట్ చేయ్."
"నా సంగతి వదిలిపెట్టే" ఆర్తి రెట్టించింది.
కానీ ధీర వదిలిపెట్టలేదు.
తప్పనిసరైంది ఆర్తికి.
ఏనాడూ సరస్వతమ్మతో బాటు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోని ఆర్తి ధీర మూలంగా నియమాన్ని ఉల్లంఘించింది.
ఆ క్షణంలో సరస్వతమ్మ మొహంలో మారుతున్న రంగుల్ని గమనించిన ధీర వూరుకోలేదు.
ఆమెనింకా రెచ్చగొడుతున్నట్టుగా యూనివర్శిటీ కబుర్లు చెబుతూ చాలా అల్లరి చేసింది.
అసలు అక్కడ మూడో వ్యక్తి ఉన్నట్టే గమనించనట్టు చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తించింది ధీర.
ఇంకా ఆర్తి కంటిన్యూ చేసేదే.
కానీ ఆర్తి పడనివ్వలేదు.
గబగబా టిఫిన్ పూర్తిచేసి కిచెన్ లోకి పరుగెత్తింది.
ఇంటి పరిస్థితికన్నా ఇంట్లో ఆర్తి స్థితి ఇప్పటికి పూర్తిగా అర్థమైన ధీర వంటగదిలో నుంచి బెరుకుగా బెడ్ రూంలో అడుగు పెట్టిన ఆర్తిని నిలదీసింది.
"అత్తంటే అంత షేకవుతున్నావేమే?"
" వయసులో పెద్దదిగా."
ఆమె నవ్వింది ఆర్తి సంజాయిషీకి. " పెద్దవాళ్ళని గౌరవించడం తప్పని నేను అనను. కానీ నువ్వు భయపడుతున్నట్టుగా వుంది."