Previous Page Next Page 
పడిలేచే కడలితరంగం పేజి 7

 

    "కాని జీవితం వ్యాపారం కాదు."

    "జీవితం వ్యాపారం కాకపోయినా వ్యాపారం జీవితంలో ఓ భాగమని మీరు అంగీకరిస్తారనుకుంటాను."

    "అలా అని ఇంత బ్రతుకూ బ్రతికిన నేను నా కూతుర్ని అయిదులక్షలకు అమ్ముకోలేను."

    "ఇందులో అమ్మడమనే ప్రసక్తిలేదు రంగనాధం గారూ! జస్ట్ బార్డర్ సిస్టమ్.... ఇచ్చి పుచ్చుకోవటం....."

    రంగనాధంగారు మౌనంగా ఉండిపోయారు.

    "అయినా రేపు మీ పరిస్థితులు అస్తవ్యస్తమైతే మీ అమ్మాయికి పెళ్ళిమాటైనా తలపెట్టగలరా? ఎండ కన్నెరుగకుండా పెరిగిన శిల్ప అలాంటి పరిస్థితుల్ని తట్టుకొని నిలబడగలదా అన్న ప్రశ్నలు మీలో తలెత్తితే నా ప్రపోజల్ ని మీరు అపార్థం చేసుకునేవారు కాదు" కిరీటి మాటలు రంగనాధంగారిలో కొంత ఆలోచనని రేకెత్తించాయి.

    "అదీ గాకుండా ముక్కుసూటిగా అడిగానన్న నేరం తప్ప నేనెందులో తక్కువవాడ్ని..... అందం లేదా.... చదువు లేదా.... ఆస్తి లేదా.... ఇన్ వాట్ వే ఐయామ్ ఇన్ ఫీరియర్ టు యువర్ డాటర్."

    కిరీటి మాటల్లోని నిజాయితీ రంగనాధంగార్ని పూర్తిగా ఆకట్టుకుంది.

    నిజమే.... శిల్ప అంగీకరిస్తే నిజంగా కిరీటి అన్ని విధాలా అర్హుడే

    "వెల్..... మీ అంగీకారాన్ని రేపటిలోగా నాకు తెలియచేయండి. ఇందులో బలవంతం ఏమీలేదు."
 
    రంగనాధంగారు పైకి లేచారు.

    "మరొక్కమాట మీ అంగీకారాన్ని రేపు నాకు ఫోన్ దవారా తెలియచేస్తే స్వయంగా నేను వస్తాను..... పెళ్ళి చూపులనే ఫార్మాలిటీస్ తో కాకపోయినా శిల్పతో పర్సనల్ గా మాట్లాడాలని."

    యాంత్రికంగా ఇంటికి తిరిగి వచ్చిన రంగనాధంగారిలో ఊహించని ఈ సంఘటన పెద్ద సంచలనమే రేకెత్తించింది.

    ఎవరీ కిరీటి.... ఇంతవరకు తనకు పరిచయంలేని యీ వ్యక్తికి శిల్ప ఎలా తెలుసు...... శిల్పపై అంతటి మక్కువ ఏర్పడడానికి కారణం ఏమిటి?

    అసలు యీ విషయం శిల్పకెలా తెలియపరచటం.... అతడివ్వబోయే డబ్బుకీ తను నిలుపుకోవాలనుకుంటున్న పరువుకే మధ్య అనుసందానంలా నిలిచే ఈ బంధాన్ని శిల్ప హర్షిస్తుందా?

    సాయంకాలం వరకూ సందిగ్దంలో ఉండిపోయారాయన.

    ఆ రాత్రి భోజనాలయ్యాక శిల్పను డాబాపైకి తీసుకువెళ్ళారు.

    సందేహిస్తూనే భూషణ్ వచ్చింది మొదలు కిరీటిని కలిశాక అతడితో జరిపిన చర్చవరకూ అన్ని విషయాలనూ తెలియపరిచారు.

    అంతా విన్న శిల్పనుండి ఏ జవాబు రాకపోయేసరికి ఆయనలో ధైర్యం సడలిపోయింది.

    "ఇంతజరిగినా నిజానికి నేను అవుననిగాని కాదనిగాని ఏమీ కమిట్ కాలేదమ్మా.... కారణం ఇది నీ జీవితసమస్యని నిన్ను సంప్రదించకుండా ఏ నిర్ణయానికీ రాకూడదని....." సంజాయిషీ ఇస్తున్నట్టుగా ఆర్థోక్తిలో ఆగిపోయారాయన.

    డబ్బు అప్పిచ్చి వ్యవహారాన్ని కోర్టువరకూ లాగి విషమ పరిస్థితుల్ని సృష్టించి ఇప్పుడు ఆదుకుంటానని హామీ ఇవ్వటం కిరీటి తనకోసం పన్నిన ఓ వలలా అనిపించిందామెకు....

    తనను సమిధను చేయాలనే ఉద్దేశ్యంతో రగిల్చిన హోమంలా కనిపించింది ప్రతీకారవాంఛతో ఆమె మనసు అట్టుడిగిపోయింది.

    ఎవడైనా కానీ.... ఆ కిరీటికో గుణపాఠం చెప్పాలి.... డబ్బుతో పాముని కొనుక్కోగలడు కాని ఆ పగడ నీడన నిశ్చింతగా నిద్రపోలేడని నిరూపించాలి.

    "ఒప్పుకుంటున్నాను నాన్నగారూ!"

    గుండెల్ని దగ్ధం చేస్తున్న దావానలాన్ని ముఖంపై మెరియకుండా జాగ్రత్తపడింది.

    "కాని యీ యింటి పరువుకోసం నిలుచున్న పాటున నువ్విలా ఓ నిర్ణయానికి రావటం న్యాయం కాదమ్మా....." నొచ్చుకుంటున్నట్టుగా అన్నారు.

    "పాపం ఆయన చాలా ఔదార్యంతో మనకీ అవకాశమిచ్చారు నాన్నా! ఆలస్యం చేస్తే మనకు మిగిలేది అపఖ్యాతి మాత్రమే" మరోమాటకు అవకాశమివ్వకుండా ఆమె క్రిందికి వెళ్ళిపోయింది. ఎంతో రాద్దాంతం చేస్తుందనుకున్న శిల్ప అతిసునాయాసంగా అంగీకారాన్ని తెలిపేసరికి గుండెలపై నుండి పెద్ద బరువు దింపినట్టయింది రంగనాధంగారికి......

 Previous Page Next Page