తరువాత వాళ్ళవైపు తిరిగి "ఇందులోంచి కేవలం రెండు అగ్గిపుల్లలు మాత్రమే వేరే మరోచోటికి మార్చి నాలుగు చతురస్రాలు చేయాలి బెస్టాఫ్ లక్" అంది.
అందరూ బల్లచుట్టూ మూగారు.
"చేశాక చెప్పండి నేను అంకుల్ దగ్గరకు వెళుతున్నాను" అంటూ వెళ్ళి "అంకుల్ మీతో మాట్లాడాలి" ప్రకాశరావుగారితో అంది పద్మజ, వేరే గదిలో వున్న ఆయనతో.
"పద ! లోపలకు వెళదాం" స్టడీరూంలోకి దారి తీశారు.
"చెప్పు! మళ్ళీ ఏం సమస్య వచ్చిపడింది?" సోఫాలో కూర్చుంటూ అన్నారు.
"లార్కిన్ బ్రదర్స్ విషయం బయటపడ్డాక చాలా జాగ్రత్త పడుతున్నాం అంకుల్. డిపార్టుమెంటులో తప్ప మరెవ్వరికీ ఎలాంటి ఇన్ ఫర్మేషన్ తెలియకుండా చూస్తున్నాం. అయినా కొన్ని సీక్రెట్స్ బయటపడుతున్నట్లు అనుమానంగా వుంది" నౌక విషయం చెప్పింది.
"నీ ప్లాన్ ఏమిటి?" అడిగారు.
వివరించింది పద్మజ.
"బాగానే వుంది. ఎవరు చూస్తున్నారు ?"
"సోమశేఖరాన్ని పంపుదామనుకుంటున్నాను."
'గుడ్....కానీ...." రెండు మూడు సూచనలిచ్చాడు.
అందుకే ఆయనంటే అభిమానం పద్మజకి. ఆయన అనుభవం చాలా ఉపయోగపడుతుంది.
"థాంక్స్ అంకుల్."
"యు ఆర్ వెల్ కం బేబి! నా సహాయం నీకెప్పుడూ ఉంటుంది. సరేగానీ పెళ్ళి విషయం ఏం ఆలోచించావు? సంబంధం చూడనా" అడిగారు.
"త్వరలోనే చెపుతాను అంకుల్" అంటూ బయట కొచ్చింది.
"సమాధానం దొరికిందా?" పక్కగా వచ్చి సీక్రెట్ గా అడిగాడు గిరి, ఆమె రూంలోంచి బయటకు రాగానే.
"దేనికి?" ఒక్కక్షణం ఆమెకు అర్ధంకాలేదు.
"స్టడీ రూంలో అంతసేపుంటే అసలు సమాధానం మీకు తెలీదేమో, వెతుకుతున్నారేమో అనుకుంటున్నాను."
"అదా...." తేలిగ్గా నవ్వేసింది. "సమాధానం నాకు ముందే తెలుసు. అక్కడి పుస్తకాలలో దొరికుతోందనుకొంటే వెళ్ళి వెతకండి. నాకు అభ్యంతరం లేదు."
"ఏమిటోనండీ. ఇవ్వాళ బుర్రసరిగా పనిచేయడం లేదు. తెలివితేటలన్నీ హరించిపోయాయనిపిస్తోంది."
"పోనీ, ఈసారి కాస్త మతిని దిగుమతి చేసుకోండి.
"తెప్పించుకోవడం దేనికి ? ఇక్కడే దొరుకుతుందిగా" అతని చూపులని తట్టుకోలేక తల తిప్పుకుంది పద్మజ.
"డిన్నర్ రెడీ అనుకుంటాను పదండి" అని మాట మార్చింది.
పద్మజ వెనకే వచ్చి ఆమె ప్లేట్లో ఏమేం పెట్టుకొంటోందోనని గమనిస్తూ నిలబడ్డాడు గిరి.
"ఏమిటి అలా చూస్తున్నారు వడ్డించుకోండి."
"ఉహు....తెలివితేటలు కలగటానికి మీరేం తింటారో తెలుసుకుందామని చూస్తున్నాను.
అతని మొహం చూసి ఫక్కున నవ్వింది పద్మజ.
పద్మజ యింటికి వచ్చేసరికి పదకొండవుతోంది. హాల్లోనే కూర్చుంది హిమజ.
"ఎప్పుడొచ్చావు? పార్టీకి రాలేదేం ?"
"కళాభవన్ లో నేపాల్ బొమ్మల ప్రదర్శన మీద ఆర్టికల్ తయారు చేస్తున్నానక్కా! అక్కడే ఆలస్యమై పోయింది" అంది హిమజ.
ఫోన్ మోగింది.
ఈ టైంలో ఎవరు? సోమశేఖరమా? సాలోచనగా ఫోన్ తీసింది పద్మజ.
"హలో జీనియస్" అవతలవైపు నుంచి వినిపించింది.
"మీరా" అంది ఆశ్చర్యంగా.
"మీరాని కాదు గిరిని."
"పాత జోకే. ఏమిటి యింతలోనే ఫోన్ ?"
"పజిల్ కు జవాబు చెప్తారేమోనని - తెలుసుకుంటేగాని నిద్రపట్టేలా లేదు. అసలా పుల్లలు తీయకూడదా?"
"లేదు- ఆ 17 పుల్లలతోనే, కేవలం రెండు పుల్లల్ని వేరేచోటికి మార్చి నాలుగు చతురస్రాలు చేయాలి."
"రావటం లేదు."
"అందుకే రాత్రంతా కూర్చుని ప్రయత్నించండి. తెలుస్తుంది. ఫోన్ లో చెప్పేది కాదు."
"సరే మీరు చెప్పాక తప్పుతుందా. అలాగే చేస్తాను. ప్రొద్దుటేవచ్చి చూపించాలని ఉంది, రమ్మంటారా?"
"పొద్దున్నే నేను ఆఫీసుకు వెళ్ళిపోవాలి. సారీ, చాలా ముఖ్యమైన పనులున్నాయి."
"మీ కెప్పుడు వీలవుతుందో చెప్పండి. అప్పుడే వస్తాను."
"ఊ__మధ్యాహ్నం ఒంటిగంటా ప్రాంతంలో యింటికి వస్తాను. లంచ్ కి. అప్పుడు రండి."
"ఏమిటి భోజనానికే రమ్మంటున్నారు?" సంభ్రమంగా అడిగాడు.
"ఆ_భోజనానికే రమ్మంటున్నాను- తప్పేంలేదుగా ?"