Previous Page Next Page 
విశిష్ట పేజి 6

     మరునాడు కరుణ చెల్లెలు మళ్ళీ వచ్చింది. "విశిష్టక్కా! అమ్మ నిన్ను పిలుచుకురమ్మంది."

    "దేనికి?"

    "ఏమో మరి!"

    విశిష్ట వెళ్ళేసరికి కరుణ ఇంట్లోనే వుంది.

    "ఏమిటమ్మా ఈ గొడవ? మా నెత్తిన ఏదో పిడుగు విరుచుకుపడుతున్నట్టుగా వుంది" విశిష్ట వెళ్ళగానే అందుకొందామె.  "మీ కాలేజీలో ఎవరో పృధ్వీ సార్ అట. ఆయన్ని తప్ప ఇంకెవరినీ పెళ్ళాడనంటుంది నీ స్నేహితురాలు! ఎవరమ్మా అతడు? మంచివాడేనా?"

    "నాకేం తెలుసునండీ? మీ అమ్మాయికే బాగా తెలుసు అతడి గురించి."

    "దాని మాటల మీద నాకు నమ్మకం కలుగనందునే నిన్ను పిలిచి అడుగుతున్నది, వాళ్ళు బాగా వున్నవాళ్ళట. వాళ్ళ నాన్న పెద్ద పొలిటికల్ లీడరట.ఆయనకి ఏదో మినిస్ట్రీ కూడా వుందంది. మనబోటి మధ్యతరగతి వాళ్ల సంబంధం చేసుకొంటారటనా?"

    "నాకేం తెలుసునని ఆ సంగతులన్నీ నన్నడుగుతున్నారండీ?"

    "కాలేజీలో నువ్వతడిని ఎరుగనే ఎరుగవా?"

    "ఎరుగుదునండీ! క్లాసులో ఇంగ్లీష్ పాఠాలు చెబుతాడు కదా? ఇంగ్లీష్ ప్రొఫెసర్ అని ఎరుగుదును ఇంకొకరకంగా కూడా ఎరుగుదును. ఇంకా పెళ్ళికాలేదని, వట్టి దగుల్బాజీ అని ఆడపిల్లలను ఆకర్షించి మోజుతీర్చుకుని వదిలేసే రకమని....." మంటగా అంది విశిష్ట.

    "మరి ఇది ఇలా చెబుతుంది ఏమిటి? చాలా మంచివాడనీ, తనంటే చాలా ఇష్టపడుతున్నాడనీ......." ఆవిడ బుగ్గలు నొక్కుకుంది విడ్డూరంగా.

    అక్కడే వున్న కరుణ కోపంగా చూసింది. "పోయి పోయి దీని సాక్ష్యమే కావలసి వచ్చిందా అమ్మా? కాలేజీలో పృధ్వీసారంటే ఆడపిల్లలందరికీ క్రేజీ తెలుసా? అతడు మనసుపడ్డది మాత్రం నామీదే! దీనికేదో ఈర్ష్యపుట్టినట్టుంది నన్ను చూసి. అందుకే అలా చెబుతోంది."

    "చెప్పుతీసుకు కొడతాను ఆ మాట అన్నావంటే. నిన్ను చూసి ఈర్ష్య పడ్డంలేదే. జాలిపడుతున్నాను. ఇంత గుడ్డిగా నువ్వతడి వల్లో పడ్డందుకు. నువ్వు చదివిన చదువు నీకెందుకూ ఉపయోగపడనందుకు బాధపడుతున్నాను" విశిష్ట అరిచినట్టుగా అంది.

    "కొంచెం నెమ్మదిగా మాట్లాడు తల్లీ! ఈ విషయం ప్రక్కింటివాళ్ళ చెవిలో పడిందా వూరంతా చాటింపు వేస్తారు.....ఇది అతడు తనని పెళ్ళి చేసుకుంటానని చెప్పాడంటుందేమిటి?" కరుణ తల్లి మొత్తుకొన్నట్టుగా అంది.

    "అతడి మీద వ్యామోహంతో దీని కళ్ళు మూసుకుపోయాయండీ. అయినా మనమెందుకు తర్జనభర్జన పడాలి? బాబాయిగారిని వెళ్ళి అడగమనండి ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకొందామని, అతడు ఒప్పుకుంటే సంతోషించే వాళ్ళలో ముందు నేను వుంటాను. ఎందుకంటే నా చిన్ననాటి స్నేహితురాలు కాబట్టి. లేదంటే దీని పిచ్చి వదులుతుంది."

    కరుణ తల్లి విమలమ్మ భర్తకు పోరుపెట్టి పంపింది.

    "నేను మీ స్టూడెంట్ కరుణ తండ్రిని. శేషగిరిరావు నా పేరు" అంటూ తనని పరిచయం చేసుకున్నాడాయన." రాజభవనంలా వున్న వాళ్ళ ఇల్లు, ఇంటి ముందున్న సెక్యూరిటీ, గేటు దగ్గర కట్టేసిన కుక్కలు అదంతా చూసినప్పుడే ఆయన ఆశ సగం చచ్చిపోయింది.

    "అలాగా - వచ్చిన పని చెప్పండి?" పృధ్వీ నింపాదిగా అన్నాడు. 

    "అదే.....అదే....మా కరుణని మీరు పెళ్ళి చేసుకుంటానన్నారట!" ఆయన మాటల్ని కూడసీదుకొంటున్నట్టుగా అన్నాడు.

    ప్రపంచంలోని ఆశ్చర్యాన్నంతా ముఖంలోకి తెచ్చిపెట్టుకొన్నాడు పృధ్వీ.  "ఆ మాట ఎవరు చెప్పారు మీతో?"

    "అది.......కరుణే చెప్పింది. మీరు ఒకరినొకరు ఇష్టపడ్డారని, మీరు దాన్ని పెళ్ళి చేసుకొంటానన్నారనీ....."

    "వా! ఇంత కథ అల్లిందా ఆ పిల్ల? క్లాసులో పాఠాలు అర్ధం కాలేదంటే రెండు రోజులు ఇంటికి వచ్చి చెప్పించుకోమన్నాను. వచ్చి చెప్పించుకొంది. ఆ పిల్ల మనసులో ఇన్ని ఊహలున్నట్లు అర్ధం చేసుకోలేక పోయాను" ఆశ్చర్యాన్ని వర్షంలా కురిపించాడు.   "కరుణ నా స్టూడెంటు! అంతకు మించి వేరే అభిప్రాయం నాకు లేదు. ఇక మీరు వెళ్ళవచ్చు! నమస్కారం" కుర్చీలోంచి దిగ్గున లేచి నమస్కారం పెట్టాడు. పృధ్వీ.
 
    "నమస్కారం!" తనూ నమస్కారం పెట్టి లేవక తప్పిందికాదు శేషగిరిరావుకు.
 
    ఇంటికి వస్తూనే చెడామడా తిట్టాడు కూతుర్ని.

    "చదవేస్తే వున్నమతి పోయింది దీనికి. కనీసం పి.జి. అన్నా చేయిస్తే గవర్నమెంటుదో, ప్రయివేట్ దో ఏదో ఒక ఉద్యోగం చేసి తన కాళ్ళ మీద తను నిలబడి, మనకింత బరువు తగ్గిస్తుంది కదా అనుకొన్నాను. ఇది ఎంత పని చేసిందో చూడు. వాడితో సినిమాలకి షికార్లకీ తిరిగి నలుగురి దృష్టి లోనూ పడింది. వాడేమో పెళ్ళి చేసుకోనంటున్నాడు, నాకెంత తలవంపులు తెచ్చిపెట్టింది" ఆయన ఉత్తరీయంతో ముఖం తుడుచుకుంటూ కుర్చీలో కూలబడ్డాడు. "అందుకే........ఈ ఆడముండల బుద్దులు ఇలా ఏడుస్తాయనే 'ఆష్టవర్షా భవేత్ కన్యా' అంటూ ఎనిమిదేళ్ళకే పెళ్ళిళ్ళు చేసి గడప దాటిస్తున్నారు. వెనుకటి వాళ్ళదంతా చాదస్తమని మనం పిల్లల్ని చదివిస్తుంటే బాగా బుద్ది చెప్పింది పాడుముండ. చదివిన చదువుచాలు రేపటి నుండి అది కాలేజీకే కాదు దేనికీ గడప దాటడానికి వీల్లేదు. అది గడప దాటిందో ముందు నిన్ను చంపేస్తాను" అత్త మీద కోపం దుత్త మీద తీర్చినట్టుగా ఆయన భార్య మీద ఎగిరాడు.

    "ఇంతకీ ఏమన్నాడండీ?"

    "రాజభవనం లాంటి ఇల్లు. ఇంటి ముందు పులుల్లా కట్టేసిన కుక్కలు. అడుగడుగునా సెక్యూరిటీ మూడు నాలుగు కార్లు. వాడి తండ్రి హోంమినిస్టరే! వాళ్ల ఇంట్లో అడుగు పెట్టడానికి నానా అవస్థా పడాల్సి వచ్చింది. అంతటి వాడిని పట్టుకొని నా బిడ్డను పెళ్ళి చేసుకొంటావా అని అడిగితే చేసుకుంటాడా? నయం! మెడపట్టి బయటికి గెంటించకుండా మర్యాదగా నమస్కారం పెట్టి బయటికి పోమన్నాడు" అంటూ అక్కడ జరిగిన సంభాషణ గురించి చెప్పాడు.

    ఆవిడ ఉస్సురుమని తల పట్టుకొంది.

 Previous Page Next Page