Previous Page Next Page 
తులసి పేజి 6

    విషాచి ఆనందంతో కదిలిపోయాడు. చేతులు సాచి దార్కాని కౌగిలించుకుని "అమోఘం అమోఘం దార్కా, నీ తెలివితేటలు అపారం. ఇన్నాళ్ళకి నా పగ తీరుతుందనే నమ్మకం నాకు కల్గుతుంది" అన్నాడు ఆనందంతో. అంతలో అతడి ముఖంలో సంశయం పొడచూపింది - "కానీ సమయం చాలా తక్కువ."

    దార్కా విస్మయంతో "దేనికి?" అన్నాడు.

    "అన్నీ చెప్పిన నీకు ఒక్క నేనొక్కటి మాత్రం చెప్పలేదు" అన్నాడు విషాచి - "అది కాష్మోరా"

    దూరంగా ఒక గుడ్ల గూబ ఉన్నట్టుండి వికృతంగా అరిచింది. ఎక్కడో ఒక కుక్క వికృతంగా ఏడ్వడం మొదలు పెట్టింది.

    "కాద్రా తులసిమీద కాష్మోరాని ప్రయోగించాడు. కాద్రా మరణంతో కాష్మోరా అసంతృప్తుడై తిరిగి నిద్రలోకి జారుకున్నాడు. మళ్ళీ పదకొండు సంవత్సరాల తర్వాత కాష్మోరా నిద్రలేస్తాడు. ఆ తులసి ఎవరో ఆమెను పీల్చుకుతింటాడు ఎక్కడున్నా సరే అందుకని. ఈ లోపులోనే మనం ఆచూకీ తెలుసుకోవాలి. తులసి మరణం జరగాలి. మనకి తులసితో సంబంధం లేదు."

    "అవును ఇంకెంతో సమయం లేదు. అయిదారు సంవత్సరాలు -అంతే . ఈ లోపులో విశాలమైన ఆంధ్ర దేశం అంతా గాలించాలి. అందులో ఎంత మంది తులసిలు దొరుకుతారో తెలీదు. ప్రతి తులసికీ పరీక్ష పెట్టాలి. కాష్మోరా నిద్రలేచే లోపులో ఇది జరగాలి."

    "నా అనుమానం అదికాదు దార్కా"

    "మరి"

    "నువ్వు వెళ్తున్నది నాగరిక ప్రపంచంలోకి. నీ కన్నా తెలివి గల వాళ్ళు, మోసగాళ్ళు అక్కడ వుంటారు. దానికి కూడా భయపడటంలేదు నేను. నీ వయసెంత?"

    "పదహారు."

    "పదహారేళ్ళ యువకుడివి. ఎలా? ఒక యువతి రక్తపు గుడ్డను సంపాదించగలవ్ నువ్వు?"

    దార్కా నెమ్మదిగా అన్నాడు. "కష్టం- చాలా కష్టం - నాగరిక ప్రపంచంలో మరీ కష్టం. అందుకే కదా విషాచీ నువ్వు ఈ పనికి నన్ను ఎన్నుకున్నావ్" ఆ మాటలకి విషాచి సాలోచనగా దార్కా కళ్ళలోకి చూసేడు. చాలాసేపు ఇధ్దరూ ఒకరి కళ్ళలోకి ఒకరు కన్నార్పకుండా చూసుకున్నారు. దార్కా ముఖంలో ఏ భావం లేదు. విషాచి తల పంకిస్తూ "చెయ్యగలవ్ నువ్వు చెయ్యగలవ్ నాకు తెలుసు" అన్నాడు.

    "చేస్తాను విషాచీ. నా ప్రాణం పోయేలోపులో ఆ ముగ్గురి ప్రాణాలు తియ్యటం ఖాయం. ఒకర్ని మానసికంగా చంపుతాను. ఇంకొకర్ని దగ్ధం చేస్తాను. మరొకర్ని......."

    "నీ ప్రతిజ్ఞ నాకు గుర్తుంది దార్కా., దాన్ని నువ్వు మాటిమాటికీ జ్ఞాపకం చెయ్యక్కర్లేదు, నాలుగు సంవత్సరాల క్రితం నువ్వు కాద్రా సమాధి దగ్గర చేసిన ప్రతిజ్ఞని ప్రతి క్షణమూ ప్రతి రాత్రీ నేను మననం చేసుకుంటూనే వున్నాను. కానీ ఇంకొక్క అనుమానం నేను నీకు చేతబడి నేర్పాను, వశీకరణం నేర్పాను. దృష్టి కేంద్రీకరించి ఎదుటి వస్తువుని భస్మీపటలం చేసే అరుత్యుంగ విద్య నేర్పలేదు. మరి నీ శత్రువుల్లో ఒకరిని ఎలా భస్మం చేస్తావు దార్కా?"

    మొదటిసారి ఓడిపోయినట్టు తల వంచుకున్నాడు దార్కా.......విషాచి అతని భుజంమీద చెయ్యివేసి, "నువ్వు మాట తప్పనక్కర్లేదు దార్కా, నీకు నేను ఆ విద్యను కూడా నేర్పుతాను"

    దార్కా విస్మయానందాలు నిండిన మొహంతో "విషాచీ" అన్నాడు

    "అవును. కొన్ని వేల సంవత్సరాలక్రితమే నిక్షిప్తమైపోయిన ఈ విద్య నా ఒక్కడికే తెలుసు. అది నా తోనే అంతరించి పోవాలనుకున్నాను. కానీ ఈ క్షణం నా ప్రత్యర్ధుల్ని చంపబోతున్న నీకు ఆఖరి విద్యగా దాన్ని నేర్పబోతున్నాను. ఈ క్షణమే ఈ రాత్రేదాన్నినీకు నేర్పుతాను. రేపొద్దున్న తెల్లవారకముందే బిస్తా గ్రామాన్ని వదిలిపెట్టి నువ్వు వెళ్ళిపోవాలి . సరిగ్గా ఐదు సంవత్సరాల కాలంలో నీ పని పూర్తవ్వాలి. నాగరికుల మద్య నాగరీకుడిలా మెలగుతూ ఈ కార్యం సాధించాలి. నీ శత్రువును తెలుసుకున్న మరుక్షణం నీ కళ్ళతో బడబాగ్ని సృష్టించి అతడిని చంపాలి. ఇంకో అయిదు నిమిషాల్లో వెలుగు చుక్క పొడిచే సమయానికి నీకా విద్య నేర్పుతాను. పద దార్కా శ్మశానానికి పద."

    దార్కా కదల్లేదు.

    "రేపు నేను వెళ్ళిపోతున్నాను. ఇన్నేల్ళుగా నాలో మెదుల్తున్న ఒక అనుమానానికి ఈ చివరి క్షణం జవాబు చెప్పు, ఈ గ్రామ పెద్దవి నువ్వు. అది సరే, కానీ మరో ముగ్గురు వచ్చి ఒక మంత్రగాణ్ని చంపితే దానికింత పగతో నువ్వు రగిలిపోవటం దేనికి?"

    విషాచి నెమ్మదిగా తలెత్తాడు. ఆ నీరవంలో అతడి కంఠం అస్పష్టంగా పలికింది. "కాద్రా నా కొడుకు కాబట్టి"

    దార్కా విస్మయంతో అతడి దృఢమైన శరీరం కేసి చూస్తూ "విషాచీ, నీ వయసెంత?" అని అడిగేడు.

    "ఎంతనుకుంటున్నావింతకాలం" అంటూ నవ్వేడు.

    "యేభయి సంవత్సరాలు"

    "మూర్ఖుడా! నా వయసు నూట ముప్ఫయి అయిదేళ్ళు"

 Previous Page Next Page