Previous Page Next Page 
అష్టదళం 2 పేజి 6

     ఒళ్ళంతా ఏదో పులకింత.

     "ఇది మారుతి మంత్రం. మండలం అంటే నలభై ఒక్కరోజు ఎక్కడైనా ... ఏకాంతంగా ... అదీ ఆంజనేయస్వామి క్షేత్రం అయితే మరీ మంచిది. నీ దీక్ష అక్కడ కొనసాగించు. దీక్షపూర్తి అవుతున్న సమయం  దగ్గరపడుతున్న కొద్దీ శరీరంలో జ్వాలలు చెలరేగుతాయి. ముఖం ఎర్రబారుతుంది. స్వామి పరీక్షకు గురిచేస్తాడు. ముఖ్యంగా నిన్ను జడిపించాలని చూస్తాడు. భయపడకు. నిశ్చల మానసంతో నీ దీక్ష కొనసాగించు. ఆయన ఏ రూపంలో వచ్చినా భయపడకు. స్వామి  సాక్షాత్కరిస్తాడు. స్వామి అనుగ్రహం పొందవా, నీకీ ప్రపంచంలో ఎదురన్నదిలేదు. ఈ చంద్రరేఖ నీ ముందు పిల్లికూన అవుతుంది."

     సూర్య మట్లాడలేదు. నిశ్సబ్దంగా వున్నాడు.

     "ఏమిటి సూర్యా! నిశ్శబ్దంలో పడ్డావు? ఎక్కడ అమెరికా చదువు? ఎక్కడ ఏటిలో మంత్రోపదేశం అని ఆలోచిస్తున్నావా? నీ సైన్స్ కూ, వైద్యశాస్త్రానికీ అందని అధ్బుతాలెన్నో వున్నాయి ఈ ప్రపంచంలో  అసలు ఈ సృష్టే ఒక అధ్బుతం. ెంతో తెలుసనుకుంటున్న  మీ సైంటిస్ట్  ఈ భూమి తిరగడం ఆగిపోతే త్రిప్పగలడా? రుతుచక్రాన్ని శాసించగలడా? నువ్వెంత చదువుకున్నా, నీ వూహకి  అందని అధ్బుతాలెన్నో వున్నాయి. అందులో మంత్రశాస్త్రం ఒకటి. వైద్యం శాస్త్రం చెప్పలేని ప్రశ్నలెన్నిటికో  మంత్రశాస్త్రం చెబుతుంది జవాబు. నేను ఉపదేశించిన మంత్రాన్ని క్రమబద్దంగా జపించు.  నా మాట నిజమో, కాదో నీకే తెలుస్తుంది. మన గురుశిష్యుల సంబంధం  ఈనాటితో మొదలైందికాదు. జన్మజన్మలుగా మనం గురుశిష్యులమే. నువ్వు నన్ను వెతక్కపోయినా నేనే నిన్ను వెతుకుతూ వచ్చాను."

    "అమెరికాలో  చదివి డాక్టర్ని" అన్న అహంభావం  వదిలింది సూర్యకి.

     "నీ మండలదీక్షకు ఎక్కడ బావుంటుందో కూడా సూచిస్తాను. ఇధే కృష్ణాతీరంలో బీచుపల్లి పేరుతో ఆంజనేయస్వామి వెలిసాడు. ఆయన  గధ్వాల సంస్ధానాధీసుల కలలో కనబడి 'నేను ఫలానాచోట  భూగర్బంలో వున్నాను. నన్ను వెలుపలికి తీసి, గుడి కట్టించండి అని సెలవిచ్చాడట. రేపు ఉదయం మొదటగా నా దగ్గరికి వచ్చిన వ్యక్తినే నాకు అర్చకుడిగా నియమించండి.'  అని కూడా  చెప్పాడట. కలలో సూచించిన ప్రకారం స్వామి విగ్రహం బయటపడింది. మొదటగా అక్కడికి  పశువులు తోలుతూ ఒక బోయ కుర్రాడు వచ్చాడు. స్వామి అభీష్టం మేరకు అతడు స్వామి పూజారి అయ్యాడు. ఆ కుర్రవాడి పేరు బీచుపల్లి.  ఆ పేరుమీదే స్వామి పూజలందుకుంటున్నాడు. గద్వాల సంస్ధానాధీశులే ఆచయనకు గుడీ, భక్తులు వుండడానికి సత్రాలు కట్టించారు.  కృష్ణాతీరంలో అతి ప్రశాంతంగా వున్న ప్రదేశం అది.ఆ ప్రదేశానికి మరో విశిష్టత కూడా వుంది. శకుంతలను  పెంచిన  కణ్వముని ఆశ్రమం అక్కడే వుండేది.  అక్కడొక కలిమిచెట్లు, ఆ చెట్టు చుట్టూ బ్రహ్మాండమైన వల్మీకం వున్నాయి. రోజూ ప్రాతఃసంధ్యలలో కృష్ణలో  మునిగి స్వామి దర్శనం చేసుకుని,  ఆ వల్మీకం సమీపంలో జనం చెయ్యి. స్వామి దర్శనం సత్వరం చేకూరుతుంది. విజయోస్తు."

    గ్రహణం విడిచింది.

     గ్రహణం విడిచిన చందమామ మేఘబాలలతో ఆడుకుంటుంటే, ప్రకృతి పండు వెన్నెల సింగారించుకుని  మురిసిపోయింది.

     నిధి రహస్యం ఆత్మానందులు చెప్పలేదు. సూర్యకి అడగాలనిపించలేదు. అతడిలో మోహాపాశాలు వదులుతున్న భావన.


                         *    *    *    *    *


    ఉదయ సంధ్యలలో కృష్ణానదిలో స్నానం, స్వామి సేవ. కణ్వముని ఆశ్రమం వుండేదని చెప్పబడినచోట కలిమిచెట్టు కింద అరుగుమీద జపానుష్టానికి కూర్చునేవాడు సూర్య.  చుట్టూ దడి కట్టినట్టుగా పంట పొలాలు, విరిసిన జొన్నకంకులు. వాటిమీద వాలే రకరకాల పిట్టలు. అవి చిన్న చిన్న రెక్కలతో ఎగురుతూ చేసే కలకలం.

     సూర్యకి చాలా ప్రశాంతంగా సాగిపోతున్నాయి రోజులు.

     తెల్లటి లుంగీ, భుజంమీద ఉత్తరీయం.

    రాందత్ వండిపెట్టే సాత్వికాహారం, అతి నిరాడంబరమైన జీవితం

    రాత్రివేళ స్వామి మండపంలో పడక, అదీ వట్టి బండరాళ్లమీద ఉత్తరీయం పరుచుకుని.

     తను భూపాల్ గారి కుమారుడినని, అమెరికా వెళ్ళి చదివి, వచ్చిన డాక్టర్ నని మరచిపోయాడు. అతడికి గుర్తు వున్నది ఒక్కటే. తనొక సాధకుడు.

    మితాహారంవల్ల అతని శరీరం శుష్కించడం  మొదలుపెట్టింది. కానీ, ఆ శుష్కవదనంలో  ఏదో వింత తేజం. ఆ కళ్ళల్లో వినూత్న కాంతి.

     రోజంతా మౌనం. ఒకటి  రెండు మాటలకంటే ఎక్కువ మాట్లాడడంలేదు.

     మండలంలో సగం రోజులు ఏ గడబిడ లేకుండా గడిచిపోయాయి. జీవితం ఎంతో ప్రశాంతం అనిపించింది. ఆ తరువాత నెమ్మదిగా మొదలైంది శరీరంలో తాపం. ఒళ్లంతా మంటలు. కళ్లు మంటలు. ముఖం సింధూరం పూసినట్లుగా ఎర్రబడిపోయేది. ఇరవైనాల్గు గంటలు కృష్ణవేణిలో చల్లగా మునిగి కూర్చోవాలనిపించేది.

     అసలు నిద్రపోయే టైమే తగ్గింది. రాత్రి పదిగంటలకి పడుకుంటే, తెల్లవారుజామున నాలుగు గంటలకే  లేచి కృష్ణకు వెళ్లిపోయేవాడు. కన్నుమూసినా  ఆ కాసేపటిలో ఏవో కలలు. భయంకరంగా ఏవో భూతాలు వచ్చి తనను  ఈడ్చుకుపోయి, తలా కాస్త పీక్కుతింటున్నట్లుగా ఏవో  వింత ఆకారాలు వచ్చి తనమీద కత్తులతో దాడి చేస్తున్నట్లుగా!

    స్వామి సన్నిధిలో సాధనలో వున్న సమయంలో, ఇంకా ఎందుకు జరుగుతూందో తెలియడంలేదు సూర్యకు. జనం కూడా నిశ్చలంగా చేసుకోలేకపోతున్నాడు. చెవుల్లో ఏవో శబ్దాలు, బ్రహ్మాండం బద్దలైపోతున్నట్లుగా ఏవో పెద్ద పెద్ద శబ్దాలు. జపానికి కూర్చుంటే, నేల కదిలిపోతున్నట్లుగా అనిపించేది.

     ఇంకా ఏవో వింత అనుభవాలు.

     జపం గిపం వదిలేసి పారిపోదామా అనుకున్నాడు.

     మండలం రోజులు పూర్తిచేయకుండా మధ్యలో వదిలివేయడం మంచిదికాదని తన మనసునే నచ్చచెప్పుకున్నాడు. చావో బ్రతుకో ఇక్కడే తేలాలి అని మనసు ధృఢం చేసుకున్నాడు, ఎన్ని అనుభవాలైనా ఎదురుగానీ, నిజంగా భూతాలే  వచ్చి పీక్కుతినని, తన వంటిమీద తెలివి వున్నంత వరకూ, తన పెదవులు కదిలే శక్తి కలిగి వున్నంతవరకూ దీక్ష విరమించేది లేదు అన్న కఠోరనిశ్చయానికి వచ్చేశాడు.

    ఆ  రోజు నాలుగు గంటలకే కృష్ణలో స్నానం చేసి, స్వామి గుడి చుట్టూ ప్రదక్షిణాలు ముగించి కలిమి చెట్టుకింద ధ్యానానికి కూర్చున్నాడు.

    మనస్సంతా  లగ్నం చేసి జపం చేస్తున్న అతడికి తెలియదు. బారెడు పొడుగున్న కృష్ణసర్పం ఒకటి అతడిని పెనవేసుకుని సరిగ్గా అతని కంఠం దగ్గర పెద్ద దోసిలంత  పడగ విప్పిందని.

     జొన్నచేను కావలికి వచ్చి, మంచంమీద పడుకున్న రైతు అప్పుడే లేస్తూ ఆ దృశ్యాన్ని చూసాడు. అతనికి గుండె ఆగినంత  కునయింది.

     దెయ్యాలు పట్టినవాళ్లు, స్వామి సేవకు వచ్చినవాళ్లు మండలమో, అరమండలమో వుండి వెళ్లేవాళ్లను అతడెరుగును. ఉదయం, సాయంత్రం  స్వామి చుట్టూ ప్రదక్షిణాలు చేసి వచ్చి, తెల్లవారకముందే కలిమి చెట్టువద్దత ధ్యాననిమగ్నమయి సూర్యుడు తన వాడి కిరణాలతో పొడిచి పొడిచి  నడినెత్తిమీదకి వచ్చేదాకా జపం చేస్తూ కూర్చొనేవాడిని ఇప్పుడే  చూస్తున్నాడు.

     రైతు పెద్దగా అరవబోయాడు. కానీ శబ్దం గొంతులోనే వుండిపోయింది. ఆ అలికిడి అయినా పాము అదిరి అతడిని కాటేసే ప్రమాదం వుంది. పాము స్పర్శకు అతడు కళ్లు తెరిచి అతడు కంగారుపడినా ఆ ప్రమాదం తప్పదు.

     తూరుపు వాకిలి తెరుచుకుని సూర్యభగవానుడు తన రథాన్ని అదిరోహించి సప్తాశ్వాల పగ్గాలు చేతబట్టుకున్నాడు. ఉషఃకాలం ఆయనకి స్వాగతం పలుకుతూ, వసంతోత్సవం జరుపుకుంటున్నట్లుగా తూరుపు వాకిలి ప్రాంగణమంతా గులాలు చల్లింది.

     ఆ ఎర్రరంగుల మబ్బులమీదే సూర్యుని రధం సాగి  వస్తోంది.

     ఆయన రాకతో రాత్రంతా రాజ్యమేలిన చీకటి తెరలు ఎక్కడి వక్కడ అదృశ్యమవుతున్నాయి. చెట్లుకొమ్మల్లో నిదురించిన పక్షులు లేచి రెక్కలు కొట్టుకుంటూ ప్రభాతగీతాలు ఆలపించసాగినాయి. ఆ ఆలాపనలో ఎంత మాధుర్యం?

     అలాంటి సుప్రభాతంలో అపూర్వమైన ఆ దృశ్యం రైతు కంటబడింది. అతడునిశ్చలంగా కూర్చుని నిశ్శబ్దంగా చూస్తున్నాడు.

     నిముషాలు గడిచిపోతున్నాయి.

     సూర్యలో కదలిక లేదు.

     పాము మెల్లగా పడగ ముడుచుకుని కిందకి దిగిపోయి ప్రక్కనున్న పుట్టలో ప్రవేశించింది.

     అప్పుడు మంచె దిగాడు రైతు. గబగబా పరిగెత్తుకువెళ్లి సూర్య ముందుసాష్టాంగ పడ్డాడు. అతడిముందు నేల కళ్లకద్దుకున్నాడు.

     సూర్యకి ధ్యానభంగం కలగకుండా, మెల్లగా వెనుదిరిగి వచ్చేసినతడు సాయంత్రం ఆవుపాలు చెంబునిండా పిండుకుని వెళ్లాడు. సూర్య ధ్యానం చాలించేదాకా అక్కడ కూర్చున్నాడు.

     అతడు కళ్లు తెరవగానే పాలచెంబు ముందుపెట్టి సాష్టాంగ పడ్డాడు.

     "ఈశ్వరుడు ఎక్కడుంటాడో తెలియదు. ఇయాల పొద్దుటే చూసిన సామి. అచ్చం పరమశివునికిమల్లె కనిపించిన్రు. మీ ఒంటికి చుట్టుకుని పడగెత్తిన పాము పది నిమిషాలసేపైనా వుంది. నేను చూస్తుండగానే దిగిపుట్టలోకి జారిపోయింది.  నా కళ్లు సార్దకమైనవి సామీ! నా బతుకు ధన్యమైంది. ఏ పుణ్నెం చేసుకుని పుట్టిన్నో, మీవంటి మానుబావుడిని చూడగలిగిన. "

    "పాము ఒంటిని చుట్టుకుందా?ఎప్పుడు?"సూర్య స్వరంలో నిర్వికారం.

     ఉదయం తను చూసింది వర్ణించి, వర్ణించి చెప్పాడు రైతు.

     "ఈ చెంబు  ఎత్తుకుని, ఈ పాలు గటగటా తాగెయ్యండి సామీ. నా ఆవు పొదుగుల దీనికి నాలుగింతలు పాలు పడతయ్."

    అతడి కళ్లముందు తెల్లటి నురగతో వున్న చిక్కటి పాలు. అతడు తాగేదాకా వదల్లేదు రైతు.
 

 Previous Page Next Page