మరికొద్ది రోజుల తర్వాత ఆ విషయం చెప్పినప్పుడు ఆమె చాలా గాఢమైన ఆలోచనల్లో మునిగిపోయింది.
ఒక రోజంతా ఆలోచించాక అంగీకారం తెలిపింది.
కానీ ఓ కండిషన్ పెట్టింది.
వాళ్ళు ఇండియాలో సెటిలవ్వాలి.
తను ఆశ్చర్యపోయాడు.
"అదేమిటి? ఇండియాలో వున్నవాళ్ళంతా అమెరికా స్వర్గం అనుకుంటూంటే నువ్వు ఇండియాలో వుంటానంటున్నావు?"
జూలియా నవ్వింది.
"నాకు మెటీరియల్ అవుట్ లుక్ చిన్నప్పటినుంచీ లేదు. నాకు జీవితంమీద కంటే జీవితం తరువాతి జీవితంమీద ఆసక్తి ఎక్కువ. అందుకే ఫిలాసఫీ చదివాను. సమ్ హరే హిందూ ఫిలాసఫీ నాకు బాగా కుతూహలం కలిగించింది. ఇంకా దగ్గరగా, ఇంకా డీప్ గా స్టడీ చేయాలన్న కోరిక కలిగింది. ఒకవేళ మన పెళ్ళివల్ల నా కోరిక తీరేటట్లయితే నాకు చాలా ఆనందంగా వుంటుంది."
అప్పుడు కూడా తను ఆమెలోని ఆధ్యాత్మిక చింతనను అర్ధం చేసుకోలేదు. కేవలం ఆమెకున్న ఎకాడమిక్ ఇంటరెస్ట్ అనే అనుకున్నాడు.
ఇద్దరూ పెళ్ళిచేసుకుని ఇండియా వచ్చిన కొద్దిరోజుల వరకూ తను వ్యాపార విషయాల్లో పడి ఆమె గురించి పెద్దగా పట్టించుకోలేదు.
కానీ ఓ రోజు సడెన్ గా ఆమె వచ్చి "నేను రమణమహర్షి ఆశ్రమానికెళ్ళాలి! ఏర్పాట్లు చేయగలరా?" అనడిగేసరికి తను నిశ్చేష్టుడయ్యాడు.
"అక్కడికెందుకు?"
"ఇండియా వచ్చినప్పట్నించీ చాలా పుస్తకాలు చదివాను. ఎందుకో తెలీదు రమణమహర్షి ఆశ్రమం చూడాలనిపిస్తోంది."
తను వెంటనే ఆ ఏర్పాట్లు చేశాడు.
వారంరోజుల తర్వాత తిరిగొచ్చిందామె.
వచ్చిన దగ్గర్నుంచీ ఆమెలో చాలా మార్పు కనిపించసాగింది.
తనకున్న డ్రెస్ లన్నీ విరాళంగా యిచ్చేసి తను చీరలు కట్టటం ప్రారంభించింది.
రోజూ ధ్యానంలో కొద్దిసేపు గడపటం కూడా మొదలయ్యింది.
ఆ తరువాత కొద్దికాలం ఆశ్రమం దగ్గర వుంటానని అడిగితే తను కాదనలేకపోయాడు.
ఆశ్రమానికి సమీపంలోనే ఓ కాటేజ్ కట్టించి యిచ్చాడు.
తరచుగా అక్కడికెళ్ళి కొద్దిరోజులు గడపటం అలవాటు చేసుకుందామె. రాన్రాను ఆమెకి సెక్స్ మీద ఆసక్తి సన్నగిల్లటం గమనించే సరికి తనకు అనుమానం వచ్చింది. అప్పుడు మనసు విప్పి మాట్లాడాడు ఆమెతో.
ఆమె తన అనుమానాన్ని ధృవపరిచింది.
తనకు సంసారం మీదా, సంసార సుఖాల మీదా ఆసక్తి వుండటం లేదనీ, ఎప్పుడూ భగవంతుని ధ్యానంలోనే వుండాలనిపిస్తోందనీ చెప్పింది.
ఆమె మాటలకు మొదట్లో తనకు కోపం వచ్చింది.
కానీ నింపాదిగా ఆలోచిస్తే ఆమె కిష్టమైన పనిచేసే అధికారం ఆమెకుందనిపించింది. ఆ తర్వాత ఆమె డైవోర్స్ తీసేసుకుంది.
అప్పటినుంచీ తన మనసుని పూర్తిగా వ్యాపారం మీద కేంద్రీకరించాడు.