Previous Page Next Page 
మబ్బు విడిపోయింది పేజి 6


    అంతలో కుమార్ కోసం వెళ్ళిన విద్యార్ధి అతనిని వెంటబెట్టుకుని వచ్చాడు. ఖరీదైన బట్టలతో నిగనిగ లాడుతున్న బూట్లతో, నున్నగా దువ్విన జుట్టుతో పెద్దింటి పిల్లాడిలా కనిపిస్తోన్న కుమార్ ని చూసి ఆశ్చర్యపోయారు మిగిలిన విద్యార్ధులు.
    "కుమార్! ఈవిడ మీ మామ్మగారా?...." లోకంలో దరిద్రమంతా రూపుదాల్చినట్టున్న ఆ హరిజన వృద్దురాలినీ, విద్యా సంస్కారాలు ఉట్టిపడుతోన్న, ఆధునిక నాగరిక వేషంలో ఉన్న కుమార్ నీ మార్చి మార్చి చూస్తూ అడిగారు.
    కుమార్ చిరునవ్వుతో "అవును" అని "మామ్మా! ఇక్కడికెందుకు వచ్చావ్? సాయంత్రం నేనే వచ్చేవాణ్ణిగా!" అన్నాడు, ఆ వృద్ధురాలితో.
    ఆ వృద్ధురాలు బెదిరిపోతూ "యేంటిరా! నేనీడికి రాగూడదా?" అంది జాలిగా.
    కుమార్ నవ్వి "అది కాదు మామ్మా! నువ్వు నాకోసం ఎక్కడికైనా రావచ్చు. పాపం, నువ్వెందుకు నడిచి రావటమని...." అన్నాడు.
    "చుట్టలు కొంటానికి చారణా ఇస్తావేమోనని వచ్చిన.... ఇస్తావా?" ఆశగా అడిగింది ఆ వృద్ధురాలు.
    "చుట్టూ ఉన్న విద్యార్ధి బృందం ఘొల్లున నవ్వింది. ఆ వృద్ధురాలు బెదిరిపోయి చూసింది. విరగబడి నవ్వుతోన్న తన మిత్రులను ఒక్కసారి కలయచూసి "అలా రా మామ్మా! మాట్లాడుకుందాం!" అని ఆ వృద్ధురాలిని చెయ్యి పట్టుకుని దూరంగా తీసుకుపోయాడు కుమార్.
    కుమార్ తన మామ్మతో మాట్లాడి ఆవిణ్ణి పంపించి తిరిగి వచ్చేసరికి అతని కోసం అనేక బిరుదావళులు సిద్ధం చేసి ఉంచారు విద్యార్ధి నాయకులు. "ముష్టి మహరాజ్!" కూలీ దేవుడు!" వగైరా, వగైరా__
    ఈ బిరుదావళులతో నాలుగు వైపుల నుండీ తనను స్తోత్రం చేస్తున్న సహ విద్యార్ధులను చూసి కుమార్ మొదట తెల్లబోయాడు. ఆ తరువాత నవ్వుకున్నాడు. ఆ తరువాత తల వంచుకుని క్లాసులోకి వెళ్ళిపోయాడు.


                                      4


    కుమార్ ఎప్పుడు ఎక్కడ కనిపించినా, "సుట్టలు కొనుక్కుంటానికి చారణా ఉంటే యియ్యి మనవడా!" అని ఏడిపించటం మొదలుపెట్టారు విద్యార్ధి బృందం. తన చుట్టూ అంతమంది చేరి అన్నివిధాల ఉడికిస్తున్నా కుమార్ ఏదీ పట్టించుకునేవాడు కాడు. తన దారిన తను క్లాస్ లోకి వెళ్ళిపోయేవాడు. అతడలా పట్టించుకోకుండా ఉండటం విద్యార్ధి బృందానికి కొంత నిరుత్సాహం కలిగించినా ఏడిపించటం మానలేదు.
    "గురూ! మనం ఇలా ఏడిపిస్తోంటే ఆ కుమార్ గాడు ఉడుక్కోక పోగా తనలో తను నవ్వుకుంటున్నాడేంటిరా!" అని తన అనుమానం ప్రకటించాడొక విద్యార్ధి.
    "నీకూ అలా అనిపించిందా? నాకూ అదే అనిపించింది.... మనమేదో వాణ్ణి ఏడిపించబోతే, వాడు 'మీరే ఫూల్స్' అన్నట్లు నవ్వుకుంటున్నాడు.
    "దీని భావమేమి తిరుమలేశ?"
    "ఇందులో ఏదో తిరకాసుంది!"
    "అవును ఉంది. వాడి బట్టలు-వాడి దర్జా-వాడి పొగరు...."
    "ఏడిశావ్ లే!"
    వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగానే కుమార్ తన స్నేహితుడు జయరాంతో కలిసి లైబ్రరీకి వెళుతూ కనిపించాడు.
    "అరె! ఈ జయరాం, కుమార్ గాడికి ఫ్రెండేమిటిరా?"
    "కావచ్చు! వాళ్ళిద్దరూ కలిసి లైబ్రరీలో, ప్లేగ్రౌండ్ లో చాలాసార్లు కనిపించారు."
    "అయితే ఆ జయరాంగాడి పని పడ్దాం. ఈ కుమార్ గాడు మనకి లొంగి రావటం లేదు. జయరాంని ఏడిపిస్తే కుమార్ ని ఏడిపించినట్లే!"

 Previous Page Next Page