Previous Page Next Page 
సుడిగుండాపురం రైల్వే హాల్ట్ పేజి 6


    "బావుండలేదు."
    "చాలా మంది ఎలాంటి అబ్జెక్షనూ చెప్పలేదే ఆ పదానికి!"
    "వాళ్ళంతా నీ స్టాండర్డ్ కి తగ్గవాళ్ళయి వుంటారు"
    "ఎనీవే. మీ బయోడేటా ఓసారి చెక్ చేస్తాను. ఎనీ అబ్జెక్షన్?"
    మార్కండేయులు అతి కష్టం మీద కోపం అణుచుకున్నాడు "నీకో విషయం స్పష్టం చేయదల్చుకున్నానిప్పుడు."
    "చేసేయండి ఏం పర్లేదు! ఐ లవ్ ఓపెనెస్!"
    "దమ్మిడీకి కొరగాని సన్యాసి వచ్చి 'మీ డాటర్ ని పెళ్ళి చేసుకుంటాను' అంటే బెదిరిపోయి 'అలాగే చేసుకో నాయనా' అనే రకాన్ని కాదు నేను."
    "కాదా? మరే రకం?"
    "షటప్! నేను చెప్పేది విను! మా అమ్మాయిని చేసుకునేవాడు మోస్ట్ ఇంటెలిజెంట్ అయ్యుండాలి! ఎలాంటి వ్యాపారంలోనయినా బ్రహ్మాండమయిన సమర్థత చూపగలగాలి. భార్యను తన సొంత సంపాదనతో పోషించుకోగలగాలి."
    "మీ ఆఫీస్ లో ఉద్యోగానికి సెలక్ట్ అవ్వటం ద్వారా ఇవన్నీ నాకు ఉన్నాయని ఋవువయిపోయింది గదా?"
    "ఏమీ రుజువు కాలేదు"
    "కాలేదా?" ఆశ్చర్యంగా అడిగాడు.
    "కొంచెం కూడా కాలేదు!"
    "ఎందుకని? మీ వంట్లో ఆరోగ్యంగా లేదా?"
    "నీకీ వుద్యోగం నీ సత్తా ఋజువు చేసుకుంటావని ఇచ్చాను"
    భవానీశంకర్ ఆశ్చర్యపోయాడు "అంటే మా లవ్ ఎఫైర్ గురించి మీకు ముందే తెలుసా?"
    "ఉన్న ఒకే ఒక్క కూతురు ఎవర్తో సినిమాకి వెళ్తూందో, పార్కుల కెళుతోందో. ఆ పిల్లను ఎలా కాపాడుకోవాలో తెలీనంత మూర్ఖుడిని కాదు నేను."
    "ఓ! సి.ఐ.డి. సెటప్ వుందన్నమాట!"
    "కనుక ఇప్పుడు నీకిచ్చిన ఉద్యోగంలో నీ సత్తా చూపించుకోలేకపోతే నీకు ఉద్యోగంతో పాటు ప్రతిమ కూడా దక్కదు, గుర్తుంచుకో!"
    "ఓహో! కండిషనల్ జాబ్ అన్నమాట!"
    "సెంట్ పర్సెంట్ కండిషనల్ జాబ్!"
    "అచ్చం తెలుగు సినిమాల్లో వున్నట్లే వుంది కదూ!"
    "వుంటే వుండవచ్చు"
    "అయినా గానీ సినిమా ఎప్పటికీ నిజ జీవితం కాలేదు కదూ?"
    "అంతేకాదు. నిజ జీవితం ఎప్పటికీ సినిమా కాలేదు కూడా!"
    "ఐసీ! చాలా మంచి కొటేషన్"
    "నేను చెప్పింది అర్థమయ్యిందా నీకు?"
    "అయింది. ఏమయినా డౌట్స్ వస్తే తర్వాత అడుగుతాను! ఎగ్జామినేషన్ ముందు."
    "అయితే వెళ్ళి జగన్నాధాన్ని కలుసుకుని ఉద్యోగంలో జాయినవు!"
    "థాంక్యూ మైడియర్ ఫాదరిన్లా!"
    "షటప్! నన్ను ఫాదరిన్లా అని పిలవకు" మండిపడుతూ అన్నాడు.
    "ఆల్ రైట్! అభ్యంతరం వుంటే వాయుదూత్ సర్వీస్ అని పిలవచ్చా?"
    "డోంటాక్ రాట్!"
    "అది రాట్ కాదు గానీ, ఓ.కె. మీకిష్టం లేకపోతే పోనీలెండి. బైదిబై నా ఛాంబర్ ఎక్కడా? నా టేబుల్, నా ప్యూనూ, నా ఏ.సి. రూమ్, నా సెక్రటరీ..."
    మార్కండేయులు వెళ్ళిపోయాడు.
    భవానీశంకర్ చిరునవ్వుతో జగన్నాథం రూమ్ వైపు నడిచాడు. జగన్నాథం గ్రాఫ్ కాగితం చేత పట్టుకుని దిగులుతో చూస్తున్నాడు. అతనిని చూడగానే ముఖంలో రంగు మారిపోయిందతనికి!
    "సో. యూ హావ్ కమ్!" అన్నాడు కోపాన్ని అణుచుకుంటూ.
    "ఎస్, అయ్ హావ్ కమ్!"
    "నువ్వు చాలా ఇంటెలిజెంట్ ననుకుంటున్నావ్ కదూ?"
    "నిజానికి మరీ అంత గొప్ప ఇదేంకాదు గానీ, ఆముదపు చెట్ల ముందు మాత్రం భలే షైనయిపోతాను. మీ ముందయినట్లు!"
    "అతిగా మాట్లాడకు మంచిదికాదు" మండిపడుతూ అన్నాడు.
    "చాలా ఓల్డ్ మూఢనమ్మకం అది మైడియర్ జగన్నాథం! లేటెస్ట్ స్లోగన్ ఇంకా మీకు తెలీదంటే చాలా ఆశ్చర్యంగా వుంది. అది మానవులకు కూడా ఎప్పుడో చేరిపోయిందది. ఎనీవే మీ లాభం కోసం ఓసారి చెప్తాను. ఎక్కువగా మాట్లాడండి, అతిగా మాట్లాడకండి. హృదయం విప్పి మాట్లాడండి. ప్రస్తుతం మన దేశంలో వున్న అన్ని అనర్థాలకూ మూలకారణం మనిషికీ మనిషికీ మధ్య ఏర్పడ్డ మూగతనమే. అర్థమయిందా?"
    "మా ఆఫీసులో పనికి రాదు"
    "అందుకే మీ వ్యాపారాలు ఇలా బూజు పట్టినాయ్ మైడియర్ జగన్నాథం!"
    జగన్నాథం 'బూజు' పదం వినేసరికి కోపంతో మండిపడిపోయాడు "ఆల్ రైట్! వెళ్ళి సేల్స్ ప్రమోషన్ లోని సీటులో కూర్చో."
    "కూర్చోవటం నా పాలసీ కాదు మైడియర్ ఫ్రెండ్! అయ్ వాంట్ యాక్షన్. వాటీజ్ మై జాబ్! ఇప్పుడు నేనేం చేయాలి? అర్జంటుగా చెప్పండి"
    "అదంతా నీకు మోహన్ రాజ్ చెప్తాడు"
    "మోహన్ రాజా? ఎవరా మోహన్ రాజ్! ఎక్కడుంటాడు? ఎలా వుంటాడు?"
    "నీ బాస్! డైరెక్ట్ బాస్! సేల్స్ ఇన్ ఛార్జ్"
    "మరి ఇంతసేపూ మధ్యలో నువ్వెందుకు మాట్లాడుతున్నావ్! ఇలా అనవసర విషయాల్లో తలదూర్చి వెధవ వాగుడు వాగటం నీ వంటికీ, మార్కండేయులు వ్యాపారానికి మంచిదికాదు జగన్నాథం. నీ యాటిట్యూట్ మార్చుకో. లేకపోతే మటాష్ అయిపోతావు" అనేసి బయటకు నడిచాడతను.

 Previous Page Next Page