Previous Page Next Page 
అందమైన శతృవుతో అరవై రోజులు పేజి 6


    చిరంజీవి నవ్వాడు.
    "మీరుత్త పెసిమిస్ట్ లాగున్నారు."
    "నేను పెసిమిస్ట్ ని కాదు. మీరు ఊహల్లో బతుకుతున్నారని చెపుతున్నానంతే!"
    "ఎనీవే నా లక్ ఎలా వుందో ప్రయత్నించి చూస్తాను."
    "ఓకే! అలాగే కానీండి."
    ఆమె ఇంటర్ కమ్ లో స్వామికి రింగ్ చేసింది.
    "సార్! మన చిరంజీవి ఓసారి మీతో మాట్లాడాలనుకుంటున్నాడు."
    "అవసరం లేదు, టైమ్ వేస్ట్ చేయవద్దని చెప్పు."
    "చెప్పాను సార్! అయినా రిక్వెస్టు చేస్తున్నాడు."
    "వీల్లేదని చెప్పేసెయ్!"
    ఫోన్ డిస్కనెక్ట్ చేశాడతను.
    చిరంజీవి ఇంక ఆలస్యం చేయలేదు. ప్యూన్ ఆపుతున్నా ఆగకుండా తలుపు తీసుకుని లోపలకు నడిచాడు.
    అతనిని చూస్తూనే స్వామి ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యంతోపాటు కోపం కూడా మొఖంలో కనబడుతోంది.
    "ఎందుకొచ్చావ్?"
    "చూడండి సార్! యూనిఫారం ఎంత నీట్ గా ఉందో చూశారా? మీరు చెప్పినట్లే బటన్స్ అన్నీ బ్రహ్మాండంగా కుట్టుకున్నాను. బూట్లు చూడండి ఎంత అద్భుతంగా పాలిష్ చేశానో? మా చుట్టుపక్కలవాళ్ళు నా షూస్ లోనే మొఖాలు చూసుకుని తల దువ్వుకుంటున్నారు. నా వాచ్ స్ట్రాప్ కి కూడా 'బ్రాసో' కొట్టేశాను. హెయిర్ స్టయిల్ కూడా ట్రిమ్ చేయించేశాను చూడండి 'న్యూ స్టయిల్ కటింగ్ సెలూన్' వాడు సరిగ్గా అరగంట తీసుకున్నాడు ట్రిమ్ చేయటానికి."
    "తాగుడు సంగతేమిటి?"
    చిరంజీవి ప్రవాహానికి బ్రేక్ వేస్తూ అన్నాడతను.
    చిరంజీవికి ఏం మాట్లాడాలో తెలీలేదు.
    తాగుడా సార్? బైగాడ్ చెపుతున్నాను సార్! అది కూడా మీరు చెప్పినట్లే చేయబోతున్నాను. ఇవాళ్టి నుంచి డ్యూటీలో ఉండగా ఛస్తే తాగదల్చుకోలేదు సార్. ఎనలైజర్ తో టెస్ట్ చేసుకోండి కావాలంటే"
    "నీ వేషాలన్నీ నాకు తెలుసు చిరంజీవి! ఇలాగే చిలక లెక్క కబుర్లు చెప్తావ్. రేపు మళ్ళా ఫుల్ గా తాగి వస్తావ్."
    "ప్రామిస్ చేసి చెబుతున్నాను సార్! నాకు బుద్ధి వచ్చింది. ఇవాళ చాలా పెద్ద ఇన్సిడెంట్ జరిగింది సార్. మా అక్క పిల్లలు ఏం చేశారో తెల్సా సార్? దొంగతనాలు చేస్తున్నారు. ఇదంతా నా తాగుడు వల్లే కదా? అందుకే రాత్రుళ్ళు పడుకునేప్పుడు తప్ప మిగతా టైమ్స్ లో తాగకూడదని నిర్ణయించుకున్నాను సార్."
    "సారీ! నేను నీ మాటలు నమ్మను"
    "ఈ ఒక్కసారికి నమ్మండి సార్!"
    "ఇంతకుముందు కూడా ఇట్లాగే చెప్పి, రెండోరోజు తాగి వచ్చినవ్! యాదున్నదా?"
    "ఆ రోజులు అయిపోయాయ్ సార్, ఇంక లేవు. ప్రామిస్ సార్."
    స్వామి ఓ క్షణం ఆలోచించాడు.
    అతనికి చిరంజీవి మీద సాఫ్ట్ కార్నర్ ఉంది.
    చిరంజీవిలో నిజాయితీ ఉంది. తను పూర్తిగా నమ్మే వ్యక్తి అతనొక్కడే. అది తన స్వంత సంస్థలా పని చేస్తాడతను. అవసరమయితే రాక్షసుడిలా రాత్రింబవళ్ళు కష్టపడతాడు. మిగతా వారి దగ్గర అదిలేదు. ఇవన్నీ కాక అతను ఎక్సలెంట్ డ్రయివర్.
    ఒకవేళ నిజంగానే చిరంజీవి తాగుడు మానేస్తే తనకంత కంటే కావల్సిందేమీ లేదు. కళ్ళ కద్దుకుని అతనికి ఉద్యోగం ఇస్తాడు.
    అయితే అతను అడిగిన వెంటనే ఉద్యోగం ఇచ్చేస్తే అలుసిచ్చినట్లయిపోతుంది. అందుకని బాగా ఏడిపించి ఇవ్వాలి.
    "ఇదిగో చూడు చిరంజీవి! నువ్ లక్ష చెప్పు! నేను నీ మాట నమ్మను."
    "అలా అంటే ఎలా సార్? ప్రతి వాడికి మనం ఛాన్స్ ఇవ్వాలని పెద్దలు అంటారు సార్!"
    "వాళ్ళు నాతో ఎప్పుడూ ఆనలే! ఆల్ రైట్! రేపు ప్రొద్దుట ఆరుగంటలకల్లా ఇక్కడుండాలి నువ్వు. రెండు మూడు దినాలు నీ సంగతి చూసి అప్పుడు డెసిషన్ తీసుకుంటా సరేనా?"
    "సరే సార్!"
    "ఒకవేళ ఈ అబ్జర్వేషన్ పిరీడ్ ల ఏమాత్రం తాగినా కాని, యూనిఫారం విషయంల, షూ పాలిష్ విషయంల, గడ్డం చేసుకునే విషయంల గానీ జర్రబీగల్తీ కనిపించిందో ఇంక జన్మలో ఈడికి రానియ్య సమజయిందా?"
    "చూసుకోండి సార్, మీరే చూసుకోండి! మనకేం భయంలేదు మనం తల్చుకుంటే చాలా కరెక్ట్ గా ఉంటాను సార్! ఎవ్వరూ వేలెత్తి చూపడానికి ఛాన్సివ్వం, ఆ!
    "అదే....చూస్తా కదా!"
    "అలాగే సార్! థాంక్యూ వెరీమచ్."
    "ఇకపో నువ్వు."
    చిరంజీవి తల గోక్కుంటూ నిలబడ్డాడు.
    "ఏమి సంగతి నిలబడ్డావ్?"
    "మరేం లేద్సార్! ఇది అఫీషియల్ వ్యవహారం కాద్సార్! ప్రైవేట్. ఇంట్లో బియ్యం, పప్పులు ఏమీలేవు సార్! నేనంటే ఎలాగోలా మానేజ్ చేస్తాను కానీ ఆ పిల్లల కోసమయినా ఏదొక ఏర్పాటు చేయాలి కద్సార్. నా దగ్గరేమో ఒక్క పైసా కూడా లేదు. ఎంతో కొంత అడ్వాన్స్ ఇప్పించారంటే_ఎంతో హెల్ప్ చేసిన వారవుతారు."
    "ఇదిగో నీకేమయినా బుద్ధున్నాది?"
    "లేద్సార్! ఏమాట కామాటే చెప్పుకోవాలి."
    స్వామి నవ్వేశాడు.
    "నేను ఉద్యోగం గిట్ట ఇవ్వనే లేదు! గిప్పుడే అడ్వాన్సా? నేనేం చెవుల్లో పూలు పెట్టుకున్నానా?"
    "లేద్సార్! పూలు మీ గుండెలో ఉన్నాయ్. అందుకే నన్ను చల్లగా చూస్తున్నారు."
    "ఇగో ఈ చెంచా గిరీయే మనకు నడవది! మస్కా గిట్ట కొడితే నీకు డబ్బిచ్చేస్తాననుకుంటున్నావ్ లే?
    "అవున్సార్."
    "ఛస్తే ఇవ్వ!"
    "అలా అనకండి సార్! నాకోసం కాదని ముందే చెప్పాను కదా. మా అక్క పిల్లలు."
    "బస్ బస్! ఇంకేం చెప్పకు ఎంత కావాలి?"
    "ఐదు వందలయితే...."
    "ఇగో గట్లయితే అసలివ్వ వెళ్ళు."
    "కోప్పడకండి సార్! పాతిక రూపాయిలివ్వండి పోనీ...సరిపెట్టుకుంటాను."
    "నాకు తెలుసు పాతిక ఇస్తే సీదా కల్లు కాంపౌండ్ కెళతావ్ లే?"
    "బైగాడ్ సార్! తాగుడు మానేశాను."

 Previous Page Next Page