Previous Page Next Page 
జయ - విజయ పేజి 6

    "చంద్రకాంత్ గారికి,
    నమస్కారం. నా పేరు విజయ! మీ నవల "కాంతిపథం" చదివినరోజు నుంచీ మీకు ఉత్తరం రాయాలని ప్రయత్నం. అంతగా నన్ను కదిలించి వేసిందా నవల. రాధ పాత్ర నిజంగా ప్రతి ఆడదీ తనూ అలా ఉండాలని కోరుకునే పాత్ర. అంతటి ధైర్యం, ఆత్మస్థయిర్యం ప్రతి స్త్రీకి ఉంటే ఎంత బావుండునని అనిపించే చక్కటి పాత్ర. ఎన్నో నవలలు చదివాను. కానీ ఇంతగా నన్నాకర్షించిన నవల ఇంతవరకూ కనిపించలేదు. కథ, కథనం, సందేశం అన్నీ నా మనసుని హత్తుకుపోయినయ్. అందుకే మీకీ ఉత్తరం రాసి అభినందించాలని కోరిక! అయితే మీ అడ్రస్ అంత తేలికగా లభించలేదనుకోండి. అన్ని పత్రికల వాళ్ళకూ రాస్తే ఒక్కరు మాత్రం దయతలచి పంపించారు.
    ఇంత అద్భుతమయిన నవల రాసినందుకు నా అభినందనలు అందుకోండి! మీకేమీ అభ్యంతరం లేదంటే మీకు అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తుంటాను. జవాబు ఇవ్వగలరా? పోనీ కనీసం ఈ ఒక్క ఉత్తరానికయినా జవాబు రాస్తారని ఆశిస్తాను. ఎంతో ఆతృతగా మీ జవాబు కోసం ఎదురుచూస్తుంటాను.
                                                                    మీ అభిమాని
                                                                        విజయ
    ఆ ఉత్తరం కవర్లో ఉంచి అతని అడ్రసు రాసి తన బాగ్ లో ఉంచుకుందామె.
    అప్పుడుగాని ఆమెకు నిద్రపట్టలేదు.
    మర్నాడు ఆఫీసు కెళ్ళేప్పుడే ఆ ఉత్తరం పోస్టు చేసేసింది. ఆ రెండో రోజునుంచే అతని జవాబు కోసం ఎదురుచూడసాగిందామె.
    వారంరోజులు గడిచిపోయినయ్. అయినా అతని దగ్గర్నుంచి ఎలాంటి జవాబు రాకపోయేసరికి ఆమె నిరాశపడిపోయింది.
    ఆ రచయిత మీద ఎక్కడలేని కోపం వచ్చింది.
    ఇంత అభిమానంతో తను ఉత్తరం రాస్తే అతగాడికి జవాబిచ్చేంత తీరిక కూడా లేదా? రచయిత అయినంత మాత్రాన అంత గర్వమా? అనుకుంది కోపంగా.
    "ఏమయింది? మీ రచయిత జవాబిచ్చారా?" అడిగింది రజని ఆఫీసులో.
    "ఊహు! పదిరోజులయిపోయింది. రాయకపోతే పోనీ! ఐ డోంట్ కేర్" అంది విజయ చిరాగ్గా.
    "అయ్యో! అంతగా అతని అడ్రస్ కోసం కలవరించి పోయావ్. ఇప్పుడింత విసుగు కలుగుతుందేమిటి?" నవ్వుతూ అడిగింది రజని.
    "లేకపోతే ఏమిటి? ఆయనకంత గొప్పగా ఉంటే మనమేనా తక్కువ! అసలింక ఛస్తే ఎవరికీ ఉత్తరాలు రాయకూడదు."
    రజని నవ్వేయసాగింది.
    "బావుంది నీ కోపం! మరో రచయిత జవాబు రాయలేదట! అందుకని అసలెవరికీ ఉత్తరాలు రాయదట."
    ఆమె మాటలకు విజయక్కూడా నవ్వు వచ్చేసింది.
    ఆ సాయంత్రం ఇంటికొచ్చేసరికి జయ ఓ కవరు చేత్తో పట్టుకొచ్చింది.
    "అక్కా! ఇదిగో మీ రచయిత ఉత్తరం!"
    విజయ ఆత్రుతగా కవరు అందుకుంది. ఫ్రమ్ అడ్రసులో అతని పేరు, చిరునామా కనిపించేసరికి ఆమె మనసంతా ఆనందంతో నిండిపోయింది. గదిలోకి నడిచి మంచంమీద కూలబడి కవరు చింపి ఉత్తరం బయటకు లాగింది.
    విజయ గారికి,
    నమస్తే.
    మీరు అభిమానంతో రాసిన ఉత్తరం అందింది. చాలా థాంక్స్. నా నవల మీకు అంతగా నచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే అదే నా మొదటి నవల. మీరు ఉత్తరాలు రాస్తానంటే అభ్యంతరం ఎందుకుంటుంది? ఎంతో ఆనందిస్తాను. నేనేం గొప్ప రచయితను కాదు. ఉత్తరాలు రాయడానికి కూడా తీరిక లేకపోవడానికి. నేనూ ఈ మధ్యే రచనలు చేయడం ప్రారంభించాను. ఇప్పటివరకూ ఇరవై కథలూ, ఈ నవల ఒక్కటీ రాశాను.
    అంచేత నాకు అభిమానులు చాలా తక్కువ! మీకో విషయం చెప్పనా? ఇలా శ్రమ తీసుకుని అడ్రస్ సంపాదించి ఉత్తరం రాసినవారు మీరొక్కరే! అంటే ఉత్తరాల ద్వారా పరిచయమయిన వారు మీరు తప్పితే యింకెవరూ లేరు. మీరు చదువుతున్నారా? ఉద్యోగం చేస్తున్నారా? లేక యింట్లోనే ఉంటున్నారా?
    నా వివరాలు కొన్ని మీకు తెలియజేస్తాను.
    నేను యిక్కడ ఇంజనీరింగ్ ఫరమ్ లో పనిచేస్తున్నాను. ఉద్యోగంలో చేరి సంవత్సరం దాటింది. అంతకుముందు పాలిటెక్నిక్ లో డిప్లొమా తీసుకున్నాను. నాకు తల్లీ, తండ్రీ, అన్నా, వదినా ఉన్నారు. నా సర్వస్వం వీళ్ళే! ప్రస్తుతానికీ వివరాలు చాలనుకుంటాను. ఇలాగే మీ గురించి కూడా తెలియజేస్తారు కదూ?
    ఉంటానిక_
                                                                     భవధీయుడు
                                                                       చంద్రకాంత్.
    ఆ ఉత్తరం ఎన్నిసార్లు చదివినా తనివి తీరడంలేదు విజయకు.
    'ఎన్నిసార్లు చదువుతావక్కా ఆ ఉత్తరం! అంత బావుందా అది! నేనూ చదవొచ్చా?" అడిగింది జయ ఆమె దగ్గరకొస్తూ.    
    "ఇందులో చదవకూడనిదేమీ లేదు కానీ. ఇలా ఒకరి ఉత్తరాలు చదవడం మంచి అలవాటు కాదు!" చెప్పింది విజయ!
    జయ నవ్వేసింది.

 Previous Page Next Page