పట్టువిడువని నిర్మాత మళ్ళీ అర్ధరాత్రి కాగానే సెన్సార్ ఆఫీస్ కెళ్ళి తన ఫిలిమ్ బాక్స్ ని భుజాన వేసుకుని ఊరి వేపు నడువసాగాడు. అప్పుడు బాక్స్ లోని సెన్సార్ ఇలా అంది -
"రాజా! నీ పట్టుదల చూస్తుంటే నాకు తెగ ఆశ్చర్యంగా వుంది. మేము బాన్ చేసిన సినిమాలను వదిలి పారిపోయిన నిర్మాతలను చూశాను గానీ ఇలా రీషూట్ చేయాలన్న పంతం నీ ఒక్కదిలోనే కనబడుతోంది. సరే - నీతంటాలు నువ్వెలాగూ పడుతున్నావ్! మీ ఇంటికి చేరుకునే లోగా నీకు టైం పాస్ అవడానికి ఓ కధ చెప్తాను విను "
నిర్మాత 'వినను' అంటూ తల అడ్డంగా ఊపాడు. ఓ చేత్తో ఓ చెవి కూడా మూసేసుకున్నాడు. కానీ రెండో చేయి ఫిలిమ్ బాక్స్ ని చుట్టి ఉండడం వల్ల ఆ చెవి మూసుకోడానికి వీల్లేకపోయింది. ఇది గ్రహించి సెన్సార్ ఆ చెవిలో మోత పెట్టసాగింది.
"చాలా కాలం కిందట మద్రాస్ మహా నగరంలోకి వామనరావ్ అని ఓ కుర్రాడు అడుగు పెట్టాడు. అడుగు పెట్టినప్పుడు అతని చేతిలో రెండు జతల బట్టలూ, ఓ పెన్నూ ఉన్నాయ్. అంతే! సరాసరి ఓ ప్రఖ్యాత డైరెక్టరు దగ్గర కెళ్ళి 'నాకు డైరెక్టర్ కావాలని ఉంది . మీ దగ్గర అసిస్టెంట్ గా చేరనివ్వండి' అని బతిమాలాడు. ప్రఖ్యాత డైరెక్టర్ కి ఆ కుర్రాడిని చూస్తె జాలేసింది.
'ఏం చదువుకున్నావ్?" అనడిగాడు.
"నేనేమీ చదవలేదండీ!" అన్నాడతను.
"వెరీ గుడ్! స్టేజి అనుభవమేమయినా ఉందా?"
"స్టేజి అంటే ఏమిటండీ?"
"పోనీ రేడియో, నాటికలకయినా దర్శకత్వం, లేక నిర్వహణ లాంటివి చేశావా?'
'ఇంతవరకూ ఏ నాలుగయిదు సార్లో రేడియో లో పాటలు విన్నానండీ! అంతకు మించి రేడియో గురించి నాకేమీ తెలీదు. అన్నట్లు నాకు చింతపిక్కలాట వచ్చండీ!"
"టి.వి. చూశావా ఎప్పుడయినా?'
'టి.వి. అనేది ఒకటుందని పేపర్లో చూడడమేనండీ!"
ప్రఖ్యాత డైరెక్టర్ ఆనందభరితుడయ్యాడు, ఆ కుర్రాడిని కౌగలించుకుని ఆనంద భాష్పాలు రాల్చాడు.
'అబ్బ! ఎంత కాలానికి నాకో మంచి అసిస్టెంట్ దొరికాడోయ్! ఎలాంటి అభిప్రాయాలూ, ఎలాంటి తెలివితేటలూ, లేనివాళ్ళే మన ఫీల్డులో రాణిస్తారు. అంచేత నువ్వూ రాణిస్తావ్!" అన్నాడు.
వామనరావ్ ఆరోజు నుంచి చకచక దర్శకత్వానికి చెందిన విషయాలు అనేకం నేర్చుకోడం ప్రారంభించాడు. కొద్ది రోజుల్లోనే 'ఓశ్ డైరెక్షన్ అంటే ఇంతేనా?' అన్నాడు . ఆ తర్వాత కధ, మాటలు ఎలా రాస్తారో చూశాడు. 'ఇది ఆరేళ్ళ పిల్లలు చేసే పని' అని నవ్వుకున్నాడు. పాటలు రాసేవాళ్ళను గమనించి 'ఈమాత్రం బూతు పాటలు రాయడానికి కవులు కావాలా? మా వూళ్ళో ఏ వేశ్య నడిగినా పాతిక రకాల సాహిత్యం రాస్తుంది' అనుకున్నాడు.
ఓ మంచి రోజ్జూసి తనే ఓ సినిమాకి దర్శకత్వం చేపట్టాడు. అంతే! అప్పటినుంచీ అతని విజయానికి తిరుగులేదు. సంవత్సరానికి వందలాది పిక్చర్లు తీసేసి విజయడంకా మోగించేస్తున్నాడు. ఏ సినిమాకి చూచినా కధ, మాటలు, పాటలు, ఈలలు, కేకలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, సంగీతం, స్పెషల్ ఎఫెక్ట్, ఆర్డినరీ ఎఫెక్టు ఎడిటింగూ - అన్నీ తనే! ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ చూసినా అతనికి సన్మానాలు, సభలు ఎక్కువయిపోయాయ్ . అతనిని చూసి 'ఓశ్ వాడు పైకి రాగా లేంది టెన్త్ వరకూ చదువుకుని , ఓ నాటకమేసినా నేను పైకి రాలేనా" అని ఇంకా కొన్ని వేలమంది దర్శకత్వం చేసేయడం మొదలు పెట్టారు.
అలా వెలిగి వెలిగి కొన్నాళ్ళకు అతను వెలగటం మానేశాడు. వామనరావ్ తీస్తున్న సినిమాలన్నీ టకీమని వెనక్కు వచ్చేస్తున్నాయ్. రెండ్రోజుల్లో దివాళా తీస్తున్నాయ్. అతని పిక్చర్లు జిల్లాల వారీగా కొన్నాళ్ళలందరూ వెంటనే రిక్షాలు తొక్కసాగారు" ఇంతవరకూ చెప్పి బాక్స్ లోని సెన్సారు ఇలా అంది -
"రాజా! పరమ మూర్ఖుడయిన వామన్రావ్ అంత తక్కువ సమయంలో అన్ని రకాల విద్యలు నేర్చుకుని ఎలా ప్రఖ్యాత దర్శకుడవ గలిగాడు? అన్ని సినిమాలు తీసి ఎలా విజయవంతం చేయగలిగాడు? అతన్ని ఆకాశానికెత్తి అతని చిత్రాలకు అఖండ విజయం చేకూర్చిన ప్రజలు మళ్ళీ అతనిని కిందకు పడదోసి అతని చిత్రాలను ఎందుకు నిరాకరించారు?
ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసీ చెప్పకపోయావో నీ తలను ఈ ఫిలిం బాక్స్ తోనే వెయ్యి ముక్కలుగా 'కట్' చేస్తాను.
నిర్మాత ఓ క్షణం ఆలోచించాడు.
"నీయవ్వ! దీనికి తెలిస్సచ్చేదే వుందీ! ఆ వామన్రావే కాదు. ఇలా కధా, మాటలూ, పాటలూ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, సంగీతం , ఎడిటింగూ అన్నీ తనే చేసే ఏ డైరెక్టరయినా చేసే పని ఒక్కటే. అన్ని రంగాల్లో బాగా ప్రసిద్దులయి, అవకాశాల్లేక మూలబడి ఉన్నోళ్ళని డబ్బుతో కొని తన ఆఫీసులో కట్టిపడేసి వాళ్ళతో తన సినిమాకు కావలసిన మసాలాలన్నీ తయారు చేయించి పేరు తనది పెట్టేసుకోడమే! దీన్నే "ఘోస్ట్ వర్క్" అంటారని మా డైర్రేట్ర కూడా చెప్పాడు. సినిమా ఫీల్డులో కొచ్చి వామాన్రావ్ నేర్చుకుంది. ఈలాంటి తెలివితేటలే కనుక దీనికి చదువూ సంధ్యలతో సంబంధం లేదు.
ఇకపోతే వామన్రావ్ పడిపోడానికి కారణం అతని వెనకున్న ప్రసిద్ద రచయితలూ, కవులూ, బూతు పాటలు రాసే వేశ్యలూ , సహాయ దర్శకుల పేరుతొ అసలు పనంతా చేసే దర్శకులూ , సంగీత దర్శకులూ , ఎడిటర్లూ, వీరందరూ అతనికంటే ఎక్కువ డబ్బు ఇస్తానన్న మరో దర్శకుడికి అమ్ముడుపోవడమే. వాళ్ళు లేకపోయినా తన సొంత తెలివి తేటల్తో చిత్రాలు నిర్మించి విజయవంతం చేయగలనని అనుకున్నాడు వామన్రావ్. అంచేత అతని సొంత తెలివి ఉపయోగించి తనే కధా, మాటలూ, పాటలూ వగైరా లు నిర్వహించాడు. దాంతో ఆ చిత్రాలన్నీ టకీమని లేచిపోయాయ్" అన్నాడు.
ఈ విధంగా నిర్మాతకు మౌనభంగం కాగానే సెన్సార్ బాక్స్ తో సహా సెన్సార్ ఆఫీస్ వేపు ఎగిరిపోయింది.
***