Previous Page Next Page 
8 డౌన్ పేజి 6

    జయసుధ మొఖంలో వారి సంభాషణ మీద ఆసక్తి కనిపించింది.    
    "ఓ, సారీ బాలక్! మీది "సినిమాగోత్రం" అన్న సంగతి మర్చిపోయాను. అందులోగిరీశం కారెక్టర్ చూశావా?"    
    "చూశాను! ఎన్టీఆర్ భలేమోతగా యాక్ట్ చేశాడు."    
    "ఆ డైలాగ్స్ గుర్తున్నాయా బాలక్?"    
    "ఓ భలే బాగుంటాయ్ మా ఇంట్లో అందరికీ ఇష్టం అవి"    
    జయసుధ మొఖంలో ఓ విధమయిన ఆనందం అస్పష్టంగా కనబడుతోంది.    
    "హలో బుచ్చమ్మొదినా" అన్నాడు బాలక్.    
    "షటప్" అంది జయసుధ మనోజ్ తో.    
    వాడు నోరు మూసేశాడు.    
    కానీ భవానీశంకర్ మొదలుపెట్టాడు.    
    "ఇవాళ టౌన్ హాల్లో విడోమేరేజ్ మీద లెక్చరుంది. వెళ్ళొస్తా హరహరా! ఇంత ఘోరమయిన అబద్దం ఎవడు చెప్పాడు నీతో ఇదిగో విను, నేను యాంటీనాచ్ ని! యాంటీనాచ్ యనగాసాని అన్నమాట కూడానా చెవిన పడకూడదు- పియర్స్ సబ్బు రాసి కడుగుతేగానీ ఆ కల్మషం పోదు-".    
    జయసుధ ఆశ్చర్యంగా చూడసాగింది భవానీ శంకర్ వేపు "అరె! మీకా సినిమాలో డైలాగ్ లన్నీ వచ్చా?"   
    "రాకేం చేస్తాయ్! చిన్నపుడు కైకలూర్లో మా స్కూల్లోనే గిరీశం ఏకపాత్రాభినయం చేసింది ఓ పిల్ల?"        
    జయసుధ గుండెల్లో ఝల్లుమంది.    
    కైకలూరులో చదివాడా ఇతను? అంటే అతను చెప్పేది తనగురించేనా? తనే ఆరోక్లాస్ చదివేప్పుడు కల్చరల్ ప్రోగ్రామ్స్ లో గిరీశం ఏకపాత్రాభినయంచేసింది. తనకుప్రధమ బహుమతి కూడా వచ్చింది- అంటే ఇతను తననుగుర్తుపట్టాడా? ఇంతలోనే తన ఆలోచనకు నవ్వు వచ్చిందామెకి? ఎప్పటి ఆరోక్లాస్ సంగతి? ఇన్నేళ్ళ తర్వాత కూడా గుర్తుంటారా? అసంభవం!    
    "ఏయ్ మనోజ్ నువ్వు నోర్మూసుకుంటావా లేదా?" మనోజ్ ని గదమాయించిందామె. కానీ ఆమె గొంతులో అదివరకటి ఫోర్స్ లేదిప్పుడు.    
                                                                  * * *    
    రజని కిటికీలోనుంచి చీకటిలోకి చూస్తోంది. వేగంగా వెళ్తోన్న రైలు శబ్దంతో పాటు ప్రక్కనే పారలల్ గా వున్న రోడ్ మీద లారీలు వెళ్ళటం గమనిస్తోందామె. ఆమె భర్త, తల్లీ, ఆడబిడ్డా ముగ్గురూ ఏదో గుసగుసలాడుకుంటున్నారు పక్క సీటు మీద కూర్చుని.    
    వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో తనకు తెలీదుగానీ వాళ్ళ మనసుల్లో ఏముందో తనకు తెలుసు తీర్ధ యాత్రలవంకతో తననుతీసుకెళ్ళి గోదావరినదిలో స్నానానికి దిగినప్పుడు తననునదిలో ముంచిచంపేయాలని వాళ్ళ ఆలోచన. మూడేళ్ళసహజీవనంతో వారి ఆలోచనలకు అద్దం పట్టగల నేర్పు లభించింది తనకు.        
    ఆమెకళ్ళ వెంబడినీళ్ళు తిరిగినాయ్.    
    ఈ నరకం భరించటంకంటే చావటమే తనకూ ఆనందం. అందుకే ఎలాంటి ప్రతిఘటనా లేకుండా బలిపశువులా వాళ్ళతోబయలుదేరింది.    
    వాళ్ళని కాదని తనుచేయగలిగిందికూడా ఏమీ లేదు. ఎలాగో తనను వదిలించుకుని మరో వివాహం చేసుకోవాలనుకుంటున్న తన భర్తని వదిలి రోడ్ న పడితే తనగతి ఏమవుతుందో బాగా తెలుసు.    
    కుక్కలు చింపిన విస్తరి అవుతుంది.    
    దానికంటే చావే నయం- బుగ్గల మీదకి జరుతున్న వెచ్చని కన్నీటిని తుడుచుకుంటుంటే- ఆమెకు హఠాత్తుగా విశ్వం గుర్తుకొచ్చాడు. తన కుటుంబం అప్రతిష్టపాలు కాకూడదన్న కోరికతో ఎంత పెద్ద పొరబాటుచేసింది తను?    
    ఆ రోజు విశ్వం మాటలువిని వుంటే?    
    అర్ధరాత్రి తనముఖం మీద ఏదో మెత్తగాతగిలినట్లయి ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. ఏం జరిగిందో కొద్ది క్షణాలవరకూ అర్ధం కాలేదు. అప్పుడేమరో బంతిపువ్వు ఎగిరివచ్చి మొఖానికి తగిలింది.    
    చటుక్కున మంచంమీదనుంచి లేచికూర్చుంది.    
    కిటికీ బయటవెన్నెల్లో నిలబడివున్నాడు విశ్వం.    
    తన గుండెలు ఝల్లుమన్నాయ్!    
    తనకు కొద్ది దూరంలోనే నిద్రపోతున్న అక్కయ్యవేపు చూసింది ఆమె గాఢనిద్రలో వుంది. కిటికీకి సమీపంగా వచ్చాడతను.    
    "రజనీ! ఒక్కసారిలారా! నీతో మాట్లాడాలి!" రహస్యంగా అన్నాడతను. తనకేంచేయాలో తోచలేదు. అతనేం మాట్లాడబోతున్నాడో తనకు తెలుసు. అతని మాటలు వినడం తనకిష్టంలేదు.    
    "దయచేసి వెళ్ళిపోండి" అంది భయంగా.    
    "రజనీ, ప్లీజ్! ఈ ఒక్కరోజు నీతో మాట్లాడనీ- ఇంకెప్పుడూ నిన్ను బాధపెట్టను"    
    "ఉహూ! నేనురాలేను. మా వాళ్ళెవరయినా నిద్రలేస్తే...."    
    "సరే, నువ్ రాకపోతే నేనిక్కడే నిలబడివుంటాను తెల్లారేవరకూ".    
    తను పట్టించుకోదల్చుకోలేదు.    
    కిటికీ తలుపులుమూసివేసి ఒఅడుకుంది మళ్ళీ పావుగంట గడిచిపోయింది.    
    ఎంతప్రయత్నించినా కంటిమీద కునుకురావటం లేదు.    
    లోలోపల ఆత్రుత-    
    అతనింకా అక్కడే నిలబడివున్నాడా?    
    మరో పావుగంట-    
    ఇంకా ఆత్రుత అణచుకోవటం సాధ్యం కావటంలేదు.    
    చటుక్కున లేచికిటికీ తలుపు ఒకటి నెమ్మదిగా తెరిచింది. అతనింకా అక్కడే నిలబడివున్నాడు బొమ్మలాగా! ఆమె హృదయమంతా తీయని బాధతోనిండిపోయింది. ఎందుకింతగా అతనిని అభిమానిస్తుందో తనకే తెలీదు. వద్దనుకుంటూనే ఎందుకతనికి చేరువకావాలని తహతహ లాడుతూందో తెలీదు.    
    "రజనీ! ఇంకా దయ రాలేదా?"    
    ఇంక అతనిని నిర్లక్ష్యం చేయడంతనవల్ల కావటంలేదు. లేచినెమ్మదిగా గది బయటకొచ్చింది. తల్లి, తండ్రి, మావయ్య, అత్తయ్య అందరూ వరుసగా పడుకునివున్నారు. అడుగులచప్పుడు కూడా వినిపించకుండా పెరటి తలుపు తెరుచుకుని బయటికొచ్చిందామె. తలుపులు మళ్ళీ నెమ్మదిగా మూసిడాబా మెట్ల దగ్గరకు చేరుకుంది. విశ్వం పైమెట్టుమీదనుంచి తనచేయి అందుకున్నాడు. ఇద్దరూ డాబా ఎక్కారు.    
    వెన్నెలకు తోడు విపరీతమయిన చలి.    
    "ఏమిటో చెప్పండి త్వరగా ఎవరయినా నిద్ర లేచారంటే నన్ను బ్రతకనీరు "కోపంగా అంది.    
    అతను జవాబివ్వకుండా తనను దగ్గరకు తీసుకుని ముద్దుపెట్టుకున్నాడు.    
    "ఏమిటింకా చూస్తూ కూర్చున్నావ్? పడుకుందువు లే" కసురుకుంది విమలాబాయ్.    
    రజని ఠక్కున ఆలోచనల్లో నుంచి బయటకొచ్చేసింది రైలు ఇంకా వేగంగా వెళ్తూనేవుంది.    
    ఆమె భర్త నాగరాజు బెర్తులు పైకి లాగిచెయిన్ లు తగిలిస్తున్నాడు.    
    అప్పటికే కోచ్ లో అందరూ నిద్రలోకి జారిపోయారు.    
    "ఇంకా చూస్తావేం? పడుకో" గదమాయించింది ఆడబడుచు హైమ రజని మిడిల్ బెర్తు మీద కెక్కి పడుకుంది.    
                                                                * * *    
    "హోమ్ సిగ్నల్ డేంజర్" అరిచాడు అసిస్టెంట్.    
    డ్రైవర్ గురుమూర్తి దూరంగా కనబడుతోన్న హోమ్ సిగ్నల్ వేపు మరింత పరీక్షగా చూశాడు. సిగ్నల్ లో రెడ్ లైట్ స్పష్టంగా కనబడుతోంది.    
    "హోమ్ సిగ్నల్ డేంజర్?" అన్నాడు తను కూడా.    
    వ్యాక్యూమ్ అప్లయ్ చేయటానికి ప్రయత్నించాడతను. స్పీడ్ కేవలం అరవై, డెబ్బై మధ్యే మెయింటెయిన్ చేస్తూవచ్చాడు అంతవరకూ ఎందుకో మాక్సిమమ్ పర్మిషబుల్ స్పీడ్ లోకి వెళ్ళబుద్దికావటం లేదు.    
    హఠాత్తుగా గమనించాడు వ్యాక్యూమ్ గేజ్ లోని నీడిల్ సరిగ్గా పని చేయటంలేదని. చూస్తూండగానే అమాంతం కిందపడిమళ్ళీ పైకి లేచిందది.    
    గుండెలు ఝల్లుమన్నాయ్.    
    కొంపదీసి ఇది డిఫెక్టివ్ కాదుగదా? బండి వేగంతగ్గుతోందా లేదా అని వీల్స్ శబ్దం వినడానికి ప్రయత్నించాడు. బ్రేక్స్ చక్రాల్ని అదిమి పెడుతున్నట్లు తెలుస్తూనే వుంది. అంటే బ్రేక్ పవర్ వుందన్నమాట.    
    అతనికి కొండంత దైర్యం వచ్చింది.    
    మరి ఇందాక నీడిల్ ఎందుకుపడిపోయినట్లు? ఒకవేళ లోపల వున్న అనుమానం వల్ల తనకలా కనిపించిందా?    
    "హోమ్ సిగ్నల్ క్లియర్" అరిచాడు అసిస్టెంట్.    
    "హోమ్ సిగ్నల్ క్లియర్" తనూ అరిచాడు గురుమూర్తి ఇంక తను వ్యాక్యూమ్ అప్లయ్ చేయాల్సిన అవసరంలేదు. సిగ్నల్ గ్రీన్ కలర్ లోకి మారిపోయింది.    
    బండి స్టేషన్ మెయిన్ లైన్ మీదనుంచి శరవేగంతో వెళ్ళిపోసాగింది. స్టేషన్ మాస్టర్ ఒకవేపు, పాయింట్స్ మెన్ మరో వేపూ ఆల్ రైట్ సిగ్నల్ చూపిస్తున్నారు.    
    "గార్డ్ సిగ్నల్ రైట్" అరిచాడు అసిస్టెంట్.    
    "స్టార్టర్ ఎడ్వాన్స్ స్టార్టర్ క్లియర్" కొద్ది క్షణాలాగి మళ్ళీ అరిచాడు.    
    గురుమూర్తి కూడా రిపీట్ చేశాడు. బండి బ్లాక్ సెక్షన్ లోకొచ్చేసింది. గురుమూర్తి సంతృప్తిగా నిటూర్చాడు. అంతవరకూ వేరే ఆలోచనలురాకుండా బిగపట్టినమనసు ఒక్కసారిగా రిలీజయినట్లయింది.    
    ఇంజన్ వెనుక కోచీలోనే కూర్చున్న సంధ్యగుర్తుకొచ్చిందతనికి. సికింద్రాబాద్ స్టేషన్ లో వ్యాక్యూమ్ చెక్ చేయడానికి నెక్స్ట్ కోచి దగ్గర కెళ్ళినప్పుడు చూశాడామెని. కిటికీదగ్గరే కూర్చుని ఏదో మగజైన్ చదువుకుంటోంది ఒక్కసరిగా తన గుండెలు వేగంగా కొట్టుకున్నాయ్.    
    ఎంతకాలానికి చూస్తున్నాడామెని? ఎంత నిరీక్షణ తర్వాతకనిపించిందామె?    
    పాలిటెక్నిక్ కోర్స్ పూర్తయాక ఉద్యోగం కోసం హైద్రాబాద్ వచ్చినప్పుడు వాళ్ళింట్లో దిగాడు. తన తల్లి తరపునదూరపు బంధువులు వాళ్ళు వాళ్ళు తమకన్నా ఆస్థిపరులవ్వటంతో తను ఇన్ ఫీరియర్ గా ఫీలయేవాడు.

 Previous Page Next Page