Previous Page Next Page 
కార్నర్ సీట్ పేజి 6


    "చూడండి...మా ఫ్రెండ్ తో వారం రోజుల్లో ఖాళీ చేస్తానని చెప్పానుగానీ, నిజానికి ఈ లోపలే చేసేయటం మంచిది. ఎందుకంటే రేపు గురువారంనాడే వాళ్ళావిడ కాపురానికొచ్చేస్తోంది"
    "నేను చూస్తాను కదా..."
    "కొత్త పెళ్ళికూతురు కాపురానికని మొగుడి దగ్గరకొస్తూంటే...మధ్యలో నేను పానకంలో పుడకలాగా...అర్ధమయిందా?"
    "అయింది మహాప్రభో అయింది...మీరింక నిశ్చింతగా వెళ్ళిరండి."
    "ఆ చెప్పండమ్మా...మీ సంగతేమిటి?"
    "నాదీ అదే కేసు. వారంలో ప్రస్తుతం ఉంటున్నచోటునుంచి వచ్చెయ్యాలి. అంచేత అర్జంటుగా ఇల్లు చూపిస్తే..."
    "పాతిక రూపాయలు కట్టండి..."
    ఆమె బ్యాగ్ లోనుంచి పాతిక రూపాయలు తీసికట్టింది.
    "ఇంక మీ వివరాలు చెప్పండి."
    "పేరు సావిత్రి_"
    "చిరునామా?"
    "చెప్పిందామె.
    "ఎంతలో కావాలి ఇల్లు?"
    "రెండొందలూ, రెండొందల యాభయ్ మధ్యలో"
    "ఏ ఏరియాలో?"
    "ఏదొక ఏరియా__నేను చీఫ్ ఇంజనీర్ ఇరిగేషన్ లో వర్క్ చేస్తాను. అక్కడికి వీలయినంత దగ్గరగా వుంటే మంచిది..."
    "సరే! రేపు సాయంత్రం రండి."
    "వీలయినంత త్వరగా చూడాలి. చాలా అవసరం.
    అతని ముఖం విప్పారింది.
    "అలాగా! అయితే పోనీ ఓ పని చేయండి. ఎమర్జన్సీలో రాసేస్తాను మీ పేరు. ఏమంటారు?"
    "ఏమయినా రాయండి. నాకు రెండు మూడు రోజుల్లో ఇల్లు దొరికితే అంతే చాలు..."
    "మీరింక ఆ బాధ్యత నాకొదిలేయండి. నలభై ఎనిమిది గంటల్లో మీకో గది చూపించే బాధ్యత నాది. కాని ఎమర్జన్సీ అంటే మాటలు కాదు. కొంచెం ఖర్చవుతుంది. ఎక్స్ స్ట్రాగా!"
    "ఎంత?"
    "ఇంకో ఇరవై అయిదు రూపాయలు."
    "సరే...ఇదిగో, తీసుకోండి...! కానీ దయచేసి మీ మాట నిలబెట్టుకోండి. మీరడిగినంతా ఇస్తున్నానంటే నా అవసరం ఎంతటిదో మీరూహించుకోవచ్చు..."
    "మీకెందుకమ్మా! మీరు నిశ్చింతగా వుండండి. సాయంత్రం మీ ఆఫీసునుంచి సరాసరి ఇటొచ్చేయండి...ఇల్లు చూద్దురుగాని!"
    సావిత్రి లేచి బయటికొచ్చింది. ఆమె మనసిప్పుడు కొంత ఊరట చెందింది.
    మర్నాడు మళ్ళీ అతని ఆఫీస్ కి చేరుకునేసరికి ఆ యువకుడు కూడా అక్కడే కూర్చుని కనిపించాడు.
    ఆమెను చూడగానే మందహాసం చేశాడతను. "ఈ పెద్దమనిషి ఎక్కడికో వెళ్ళాడుట."
    "మీరు ఇంటికోసమే వచ్చారా?" అడిగాడతను.
    "అవును..." ముక్తసరిగా అంది సావిత్రి.
    "ఏమయినా ఉన్నయ్యన్నాడా?"
    "ఏమో...తెలీదు."
    అప్పుడే రామలింగం లోపలికొచ్చాడు చెమటలు తుడుచుకుంటూ...
    "ఆ! ఏం కావాలండీ?" శ్రీరామ్ వంక సందేహంగా చూస్తూ అడిగాడు.
    "ఇల్లు..."
    "పాతిక రూపాయలు కట్టండి!"
    "అంటే రోజుకి పాతిక రూపాయల చొప్పున కట్టాలా?"
    రామలింగం ఉలిక్కిపడ్డాడు.
    "ఓ... మీరు కట్టేశారు కదూ... మీ పేరేమిటన్నారు?"
    "శ్రీరామ్..."
    "శ్రీరామ్! ఆ! గుర్తుకొచ్చింది. రెండొందల్లో ఇల్లు కావాలన్నారు కదూ?"
    "అవును..."
    "రేపు సాయంత్రం రండి...! కుర్రాళ్ళు వెతుకుతున్నారు."
    "ఇంకా వెతకటంలోనే వుందా?"
    "అవునండీ! మీ ఒక్కరికే కాదుగదా...! అందరికీ కలిపి వెతుకుతుంటారు. అంత అర్జంటుగా కావాలంటే ఎమర్జన్సీ ఫీజు పాతిక కట్టండి..."
    "ఏమిటీ ఇంకో పాతికా? నేనేం నోట్లు అచ్చుగుద్దే ప్రెస్ లో పనిచేయటం లేదయ్యా."
    "ఆమెగారు చేస్తున్నారేమిటి? అయినా పాపం అర్జంటని ఎగస్ట్రా పాతిక కట్టలేదూ?"
    "గోవిందా గోవింద..." అన్నాడతను.
    రామలింగానికి కోపం ముంచుకొచ్చింది.
    "ఏమిటి గోవిందా?"
    "ఆవిడ కట్టిన ఎమర్జన్సీ పాతిక."
    "ఎందుకూ? 48 గంటల్లో ఇల్లు చూపిస్తాం ఆమెకి."
    "సరే...పాతిక రూపాయలు కడతాను...ముందు ఆమె సంగతేదో తేల్చండి! ఆవిడ పేరు ఎమర్జన్సీలో రాసి పాతిక రూపాయలు తీసుకొన్నారు కదా? ఇరవైనాలుగు గంటలు కూడా అయిపోయింది. ఈ ప్రొసీజరు ఎంత బాగా పనిచేసిందో చూసి అప్పుడు నేనూ కడతాను."

 Previous Page Next Page