Previous Page Next Page 
నారాయణరావు (నవల) పేజి 6


                                            కొత్తపేట

    సుబ్బారాయుడు గారు మంచి సరసుడు, మాటకారి. తేనెలూరునట్లే వ్యవహారమునైనను, తేట తెల్లముగ వివరింపగలరు. వ్యవహారదక్షులైన సుప్రసిద్ధ న్యాయవాదులే యాయన మాటలు చెవులార వినుచుందురు. అప్పులిచ్చు షావుకార్లకందరకు తప్పనివగు ధనసంబంధ వ్యాజ్యములలోదప్ప నితరముల యెడ నాయనకు సంపర్కమేదియు లేకపోయినను, చక్కని బుద్ధి సూక్ష్మత, పరిశీలనా దక్షత కలవాడగుటచే నేసంబంధమైనను, న్యాయసూత్రాల పట్ల విచిత్రాలోచన చేయగలడు. సలహా చెప్పగలడు. చదువుకొని పట్టాను బొందినఛో భాష్యం అయ్యంగారు కాదగిన తెలివి యాయనకు గలదు. హిందూ న్యాయశాస్త్రములో నిదివరకు లేని కొన్ని సూక్ష్మముల వివరించి యాయన యొసంగిన సలహాల వలన, ఒక దత్తతాభియోగము నెగ్గినదనియు, నా వ్యవహారపు దీర్పే దత్తతాన్యాయమును చాలావరకు మార్చినదనియు కోనసీమలోని పండిత పామరు లందరికిని దెలియును.  
    పచ్చని దబ్బపండుచాయ మానిసి, పొడగరి. ఆజానుబాహుడు. తెల్లగా నచ్చటచ్చట నెరసిన తల, గడ్డము, మీసము లాయనకు వింత శోభ నిచ్చును. పొలము దిమ్మవంటి వక్షముతో, వట్రువలు తిరిగి కండలూరిన బాహుసంపదతో, కోలనై, బింక మొలుకు మోముతో, విశాలమై లోతైన కాటుక కన్నులతో, విరివియై విశాలమైన ఫాలముతో, తెల్లని యజ్ఞోపవీతముతో నాయన ద్రోణుని దలపించుచుండును.
    సుబ్బారాయుడుగారి కెన్ని కథలు వచ్చునో లెక్కలేదు. ఆయన చెప్పు కథలు పెద్దలు గూడ తనివోవ వినుచుందురు. కొంచె మెచ్చుతగ్గుగా ననేక భాషలలోని గ్రంథములన్నియు నాయన పఠించినారు. కథలు సందర్భానుసారముగా నాయన కల్పించవలసి వచ్చిన కల్పించును. ఒకసారి కల్పించిన కథను మరల నెప్పటికిని మఱచిపోడు.
    ఆనాటి సాయంత్ర మేడుగంటలకు, దన నాల్గవ కుమార్తె ఊకొట్టు చుండగా కాశీ మజిలీలలోని అదృష్ట దీపుని కథ యాయన చెప్పుచుండెను. పెద్ద కుమారుడు, నాతని సంతానమగు నిద్దరు కుమారుళ్ళును కుమార్తెయు, సుబ్బారాయుడుగారి భార్య జానకమ్మ గారు, కొందరు రైతులు, ఇరుగుపొరుగు బ్రాహ్మణులు, చుట్టములు, కాళ్ళు పట్టుచున్న మంగలి, విసనకర్ర వీచుచున్న చాకలి యా కథ వినుచుండిరి. ఇంతలో గొన్ని బండ్లు వారి ఇంటిముందాగిన చప్పుడైనది.
    నారాయణరావు లోనకి వచ్చినాడు. 'అన్నయ్య వచ్చాడు. అమ్మా! చిన్నన్నయ్యేవ్!' అంటూ సూర్యకాంతం లేచి పరుగున అన్నగారి దగ్గరకు జేరినది. నారాయణరావామెను సునాయాసముగ బైకెత్తి తన హృదయమున నదిమికొని ముద్దిడి క్రిందికి దింపినాడు.'చిన్న నాన్నగారు! తిన్న నాన్నగాలు! తిన్న నాన్నగాలు!' అనుచు నారాయణరావన్న కుమార్తెయు, నిరువురు కుమారులును, లేగదూడలవలె పినతండ్రికడకు పరుగు వారిరి. ముగ్గురినొకసారిగా నెత్తివేసుకొని యొకరిని భుజముమీద, నిరువురిని జేతులలో నిముడించుకొని, చెల్లెలు తన్ను చేయి చుట్టి నడువ, ముందరి మండువాలోకి బోయినాడు. బండి వాడును, చాకలి, మంగళ్ళు, సామానంతయు లోనకి జేరవేసిరి. నారాయణరావందులో నొక పెద్ద పెట్టె పై మండువాలో దింపించి, తాళము తీసి, యందులో నుండి బొమ్మ సామానులు, జపాను మర పనులు, చిత్రవిచిత్రములైనవి పుదుచ్చేరీ పనులు, విక్టోరియా చిత్రవస్తుశాలలోకొన్న రాగి, వెండి, దంతపు, గంధపు శిల్పపుంబనులు, కొండపల్లి బొమ్మలు, మచిలీపట్టణపు టద్దకపుదెరలు, ఖద్దరు, పట్టు, నూలు చొక్కాలు, పరికిణీలు, పొందూరు చీరలు, పయ్యద కండువాలు తీసి తనచుట్టూ మూగిన తల్లికి, వదిన గారికి, పిల్లలకు, అన్నగారికి, పెదతల్లికి జూపించినాడు.
    'నా గుల్లంబండి బాగా వెళుతోంది' అన్నాడు అన్నగారి చిన్నపిల్లవాడు.
    'చిన్నాన్న గారూ! నా మోటారు బాగాలేదుటండీ, తమ్ముడు బండి కంటే!' యని పెద్దవాడు. 'ఒరే తమ్ముడూ! నాకు తెచ్చిన యీ వెండి బొమ్మ సామానంత మంచివి కావురా మీవి?' అన్నది అన్న కుమార్తె.
    మంచి రంగులు వేసి బొంబాయిలో జరీ పువ్వుల పనిచేసిన పొందూరు కండువాలు చూచుకొనుచు,గంధపు బొమ్మలు మొదలైనవి గమనించుకొనుచు, సూర్యకాంతము ముసిముసి నవ్వులతో మురిసిపోయినది.
    'నారాయుడు మూడువందల రూపాయలకు తక్కువ ఖర్చుచేసి ఉండడు వీటికోసం. డబ్బంటే మంచినీళ్ళు తాగుతాడు' అనుచు నన్నయగు శ్రీరామమూర్తి విస్తుపోవుచు జూచినాడు.
    శ్రీరామమూర్తికి తమ్ముడన్ననెంత ప్రేమయున్నదో, నారాయణరావు తక్క దక్కినలోక మెరుగడు. తల్లిదండ్రులు, శ్రీరామమూర్తి భార్య వరలక్ష్మమ్మయు గొంచెముగా నెరుంగుదురేమో. శ్రీరామమూర్తి, సుబ్బారాయుడు గారికి, జానకమ్మగారికి ప్రథమ సంతానము. ముప్పదియేండ్ల ఈడువాడై, బి.ఏ., ప్లీడరుషిప్పు పరీక్షలలో గృతార్ధుడై, యమలాపురములో వృత్తి జేయుచు, ధనము బాగుగా సముపార్జించుచు, బేరుగాంచిన న్యాయవాది యతడు. వ్యవహారముల నారితేరిన బంటు. కోర్టు, ఇల్లు, తనయూరు, తన యాలుబిడ్డలు, తలిదండ్రులు, తమ్ముడు, చెల్లెళ్ళు, ఆలివంక బందుగులు, దగ్గర బందుగులు_అదియే యతని ప్రపంచము. సాంఘిక రాజ్యాంగ వ్యవహారములతో నతనికి నిమిత్తము లేదు. మేనమామ పోలికతో గొంచెము స్థూలమనిపించు చామనచాయ రూపము. అయిదడుగుల ఏడంగుళముల పొడవయ్యు దమ్మునికన్న, దండ్రికన్న నతడు చాలా పొట్టి.
    అన్నయ్యా! నీకోసం యీ మంచిగంధపు ఉత్తరాల పెట్టె పట్టుకు వచ్చాను. బాగుందా? దీని పనితనం చూడు. మూతమీద గోవర్ధనోద్దరణం, లోపల కైలాసపర్వతం రావణుడు ఎత్తడం చెక్కి ఉన్నది. కింద రాముడు లేడికై పరుగెత్తడం, పక్కల్ని అశోకవనంలో సీత, బృందావనంలో గోపి కృష్ణులను చేశాడు. దీని ఖరీదు డెబ్బైఅయిదు రూపాయలు.
    'ఇంత చిన్నదానికే అంత ఖరీదేమిటి రా!'
    'శిల్పపు పని విలువ అది' అన్నది వదినగారు.
    'ఏమమ్మోయ్ వదినా! నీకు తెచ్చిన పొందూరు చీర యిదిగో.'
    'ఎందుకురా పొందూరు కొనడం? మామూలు ఖద్దరులోనే సన్నరకం ఏడెనిమిది పెడ్తే వస్తాయి గదట్రా' అన్నాడన్నగారు.
    'అడిగాదన్నయ్యా! బండ ఖద్దరు చీరలు కట్టుకుంటూంది. అసలే కొంచెం బొద్దు మనిషి. అందులో సాదా ఖద్దరు చీరలు కట్టుకుంటుంటే రెండు రెట్లయింది వదిన అని, మూడు పాటినూలువి, ఒక పట్టుశాలీ నూలుది నాల్గూ కొనుక్కుని చక్కా వచ్చాను. అమ్మకి నాలుగు పట్టుకువచ్చాను. నీకు జరీకండువాలు రెండు. ఒకటి పొందూరుది, ఒకటి సేలంది. నాన్నగారికి బందరు పురిటి గడ్డవి, నాల్గు ఎర్ర అద్దకం పంచెలు పట్టుకువచ్చాను. ఇంకా ఉన్నాయి. అక్కయ్యలకీ, కన్నతల్లికీ, అమ్మడికీ, పిల్లలకీ, నీకూ నాకూను. కన్నతల్లి ఏదర్రా?' 'మందపల్లి మామయ్యగారింటికి వెళ్ళింది. వస్తూ ఉంటుంది' అన్నాడు శ్రీరామమూర్తి. హృదయము వికసించి, యతని మోము వెన్నెల వెలుగయినది. తమ్ముని గుణగణములు రోజుకు మూడు నాల్గుసార్లు తక్కువ కాకుండ నితరులకడ నాతడు వర్ణన చేయుచుండును.
    'మా తమ్ముడున్నాడే వాడి దేహం, ఎంత వజ్రమో, హృదయం అంత నవనీతం సుమండీ! మా నాన్నగారి తెలివితేటలు దశమి వెన్నెలైతే, మావాడి జ్ఞానం పున్నమ వెన్నెలండీ! మనకు స్వరాజ్యమంటూ వస్తే మావాడు ముఖ్యమంత్రి అవవలసిందే. నౌరోజీ, దాసు, నెహ్రూ, రాధాకృష్ణ, పట్టాభి, హాల్డేను మొదలైన వాళ్ళతో సమమైన బుర్రండీ' అని యనుచుండును.
    తాను లోభియయ్యు, దమ్ముడిట్లు ధనము వెచ్చించుటన్న నతనికి పరమ ప్రీతీ. అతని హృదయాంతరాళమున నణగిమణగియున్న యుత్కృష్ట గుణములన్నియు దమ్ముడగు నారాయణరావు కడ జాగృతములై ప్రత్యక్షమైనవి.
    ఈ సంగతియంతయు సూక్ష్మగ్రాహియగు నారాయణరావున కవగతమే!
    'పరమలోభి, గట్టి మనస్సువాడూ ఐన అన్నగారంటే అంత గౌరవం, అంత ప్రేమా ఏమిటా నారాయుడికి' అని యతని స్నేహితులెన్నిసార్లు గుసగుసలు వోయినారో!
    'ఏమిటా చిన్నబాబూ! నాన్నగారు పంపించిన అయిదువందలూ ఖర్చుచేసేశావా' అన్నది తల్లి.
    'ఆఁ! ఇంకో నూటయాభై రూపాయల సరకు వీ.పీ.గా వస్తుంది, అమ్మా!'
    'కొడుకు సోద్యాలు చూసి సంతోషించడమేనా, మాకు నాల్గు మెతుకు లేవన్నా పారేయించేదున్నదా!' అని యప్పుడే లోనికి లక్ష్మీపతితో వచ్చిన సుబ్బారాయుడు గారు భార్యను నవ్వుచు బ్రశ్నించినారు.
    వేళాకోళములు చేయుటలో సుబ్బారాయుడు గార ద్వితీయులు. అందులో భార్యనెప్పుడు బరిహాసములతో ముంచివేయుచుండును.
    మా అక్కయ్య వంట చేసికొని కూర్చుంది. ఎనిమిదైనా మీరు లేవకపోతే! రోజూ ఎంత మొత్తుకున్నా తొమ్మిదింటికైనా భోజనానికి లేచిరాని మీకు ఈవేళ పట్నవాసాన్నుంచి అబ్బాయి, అల్లుడూ వచ్చారని, ఇంత తొందరగా జఠరాగ్ని కదిలింది!'
    గుమ్మం దగ్గర నిలుచుండి నారాయణరావు కొని తెచ్చిన వింతలన్నియు గమనించు చుండిన జానకమ్మగారి అక్క లక్ష్మీనరసమ్మగారు 'మరది గారికి కొత్తటే అమ్మాయీ! ఉన్న దోటీ అనేదొహటీ' అని పలికినది. 'అప్ప చెల్లెళ్లిద్దరూ వీరసతు లౌతున్నారు. ఆడవాళ్లు తలుచుకుంటే మొగాళ్లు మూల గదుల్లో దాగాలిసిందే' అని సుబ్బారాయుడు గారు నవ్వుకొన్నారు.

 Previous Page Next Page