Previous Page Next Page 
వెన్నెల వేట పేజి 6


    "నేనే అంకుల్. భవానీశంకర్ ని. బంగారయ్య అంకుల్ మేనల్లుడిని ఎప్పుడో చిన్నప్పుడు చూశానంకుల్ మిమ్మల్ని. తెగ లావయిపోయారిప్పుడు."
    "నీకేం కావాలి?" కోపం అణచుకుంటూ అడిగాడతను.
    "ఇదిగో అంకుల్ ఈ ఉత్తరం ఇచ్చారు మీకు."
    సాంబమూర్తి ఉత్తరం అందుకుని త్వరగా చదివేసి "అలా కూర్చో. తర్వాత మాట్లాడతాను" అన్నాడు. భవానీశంకర్ కుర్చీలో కూర్చున్నాడు.
    సాంబమూర్తి మళ్ళీ ఎడిటర్ వేపు తిరిగాడు.
    "అదేంటండీ. ఆంధ్రా ఇర్వింగ్ వాలెస్ అనే పేరు రంగరాజు అనే రచయిత కిచ్చాంగా ఆ మధ్య. మళ్ళీ ఇప్పుడు శ్రీకుమార్ కిస్తే ఎలా?"
    "ఇతనుకూడా అదే పేరు కావాలని పేచీ పెట్టాడండీ. అంచేత మన ఆస్థాన రచయిత గదాని ఇచ్చేశాను"
    "సరే పెడితే పెట్టావ్. అక్కడితో ఆగక ఆంధ్రా ఫ్రాయిడ్ అన్నావెందుకు మళ్ళీ?"
    భవానీశంకర్ చప్పున కల్పించుకున్నాడు.
    "మియర్ వేస్టు అంకుల్! ఇలా ఒక్కొక్క తెలుగు రచయితకూ రెండేసి ఇంగ్లీష్ రచయితల పేర్లు వాడితే చాలా కష్టం. చివరకు బోలెడు మంది తెలుగు రచయితలు అసలేమీ ఇంగ్లీష్ రచయితల పేర్లు మిగలక దెబ్బతినేస్తారు."
    సాంబమూర్తికా పాయింట్ నచ్చింది.
    "కరెక్ట్! అంచేత ఒక్కొక్క తెలుగు రచయితకూ ఒక్కొక్క ఇంగ్లీష్ రచయిత పేరే వాడండి. వచ్చేవారం మన శ్రీకుమార్ కేవలం ఆంధ్రా ఇర్వింగ్ వాలెస్ యేనదీ, ఆంధ్రా ఫ్రాయిడ్ అని పొరపాటున ప్రచురించడం జరిగిందనీ ఎనౌన్స్ చేయండి."
    రంగారావ్ భవానీశంకర్ వేపు కోపంగా చూసి "సరేనండీ!" అన్నాడు సాంబమూర్తితో. సాంబమూర్తి మళ్ళీ పేజీలు  తిప్పసాగాడు.
    "అరె! ఇదేమిటి?" ప్రముఖ రచయిత్రి కుమారి విమలారాణి సెన్సేషనల్ సీరియల్! వచ్చేవారం నుంచే ప్రారంభం" ఈవిడ ప్రముఖ రచయిత్రా? అసలీమె పేరే వినలేదే నేను?" రంగారావ్ కొంచెం తడబడ్డాడు.
    "అహహ_ఆవిడ రచయిత్రే సార్! మన పత్రికలోనే నాలుగు వారాలక్రితం ఉత్తరాల శీర్షికలో బహుమతి పొందిన ఉత్తరం రాసింది! ఆ ఉత్తరం చాలా అద్భుతంగా ఉందనీ. ఆమెతో సీరియల్ వెంటనే రాయించకపోతే మన పత్రిక ఆఫీస్ ముందు ఆమరణ నిరాహారదీక్ష జరుపుతామనీ కరీంనగర్, జగిత్యాల, మిర్యాలగూడ, బెల్లంపల్లి, శ్రీకాకుళం పాఠకులు బెదిరింపు ఉత్తరాలు రాశారు. అదీకాకుండా ఆ అమ్మాయి నాకు బాగా కావలసిన అమ్మాయ్" సాంబమూర్తి నిరాకుపడ్డాడు.
    "ఆల్ రైట్ ఇదే లాస్ట్ అవకాశం మీకు! నాకు తెలీకుండా ఇంకెవరివీ సీరియల్స్ వేయకండి!"
    "అలాగేనండీ!"
    మరోపేజీ తిప్పాడతను.
    "ఇదేమిటి? ఈ వారం వారఫలాలు వేయటంలేదా? ఎందుకని?"
    "అవి రాసే అయన ఊరెళ్ళాడండీ!"
    భవానీశంకర్ ఘొల్లున నవ్వేశాడు.
    "వారఫలాలు అసలు ఎవరో రాయటమేమిటి గురూజీ! వెరీబాడ్! ఇలాంటి చిన్న చిన్న శీర్షికలన్నీ ఎడిటరే రాస్తూండాలి! రచయిత సీరియల్ తరువాయి భాగం ఇవ్వటం ఆలస్యమయితే మనమే రాసేయాలి! పాఠకుల ప్రశ్నకు డాక్టర్ జవాబులు సమయానికి అందకపోతే మనమే హెల్త్ గైడ్ దగ్గర పెట్టుకుని జవాబులిచ్చేయాలి! పాఠకులు ఉత్తరాల శీర్షికకు మనకు కావలసిన విధంగా ఉత్తరాలు రాయకపోయినా మనమే రాసేయాలి."
    సాంబమూర్తి భవానీశంకర్ వేపు మెచ్చుకోలుగా చూశాడు.
    "నీకివన్నీ ఎలా తెలుసోయ్?"
    "ఇంకా బోలెడు తెలుసంకుల్! ఇప్పుడెందుకులే అని చెప్పలేదు"
    "ఈ ఫీల్డులో నీకు చాలా అనుభవం ఉన్నట్లుంది."
    "అనుభవమా? రష్యన్ ట్రాక్టర్ తో దున్నినట్లు దున్నేయటమే! ఓ సారి మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ పత్రికలో ఓ రచయిత సీరియల్ పంపటం ఆలస్యమయితే నేనే రాసిచ్చాను. అంతే! పాఠకులు తెగ ఉత్తరాలు రాశారు. మొత్తం సీరియల్లో నేను రాసిన భాగమే అద్భుతంగా ఉందని! తమాషా ఏమిటంటే రచయిత అది తనే రాశాననుకున్నాడు."
    సాంబమూర్తికి అతనిమీద గురి కుదిరిపోయింది.
    "చూశావుటోయ్ రంగారావ్! ఎడిటరంటే ఇంత డాషింగ్ గా ఉండాలి! అంతేగానీ, అన్నిటికీ తలక్రిందులయిపోకూడదు. ఆల్ రైట్ భవానీశంకర్! నువ్వు మా వారపత్రికలోనే సబ్ ఎడిటర్ గా చేరిపో."
    భవానీశంకర్ ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు.
    "థాంక్ యూ అంకుల్!"
    "దట్సార్ రైట్_రేపు ప్రొద్దున జాయిన్ అయిపో."
    "ఓ.కే. అంకుల్."
    భవానీశంకర్ బయటికొచ్చేశాడు అలా అద్భుతమయిన ఉద్యోగం దొరికింది అనుకోకుండా! తన టాలెంట్స్ అన్నీ బ్రహ్మాండంగా ప్రదర్శించవచ్చు.
    గేటు దగ్గర కొచ్చాక వాచ్ మెన్ ఎందుకయినా మంచిదని సెల్యూట్ కొట్టాడు.
    అతని భుజం తట్టాడు భవానీశంకర్.
    "నువ్ చెప్పింది నిజమేనోయ్. మా సాంబమూర్తిగాడి కిప్పుడు జుట్టు మొలిచింది గుండుమీద."
    "అవున్సార్."
    భవానీశంకర్ రోడ్డుమీద నడుస్తూ తన జేబులోనుంచి ఆ కాగితం తీసి మరోసారి చూచాడు అమ్మాయి ఫోటోవంక.
    "దేవతా! నీ కోసం వేట మొదలుపెట్టాను ఇవాళే" అనుకున్నాడు ఉత్సాహంగా.


                           *    *    *    *


    హోటల్ రూమ్ చేరుకునేసరికి సాయంత్రం నాలుగయిపోయింది. అప్పటికి ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు భరద్వాజ. హోటల్ గది బాల్కనీలో కూర్చుని రోడ్డుమీద వచ్చేపోయే అమ్మాయిల మొఖాలను చూస్తూ చాలాసేపు గడిపేశాడు భవానీశంకర్. ఆ ఫోటోలో అమ్మాయి ఏదొకరోజు అకస్మాత్తుగా కనబడుతుందని నమ్మకంగా ఉంది.
    రాత్రి ఎనిమిదింటికి "హలో ఫ్రెండ్!" అన్న కేకవిని బాల్కనీలో నుంచి గదిలోకి నడిచాడు భవానీశంకర్ భరద్వాజ నిద్ర లేచాడు.
    "ఆకలి బ్రదర్! అర్జంటుగా భోజనం తెప్పించు."
    భవానీశంకర్ భోజనం ఆర్డర్ చేశాడు.
    "అబ్బ! నిద్రలో బ్రహ్మాండమయిన కలొచ్చింది గురూ! వాడెవడో. జేబులో ఓ మాగజైన్ లో ఓ పాత పేజీ తీసుకుని అందులో ప్రింటయిన అమ్మాయి ఫోటోని ప్రేమించి గోడవెంబడి తిరుగుతున్నాడట. పిచ్చివెధవ ఫెంటాస్టిక్ గా లేదూ?"
    "లేదు!" అన్నాడు భవానీశంకర్.
    "లేదా?"
    "ఏ మాత్రం లేదు!"
    "ఎందుకని?"
    "నేనే ఆ కాగితం జేబులో పెట్టుకుని తిరుగుతున్నాను కాబట్టి!"
    భరద్వాజ్ ఆశ్చర్యపోయాడు "నువ్వా!"   
    "అవును!"
    "ఏదీ ఆ కాగితం చూపించు!"
    భవానీశంకర్ ఆ కాగితం అతనికిచ్చాడు.
    "వెరీ లవ్ లీ గాళ్! ఇంత అందమయిన అమ్మాయికోసం అలా పిచ్చివెధవలా తిరిగినా తప్పులేదు" అన్నాడు మెచ్చుకోలుగా.
    భోజనం తెచ్చాడు బాయ్.
    ఇద్దరూ భోజనం చేయసాగారు.
    "ఆ కాగితం ఏ మాగజైన్ లోది?" అడిగాడు భరద్వాజ్.
    "తెలీదు. పై పోర్షనూ, కింద పోర్షనూ కూడా చిరిగిపోయింది."
    "వెరీబాడ్! అయినా ఫర్లేదు. ఆ అమ్మాయిని కనుక్కోవటం కష్టమేమీ కాదు. ప్రతిరోజూ ఓ బస్ స్టాప్ దగ్గర నిలబడు. ఏదొక బస్ స్టాప్ కి తప్పక వస్తుంది కదా."
    భవానీశంకర్ కి ఉత్సాహం కలిగింది.
    "సిటీలో ఎన్ని బస్ స్టాప్ వుంటాయ్?"
    "ఓ వెయ్యి పైన వుంటాయ్?"

 Previous Page Next Page