Previous Page Next Page 
ప్రేయసీ! నీ పేరు రాక్షసి! పేజి 6


    రకరకాల ఇంటర్వ్యూలకు ఎటెండ్ అయ్యాడు. అసలు లాభం కలగలేదు సరిగదా తల్లి సంపాదనలో మూడోవంతు ఫారాలకీ_ఫీజులకీ, బస్సు టిక్కెట్లకీ ఖర్చయ్యాయి.


                            *    *    *    *


    టెలిఫోన్ మ్రోగడంతో ఈ లోకంలో పడ్డాడు సాగర్, చేయిచాచి రిసీవర్ అందుకున్నాడు.
    "హల్లో....సాగర్ హియర్"
    "శృతి"
    "ఓ నువ్వా?" ముందుకి వంగాడు.
    "చెప్పు"
    "ఆలోచించావా?"
    "ఆలోచిస్తున్నాను"
    "ఈ రోజు బుధవారం....సాయంత్రం క్లబ్ కెళతారాయన"
    "ఓ...."
    "ఇదో అవకాశం కావచ్చు"
    "కావచ్చు" సాలోచనగా అన్నాడు.
    అతని చేతివ్రేళ్ళు అప్రయత్నంగా ఫోన్ చుట్టూ గట్టిగా బిగుసుకున్నాయి.
    "ఎవరన్నా వున్నారా దగ్గరగా?" అడిగింది.
    "లేరు"
    "మరి అంత ముభావంగా వున్నావేం?"
    "ఏమీ లేదు"
    "సాగర్...."
    "ఊఁ...."
    "భయపడుతున్నావా?"
    "......."
    "ఏవిఁటి సాగర్ యిది? కాలేజీలో అంత వీరోచితంగా దయాళ్ ని ఎదుర్కొన్నవాడివి....ఇప్పుడింత చిన్న విషయానికే...."
    షాక్ తిన్నాడతను. చిన్న విషయమా ఇది? ఓ మనిషి ప్రాణం అంత చిన్న విషయమా?
    "అది దెబ్బలాట శృతీ....ఇది....హత్య...."
    "రెంటికీ కావలసిందొక్కటే....ధైర్యం....మగతనం డార్లింగ్"
    "........."
    "మాట్లాడవేం?"
    "మరేమీ దారి లేదంటావా శృతీ!"
    "వుంది"
    "ఏవిఁటది?"
    "నిన్ను నేనూ, నన్ను నువ్వూ శాశ్వతంగా మర్చిపోవటం"
    ఎక్కడో మారుమూల ఏదో బాణం తగిలిన అనుభూతి....
    "ఐ కాంట్ డూ దట్"
    "మరి?"
    "పోనీ....చచ్చిపోదాం శృతీ...."
    నవ్వింది శృతి అవతల....
    "అది పిరికివాళ్ళ లక్షణం. ఇంత ఆస్థి, మన ఆనందం, మన భవిష్యత్తూ విడిచి చచ్చిపోవడమా....? నువ్వేనా యిలా మాట్లాడుతున్నావ్ సాగర్?"
    "........."
    "సాగర్?"
    "ఓ.కే! నేను రెడీ"
    "దట్స్ లైక్ మై స్వీట్ సాగర్...." అని_ "సాగర్" గోముగా పిలిచింది.
    "ఊఁ...." పరధ్యానంగా అన్నాడు సాగర్.
    "యూ ఆర్ లవ్ లీ....నో....యూ ఆర్ ది లవ్ లీయస్ట్"
    అవతల ఫోన్ డిస్కనెక్ట్ అయింది.
    రిసీవర్ క్రెడిల్ మీదుంచి లేచి ఓసారి ఒళ్ళు విరుచుకున్నాడు సాగర్.
    మళ్ళీ మనసు వెనక్కి పరిగెత్తింది. డిగ్రీ అయ్యాక గడిచిన ఆ సంవత్సరం జీవితంలో ఎప్పుడూ మర్చిపోడు సాగర్. తెల్లవారుఝామున లేచి పేపర్లు పంచిపెట్టాడు సాగర్. అప్పుడు కలిగిందతనికి మరో ఆలోచన బి.ఎడ్ చేద్దామా అని. తల్లితో ఆ విషయం మాట్లాడదామని ఎంతో ప్రయత్నించి విఫలుడయ్యాడు. లాభంలేదు. చూస్తూ చూస్తూ ఆ పరిస్థితిలో తల్లిని ఇంకా ఇబ్బందిపెట్టడం దారుణమని గ్రహించాడు సాగర్, నిరంతరం అతను సాగిస్తున్న ఆ పోరాటంలో మరో మజిలీగా 'తాజ్'లో బేరర్ గా చేరాడు. తాను చదివిన చదువుకి తగిన ఉద్యోగం కాదే అని అప్పుడప్పుడు మనసు పీకినా తనలాగా ప్రపంచంలో యింకా ఎంతోమంది వున్నారనే సమాధానం తనకు తానే యిచ్చుకొని తృప్తి పడుతుండేవాడు. అతను తాజ్ లో చేరిన సంవత్సరమే అతని ఆశల దీపాల్ని ఆర్పేస్తూ తల్లి కన్నుమూసింది.
    కాలం అతి మామూలుగా గడిచిపోతుండగా జరిగిందా సంఘటన. జరిగి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తున్నా నిన్ననే జరిగినట్లుగా సాగర్ కళ్ళకి కనిపించే సంఘటన, అతని జీవిత గమనాన్నే మార్చేసిన సంఘటన.
    ప్రొద్దున్నే పదిన్నరకల్లా మొదలయింది తాజ్ లో 'లంచ్' రష్ ఎప్పటిలాగే.
    జనం వస్తున్నారు, భోజనం ముగించి వెళుతున్నారు. బేరర్ లు హడావుడి హడావుడిగా తిరిగేస్తున్నారు. రకరకాల శబ్దాలతో హోటల్ మహా సందడిగా వుంది.
    వరుసలో మూడో నెంబర్ టేబుల్ దగ్గరికొచ్చి కూర్చున్న కష్టమర్ దగ్గర ఆర్డర్ తీసుకోవడానికి వెళ్ళిన సాగర్ నిశ్చేష్టుడై నిలబడిపోయాడు.
    శృతి.
    "హలో...." పలకరించింది శృతి.
    "హ....హ....హలో" తడబడ్డాడు.
    "హౌ ఆర్యూ సాగర్?"
    "ఫైన్ థాంక్స్" అని క్షణం ఆగి మళ్ళీ నమ్రంగా అడిగాడు.
    "ఆర్డర్ ప్లీజ్"
    "ఆఫ్లై ఫర్ లీవ్ ఎండ్ కమ్ విత్ మీ"
    "పార్డన్?" తనేం విన్నాడో తనకే అర్థంగాక అడిగాడు.
    "ఐ సెడ్ అప్లై ఫర్ లీవ్ అండ్ కమ్ విత్ మి.... సెలవు పెట్టి వెంటనే నాతోరా"
    "ఎక్కడికి?"
    "రా చెప్తా"
    వెంటనే పర్మిషన్ తీసుకున్నాడు. అక్కడినుండి 'కామత్' కెళ్ళారిద్దరూ.
    ఫామిలీ రూంలో కూర్చుని లంచ్ ఆర్డర్ చేశాక చెప్పింది శృతి.
    "నువ్వు వెంటనే రిజైన్ చేసేసి నాతో వస్తున్నావ్."
    "వాట్?"
    "అలా కొయ్యబారిపోనవసరం లేదు. అతి సాధారణ వ్యవహారిక భాషలోనే చెప్పాను."
    "వచ్చి?"
    "మా ఫర్మ్ లో ఏదో ఒక దాంట్లో జాబ్ చూపిస్తాను. జాయిన్ అయిపో."

 Previous Page Next Page