"అందుకే ఒక ఉత్తరం వ్రాశాను. ఇది చదివి..." అంటూ అతను ఉమ దగ్గిరగా వచ్చి ఒక కాగితం మడత ఆమె చేతుల్లో ఉంచబోయాడు. అతని ప్రవర్తన తను ఆశించడానికి భిన్నంగా ఉండటానికి తోడు అతను దగ్గిరకు రావటంతో, ఉమకు ఎక్కడలేని చిరాకూ వచ్చింది. ఆ కాగితాన్ని అడ్డంగా చించి అతన్ని బలంగా ఒక్క తోపు తోసింది. ఆ తోపుకు అతను తూలి ప్రక్కనే ఉన్న మైలురాయి మీద పడ్డాడు. నుదురు చిట్లి రక్తం చిమ్మింది. బాధగా నుదురు చేత్తో పట్టుకుని రోడ్డుమీదే కూలబడ్డాడతడు. పొంగివచ్చే ఆవేదన నణచుకుంటూ, రాని నిర్లక్ష్యాన్ని నటిస్తూ, కన్నీటిని కనురెప్పల మధ్య ఆపి ముందుకు నడిచింది ఉమ.
5
వరుసగా రోగుల నొక్కొక్కరినే పరీక్షిస్తున్నాడు డాక్టర్ రావు.
అనుకోకుండా లోపలకు ప్రవేశించిన శోభను చూసి సంభ్రమంతో తొట్రుపడుతూ "కూర్చోండి! కూర్చోండి! నేను గుర్తున్నానన్నమాట" అన్నాడు.
"గుర్తుపెట్టుకునే మొదట మీ దగ్గరకు వచ్చాను" అంది.
శోభను వింతగా చూస్తూ, "మొదట అంటే?" అన్నాడు.
శోభ నవ్వింది.
"ఆనాడు మీరు మీ అమూల్య సందేశంలో మేమంతా వ్యర్థంగా కాలం గడుపుతున్నామనీ, దేశం నేడున్న అత్యవసర పరిస్థితుల్లో చేయవలసిన ముఖ్యమైన పనులెన్నో ఉన్నాయనీ హెచ్చరించారు. మా సమాజంలో మాట్లాడటానికొచ్చి సమాజాన్నే ఆక్షేపిస్తున్న మీ మాటలకు మొదట కోపమొచ్చిన మాట నిజమే అయినా, ఆలోచించగా మీ మాటలు నిజమే అనిపించింది. నేనూ బంగారం పోగు చెయ్యటానికి బయలుదేరాను. మూర్తి డబ్బు పోగుచేస్తానన్నాడు. సరోజిని ఊలు కొని నిట్టింగ్ వచ్చిన వాళ్ళచేత స్వెట్టర్స్ అల్లించటానికీ, అల్లటానికీ పూనుకొంది. నేను బీదదానిని. ఒక్క జత గాజులు, దుద్దులు, సన్నని గొలుసు మాత్రం ఉన్నాయి. నా గాజులిచ్చేశాను. మీదగ్గిరకొచ్చాను. వాక్శూరత్వంతోపాటు కార్యశూరత్వం కూడా ఉందని నిరూపించుకోండి. మీ శ్రీమతి నగలు కొన్ని ఇలా అర్పించుకోండి" అంది.
ఊ!" అంటూ కుర్చీలో వెనక్కు వాలి, బల్లమీద చేతితో తాళం వేస్తూ, శోభ ముఖంలోకి చూస్తూ కూర్చున్నాడు.
శోభ ఇబ్బందిగా కదిలింది.
"నన్ను వెళ్ళిపొమ్మంటారా?"
"ఈ జన్మలో కాదుగదా పై జన్మలో కూడా అనను."
మనసులో కదిలిన అవ్యక్త ఆనందతరంగాలను అణచివేస్తూ కనుబొమ్మలు ముడిచింది శోభ.
"మీ కవిత్వం వినటానికి మరొకనాడు సావకాశంగా వస్తాను. ప్రస్తుతం నేను వచ్చిన పని అది కాదు."
"మీరు వచ్చిన పని సానుకూలం కాదని చెప్పడానికి విచారిస్తున్నాను."
శోభ చివాలున లేచింది.
"అయితే తమరివన్నీ ఉత్తమాటలేనన్నమాట! వస్తాను".
రావు పకపక నవ్వాడు.
"శోభాదేవిగారూ! కాస్త స్థిమితంగా కూర్చోండి. మీరు నా శ్రీమతి నగలడిగారు. నాకసలు శ్రీమతి లేదు."
శోభ ముఖంలో క్షణకాలం మెరిసిన మెరుపు రావు దృష్టిని తప్పించుకోలేక పోయింది.
శోభ ప్రత్యేకంగా 'శ్రీమతి నగలు' అని అడగటంలో ఉద్దేశమిదే! ఆమె కోరిన సమాధానం లభించింది.
"పోనీ, మీ దగ్గిర బంగారం ఏ రూపంలో ఉంటే అదే ఇవ్వండి."
రావు తన చేతికున్న బంగారు చెయిన్ రిస్ట్ వాచ్ విప్పి శోభ ముందు పెట్టాడు.
"నాకు పి.యు.సి.లో యూనివర్సిటీ ఫస్టు వచ్చినప్పుడు మా నాన్నగారు నాకిది ప్రెజంట్ చేశారు."
"అయితే ఆయన జ్ఞాపకార్థం దీనినుంచుకోండి. ఉంగరంలాంటిదేదైనా..."
"ఫర్వాలేదు. ఈ గడియారం నాకు లభించిన క్షణం ఎంత స్మరణీయమో, దీనిని వదులుకుంటున్న క్షణమూ అంతకు కొన్నిరెట్లు స్మరణీయం."
శోభముఖం మరొకసారి కందిపోయింది. "ఇంత చొరవగా, ఇంత అల్లరిగా మాట్లాడేస్తున్నాడేవిఁటీ?" అనుకొంది. చిత్రమేమంటే ఎంతమంది మధ్య మసలుతున్నా, ఎవరు ఏకొంచెం గాడితప్పి మాట్లాడినా, కాల్చి వాతపెట్టినట్టు సమాధానమిచ్చే శోభ ఇతనినేమీ అనలేకపోతూంది. అతని మాటలూ, మాట్లాడే ధోరణీ అలా ఉన్నాయి. కోపం ప్రదర్శించడాని కెడమీయకుండా ప్రతిమాటకు రెండర్ధాలు.
"థాంక్స్." అంటూ శోభ లేచింది. బంగారు గొలుసు గడియారాన్ని చేతి సంచీలో వేసుకుంది. "వస్తాను."
రావుకెలాగో అనిపించింది. ఆమె కొంచెంసేపు ఆగితే బాగుండుననిపించింది. ఎంతసేపో తనకే తెలియదు. శోభ పాదాలు కూడా చురుగ్గా కదలలేక పోయాయి. ఆమె గుమ్మం దాటిపోబోతుంటే, "మళ్ళీ ఎప్పుడు కనిపిస్తారు?" అన్నాడు రావు.
సరిగ్గా ఈ ప్రశ్ననే శోభ మనసు ఆశిస్తోంది.
"మళ్ళీనా? ఎందుకూ? మళ్ళీ ఏమిస్తారు?"
"మీరేది కోరినా ఇస్తాను."
"బాగుంది! నా కోసమా?" మనసులో ఉద్వేగాన్ని అణచుకోవటానికి క్రింది పెదవిని పళ్ళతో నొక్కిపట్టి అంది.
తన మాటలు అర్థం చేసుకున్న ఆనందం, అర్థంకానట్లు అమాయకత్వం నటించే కొంటెతనం పోటీలు పడుతున్న ఆమె కళ్ళలోకి చూస్తూ రావు తనను తను మరిచిపోయాడు.
"నీకోసమే! నీకోసం నేను ఏమైనా చెయ్యగలను శోభా!" అన్నాడు మంద్ర స్వరాన.
అతడు తనను ఏకవచనంతో వ్యవహరించటం శోభ హృదయాన్ని తాకింది. ఆ అనుభూతి ఆమెకు కొత్తగా వింతగా గిలిగింతలు పెట్టింది. తనను 'శోభా' అని పిలిచేవాళ్ళు ఎందరో ఉన్నారు. కాని ఈనాడు రావు పిలుపులో ఇంత మాధుర్యం ఎక్కడినుంచి వచ్చింది?
"నేను మీకేం తెలుసునని నామీద ఇంత దయ చూపిస్తున్నారు?" నెమ్మదిగా అంది.
"అన్నమంతా పట్టి చూడక్కర్లేదు."