జానకి బుర్ర పగలగొట్టుకుని బంధుత్వాలన్నీ తిరగ తోడుకుని, లెక్కలేసుకుని "అవును వీళ్ళ నాన్న నాకు వరసకి అన్నవుతాడు" అని నిర్ధారించింది.
జగన్నాథం పంతులు గుండె గుభేలుమంది. బడిపంతులుగా అతి సాధారణమైన మధ్యతరగతి కుటుంబాన్ని దినదిన గండంగా నడిపిస్తోన్న సంసారి అతడు.... తెగించి దుర్మార్గంగా ఉండగలిగే సాహసమైనా లేదతనికి. తెల్లవారి లేచింది మొదలు అతనికి అన్నీ భయాలే! దేవుడంటే భయం, దెయ్యమంటే భయం, స్కూల్ కమిటీ ఛైర్మన్ చేసే అన్యాయాలంటే భయం....వీటిని ఎదిరించాలంటే భయం. సంఘమంటే భయం. సంసారమంటే భయం.
అలాగే తన గుమ్మంలోకి అనాధలుగా వచ్చిన బంధువులనబడే వాళ్ళను పొమ్మనాలంటే భయం, నలుగురూ ఏమంటారో అని. ఉండమనటానికీ భయమే, ఎలా పోషించాలని. జానకి పరిస్థితి అలాగే ఉంది. ఆ పసివాళ్ళను పొమ్మనటానికి నోరు రాలేదు. ఉండమనటానికి శక్తి చాలలేదు. ఆ దంపతులిద్దరూ అలా కళ్ళు అప్పజెప్పి చూస్తూ ఉండగానే ధనలక్ష్మి స్వతంత్రంగ లోపలికొచ్చి "పాపం" అత్తయ్యగారు బాలింతరాలిలాగా ఉన్నారు. కాఫీ తాగారా అత్తయ్యగారూ? ముఖం బాగా వడిలిపోయివుంది. ఉండండి కాఫీ కలిపి తీసుకొస్తాను" అంటూ వంటింట్లోకి వెళ్ళి కాఫీ పొడి, పంచదార వగైరాలన్నీ ఎక్కడున్నాయో తనే వెతుక్కుని కాఫీ కలిపి తీసుకొచ్చి ఇచ్చింది. పని చేసుకునే ఓపిక లేక కాఫీ కోసం ఆవురావురు మంటున్న జానకి ఆ కాఫీ తాగి "చాలా బాగుంది, చక్కగా పెట్టావు" అంది.
"నాకో కాఫీ!" అంటున్న సూర్యాన్ని "హుష్! అలా అడక్కూడదు" అని ముద్దుగా మందలించి, దేనికో పేచీ పెడుతోన్న ఆరేళ్ళ సుమతిని సముదాయించి సుమతికీ జగన్నాధానికీ కూడా కాఫీలు అందించింది ధనలక్ష్మి. ఆ కాఫీ తాగేసి, రెండుక్షణాలు అటూ ఇటూ అయోమయంగా చూసి, చిరిగిపోయిన చెప్పులో ఊడిపోతున్న మేకుని రోకలి బండతో గట్టిగా కొట్టుకుని, ఆ చెప్పులు తొడుక్కుని ఈడ్చుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు జగన్నాధం. అప్పుడు తమ్ముడికి కొద్దిగా కాఫీ ఇచ్చి, తను కాస్త తాగి ఇంటిపనుల్లో జొరబడింది ధనలక్ష్మి.
వచ్చిన రెండురోజుల్లోనే "ధనలక్ష్మి లేకపోతే ఎలా?" అని అందరూ అనుకొనేలాగ ఆ ఇంట్లో కలిసిపోయింది ధనలక్ష్మి. చిందరవందరగా ఉండే ఆ ఇల్లు సర్దిపెట్టేది. జగన్నాథం పంతులు చిరుగు బనీన్లూ, చిరుగు పంచెలూ కుట్టి పెట్టేది. సుమతికి తలదువ్వి జడవేసి అన్నంపెట్టి బడికి పంపేది. బాలింతరాలికి పత్యంగా ప్రత్యేకం ఏదో వండిపెట్టేది జానకి. నిద్రపోతున్నప్పుడు పసిగుడ్డు తులసి ఏడిస్తే జానకి నిద్ర పాడవకుండా ఎత్తుకొని ఆడించేది. పన్నెండేళ్ళు నిండని ఆ పసిపిల్ల చేస్తోన్న పని చూస్తుంటే జానకి మాతృ హృదయం సానుభూతితో ద్రవించిపోయేది. "కాసేపు పడుకో ధనం!" అనేది అప్పుడప్పుడు ఆ అమ్మాయి చాకిరీ చూడలేక.
"నాకు పగలు నిద్రరాదు అత్తయ్యగారూ! అయినా ఈ కాస్త పనికేముందిలెండి...." అనేది ధనలక్ష్మి, చిరునవ్వుతో ఏదో ఒక పనిచేస్తూ.
జగన్నాధం పంతులు మాత్రం ఏ వంక దొరికినా ధనలక్ష్మిని సతాయించేవాడు. అసలు అతనికి ఎవరినో ఒకరిని సతాయించకుండా తోచదు. ఇదివరకు ఏదో ఒక వంకతో జానకిని సతాయించేవాడు. జానకి ఓపిక ఉన్నంతవరకూ ఊరుకుని విసుగొచ్చినపుడు విరుచుకు పడేది. ధనలక్ష్మి వచ్చాక జానకికి ఇంటిచాకిరీతోపాటు జగన్నాథం సతాయింపులు కూడా తప్పాయి. ప్రతిరోజూ ఏదో ఒక సమయంలో "ఈ రోజుల్లో ఒకరిద్దరిని మేపాలంటే మాటలా? ఏనాటికి వదులుతుందో నాకీ శని!" అనేవాడు. ఆ మాటలు వింటూ ధనలక్ష్మి అవమానంతో ముఖం నల్లబడగా తల క్రిందికి దించుకుని పెదిమలు పళ్ళతో కొరుక్కొంటూ దుఃఖాన్ని నిగ్రహించుకొంటూ ఉంటే, అతనికి జాలి కలిగేది కాదు. ఆ మూర్తిని ఆనందంగా చూసేవాడు. నిజానికి అది ఆనందం కాదు. ఈ లోకంలో తనకంటే కూడా కుమిలిపోతున్న మరొక ప్రాణిని చూసినప్పటి సంతృప్తి. "ఆత్మాభిమానం" అనే మాటకు అర్థం తెలియదు జగన్నాథం పంతులుకి.... తమ కమిటీ ఛైర్మన్ గారి ముందూ, తమ హెడ్మాస్టర్ ముందూ కుక్కకంటే హీనంగా దాసానుదాసుడు కాగలడు. అందుకే తనకు లోకువైన వ్యక్తులను కుక్కల కంటే హీనంగా చూసి అవమానించగలడు. ఆత్మాభిమానం ఉన్న వ్యక్తులు ఒకరి ముందు తమని తాము హీనపరుచుకో లేరు. మరొకరిని హీనపరచలేరు. ధనలక్ష్మిలో వయసు తక్కువయినా ఆత్మాభిమానం తక్కువలేదు. కానీ, ఆ పిల్లలో అభిమానమే కాదు, సహనం కూడా అపారంగా ఉంది. అందుకే తన నిస్సహాయస్థితి తలచుకొని అంతటి అవమానాన్నీ ఒక్క కన్నీటి బొట్టు రాల్చకుండా దిగమ్రింగి ఊరుకునేది.
ధనలక్ష్మికి కావలసింది పొట్టకింత తిండే అయితే, ఆ అమ్మాయికి సమస్యలు లేకపోయేవేమో! కానీ, ఎలాగైనా తమ్ముణ్ని చదివించి పైకి తీసుకురావాలనేదే ఆ అమ్మాయి తపస్సు. తమ్ముణ్ని బళ్ళో చేర్పించటం తేలికే! కానీ, యూనిఫాం బట్టలు, బడి జీతం, పుస్తకాలు_ వీటికన్నిటికీ డబ్బు ఎలా వస్తుంది? ధనలక్ష్మిలో వయసుకన్న వివేకం పదిరెట్లు పెరిగింది. అంచేత ఆ అమ్మాయి ఏనాడూ జగన్నాధం పంతులుని చెయ్యిజాపి ఏదీ అడిగేది కాదు. తను తింటున్న తిండికి తను చేస్తున్న చాకిరీ పదిరెట్లు ఎక్కువ అనుకున్నా, ఆ మాట కూడా ఏనాడూ పైకి అనేదికాదు. నెమ్మదిగా ఆ చుట్టుప్రక్కల ఇళ్ళలో కాస్త ఉన్నవాళ్ళని మంచి చేసుకుంది. ఒకరింట్లో అప్పడాలు వత్తీ, మరొకరింట్లో లడ్డూలు చుట్టీ, చారుపొడీ, సాంబారు పొడీ లాంటివి దంచిపెట్టి అందరికీ సాయపడేది. పనిచేసిన చోట మాత్రం ఏమాత్రం సంకోచించకుండా "మా తమ్ముణ్ని చదివించుకోవాలి మీకు తోచింది యివ్వండి" అని అడిగి తీసుకునేది. ఆ అమ్మాయి అనువర్తనకీ, సాధు స్వభావానికీ, నిస్సహాయ పరిస్థితికీ మనసు కరిగిన గృహిణులు ఏదో కొంత సహాయం చేసేవారు. అలా వీలయినంత వరకూ తమ్ముడికి ఏ లోటూ రాకుండా చూసుకొనేది. జానకిలో దయ ఉన్నా ఓపిక లేదు. ధనలక్ష్మి ఇరుగు పొరుగిళ్ళకు పని సాయానికి వెళ్ళి ఇంట్లో పని తను చూసుకోవలసి వచ్చినప్పుడు, పని చేసుకోలేక ధనలక్ష్మి మీద చిరాకు పడేది. ధనలక్ష్మి చిరునవ్వుతో జానకి చేతిలో పని అందుకొని, "ఆలస్యం అయిపోయిందా అత్తయ్యగారూ! అయ్యో! మీరెందుకు లేచి వచ్చారండీ, నేను వచ్చి చేసేదాన్నిగా. ఇంతోటి వంటా ఇంతలో అవుతుందీ? తమ్ముడు జామెట్రీ బాక్సు కొనాలన్నాడండీ! మావయ్యగార్ని అడిగితే ఇస్తారనుకోండి. కానీ, పాపం ఆయన మాత్రం ఎన్నని కొనగలరండీ! సుభద్రమ్మ గారింట్లో జంతికలు వత్తి పెట్టాను. రెండు రూపాయలిచ్చారు. రేపు కమలమ్మగారింట్లో చేగోడీలు చేసిపెడితే మరో రెండు రూపాయలిస్తారు. వాడి జామెట్రీ బాక్స్ కొనచ్చు. అందుకేనండీ ఈ అవస్థ అంతా! మీరు కూచోండి, అసలే బలహీనంగా ఉన్నారు...." అంటూ చకచక పని చేస్తుంటే జానకి మనసులో చికాకు ఆవిరయిపోయి జాలి, ప్రేమా కలిగేవి. కానీ ఆ జాలికీ, ప్రేమకూ విలువలేదు. ధనలక్ష్మి కోసం జానకి చెయ్యగలిగింది ఏమీలేదు. ఆ మధ్య తరగతి ఇంట్లో ఎవరు తినటానికైనా ఏమీ ఉండదు. జానకికి పచ్చడి మెతుకులే! ధనలక్ష్మికీ పచ్చడి మెతుకులే! ఎదురు ధనలక్ష్మే ఇరుగుపొరుగులు తన చేతిలో పెట్టిన కాస్తా కూస్తా చిరుతిళ్ళు ఇంట్లో అందరికీ పంచేది.