Previous Page Next Page 
నీరు పల్లమెరుగు పేజి 8


    జ్ఞానం వచ్చీరాని సూర్యం పసిమనసుకి అక్క ఒక దేవత... తను అడగ్గానే అక్క ఏదైనా సాధించి తేగలదని అతడి నమ్మకం. అందుకే "అక్కా! నాకు శీనుబాబు తొడుక్కున్న లాంటి టెర్లిన్ చొక్కా కావాలి. రెండు చక్రాల సైకిల్ కావాలి!" లాంటి కోరికలు కూడా అక్క ముందు సునాయాసంగా వెల్లడించేవాడు. అలాంటప్పుడైనా ధనలక్ష్మి తమ దీన పరిస్థితి తమ్ముడికి విశదపరచాలని ప్రయత్నించేది కాదు. "అలాగేరా! కొనుక్కుందాం!" అనేది. తన మాటలకు సూర్యం ముఖం ఆనందంతో వికసించటం చూసి బాధగా కళ్ళు తుడుచుకునేది. రానురాను సూర్యం తనంతట తనే పరిస్థితులు అర్థంచేసుకో గలిగేవాడు. ఆనాటినుంచీ అక్కను అదీ ఇదీ అడిగేవాడు కాదు. "నేను బాగా చదువుకుంటానక్కా! బాగా చదువుకొని పెద్ద ఉద్యోగస్థుణ్ణవుతాను. అప్పుడు నిన్ను బోలెడు సుఖపెడతాను" అనేవాడు. ఈ మాటలకు పొంగిపోయేది ధనలక్ష్మి. "నువ్వు చదువుకొని ఉద్యోగస్థుడివి కావటం కంటే నాకు సుఖమేముందిరా! చదువుకోరా! బాగా చదువుకో! ఒక వ్యక్తి పట్టుదలతో కృషిచేస్తే సాధించలేనిది ఏమీ ఉండదు. నేను నిన్ను తప్పకుండా చదివిస్తాను" అనేది.
    ధనలక్ష్మిలో అక్క, తల్లి, తండ్రి, గురువు_ అందరూ కనిపించేవారు సూర్యానికి.


                                    5


    ఇంట్లో పెద్ద గొడవగా కేకలు వినిపిస్తోంటే మెలుకువ వచ్చింది తులసికి. కళ్ళు నులుముకుంటూ మంచం దిగి వచ్చింది. తులసి చూపులు మొట్టమొదట సూర్యం ముఖంమీద పడ్డాయి. ఆ ముఖం చూడగానే, భయంతో శరీరం జలదరించింది పదేళ్ళ తులసికి. సూర్యం ముఖం ఎర్రగా మండుతోంది. పళ్ళు పట పట నూరుతున్నాడు. పిడికిళ్ళు గట్టిగా బిగుసుకొన్నాయి. ఆ క్షణంలో ఎవరి మీదకో ఉరికి, ఎవరి గొంతునో బలవంతాన నులమటానికి సిద్ధంగా ఉన్న వ్యక్తిలాగ ఉన్నాడు. తులసి సూర్యం దగ్గిరగా వచ్చి అతని భుజంమీద చెయ్యివేసి "సూర్యం!" అంది. ఆ స్పర్శకూ ఆ పిలుపుకూ ఉలికిపడినట్లయి, మరేదో లోకంనుండి ఈ లోకంలోకి అప్పుడే వచ్చినట్లు అయోమయంగా తులసిని చూశాడు సూర్యం. తులసి సూర్యం భుజంపట్టి కుదుపుతూ మరోసారి, "సూర్యం!" అంది. తనను భయంగా, జాలిగా చూసే తులసి కళ్ళలోకి చూశాడు సూర్యం. చూస్తూ ఉండగా అతని ముఖంలో ఎరుపు కరిగిపోయింది. క్రింద కూలబడి పసిపిల్లవాడిలా వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టాడు. తులసికేమీ అర్థం కాలేదు. సూర్యం ఏడుస్తుండగా తులసి ఎప్పుడూ చూడలేదు. తనకంటే పెద్దవాడయిన సూర్యం ఏడుస్తోంటే ఎలా ఓదార్చాలో కూడా అర్థంకాలేదు.
    జగన్నాధం పంతులు మళ్ళీ అరుపులు మొదలుపెట్టాడు.
    "పేరేమో ధనలక్ష్మి, ఒట్టి దౌర్భాగ్యపుది. దరిద్రపుగొట్టు జాతకం_ పోనీ అని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నందుకు మంచి సత్కారమే చేసింది. ఛీ! ఛీ! ఇప్పుడు నేను నలుగురిలో ఎలా తలెత్తుకోవాలి? నా కూతుళ్ళకి పెళ్ళి ఎలా అవుతుంది? శనిముండ...."
    "అక్కనేమీ అనొద్దు, అక్క చాలా మంచిది...." ఏడుస్తున్నవాడు తలెత్తి, కన్నీటి తెరలు చీల్చుకొంటూ అరిచాడు సూర్యం.
    జగన్నాధం పంతులు ఆ అరుపులకు ఒక్కక్షణం స్థబ్ధుడై నిలబడ్డాడు. భయం అతని అణువణువునా లీనమై ఉండటం వల్ల సూర్యం అరుపులకు ఒక్కక్షణం హడలిపోయాడు. అంతలో ఆ అరిచినది నిస్సహాయ స్థితిలో ఉన్న ఒక పసివాడు మాత్రమేనని స్ఫురించి, మరింత విజృంభించాడు.
    "మీ అక్క మంచిదా? ఛండాలపుది! దౌర్భాగ్యపుది! శని గొట్టుది, చెడిపోయినది! నీతీ జాతీ లేనిది! సిగ్గూ శరం వదిలినది!"
    కసితీరా తిడుతూ రొప్పుతూ నిలబడ్డాడు జగన్నాథం పంతులు. అతని నోటి నుండి వస్తోన్న ఒక్కొక్క మాటా సూర్యం మనసును ముక్కలు ముక్కలు చేస్తున్నాయని అతని ముఖం చూస్తేనే అర్థమవుతుంది. ఆ ముఖం చూస్తూ అదొక విధమయిన పైశాచికానందాన్ని అనుభవిస్తూ__
    "నీ అక్క...." అంటూ మళ్ళీ ఏదో మొదలుపెట్టబోతుంటే సూర్యం "ఛీ!" అని ఛీత్కారం చేస్తూ కూచున్న చోటినుంచి లేచిపోయాడు. జగన్నాథం పంతులు నివ్వెరపోయి చూశాడు. తులసికి నవ్వొచ్చి నవ్వేసింది.
    "నువ్వెందుకు నవ్వుతున్నావే?" అని చేతికి అందుబాటులో ఉన్న తులసిని ఒక్కటి అంటించాడు జగన్నాథం పంతులు. జానకి అడ్డుపడి "మధ్యలో దాన్నెందుకండీ కొడతారు?" అని కసురుకోవటంతో జావకారిపోయి "నా ఖర్మ!" అని తన నుదురు కొట్టుకొన్నాడు.

 Previous Page Next Page