"ఛీ! ఛీ! బొత్తిగా కృతజ్ఞత లేని మనుషులు! వీళ్ళ కోసం, నా రక్త మాంసాలన్నీ ధారపోశాను. ఈరోజు ఒక్క అయిదు రూపాయిలు కావాలంటే....."
తులసిని చూడగానే అతని వాక్ర్పవాహం ఆగిపోయింది. తులసి ముఖంలోకి ఆశగా చూస్తూ "ఏమయింది తులసీ! సూర్యం నీ ఉద్యోగం నీకిచ్చేశాడా?" అన్నాడు తులసి తండ్రి పంతులు. అతని పూర్తిపేరు జగన్నాధం పంతులు. అతని ఉద్యోగం కూడా టీచర్ ఉద్యోగమే అవటంతో పంతులుగా స్థిరపడిపోయాడు....
"లేదు. నన్ను ఉద్యోగంలోంచి తీసేశారు. చెయ్యి స్వాధీనమయ్యాక వీలయితే మరొక సెక్షన్ లో వేసుకుంటానన్నారు సూర్యం."
"అయ్యో! అంతవరకూ జీతం రాదూ!"
గతుక్కుమంది తులసి. తన తండ్రి.... కన్నతండ్రి.... తన చెయ్యి ఎలా బాగవుతుందా, అని ఆలోచించటానికి బదులు_ తన చెయ్యి కొద్దిపాటి జ్వరంతో చచ్చుబడిపోయినందుకు ఆందోళన పడటానికి బదులు.... జీతం రాదా?" అని ఆందోళన పడుతున్నాడు.
మాసిన గెడ్డం.... నెరసిన వెంట్రుకలతో వున్న బట్టతల.... లోతుకుపోయిన కళ్ళు.... అక్కడక్కడ చిరుగులున్న ముతక పంచె.... తిరిగి తిరిగి దుమ్ము కొట్టుకుపోయిన పాదాలు, బాగా వదులయి వేళ్ళాడుతున్న చొక్కా.... ఆ తండ్రి మూర్తిని చూస్తూ ఏమనటానికీ నోరు రాక, ఏమనుకోవాలో అర్థంకాక, కళ్ళప్పజెప్పి నిలబడింది తులసి.
"పోనీ, నీ దగ్గర ఒక అయిదు రూపాయలున్నాయా?"
'లేవు' అనలేక.... అన్నాక తండ్రి ముఖంలో కనిపించే భావాలు చూడలేక.... ఆ నైచ్యాన్నంతా భరించలేక, పర్స్ తీసి అయిదు రూపాయిలు తండ్రి చేతిలో పెట్టేసింది తులసి. వెంటనే అక్కణ్ణుంచి వెళ్ళిపోయాడు పంతులు. జానకి మంచంలో పడుకుని తలకొట్టుకొంటూ "ఎందుకిచ్చావే? మురికి కాలువలో అయిదులూ, పదులూ, గుమ్మరించటానికి రాసులు పోసుకు కూచున్నామా మనం. నీ ఉద్యోగం కూడా పోయిందంటున్నావుగా! ఇంక ఎలా గడుస్తుందే?" అంది శక్తిలేని గొంతుకతో.
తల్లి కూడా చివరకు 'ఎలా గడుస్తుంద'నే బాధపడుతోంది. "ముందు నీ చెయ్యి ఎవరైనా స్పెషలిస్ట్ కి చూపిద్దాం!" అనేమాట కుటుంబంలో ఒక్కరి నోటినుండి గూడ రావడంలేదు, ఆ చెయ్యే కుటుంబానికి ఆధారమైనా కూడా.
"ఆ సూర్యానికి అంతమాత్రం విశ్వాసం లేదేమే? యెలా తీసేసాడు నిన్ను పనిలోంచి? మన ఎంగిలి మెతుకులు తిని పెరిగి పెద్దవాడయి ఈనాటికింత మొనగాడయ్యాడా?" అక్కసుగ అంది జానకి.
తులసి ఆ మాటలు విని సహించలేకపోయింది.
"విశ్వాసమా? సూర్యానికి మన పట్ల విశ్వాసం ఎందుకుండాలమ్మా? ఛీ కొట్టి విదలించినందుకా? పనికిరాని పాచిపోయిన మెతుకులు ముఖాన పారేసినందుకా? అతనికి మనమేం చేశాం? అవును, అతను మొనగాడే! స్వయంకృషితో వృద్ధిలోకి వచ్చిన ఎవరైనా మొనగాళ్ళే! నా చెయ్యి ఇలా చచ్చుబడి నేను ఏ పనీ చెయ్యలేనప్పుడు నన్ను ఆఫీస్ లో ఎలా ఉంచుకుంటారు? అక్కడికీ ఒక నెలజీతం నష్టం లేకుండా సెలవు యిచ్చాడు. ఆ నెలలో నేను వైద్యం చేయించుకోలేకపోయాను. చెయ్యి బాగుచేసుకో లేకపోయాను. ఇంకేం చెయ్యగలరు ఆయన? బెంగపెట్టుకోకమ్మా! ఒకవేళ ఈ చెయ్యి ఇలాగే ఉండిపోతే, ముష్టెత్తి మిమ్మల్నందరినీ పోషించడానికి పనికి వస్తుందిలే!"
అంతవరకూ అణచుకున్న దుఃఖం పొంగి ప్రవహించగా, వెక్కివెక్కి ఏడ్చింది తులసి.
నిర్ఘాంత పోయింది జానకి. వయసుకి మించిన భారాన్ని మోస్తున్న కూతురిలో ఎన్ని అగ్ని పర్వతాలు రగులుతున్నాయి!
తూలుతూ లేచి తులసి దగ్గిరగా వచ్చి "తులసీ! అలా ఏడవకే! నేను చూడలేను. నేను బ్రతికివుండి నీకేం చెయ్యలేనే తల్లీ! దేవుడు దయతలచి నన్ను తీసుకుపోతేనన్నా...." అంటొంటే తులసి వినలేక "అమ్మా! వద్దు అలా మాట్లాడకు" అని అస్థిపంజరంలా ఉన్న తల్లిని మంచంమీద పడుకోబెట్టి ఒక్క నిట్టూర్పు విడిచింది.
4
తల్లిమీద విసుక్కున్నంత తేలిగ్గా తన మనసు తాను సమాధాన పరుచుకోలేకపోయింది తులసి. సూర్యానికి తనకు మధ్య ఉన్నది ఒక మేనేజర్ కి, స్టెనోకి మధ్యఉన్న సంబంధం మాత్రమేనా? అంతకంటే ఏం లేదా? ఎంత చేదుగా ఉంది ఈ భావన? విషంకంటే దారుణంగా మనసును దహిస్తోంది.
నాలుగేళ్ళ పసిపిల్లవాడుగా అక్క ధనలక్ష్మి చెయ్యి పట్టుకుని జగన్నాధం పంతులు ఇంట్లో అడుగుపెట్టాడు సూర్యం. అప్పటికి తులసి పసిగుడ్డు. జానకి బాలింతరాలు.... సూర్యం తండ్రి ఏదో బీరకాయ పీచు సంబంధంతో జానకికి అన్న అవుతాడు. ధనలక్ష్మి సూర్యం కంటే ఎనిమిదేళ్ళు మాత్రమే పెద్దది.... ముందుగా తండ్రి, ఆ తరువాత తల్లి చచ్చిపోయి, విశాల ప్రపంచంలో అనాధలుగా మిగిలేనాటికి ధనలక్ష్మికి పట్టుమని పన్నేండేళ్ళు కూడా లేవు. ఆ వయసులోనే ధనలక్ష్మి ఏడవటం కూడా తెలియని పసివాడైన తమ్ముడి చెయ్యిగట్టిగా పట్టుకుని, వాళ్ళనీ, వీళ్ళనీ అడ్రస్ కనుక్కుని ఎలాగో జగన్నాధం పంతులు ఇంటికి వచ్చేసింది. ఆ అక్కా తమ్ముళ్ళని చూసి నిర్ఘాంతపోయాడు జగన్నాధం పతులు. "నమస్కారం మావయ్యగారూ! నమస్కారం అత్తయ్యగారూ!" అంటూ ఆ దంపతులిద్దరి పాదాలకీ నమస్కారం చేసింది ధనలక్ష్మి. జీవితం అప్పుడే ఆ అమ్మాయికి పాఠాలు నేర్పేసింది. సూక్ష్మగ్రహి అయిన ఆ పిల్ల చకచక బ్రతుకుతెరువు నేర్చేసుకుంటోంది.