Previous Page Next Page 
దశావతారాలు పేజి 6


    కుమిలి కుమిలి ఏడ్చింది లలిత ! ఎంత చదువుకున్నా, ఎంత ఉద్యోగస్థురాలయినా ఈ నాటికీ ఆడదాని స్థితి ఇది!
    "నా యిష్టం ! నా యిష్టమొచ్చినట్లు ఉంటాను !" అనగలిగే మొగవాడి అహం ! అర్ధంలేని మొండితనం!
    "కావాలంటే నువ్వూ నీ యిష్టం వచ్చినట్లు చేసుకో" అని సవాలు !
    ఏం చెయ్యలేదని ఆ అలుసు ! అవును ! ఆడది - మామూలు ఆడది - చదువుకున్నా, సంపాదనపరురాలయినా, ఇల్లు వదలి వీధిన పడగలదా ? పిల్లని వదులుకుని విడాకులు తీసుకోగలదా ? ఏం చెయ్యగలదు?
    ఇంచుమించు పదిరోజులు లలితకు గోపాలానికీ ఎడముఖం పెడముఖంగానే సాగింది. ఈ పరిస్థితి ఇద్దరికీ దుర్భరంగానే ఉంది. లలిత ముఖం చూసినకొద్దీ గోపాల్ మనసు మధనపడి ఉన్న విషయం ఉన్నట్లు లలితకు చెప్పేయాలనిపిస్తుంది. కానీ ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్ధంకాదు ! తీరా చెప్పిన తరువాత లలిత ఎలా తీసుకుంటుందో అనే ఆలోచన వచ్చి మరింత భయంవేసి, చెప్పటంకంటె చెప్పకపోవటమే మేలనిపిస్తుంది.
    లలితకు గోపాలాన్ని చూస్తోంటే చాలా జాలిగా ఉంది. అతడు సరిగ్గా తిండి కూడా తినటం లేదు. ఎందుకో విపరీతంగా మధన పడుతున్నట్లు అతని ముఖం చూస్తే స్పష్టంగా తెలిసిపోతూంది. అతణ్ని అనునయించాలని లలితకెన్ని సార్లో అనిపించింది. కానీ అతడు తనకు చేసిన అన్యాయం గుర్తు వచ్చేసరికి మనసులో మొలకెత్తిన అనురాగం అంతా ఆవిరయిపోయి ఆవేదన మాత్రమే మిగులుతూంది.
    ఆ రోజు గోపాలం ఇంటికి వచ్చేసరికి ఎదురుగా వచ్చింది ఇందుమతి. సడన్ బ్రేక్ వేసినట్లు ఆగిపోయాడు గోపాలం! ఇందుమతే! సందేహం లేదు. ఆ కళ్ళలో ఎప్పుడు ఉండే దిగులు మాయమయి ఇన్నాళ్ళకు హాయిగా నవ్వుతున్నాయి. తనకు బుద్ధి తెలిసిన నాటి నుండి ఆవిడను అనేక సమయాల్లో, అనేక సందర్భాల్లో అనేక విధాలుగా చూసాడు. ఇవాళే మొదటిసారిగా ఆవిడ మామూలు మనిషిలాగా కనిపించింది. లలిత చిరునవ్వుతో "ఎందుకలా బొమ్మలా నిలబడిపోయారు? మీ రహస్యం మీ కళ్ళముందు నిలిపాననా !" అంది.
    గోపాలం నుదుటికి పట్టిన చమట తుడుచుకుంటూ...
    "లలితా..." అంటూ ఏదో అనబోయాడు.
    "ముందు లోపలికి రండి, మాటలు తరువాత..."
    రాజేశ్వరి సూచనగా అందించిన విషయం లలిత మనసును మరిపిస్తోనే ఉంది. ఎలాగైనా విషయం పూర్తిగా తెలుసుకోవాలనిపించింది.
    "ఆవిడెవరో, ఎక్కడుంటుందో తెలుసుకో ! వెళ్ళి మాట్లాడుదాం !" అని రాజేశ్వరిని బ్రతిమాలింది.
    "మనం అక్కడికి వెళ్దామా ?" అంది రాజేశ్వరి ఆశ్చర్యపోతూ...
    "ఏం వెళ్తే? అసలు విషయమేమిటో తెలుసుకుందాం !" అంది లలిత. రాజేశ్వరి ఆశ్చర్యంవల్ల కలిగిన చికాకును అణచుకుంటూ.
    రాజేశ్వరికి హుషారొచ్చింది. అప్పటి నుండి అతి జాగ్రత్తగా సంభాషణలు వింటూ అతి కష్టంమీద గోపాలం తాలూకు ఆవిడపేరు, చిరునామా సంపాదించగలిగింది...
    లలితకు తను సేకరించిన సమాచారాన్ని అందిస్తూ.
    "పేరేమో ఇందుమతి...మనిషి....మాత్రం ..." పకాలున నవ్వింది ...
    లలితకు నవ్వురాలేదు - గోపాలం ... ఇలా ... నిజమేనా ? డబ్బుకోసం వొళ్ళమ్ముకునే దాని దగ్గరికి.... డబ్బు పడేసి ఆనందాన్ని వెతుక్కుంటూ... లలిత ఆలోచించలేకపోతోంది... రాజేశ్వరి సాయంతో ఇందుమతి ఇల్లు అతి కష్టంమీద కనుక్కుని వెళ్ళగలిగింది లలిత.
    రాజేశ్వరి వర్ణనల్లో అతిశయోక్తి ఏం లేదు - ఇందుమతి వయసులో పెద్దది. ఆ వయసు స్పష్టంగా తెలుస్తోంది. గతంలో గడిచిన దుర్భర జీవనం, దాన్ని ఛాయల్ని ముఖం మీద స్పష్టంగా ముద్రించింది.
    ఈ యువతితో గోపాలం ... ఛీ ! ఛీ ! ... జలదరించింది లలిత మనసు అక్కడి నుండి పారిపోవాలనిపించింది.
    "ఎవరమ్మా మీరు ? ఏం కావాలి ?"
    ఆ కంఠం సౌమ్యంగా ఉంది. శరీరంపైన గడచిన జీవితం ప్రతిఫలించినట్టే ఆ కంఠంలో ఆవిడ అంతరంగం ధ్వనిస్తోంది.
    లలితకేం తోచిందో ఒక్కసారిగా "నేను గోపాలం గారి భార్యను" అనేసింది. రాజేశ్వరి చెయ్యి గిల్లుతున్నా లక్ష్య పెట్టకుండా.
    "మీరు...నువ్వు...నాకేమనాలో అర్ధం కావటం లేదు. వాడు నిన్ను పంపించాడా ? నీతో ఏం చెప్పనన్నాడే ? విని సహించకలవో, లేదో, అని అనుమానించాడే ! ఈ అభాగ్యురాలిని క్షమించగలిగావా తల్లీ ?"
    ఇందుమతి కళ్ళలో గిరగిర నీళ్ళు తిరుగుతున్నాయి. లలితకు తల తిరుగుతోంది ఎవరావిడ? గోపాలాన్ని వాడు అంటుంది. తనను ఆప్యాయంగా "తల్లీ ! అంటుంది. ఏది ఏమైనా ఈవిడలో ఏదో మంచితనం ఉంది. తను నిష్కపటంగా మాట్లాడటమే మంచిది.
    "ఆయన నన్ను పంపించలేదు. మిమ్మల్ని ఆయనే ఇక్కడ ఉంచారని విన్నాను. సంగతి తెలుసుకుందామని వచ్చాను" ఇందుమతి ముఖం వాలిపోయింది. అణచి అణచి ఉంచుకున్న ఆర్తి ఒక్కసారి ఆ కళ్ళలోకి కురిసింది.
    "ఓ ! అనుమానించి వచ్చావన్నమాట ? నీకు పుణ్యముంటుంది. అట్లాంటి అనుమానం మాత్రం రానియ్యకు, నువ్వు స్పష్టంగా అడుగుతున్నావు కనుక నేను స్పష్టంగానే చెపుతున్నాను వాడు నా తమ్ముడు."
    "ఏమిటి?" అంది రాజేశ్వరి గట్టిగా పెద్ద రిలీఫ్ తో ... తన గోపాలం తన వాడేనన్న విశ్వాసంతో కళ్ళు మూసుకుంది లలిత.
    "అవునమ్మ, ఈ మాత్రం దానికి ఇంత రహస్య మెందుకంటారా? మీ అందరిలాగా బ్రతికేదానిని కాను. వృత్తిలో ఉన్న వేశ్యను. మా తమ్ముణ్నిమాత్రం కష్టపడి చదివించాను. వాడు నాకెవరూ లేరు అని చెప్పుకునేలాగ చేశాను. మా కర్మ ! ప్రభుత్వం శాసనాలు చేసి మా వృత్తిని నిషేధించగలిగిందేకాని మనుష్యుల హృదయాలు విశాలం చేసి మమ్మల్ని సమాజంలోకి తీసుకొనేలాగ చెయ్యలేదు కదా ! ఇదివరకు మాకు మనసులో బాధ ఒకటే. ఇప్పుడు దానికి చట్టం బాధ కూడా తోడయిందేతప్ప మరొక ప్రయోజనమేమీ లేదు. నా తమ్ముడిగా అందరూ వాడిని వేలెత్తి చూపక మానరు...అందుకే దూరంగా ఉన్నాను ... కానీ, నా తమ్ముడు అందరిలాంటి స్వార్ధపరుడు కాదు, ప్రయోజకుడు కాగానే నన్ను వదులుకుంటాననలేదు. పైపెచ్చు నన్ను తన అక్కగా ధైర్యంగా స్వీకరిస్తానన్నాడు ... నేనే భయపడ్డాను. ఆ భయంతోనే వాడి మేలుకోరి వాడికి దూరంగా పారిపోయాను... నేను కనబడకపోయేసరికి, నేను ఆశించినట్లే వాడు బ్రతుకుతో రాజీ పడ్డాడు. కానీ ఇటీవల మళ్ళీ విధి మమ్మల్ని కలిపింది.... ఈసారి వాడు నన్ను వదలలేదు... ఈ ఇల్లు నా కోసం కొని ఇక్కడ నన్ను ఉంచాడు... ఒకనాడు నాకోసం లోకాన్నంతా ఎదిరించటానికి సిద్ధపడ్డాడు. కానీ ఈనాడు నిన్ను ఎదుర్కోవటానికి భయపడ్డాడు. ఈ నిజాన్ని నీతో చెపితే నువ్వు అందరిలా చీదరించుకుంటావని అనుమానించాడు.... ఇదీ సంగతి..."
    లలిత చిరునవ్వుతో ఇందుమతి చేతులు పట్టుకుంది. "రండి ! వదినగారూ ! మన ఇంటికి వెళదాం !" అంది. రాజేశ్వరి కంగారుగా "లలితా! ముందు వెనుకలు ఆలోచించకుండా" అంటూ ఏమో అనబోయింది .... లలితకు రాజేశ్వరి అవసరం తీరిపోయింది.  
    "పరవాలేదు రాజేశ్వరిగారు ! ఇందులో అంత ఆలోచించవలసినదేమి లేదు" అని "పదండి వదినగారు!" అంది.
    ఇందుమతిని తన అక్కను తన యింటిలో తన వాళ్ళ మధ్య చూసుకోగలిగిన గోపాలం ఆనందానికి అంతులేదు.
    "చూశావా లలితా ! అన్యాయంగా నన్నెలా అనుమానించావో" అన్నాడు.
    ఇందుమతి కల్పించుకుని "చాల్లే కట్టుకున్న భార్య... కష్టసుఖాల్లో పాలుపంచుకునే మనిషి...ఆవిడకు ఉన్నది ఉన్నట్లు చెప్పవలసిన బాధ్యత నీది కాదూ! పైగా అహంకారంతో 'నా యిష్టం' అంటావు ? జాగ్రత్త ! ఇంకా మా మరదలు కనుక ఇంత సహనంతో "మా వదినగారు వచ్చారు ... ఇంక నా వంటిమీద ఈగ వాలనివ్వరు ..." అంది.
    ఇల్లంతా నవ్వులతో నిండిపోయింది.

                             * * *             

 Previous Page Next Page