Previous Page Next Page 
సూర్యనేత్రం పేజి 6


    "వేయించండి."
    "ఎవరు వేస్తారు? రండి మనమే వేసుకుందాం."
    "మనం ఎందుకు వేసుకోవటం? ఎక్కువ కూలి ఇస్తామని చెప్పండి. రాత్రి అయినా వచ్చి వేస్తారు"
    మసక చీకట్లో రవి కళ్ళు అతనికి స్పష్టంగా కనిపించలేదు. లేకపోతే ఆ చూపులలో తీక్షణతకి తప్పకుండా చెదిరిపోయేవాడు.
    "అవును. పాపం వాళ్ళు దారిద్ర్యంలో తలమునకలవుతున్నారు. అందుచేత ఎక్కువ డబ్బిస్తామంటే, ఏ పనైనా చేస్తారు.
    అది కరెక్టే? వెళ్ళి వాళ్ళని తీసుకురండి. ఊరు ఇక్కడికి రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది" అనిల అందుకుంది.
    "వెళ్ళిరండి! మనబోటివాళ్ళం ఇలాంటి వెధవ పనులు చెయ్యటం బాగుండదు. ఇక్కడన్నీ ముళ్ళరేగు చెట్లే? రేగు చెట్లు ఉన్నచోట ఎలుగుబంట్లు ఉంటాయంటారు.అవంటే ఎలుగుబంట్లకు చాలా ఇష్టంట. అయినా మీరేం భయపడక్కర్లేదు. ప్రాణాపాయం ఉండదు. ఎటొచ్చీ అవి ముక్కలు కొరికేస్తాయంటారు. అయినా మీకేం? బోలెడు డబ్బుంది. దర్జాగా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవచ్చును. తొందరగా వెళ్ళండి. మాకూ కాళ్ళు లాగుతున్నాయి."
    జెన్నిఫర్ నవ్వు ఆపుకోటానికి ప్రయత్నిస్తూ చమట తుడుచుకునే వంకతో కర్చీఫ్ నోటి కడ్డుగా పెట్టుకుంది.
    "రండి డేరాలు వేసుకుందాం"
    ఏడుపు గొంతుతో అన్నాడు విష్ణు.
    "అయితే ముందు మన గన్నులు వెతుక్కోవాలి."
    "గన్నా?"
    "గన్ను- అంటే తుపాకి కాదు. డేరాల తాళ్ళు బిగించే గూటాలు. నేలలో పాతేందుకు మామూలు సుత్తి కంటే చాలా బరువైన పెద్ద సుత్తి కావాలి. దానిని అందరూ 'గన్ను' అంటారు. నాకూ అలాగే అలవాటయింది. కొన్ని కొన్ని పదాలు ఇలాగే రూఢమవుతాయి. వ్యవహారంలో...."
    ఎలాగో గన్ను వెతికి పట్టుకున్నారు. ఆడవాళ్ళు గూటాలు కదలకుండా పట్టుకుంటే, మొగవాళ్ళు గన్నులతో వాటిమీద శక్తినంతా ఉపయోగించి బాదుతున్నారు.
    త్రిసికి మాత్రం పనిలోకి రాలేదు. ఒక్కర్తీ ఒక రాయి చూసుకుని దానిమీద కూచుంది.
    విష్ణు, రవి దగ్గరగా జరిగి నెమ్మదిగా అన్నాడు- "త్రిసికికి ఏవో మంత్రాలు వచ్చినట్లుగా ఉంది. ఆమె మంత్రాలు చదవబట్టే ఇందాక అలా వెర్రి గాలులు వీచాయేమో?"
    "అయ్యా భూతయ్యగారూ....?" అని రవి గట్టిగా అనబోతుంటే విష్ణు గభాలున రెండు చేతులూ జోడించి "సరే సరే ఊరుకోండి" అన్నాడు.
    కానీ అనిల వినడం జరిగిపోయింది. అడిగింది కూడా- "భూతయ్య ఏమిటి?" అని.
    రవి చెప్పాడు.
    అనిల, జెన్నిఫర్ లిద్దరూ నవ్వేశారు. విష్ణు కూడా నవ్వాడు. అతడికి బాధ కలగలేదు. త్రిసికి నవ్వితేనే...అలాంటి కూలి జనం నవ్వితేనే అతడికి కోపం.
    తెల్లవారుఝామున అయిదవుతుండగానే అనిల జెన్నిఫర్ తో కలిసి స్నానానికి బయలుదేరింది. శుక్ర నక్షత్రం బాగా మెరుస్తూ కనిపిస్తోంది. అడవి జంతువులకి కాల పరిజ్ఞానం ఎలా ఉంటుందో? వాటి సందడి లేదు.
    అరుణోదయానికి పూర్వం చీకటిని ఒరుసుకుంటూ వచ్చే మసక వెలుగులో ప్రకృతి పాడే భూపాలరాగం వినిపిస్తోంది వ్యక్తావ్యక్తంగా.
    "యు ఆర్ వెరీ స్లో...."
    స్విమ్మింగ్ కాస్టూమ్స్ లో చకచక నడుస్తున్న జెన్నిఫర్ ఆగి, వెనక్కు తిరిగి అంది.
    జెన్నిఫర్ వీలయినంతవరకూ ఇంగ్లీష్ లోనే మాట్లాడుతుంది. అప్పుడప్పుడు తెలుగు మాట్లాడినా అదీ ఇంగ్లీష్ లానే ఉంటుంది. 'అనిలా అనటానికి 'అనల్' అంటుంది.
    "భూపాల రాగం వింటున్నాను" మైకంలో ఉన్నదానిలా అంది అనిల.
    "వ్వాట్?"
    అనిల మైకం విడిపోయింది, నవ్వింది.
    "పార్కులలో కంటే, రూఫ్ గార్డెన్స్ లో కంటే ఈ నగ్న ప్రకృతిలో అద్భుత సౌందర్యం లేదూ?"
    జెన్నిఫర్ మాట్లాడకుండా ఒక్కసారి చుట్టూ చూసింది. ఆ చూపులలో పరవశత్వం కంటే చీదరింపే ఎక్కువగా ఉంది.
    చెరువులో హాయిగా ఈదులాడసాగింది జెన్నిఫర్. అనిల మాత్రం గట్టుకి కొంచెం దూరంలోనే ఉండిపోయింది. ఒకసారి నీటిలో మునిగిన అనిల కొన్ని నిమిషాల వరకూ పైకి రాలేదు. జెన్నిఫర్ కంగారుగా "అన్ లా?" అంటూ అరుస్తూ వచ్చేసరికి పైకి లేచింది.
    "వాట్ హేపెండ్?" ఆశ్చర్యంగా అడిగింది జెన్నిఫర్.
    అనిల సమాధానం చెప్పలేదు.
    రవి రాత్రి ఏ కొంచెంసేపో నిద్రపోయి ఉంటాడు. అతడి మస్తిష్కంలో సూర్యనేత్రమే నిండి ఉంది. చాలా అసాధారణమైన శిల్పం. బృహత్సిలా యుగం నుంచి ఈనాటి వరకూ లభ్యమైన శిల్పాలలో ఏ సూర్యశిల్పమూ అలా లేదు.
    సప్తాశ్వాలతో వున్న రథం మీద వున్న సూర్యశిల్పాలున్నాయి. సప్తకర్ణి శబ్దమే శాతకర్ణి అయి ఉండవచ్చుననీ, సప్తకర్ణి అంటే ఏడు రంగుల కిరణాలు గల సూర్యుడనీ, శాతవాహనులు సూర్యవంశీయులనీ కొందరి అభిప్రాయం.
    ఈ ఆలోచన రాగానే అవి తన ఫైల్ తీసి, ప్రత్యేకమైన లిపిలో వున్న శాసనాలలో శాతవాహన కాలం నాటి శాసనాలు తీసి చూశాడు. ఒక శాసనంలోకి లిపితో గుహలోపాలి లిపి చాలావరకు సరిపోయింది.
    అనిల సాయం వుంటే ఆ లిపిని మరింత తొందరగా తెలుగులోకి అనువదించుకోవచ్చు.
    ఆమెకోసం కబురు చేశాడు ఒక వర్కర్ తో. వెంటనే వచ్చింది అనిల. ఇద్దరూ కలిసి ఆ లిపిని తెలుగులోకి అనువదించారు.
    గుహలో ఉన్న పిశాచాల లాంటి భయంకర శిల్పాల కింద ఉన్న పేర్లు- వ్యాఘ్రాసుర, వ్యాళాసుర.
    సూర్యబింబం చుట్టూ వున్న అక్షరాలూ - 'కర్మసాక్షీ, సూర్యభగవాన్'    
    ఆ సమయంలో డేరాలకి దగ్గిరగా ఒక జీప్ ఆగింది.
    లిపి విషయమైన చర్చలు కూడా వదిలేసి, విష్ణు వాళ్ళని ఆహ్వానించటానికి వెళ్ళాడు. అతడికి కార్లన్నా, జీపులన్నా చాలా గౌరవం.
    ముందుగా ధగధగ మెరుస్తున్న మణి వున్న తలపాగతో సహా నడివయసు వ్యక్తి, ఆ వెనుక సౌకుమార్యాలన్నీ రాసి పోసుకుని, మెరుపుతీగగా రూపు దాల్చినట్లున్న జరీ మేలి ముసుగులో ఒక యువతీ లోపలికి వచ్చారు. ఆమె లోపలికి అడుగు పెట్టీ పెట్టగానే అందరి కళ్ళూ ఆమెవైపు తిరిగాయి.
    మేలి ముసుగు లోపల ఉండే కళ్ళను చెదరగొడుతోంది. మెరిసిపోతున్న ఆమె అందం.
    వాళ్ళ వెనుక చేతులు కట్టుకుని వచ్చిన పనివాడు - "అయ్యగారూ, మా దొరగారు యజ్ఞనారాయణ ప్రభువుగారు వేంచేసినారు" అన్నాడు.
    ఈ మాటలు కొన్ని లక్షలసార్లు అని అని వాడి నోటికి బాగా అలవాటుపడ్డాయి. అయినా కాస్త యాస రాకమానదు.
    విష్ణు వాళ్ళిద్దరికీ కుర్చీలు తెప్పించి వేశాడు. వాళ్ళు కూర్చున్నారు.
    "నా పేరు యజ్ఞనారాయణ్. ఈమె నా భార్య విలసిత."
    మళ్ళీ ఒకసారి తనను తను పరిచయం చేసుకుని, తన భార్యని పరిచయం చేశాడు.
    పరస్పర నమస్కారాలయ్యాయి.
    "ఒక్కసారి మిమ్మల్ని చూసి పోదామని వచ్చాము. పని బాగా జరుగుతున్నదా? ఎప్పటికప్పుడు ఏం కనిపెట్టిందీ మాకు తెలియపరుస్తూ ఉండండి."
    దేవనారాయణ్ ని మించిన దర్పం ఉంది ఇతనిలో.

 Previous Page Next Page