మాధవరావు ధోరణిలో ఒక "కమేండ్" ఉంది. లలితకు గొంతు పొడారిపోసాగింది.
"కానీ మా తమ్ముడు అన్యాయంగా..."
ఈసారి కూడా లలిత మాటలను పూర్తిచెయ్యనియ్యలేదు మాధవరావు.
"అరెస్ట్ చేసినది న్యాయంగానో, అన్యాయంగానో విచారణలో తేలుతుంది. అందరూ అన్యాయమే చెయ్యరు. ఒకవేళ అన్యాయం ఉందనుకున్నా దానిని ఎదుర్కోవాలి. కాని మనమూ అన్యాయంలోకి జారిపోకూడదు."
లలిత మాట్లాడలేకపోయింది.
"ఇంక మీరు వెళ్ళిరండి" అన్నాడు మాధవరావు. క్షణమాత్రం అతని కళ్ళలో జాలి మెరుపులా మెరిసి మాయమయింది.
లలిత వచ్చిన పని కాలేదు. కానీ ఆమె కృంగిపోలేదు. బాపినీడు దగ్గర భంగపడి వచ్చింది. ఆనాడు మనసంతా చీదరగా చికాకుగా అయిపోయింది. ఈనాడు మాధవరావూ కాదన్నాడు. కానీ, ఈ కాదనటం కూడా ఏదో ధైర్యం చెప్పినట్లుగానే ఉంది. 'అంతటా అన్యాయమే జరగదు' అన్నాడు మాధవరావు. నిజమేనా? నిజమేనని రుజువు చేశాడు జస్టిస్ రెడ్డి.
"మోహన్ మొదలైనవాళ్ళు చేస్తున్న పనులలో సాంఘిక శాంతి భద్రతలకు భంగం కలిగించేవేం లేవు. వాళ్ళు సంఘంలో అన్యాయాలు బయటపెడుతున్నారు. అదికూడా ఒక రకంగా సంఘసేవ! స్వతంత్రంగా ఆలోచించే హక్కు ఈ దేశంలో ప్రతి పౌరుడికీ ఉంది" అని జడ్జిమెంట్ ఇచ్చాడు.
మోహన్ విడుదలయ్యాడు. కానీ అతని పరిస్థితి మరింత సంకటంగా తయారయింది. అందరూ అతణ్ణి దొంగలాగో, హంతకుడిలాగో చూడటం మొదలుపెట్టారు. ఇదివరకు కనీసం ఇంటర్వ్యూకయినా పిలిచేవారు. ఇప్పుడదీ మానుకున్నారు. సహజంగా కొంచెం దుడుకు వాడయిన మోహన్ ఈ పరిస్థితికి తట్టుకోలేకపోయాడు. ఒక రోజున ఇంట్లోంచి మాయమయ్యాడు. ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో తెలియలేదు. పోలీస్ రిపోర్టు ఇవ్వటానికి భయపడింది లలిత. ఏమో! మళ్ళీ ఎక్కడ చిక్కుకున్నాడో?
జానకమ్మ ఈ దెబ్బకు తట్టుకోలేకపోయింది. మంచ మెక్కేసింది.
"లలితా! నువ్వు చెప్పవే! నిజంగా దేవుడున్నాడా? ఈ సృష్టిలో కొంచెమైనా న్యాయముందా? నాకెందుకిన్ని పరీక్షలు? నా పిల్లల్ని పెంచుకోవాలనీ, వాళ్ళను పైకి తీసుకురావాలనీ, అష్టకష్టాలూ అనుభవించాను. నువ్విలా అయిపోయావు. వాడలా అయిపోయాడు. ఏం చూసుకొని బతకమంటావే!" అంది ఏడుస్తూ.
"నాకేమయిందమ్మా?"
"ఏమయిందా? లక్షణంగా రాజుని పెళ్ళిచేసుకుని కళకళలాడుతూ ఉండవలసినదానివి ఇలా ఏడవలేక నవ్వుతూ తిరుగుతున్నావు. నీకసలు బుద్ధిలేదే! రాజుని ఐ.ఏ.ఎస్. కి కట్టమనకుండా ఉండవలసింది. పోనీ పెళ్ళయ్యాక కట్టమన వలసినది!"
లలిత లోలోపల నవ్వుకుంది.
పాపం అమ్మ! పెళ్ళయిపోతే తరువాత ఏం జరిగినా పరవాలేదనుకుంటోంది! తాను అంత అనుభవించినా సంప్రదాయపు వాసనలు వదలవు.
"ఇంటిల్లి పాదికీ రోగాలే! నాకు వేళకి కాస్త పళ్ళరసం ఇచ్చే దిక్కు కూడా లేదు." అని గొణుక్కున్నాడు వెంకట్రావు, మంచాన పడ్డ భార్యను చూసి.
లలిత అటు తండ్రికీ, తల్లికీ వైద్య సదుపాయాలు చూసుకోవాలి! ఇల్లు నిర్వహించుకోవాలి! ఉద్యోగం చెయ్యాలి.
బస్ కోసం ఎదురుచూస్తూ అరగంట నుండీ బస్ స్టాప్ లో నిలుచునుంది లలిత. కాళ్ళు లాగుతున్నాయి. విసుగొస్తోంది. రోడ్డుమీద పోతున్న కారుని చూసి "నాకు లిఫ్ట్ ఇయ్యకూడదూ?" అనుకుంది. అలా చాలాసార్లు అనుకునేది. కానీ ఒక్కసారీ ఏ కారు ఆగలేదు. ఈసారి విచిత్రంగా ఆ కారు ఆగిపోయింది. అంతేకాదు, కారులోంచి ఎవరో తనను చెయ్యి ఊపి పిలుస్తున్నారు. లలిత తెల్లబోయింది. తనను కాదేమో ననుకుని చుట్టూ చూసింది మరెవరైనా కదులుతున్నారేమోనని. అంతలో కారులో వ్యక్తి తల బయటపెట్టి చిరునవ్వుతో "మిమ్మల్నే! రండి!" అంది.
లలిత గుర్తుపట్టింది. మిసెస్ మణిమాల! కళామందిర్ లో లలిత సంగీత కచేరీ చేసింది. అక్కడ ఆవిడతో పరిచయమయింది. ఆనాటి ఆవిడ ధోరణిని బట్టి ఆవిడకు చాలా గర్వమని అభిప్రాయపడింది. అలాంటిది ప్రత్యేకంగా కారాపి పిలుస్తోన్నదంటే...లలిత దగ్గిరగా వెళ్ళింది.
"రండి! కూర్చోండి! మీ ఇంటిదగ్గిర డ్రాప్ చేయిస్తాను." అంది మణిమాల తలుపు తెరిచి.
లలిత మొహమాట పడుతూ "మీకెందుకు శ్రమ" అని నాన్చింది.
"శ్రమేముంది? నేను నడపాలా కారుని? డ్రైవర్ ఉన్నాడుగా! రండి." లలిత వచ్చి కూర్చుంది.
"ముందు మా ఇంటికి వెళ్దాం! కొంచెం కాఫీ తీసుకున్నాక డ్రైవర్ని మీ ఇంటిదగ్గిర దింపి రమ్మంటాను." అంది మణిమాల.
కాదనలేకపోయింది లలిత.
మణిమాల ఇల్లు కూడా మణిమాలలాగే ఆధునికంగా ఆడంబరంగా ఉంది. లలితను కూర్చోమని ఫలహారం, కాఫీ వంటమనిషి చేత ఇప్పించింది మణిమాల. ఇల్లంతా చూపించింది. మణిమాల గదిలో వీణని చూసి లలిత "మీరు కూడా వీణ నేర్చుకున్నారా!" అంది.
మణిమాల నవ్వుతూ "ఆ! పెళ్ళిచూపుల్లో "వీణ వచ్చు" అని చెప్పటానికి తగినంత పాండిత్యం సంపాదించాను. నేను వాయించలేకపోయినా వినటం ఇష్టం. మీకు అభ్యంతరం లేకపోతే మరొకసారి తీరిగ్గా వచ్చి మా ఇంట్లో వీణ వాయించగలరా?" అంది.
"అలాగే!" అంది లలిత.
మణిమాల లలితకు బొట్టు పెట్టి లలిత వద్దంటున్నా తాంబూలంతో పాటు డజను అరటిపళ్లు చేతిలో పెట్టి తమ కారులో ఇంటికి పంపించింది.
4
రాజును మరిచిపోవాలని విశ్వప్రయత్నం చేస్తోంది లలిత. ఎంత ప్రయత్నించినా కారు చీకటిలా తనను క్రమ్ముకునే ఒక నైరాశ్యభావం నుండి బయటపడలేకపోతోంది. అన్నింటిపట్లా ఏదో విరక్తి భావమే కలుగుతోంది. "నా బ్రతుకంతా రాజు మాత్రమేనా? రాజు తిరస్కరించినంతమాత్రాన ఇక నాకేమి మిగలనట్లు ఇలా అయిపోవట మేమిటి?" అని ఎంతగా తనకు తను నచ్చజెప్పుకున్నా అప్పటికప్పుడు ఈ లోకంతోనే నిమిత్తం లేనట్లు మనసు కృంగిపోక మానటం లేదు.
"నీకు ఫోన్ వచ్చింది." అని చెప్పింది ఎదురింటి వారమ్మాయి.
ఆ ఫోన్ నెంబరు రాజుకు మాత్రమే తెలుసు. ఎదురింటి వారికి ఇబ్బంది కలిగించటం ఇష్టంలేక, వాళ్ళేమైనా అనుకోవచ్చుననీ ఆ నంబరు తన స్నేహితుల కెవరికీ ఇయ్యలేదు. రాజుతో కూడా ఏదైనా అత్యవసరమయినప్పుడే ఫోన్ చెయ్యమని చెప్పింది.
తనకు ఫోన్ వచ్చిందనగానే లలిత మనసులో నైరాశ్యం మంత్రించినట్లు మాయమయింది. రాజు తనకోసం ఫోన్ చేశాడు. బహుశా తనలాగే రాజుకూడా బాధపడుతూ ఉండిఉంటాడు. ఒక్కక్షణం ఆనాడు రాగిణితో కలిసి తనను చూసి నవ్విన రాజుమూర్తి గుర్తుకొచ్చి మనసు కలుక్కుమంది. అతి ప్రయత్నంమీద ఆ ఆలోచనను వెనక్కు నెట్టింది. ఇలాంటి బలహీనతలు మొగవాళ్ళలో సహజమేనేమో! రాజును తను క్షమించగలదు. కాదు! క్షమించకుండా ఉండలేదు. అతనికోసం కాదు. తనకోసం!