Previous Page Next Page 
తదనంతరం పేజి 6


    "అమ్మో యిప్పుడా" అన్నట్లు చూసి "పిల్లలు మెలకువగా వున్నారు. చదువుకుంటున్నారు" అంది.


    "తలుపులు వేసేద్దాం" అన్నాడు.


    "ఊహు" అంది తన అయిష్టాన్ని తెలియచేస్తూ ఆ అయిష్టతలో విముఖత్వం లేదు. జీవితం మంత్రించిన సంస్కారం, జాగ్రత్తతనం వుంది.


    "పిల్లలు రెండింటిదాకా చదువుకుంటారు. ఒకడు అర్థరాత్రి రెండింటికి లేచి చదువు మొదలుపెడతాడు. తర్వాత పట్టే గాఢనిద్రలో మనకు మెలకువరాదు. వచ్చినా నిద్రమత్తులో మూడ్ రాదు. ఆ తర్వాత పాలవాడు పనమ్మాయి యిలా వాయిదాలు...అసలు ఎన్ని నెలలయిందో.


    ఆమె అతనివంక బాధగా చూసింది. "సారీ అంది. కాని ఏం చెయ్యను? కొంత వయసొచ్చాక...చాలా భాగం తల్లిగానే మనుగడ సాగించాల్సి వస్తుంది."


    అతనికామే అంటే ఎంతో జాలి కలిగింది. గాఢాను రాగంతో శరీరమంతా ఓ అనుభూతితో నిండిపోయింది. అలా...ఒక్క నిమిషం గుండెలమీద తలవాల్చి కళ్ళు మూసుకుని వుండిపోవాలనుకున్నాడు. ఇంతలో బయట అలికిడయినట్లయింది. గభాల్న చేతులు వెనక్కి తీసేసుకున్నాడు.


    చాలా రాత్రుల్లాంటి ఓ రాత్రి నిరర్ధకంగా గడిచిపోయింది.


                                            2


    ఊరు నిద్రలేచింది.


    కాకాహోటల్స్ వాళ్ళూ, పాలబూతుల వ్యాపారం చేసుకునేవాళ్ళూ ఎప్పుడో నిద్రలేచారు.


    అసలు విజయవాడ నిద్రపోతున్నట్లే వుండదు.


    రాత్రి పన్నెండు వొంటిగంటదాకా సెకండ్ షోలకి వెళ్ళి వచ్చేవాళ్ళూ, కిళ్ళీ కొట్ల దగ్గర, రోడ్ల మీద గుంపులు గుంపులుగా కూర్చుని ముఠా రాజకీయాలు మాట్లాడుకునేవాళ్ళూ వున్నట్లుండి రెచ్చిపోయి దెబ్బలాటల్లోకి దిగి సోడాబుడ్లు విసురుకునేవాళ్ళు, రైల్వేస్టేషన్ నుంచి వచ్చిపోయే ప్రయాణికులు, వీధులన్నీ సందడిగానే వుంటాయి. తర్వాత రెండు మూడు గంటలు చాటుమాటుగా తిరిగేవాళ్ళూ, వ్యభిచార గృహాలకూ, జూదశాలలకూ, రహస్యంగా తిరిగేవాళ్ళూ, దొంగతనాలకు బయల్దేరేవాళ్ళూ, గుట్టుగా జరిగిపోతుంది. నాలుగవంగానే హడావుడి మళ్ళీ మొదలు.


    సంవత్సరాల తరబడి ప్రతిరోజూ కృష్ణానదికి వెళ్ళి స్నానాలు చేసే అలవాటున్నవారు కొన్ని వందలమంది వుంటారు. ఇహ కార్తీక మాసంలో, శివరాత్రి, వైకుంఠ ఏకాదశి మొదలైన యితర పుణ్యదినాల్లో కృష్ణ స్నానానికి వెళ్ళేవాళ్ళతో వీధులన్నీ కిక్కిరిసిపోయి వుంటాయి.


    ఇక్కడి ప్రజలకు ముఖ్యమైన యాక్టివిటీ సినిమా. దాదాపు ముప్పయి సినిమాహాల్స్ వున్నా- అందులో కొత్త సినిమా ఆడుతున్నా, పాతది ఆడుతున్నా హాల్సన్నీ కిటకిటలాడిపోతూ వుంటాయి. మరి ఏ యితర ముఖ్యమైన కార్యక్రమాలకూ వెళ్ళడానికి తీరికలేనివాళ్ళు సినిమాలకు వెళ్ళటానికి మాత్రం ఎక్కడలేని తీరిక సంపాదించుకుంటారు. మండుటెండల్లో మ్యాటినీ షో గాని, చలికాలంలో సెకండ్ షో కానీ, ఎన్ని పనులున్నా నెలల పసిగుడ్డుల్ని ఎత్తుకొని నూన్ షోకి జనం కిటకిటలాడుతూ వుంటారు. పైగా సినిమా చూసి ఏమన్నా ఎంజాయ్ చేస్తారా? బోర్ అంటూ బయటకు వస్తారు. ఎవరన్నా, ఎందుకయ్యా అలా బోర్ అని తిట్టుకుంటూనే మళ్ళీ మళ్ళీ సినిమాలకి వెడతావు?" అంటే "ఈ వెధవ బెజవాడలో అంతకన్నా ఏముంది కాలక్షేపం?" అంటూ తమని తాము సమర్ధించుకుంటారు. మునపటిరోజుల్లో అయితే ఏమోగానీ, ఇటీవల కొన్ని సంవత్సరాలుగా విజయవాడలో సాంస్కృతిక కార్యక్రమాలు బాగానే జరుగుతున్నాయి. తుమ్మలపళ్ళి కళాక్షేత్రమొచ్చింది. అందులో గొప్పగొప్ప సంగీత విధ్వాంసుల పాటకచేరీలో, పెద్ద నర్తకీ మణుల నృత్య ప్రదర్శనలో, సాహిత్య సభలో జరుగుతూ వుంటాయి. వెలిదండ్ల హనుమంతరాయ గ్రంథాలయంలో ఎప్పుడూ ఏదో నాటకాలు నాటక పోటీలు జరుగుతూ ఉంటాయి. రోటరీ ఆడిటోరియంలో యించుమించు ప్రతిరోజూ ఏదో చిన్నదో, పెద్దదో కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ప్రతి ఏటా పి.డబ్లూ.డి. గ్రాండ్స్ లో ఫిబ్రవరి నుంచి రెండు నెలలపాటు భారీ ఎత్తున ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటుంది. అందులో రకరకాల ఎంటర్ టెయిన్ మెంట్స్ ఉంటాయి. అయినా కాలక్షేపం లేనట్లు తండోపతండాలుగా జనం సినిమా హాల్స్ చుట్టూ ఎగబడుతూ వుంటారు.


                                *    *    *    *

 Previous Page Next Page