ఆ రోజు మొదటిసారిగా మరో పెద్దరికం కూడా జైహింద్ బాబు అనుభవించాడు.
అతని మనసు చిత్రమైన మాధుర్యంతో నిండిపోయింది. "అమ్మా! నీ దగ్గిర దాచుకున్న డబ్బులియ్యి చెప్పులు కొనుక్కుంటాను" అన్నాడు.
ఒక్క ఆకు చెప్పులజత కొనుక్కోవాలని ఎన్నాళ్ళుగానో కలలు కంటున్నాడు జైహింద్ బాబు.
సుధీర్ కొనుక్కున్న లాంటి చెప్పులు కొనుక్కోవాలని అతని ఆశ. ఆ చెప్పులు పన్నెండురూపాయలని చెప్పాడు సుధీర్. "చవకరకంవి! రోజూ తొడుక్కోవడానికని కొంది మా అమ్మ! మంచివి కూడా ఇంకో జత ఉన్నాయి" అని చెప్పాడు.
చవకంటే పన్నెండు రూపాయలా? చాలా ఖరీదు అనిపించింది జైహింద్ బాబుకి.
అప్పటికే అతను ఇంటికి కావలసిన బజారు పనులు చేస్తున్నాడు. వస్తువుల ధరలు - బేరసారాలూ అతనికి తెలుసు.
"అంతకంటే చవకలో రావా? మూడు రూపాయలకూ, నాలుగు రూపాయలకూ వస్తాయిగా?"
"ఛ! రోడ్డుమీదవి! ఎందుకవి? ఇవాళ తొడుక్కుంటే రేపటికి చిరిగిపోతాయి. లేకపోతే ఎవరో విప్పి పారేసిన పాత చెప్పులు రిపేర్ చేసినవి తొడుక్కోవాలి. అవీ అంతే! పాత డొక్కులు.
సుధీర్ మాటలు నచ్చాయి జైహింద్ బాబుకి. అప్పటి నుండీ ఎలాగయినా పన్నెండు రూపాయల చెప్పులు కొనాలని భగీరధ ప్రయత్నం చెయ్యసాగాడు.
అతికష్టంమీద డబ్బు పోగుచేసుకుంటూ తల్లి దగ్గర దాస్తున్నాడు. ఎప్పటికప్పుడు ఎంత పోగయిందో లెక్క చూసుకుంటున్నాడు. ఆ రోజుతో పన్నెండు రూపాయలూ పోగయ్యాయని లెక్కచూసుకుని పరమానందంతో తల్లిని డబ్బడిగాడు.
పాత ఇనప్పెట్టిలో అడుగున దాచిన కర్రపెట్టి తెరిచింది అన్నమ్మ. నిర్ఘాంతపోయి నిలబడిపోయింది.
"అమ్మా! డబ్బు!" అంటూ తల్లి దగ్గరకు వచ్చిన జైహింద్ బాబు తల్లి ముఖం చూసి ఏమీ మాట్లాడకుండా నిలబడిపోయాడు.
అతనికి సంగతి అర్థమయిపోయింది.
తను చెమటోడ్చి కూడబెట్టుకున్న డబ్బు...... తల్లి ఇంట్లో అవసరాలకు కూడా వాడకుండా జాగ్రత్త పెట్టుకున్న డబ్బు.... తండ్రి తీసికెళ్ళిపోయాడు.
అంతా ఖర్చుపెట్టి తప్ప తాగి పశువులా ఇంటికొస్తాడు తల్లిని బాదటానికి.
అన్నమ్మ కింద కూలబడి ఏడ్చేసింది. ఏడుపు విని బల్ల దుకాణం వదిలి సుందరీబాయి కూడా వచ్చి తల్లి పక్కన కూలబడి ఏడవటం మొదలుపెట్టింది.
అప్పుడే తల్లిబదులు పనిలోకి వెళ్ళివచ్చిన రత్న ఏమిటో తెలియకుండానే తనూ ఏమిటో తెలియకుండానే తనూ ఏడుపు మొదలుపెట్టింది.
అలా ఏడుస్తున్న తల్లినీ, చెల్లెళ్ళనూ చూడలేకపోయాడు జైహింద్ బాబు.
ఈ శోకాలనుండి తమ కుటుంబానికి..... ఇంకా తమలాంటి అనేక కుటుంబాలకు విముక్తిలేదా? అనిపించింది.
"ఏడవకమ్మా! ఇప్పుడు నాకు చెప్పులు లేకపోతేనేం?" అన్నాడు లోపలి బాధ దిగమింగుకుంటూ.
ఆ మాటలు విని మరింత ఏడ్చింది అన్నమ్మ. ఆ చెప్పులకోసం జైహింద్ బాబు ఎంతగా ఆశపడ్డాడో ఆ తల్లికి తెలుసు!
కాస్త పెద్దయన రత్నమ్మ విషయం అర్థంచేసుకుంది.
"ఒరే అన్నయ్యా! దిగులు పడబోకురా! పై నెల అమ్మగారు జీతం డబ్బు లియ్యగానే అట్నించి అటే పోయి నీకు చెప్పులట్టుకొస్తా....." అంది.
జైహింద్ బాబు చెల్లెల్ని జాలిగా చూశాడు. ఇదే తమకు మిగిలిన అపురూప సంపద! ఒకరిపై మరొకరు చూపించుకోగలిగే ప్రేమాభిమానాలు.
ఎలాగయినా చదువుకుని పైకి రావాలని పట్టుదలగా చదువుతున్నాడు జైహింద్ బాబు.
ఆ పై నెల నిజంగానే అన్నమ్మ కొడుకుచేతిలో పన్నెండు రూపాయలు పెట్టి "జయన్ చెప్పులు కొనుక్కోరా!" అంది.
తల్లి ముఖం చూసేసరికి చెప్పులు కొనుక్కోగలుగుతున్నానన్న ఆనందం ఏమీ కలగలేదు జైహింద్ బాబుకి.
ఆ డబ్బు దాచి తనకియ్యడానికి తల్లి ఎంత అవస్థపడిందోనన్న బాధే మిగిలింది!
"వద్దమ్మా! ఇప్పుడు చెప్పులు లేకపోతేనేంటి? ఎప్పుడో కొనచ్చులే!" అన్నాడు.
అన్నమ్మ ఒప్పుకోలేదు. "అట్లా కుదర్దురా! పోయి కొనుక్కురా! ఈ ఇబ్బందులు ఒకనాటితో తీరేయికావు. జయన్! నువ్వు కొనకపోతే నా మనసుకి కష్టం వేస్తాదిరా!"
ఇంక కాదనలేకపోయాడు జైహింద్ బాబు. వెళ్ళి చెప్పులు కొనుక్కొచ్చాడు. కానీ, ఆరు రూపాయలవే కొన్నాడు.
మిగిలిన ఆరు రూపాయలూ తల్లికి తెలియకుండా రహస్యంగా తనదగ్గరే దాచాడు. ఆ డబ్బుపైన ఇంకా పోగుచేసి తల్లికి చీర కొనాలనుకున్నాడు.
జైహింద్ బాబు కొనుక్కున్న చెప్పులను తనివితీరా తృప్తిగా చూసింది అన్నమ్మ. ఆమెకి, ఇంకా అక్కడి వాళ్ళందరికీ "జైహింద్" అని సరిగా పలకటం రాదు. అంచేత వాళ్ళందరూ అతణ్ని "జయన్" అనే అంటారు.
"జయన్! నీ కాళ్ళకీ సెప్పులు సానా బుగున్నాయిరా!" అంది మెరుస్తున్న కళ్ళతో.
తన కాళ్ళకున్నచెప్పులకంటే తల్లి కళ్ళలో కనిపించిన మెరుపు ఎంతో సంతృప్తినిచ్చింది జైహింద్ బాబుకి, ఈతల్లి ఋణం ఎన్ని జన్మలకయినా తీర్చుకోగలనా? అనుకున్నాడు.
వాళ్ళలో ఒకడయిన సింహాచలం చాకలి లచ్చమ్మను పెళ్ళిచేసుకొచ్చేశాడు. అందరూ గుండె బాదుకున్నారు. పెద్ద గుడ్లెర్రచేశాడు. వాళ్ళిద్దర్నీ ఎవరూ సంఘంలో కలవనివ్వలేదు.
వాళ్ళుండేది కంటోన్ మెంట్ ప్రదేశం కావటంవల్ల అక్కడ పంపులుకాని, కరెంట్ కాని లేవు.
ఏదైనా కూరగాయలతోటలేసే ఉద్దేశంతో, ఎప్పుడో ఆ స్థలం ఆసామీ ఒక మోటబావి తవ్వించి, దానికి సరిగా గట్టూ అదీ కట్టించకుండానే వదిలేశాడు. అక్కడి వాళ్ళందరూ ఆ బావిలోంచే అవసరాలకు నీళ్ళు తెచ్చుకుంటారు.
ఆ బావి దగ్గిరకు వీళ్ళిద్దరినీ రానివ్వవేదు. ఎవరో అగ్ర వర్గాలవాళ్ళు తమదగ్గిరకు రానీయకపోవటం కాదు- తమలో ఒకడయిన వ్యక్తినే తమ కట్టుతప్పి స్వతంత్రంగా ప్రవర్తించినందుకు బావిదగ్గిరకు రానియ్యలేదు.
ఒక్కరూ వీళ్ళ గుడిసెకు రారు. వీళ్ళని తమ గుడిసెలకు రానియ్యరు, మంచికి చెడ్డకి దేనికి ఆదుకోరు.
ఇదంతా చూసి నిర్ఘాంతపోయాడు జైహింద్ బాబు. ఈ ఆధునికయుగంలో..... ఎంతో ప్రగతి సాధించామనుకుంటూన్న ఈనాడే- మహానగరంలో జరుగుతోన్న తతంగమిది.