వసంతకుమారతన్ని గత రెండు మూడు రోజులుగా ఎగ్జామిన్ చేస్తున్నాడు. డ్రోసిన్ డ్రాప్స్ వేసి డైలేట్ చేసి చూశాడు. అతనికేమీ కనిపించలేదు. గ్లాకోమా వుందేమోనని చూశాడు. ప్రెషర్ పదిహేను మిల్లీమీటర్లే ఉంది.
ఒకవేళ ప్రెషర్ గ్లాకోమానేమోనని అనుమానమొచ్చి రెండు కళ్ళలోనూ మైలోకార్, గ్లూకోమాల్ ఒక్కొక్క చుక్కా వేసి కూర్చోపెట్టాడు. ఈలోగా ఇతర పేషెంట్లని చూసుకుంటున్నాడు.
ఓ అరగంట గడిచి వుంటుంది. ఇంతలో "సార్! నా కళ్ళకేమీ కనబడటం లేదు" అన్నాడు పేషెంటు చాలా ఆందోళనగా.
వసంతకుమార్ తను ఎగ్జామిన్ చేస్తోన్న పేషెంటుని వదిలిపెట్టి అతని దగ్గరకు పరిగెత్తాడు. "ఏం జరిగింది?" అన్నాడు మామూలుగా వుండడానికి ప్రయత్నిస్తూ.
"ఉన్నట్లుండి చూపు పూర్తిగా కనబడటం మానేసింది సార్. గుడ్డివాడ్ని అయిపోయినట్లుగా వుంది సార్! సార్! ఆయాసం కూడా పుట్టుకొస్తోంది. ఊపిరాడటం లేదు సార్!"
చూస్తూండగానే పేషెంట్ కు ఆస్థమా ఎక్కువయిపోయింది. చూసేవాళ్ళకు భయం కలిగించేట్లుగా రొప్పుతూ ఊపిరి తీసుకోలేక, కళ్ళు తేలవేస్తున్నాడు.
వసంతకుమార్ కు కంగారు పుట్టింది. వళ్ళంతా చెమటలు పడ్తున్నాయి. బాయ్ ని పిలిచి బాస్ కి చెప్పి వెంటనే పిల్చుకురమ్మని చెప్పాడు.
డాక్టర్ కృష్ణచైతన్య ఆ సమయానికి చాలా బిజీగా వున్నాడు. అయినా విషయం విని హడావిడిగా పరిగెత్తుకు వచ్చాడు.
పేషెంటు స్థితిని జూసి "మైగాడ్! స్టేటస్ ఆస్థమాటికస్. వెంటనే ఆక్సిజన్ స్టార్ట్ చెయ్యండి. కమాన్. క్విక్, ఎమినోఫిలస్ డ్రిప్, డెకడ్రాన్ తక్షణం ఇవ్వండి" అంటూ ఉరుకులు పరుగులమీద దగ్గరుండి జరిపించాడు.
దాదాపు గంటసేపు ఆందోళనగా గడిచాక పేషెంటు విషమ పరిస్థితి నుంచి బయటపడ్డాడు. అంతవరకూ డాక్టర్ కృష్ణచైతన్య అక్కడ్నుంచి కదల్లేదు. అప్పుడు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు.
వసంతకుమార్ బిక్కమొహం వేసుకుని కూర్చుని వున్నాడు. కృష్ణచైతన్య అతని దగ్గరకు వచ్చాడు. అప్పటికథను పేషెంటు తాలూకు కేసు షీటు క్షుణ్ణంగా చదివేశాడు.
"డాక్టర్! మీరీ వేళ రెండు ఘోరమైన పొరపాట్లు చేశారు."
వసంతకుమార్ తలెత్తి చూశాడు దీనంగా.
"పేషెంటుకు ఆస్థమా వుందో లేదో తెలుసుకోకుండా గ్లూకోమాల్ వాడావు. అందులో టెములాల్ మేలియేట్ వుంది. టెములాల్ నాన్ సెలక్టివ్ బీటా బ్లాకర్. బీటా బ్లాకర్స్ ఆస్థమా పేషెంట్సుకు కాంట్రాయింటికేషన్. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. ఓరల్ గా కడుపులోకి వాడే బిటాబ్లాకర్స్ కంటే పాయింట్ వన్ మిల్లీ గ్రామ్ కంట్లోకి వేసినా సరే సింథటిక్ ఎబ్ సార్ బ్షన్ ద్వారా లోపలికి వెళ్ళి ఆస్థమా ప్రకోపించి స్టేటప్ ఆస్థమాటికస్ లోకి తీసుకు వెడుతుంది. అంటే ఇంచుమించు మృత్యువును సమీపించినట్లే. ఈ పేషెంటు విషయంలో ఇదే జరిగింది.
వసంతకుమార్ గుండె దడదడమని కొట్టుకుంటున్నది. టెములాల్ ఆస్థమాకి కాంట్రాయిండికేషన్ అని అతనికి తెలీకకాదు. పేషెంటుకి ఆస్థమా వుందని తెలుసుకోకపోవటం అతను చేసిన తప్పు.
ఇహ రెండవది. పైలోకార్పిస్. అది పారా సిందథోమిమిటిక్ డ్రగ్ ప్యూపుల్ ని కన్ స్ట్రిక్ట్ చేస్తుంది. మామూలు పరిస్థితుల్లో అయితే పేషెంటుకు ఒక్క గ్లాకోమాయే వుండి వుంటే అదేం హాని చెయ్యదు. పైగా ఉపకారం చేస్తుంది. కాని ఇతనికి లెన్స్ మీద సెంట్రల్ ఒపేవిట్ వుండి వుంటుంది. పోస్టీరియల్ సబ్ కాప్ స్యులార్ కేటరాక్ట్. పైలో కాధర్డిన్ వల్ల ప్యూపుల్ కన్ స్ట్రిక్ట్ అయిపోయి, లోపల లెన్స్ మీద వున్న ఒపేవిట్ వల్ల చూపు పూర్తిగా కనిపించటం మానేసింది. అఫ్ కోర్స్! ఇరవై నాలుగుగంటల్లో తిరిగి మామూలు స్థితికి వచ్చేస్తుందనుకోండి" అంటూ భుజంమీద చెయ్యి వేసి, "మైడియర్ యంగ్ మేన్! ఇది కళ్ళకి సంబంధించిన విషయం. యు మస్ట్ బి వెరీ కేర్ ఫుల్" అంటూ ఆ గదిలోంచి వెళ్ళిపోయాడు.
వసంతకుమార్ నిర్ఘాంతపోతూ అలాగే కూర్చుండిపోయాడు. కేసుని ఎగ్జామిన్ చెయ్యకుండా కేవలం కేసుషీటు చదివి ఎలా డయాగ్నైజ్ చెయ్యగలిగాడు!
దటీజ్ జీనియస్.
3
మందాకిని కళ్ళు విప్పి చూసింది. తానెక్కడుంది? అసలేం జరిగింది.
క్రమంగా ఒక్కొక్కటీ గుర్తు వస్తున్నది. అశ్వనీకుమార్ దగ్గర్నుంచి బయల్దేరడం, అనుకోని పరిస్థితుల్లో ఎవరో వెంటపడడం.
ఉలిక్కిపడినట్లు లేచి కూర్చుంది. అప్పుడు గమనించింది. తానో మంచం మీద పడుకోబెట్టబడి ఉంది. తానున్నగది నీటుగా, అధునాతనంగా వుంది. కిటికీ తలుపులన్నీ వేసి వున్నాయిగానీ, గదిలోకి వెలుతురు వస్తూనే వుంది.
ఏదో అనుమానం తోచి తన ఒంటివైపు చూసుకుంది. చీర కుచ్చిళ్ళతోసహా యధాస్థానంలోనే వున్నాయి. నో! అలాంటిదేమీ జరగలేదు.
మంచంమీదనే కూచుని ఆలోచిస్తుంది. కలా? నిజమా? ఎంత విచిత్రంగా భయంకరంగా జరిగిపోయింది సంఘటన! తప్పించుకొందామని ఎంత ప్రయత్నించింది! ఎంత ఆరాటపదిన్ది౧ కాని తన ప్రయత్నాలన్నీ నిష్ఫలమై పోయాయి.
గది, అందులోవున్న డెకరేషన్ అన్నీ చాలా రిచ్ గా వున్నాయి. బహుశా తన గదికూడా అంత శోభతో వుండదు. ఏమి ఆశించి...
రూమ్ తలుపు తెరుచుకుంటూన్నట్లయింది. తృళ్ళిపడి నిటారుగా కూడా కళ్ళార్పకుండా చూస్తుంది.
లోపలకు ఓ యువకుడు వచ్చాడు. ఇరవై ఏడు ఇరవై ఎనిమిదేళ్ళ కంటే ఎక్కువ వుండవు. ఇంచుమించు ఆరడుగుల పొడవుంటాడు. విశాలమైన ఛాతీ, దృఢంగా, చాలా బలిష్టంగా వున్నాడు. మొహం అందంగానే వుందికానీ, ఆ కళ్ళు కాంతితో మెరుస్తూ, క్రూరత్వం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ప్యాంటు బ్లాక్ షర్ట్ వేసుకొని వున్నాడు.
"ఎవరు నువ్వు?" అంది వణికే గొంతుతో.
అతను నవ్వాడు. ఆ నవ్వుకూడా చాలా క్రూరంగా ఉంది.
"నన్ను... నన్నెందుకు తీసుకొచ్చావ్?"
"నీకు ఆపరేషన్ చెయ్యడానికి."